సైబర్ సెక్యూరిటీకి వీళ్లు బాహుబలి బ్రదర్స్..!

సైబర్ సెక్యూరిటీ రంగంలో "ఇన్నెఫూ ల్యాబ్స్" సంచలనం

సైబర్ సెక్యూరిటీకి వీళ్లు బాహుబలి బ్రదర్స్..!

Monday April 04, 2016,

5 min Read


మహిష్మతి రాజ్యాన్ని .. కాళకేయుల నుంచి కాపాడుకోవడానికి బాహుబలి బ్రదర్స్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని వందల రకాల ఆయుధాలు... ఇంకెన్నో మేథోపరమైన వ్యూహాలు... అయినా తప్పని ప్రాణనష్టం. కనా కష్టంగా దక్కిన విజయం.

దీన్నే టెక్నాలజీ సంస్థలకు అన్వయించుకుంటే... ప్రతీ సంస్థా ఓ మహిష్మతి రాజ్యమే. దీనిపై దాడి చేయడానికి కాళకేయులు... సైబర్ నేరగాళ్ల రూపంలో చుట్టూ కాచుకుని ఉంటారు. సందు దొరికితే కావాల్సినంత సమాచారం పట్టుకుపోతారు. ఉన్నదంతా ఊడ్చుకుపోతారు. ఓ రకంగా సైబర్ కాలకేయులే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే.. వారు దాడి చేసి మొత్తం సర్వనాశం చేసేదాకా జరుగుతుంది. అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేం. అందుకే మహిష్మతి రాజ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే ఎక్కువ టెక్నాలజీ సంస్థలు, వాటిని ఉపయోగించుకునే వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్ డేట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది.

మెయిల్ హ్యాక్ చేసి రూ.100 కోట్లు మాయం..

RBI వెబ్ సైట్ మెయిల్ నకిలీ మెయిల్స్...

ప్రభుత్వ వెబ్ సైట్ హ్యాక్, పాకిస్తాన్ లోగో ప్రత్యక్షం...

ఇలాంటి వార్తలు రోజూ చూస్తూంటాం. వాస్తవానికి సైబర్ నేరగాళ్లకు ఇవో చిల్లర పనులు. అసలు సంస్థల లావాదేవీలను మొత్తం టార్గెట్ చేసే బడా సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అసలైన సవాళ్లు విసురుతున్నారు. సాధారణ జీవనమే కాదు.. ఇప్పుడు ప్రతీ పని స్మార్ట్ గా జరిగిపోయేలా టెక్నాలజీ ఉంది. అది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంది. అయితే ఇదంతా గొలుసుకట్టుగా ఉంది. ఎక్కడ హ్యాకర్లు ఈ చైన్ లోకి చొరబడినా మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చివేస్తారు. వ్యాపార సంస్థలకే కాదు.. ప్రభుత్వ శాఖలకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. కొద్ది రోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధ కార్ల కంపెనీ దైమ్లర్ 1.4 మిలియన్ కార్లను రీకాల్ చేసింది. కారణం తయారీలో లోపాలు ఉండటం కాదు. ఆ కార్లను వాడుతున్న యజమానుల ఫోన్లలో సైబర్ నేరగాళ్లు చొరబడి... కారును నియంత్రించే టెక్నిక్ చేజిక్కించుకోవడమే. దానికి విరుగుడు టెక్నాలజీని అమర్చి ఇవ్వడం కోసం కార్లను రీకాల్ చేసింది. కార్లపై ఇలా సైబర్ నేరగాళ్లు నియంత్రణ చేసే పరిస్థితి ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు నిరూపించడంతో దైమ్లర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది చాలు సైబర్ ప్రపంచంలో సెక్యూరిటీని ఎంత వేగంగా అప్ డేట్ చేస్తూ ఉండాలో చెప్పడానికి.

