భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ!

ధన్ బాద్ తర్వాత దేశంలోనే రెండోది!

0

రాష్ట్రంలో మైనింగ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. వర్సిటీ ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రస్తుతమున్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ లోనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించింది. మైనింగ్ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు, అందుకు సంబంధించిన కోర్సుల గురించి కూడా కమిటీ వివరించింది. రాష్ట్రంలోని అపారమైన భూగర్భ వనరులను ఎలా వెలికితీయాలి..? ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి..? పరిశోధనలకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అందులో ప్రస్తావించింది! మైనింగ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే లాభనష్టాలను కూడా నివేదికలో పేర్కొంది.


దేశంలో ఇప్పటివరకు జార్ఖండ్ లోని ధన్‌ బాద్‌లో మాత్రమే మైనింగ్ యూనివర్సిటీ ఉంది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనివర్సిటీ రెండోది. కొత్తగూడెంలో సింగరేణి గనులుండటం, ఇప్పటికే అక్కడ మైనింగ్ స్కూల్ కొనసాగుతుడటంతో.. మైనింగ్ యూనివర్సిటీని కూడా అక్కడే ఏర్పాటు చేస్తే మంచిదని ఉన్నత విద్యామండలి కమిటీ ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే వచ్చే ఏడాది యూనివర్సిటీని ప్రారంభిస్తామని ఇన్ చార్జ్ ఛైర్మన్ చెప్పారు.

దేశంలోనే రెండో యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు కానుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ కోర్సుల కోసం ఇక నుంచి ధన్ బాద్ దాకా వెళ్లాల్సిన శ్రమ ఉండదని అంటున్నారు. అన్నీ కుదిరితే 2017లో తెలంగాణలో మైనింగ్ వర్సిటీ ప్రారంభం కానుంది.

Related Stories

Stories by team ys telugu