సైబర్ ప్రపంచానికి కొత్త ముప్పు బ్లాక్ హ్యాట్స్

వ్యాపార సంస్థలే కాదు.. ప్రభుత్వ విభాగాలూ ఈ సెక్యూరిటీ లోపాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు సైబర్ టెర్రరిజం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో సైబర్ సెక్యూరిటీపైనే ఇప్పుడు అత్యధిగంగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భారత పవర్ గ్రిడ్ వ్యవస్థలోకి సైబర్ నేరగాళ్లు చొరబడి.. పవర్ సప్లైని స్థంభింపజేస్తే వచ్చే పరిస్థితులను ఒక్కసారి ఊహించండి. కొత్తగా వచ్చే పెట్టుబడులు సంగతి దేవుడెరుగు.. ఉన్నవి కూడా పరాయిదేశాలకు పరుగులు పెడతాయి. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. వినాశనమే టార్గెట్ గా పనిచేసే సైబర్ నేరగాళ్లను ఇప్పుడు బ్లాక్ హ్యాట్స్ పేరుతో పిలుస్తున్నారు. వీరికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.

బ్లాక్ హ్యాట్స్ కి సవాల్ విసురుతున్న ఇండియన్ వైట్ హ్యాట్స్

అభిషేక్ శర్మ, తరుణ్ విగ్. ఇన్నెఫూ ల్యాబ్స్ ఫౌండర్స్. ప్రసిద్ధ సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనిచేసిన వీరు... సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎంతో చేయాల్సి ఉందని గుర్తించారు. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్ డేట్ కాకపోతే... చాలా సమస్యలు వస్తాయని గుర్తించారు. భారత్ లో మూడు లక్షల వెబ్ సైట్స్ పై హ్యాకర్లు దాడిచేశాయని.. ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ దిగ్గజం మెకాఫీ ప్రకటించడం కూడా వీరి ఆలోచనలను మరింత పదును పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సైబర్ నేరగాళ్ల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 575 బిలియన్ డాలర్లు నష్టపోతోందని అంచనా. అందుకే ఎంతో కంఫ్టర్టబుల్ గా ఉన్నా.. చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సైబర్ సెక్యూరిటీ రంగంలోకి దిగారు. ఇద్దరూ కలసి ఇన్నెఫూ ల్యాబ్స్ స్టార్టప్ ను ప్రారంభించారు. బ్లాక్ హ్యాట్ ను అడ్డుకునేందుకు తమను తాము వైట్ హ్యాట్స్ గా అభివర్ణించుకుంటారు అభిషేక్, తరుణ్. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అతి తక్కువ ఖర్చుతో అత్యంత పవర్ ఫుల్ సైబర్ సెక్యూరిటీని అందించడాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. RSA, సిమాంటిక్ వంటి MNC కంపెనీలు అందిస్తున్న సెక్యూరిటీ సొల్యూషన్స్ కు ప్రత్యామ్నాయంగా ఉండేలా వీరు సేవలు అందిస్తున్నారు.

వీరు సోషల్ మీడియా మానిటరింగ్, ఈమెయిల్ ఎన్ క్రిప్షన్ తదితర వాటిల్లో రెండంచెల భద్రతా సేవలను అందిస్తున్నారు. వీరి అతి పెద్ద క్లైంట్ భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ DRDO. వీరి మొట్టమొదటి క్లైంట్ ఓ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. 2013 వారి మెయిల్స్ అన్నింటినీ ఎన్ క్రిప్ట్ చేసే సేవలను వీరికి అప్పగించారు. రెండేళ్లలో ఇన్నెఫు 51 మంది కొత్త క్లైంట్లను సంపాదించింది. పది లక్షల డాలర్లకుపైగా ఆదాయం పెరిగింది. ఈ సంస్థను ఇద్దరు కోటి రూపాయల కన్నా తక్కువ సొంత పెట్టుబడితో ప్రారంభించారు. భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ల కోసం ప్రత్యేక నిధిని కేటాయించాలని వీరు కోరుతున్నారు. ఇప్పుటికే చైనా, అమెరికా దేశాలు సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ లను ప్రొత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.

" వచ్చే కొన్నేళ్లలో ప్రభుత్వ సర్వీసులన్నీ స్మార్ట్ ఫోన్ల ద్వారానే ప్రజలకు చేరుతాయి. వచ్చే ఐదేళ్లలో అయినా ఇదే జరుగుతుంది. అండ్రాయిడ్ కానీ మరో ఆపరేటింగ్ సిస్టం ద్వారా కానీ ఈ సర్వీసులన్నీ సక్రమంగా ప్రజలకు చేరాలంటే దానికి తగ్గట్లుగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలి. లేకపోతే హ్యాకర్లు తమ పని తాము చేసుకుంటారు. అన్నీ జాతీయ ప్రయోజనాలకు సంబంధించినవే. అన్నింటినీ స్థానికంగానే కాపాడుకోవాల్సి ఉంటుంది" -తరుణ్ విగ్ 

ఇన్నెఫు ల్యాబ్స్ ఫౌండర్స్<br>

ఇన్నెఫు ల్యాబ్స్ ఫౌండర్స్


సైబర్ సెక్యూరిటీ మార్కెట్ అనంతం

1. ప్రపంచవ్యాప్తంగా పెద్దా, చిన్న సంస్థలన్నీ సైబర్ సెక్యూరిటీ కోసం కేటాయించే నిధులను పెంచుతున్నాయి. అమెరికా కేంద్రంగా సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే థౌజండ్ ఐస్ సంస్థ గత మూడేళ్లలో ఏకంగా అరవై మిలియన్ డాలర్లను సమీకరించడమే దీనికి సంకేతం.

2. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ గత ఏడాది సైబర్ సెక్యూరిటీ కోసం 76.1బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెరాకోడ్, సోర్స్ ఫైర్ సంస్థలు భారీ కంపెనీలకు సేవలు అందిస్తూ దిగ్గజ కంపెనీలుగా ఎదిగాయి.

3. ఔజా నెట్ వర్క్స్ కంపెనీ మాత్రమే ఇండియా నుంచి యూఎస్ సంస్థలకు సెక్యూరిటీ సేవలు అందిస్తోంది.

4. ఇండియన్ సెక్యూరిటీ స్టార్టప్ సంస్థలు ఇప్పటికీ పెట్టుబడులు కోసం ఎదురుచూస్తున్నాయి. యాప్ క్నాక్స్, ఇన్ స్టా సేఫ్, షీల్డ్ స్క్వేర్, పాలాడియోన్ లాంటి స్టార్టప్స్ తమ సేవలు విస్త్తత పరిచేందుకు పెట్టుబడుల కోసం చూస్తున్నాయి. అయితే భారతీయులు అమెరికాలో ప్రారంబించిన ఇంపెరిమియమ్ అనే సెక్యూరిటీ సంస్థను మాత్రం.. గూగుల్ సంస్థ 9 మిలియన్ డాలర్లకు ఎక్వైర్ చేసింది.

స్థిరమైన ఆదాయం

సెక్యూరిటీ స్టార్టప్ లకు ప్రధాన ఆదాయం... సంస్థలతో సుదీర్ఘ ఒప్పందాలు చేసుకోవడం వల్లే వస్తుంది. దీనివల్ల ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇన్నెఫు ల్యాబ్స్ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులతో సుదీర్ఘ కాలం అమల్లో ఉండే ఒప్పందాలు చేసుకుంది. దీనికి రిస్క్ కూడా తగ్గుతుంది. అయితే ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ పరంగా కొత్తకొత్త ఉత్పత్తులు, బ్లాక్ హ్యాట్స్ కూడా ఏమీ చేయలేని విధంగా ఉండే సాఫ్ట్ వేర్ ను రెడీ చేస్తేనే సెక్యూరిటీ స్టార్టప్ లకు మనుగుడ ఉంటుంది. దీనికి తోడు MNC ఉత్పత్తుల కంపెనీలను కూడా తలదన్నేలా సేవలు ఉండాలి. ఇలాంటి సంస్థలు ముందుగా చిన్న సంస్థలు, మీడియం సైజ్ బ్యాంకులకు సేవలు అందించి మార్కెట్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు ప్రకటిస్తే .. ఇలాంటి స్టార్టప్ లు జోరందుకుంటాయి.

 ఈ-కామర్స్ కంపెనీలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు సెక్యూరిటీ స్టార్టప్స్ కి లేకపోయినా... అతి తక్కువ కాలంలోనే పరిస్థితి మారుతుందని అభిషేక్, తరుణ్ నమ్మకంతో ఉన్నారు. సైబర్ టెక్ రంగంలో తలపండిన నిపుణలూ అదే చెబుతున్నారు. ఇప్పుడు ఈ-కామ్ ట్రెండ్. రాబోయేది.. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కాలం. అందులో సందేహమే లేదు.