నేను ఇంటర్ చదివే వరకు మా ఇంట్లో కరెంట్ లేదు- సివిల్స్ థర్డ్ ర్యాంకర్ గోపాలకృష్ణ మనోగతం

నేను ఇంటర్ చదివే వరకు మా ఇంట్లో కరెంట్ లేదు- సివిల్స్ థర్డ్ ర్యాంకర్ గోపాలకృష్ణ మనోగతం

Thursday June 01, 2017,

3 min Read

తెలుగులో సివిల్సా? వెటకారానికి గుండె గాయపడింది!

ఇంగ్లీష్ రాదా..? ఎగతాళికి మనసు చిన్నబుచ్చుకుంది..!

తిండికి ఠికానా లేదు పై చదువులు అవసరమా..?

ఇదిగో.. ఇక్కడ కసి పెరిగింది..!

ఆస్తిపాస్తులే లేవు గెజిటెడ్ ఆఫీసర్ కావాలని పగటి కలలా..?

ఇదిగో మళ్లీ ఇక్కడ రక్తం మరిగింది..!

image


తెలుగు సబ్జెక్టా అని హేళన చేసిన నోళ్లకు తెలుగుతోనే సమాధానం ఇచ్చాడు. ఆస్తిలేదని ఎగతాళి చేసిన వాళ్లకు కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించాడు. పట్నం వాసనే తగలని ఓ మారుమూల గ్రామంలో పుట్టి, వీధి బళ్లోనే చదివి, విధిని జయించిన ఆ కుర్రాడే రోణంకి గోపాలకృష్ణ. సివిల్స్ థర్డ్ ర్యాంకర్.

కార్పొరేట్ స్కూళ్లలో చదివితేనే చదువా? ఇంగ్లీష్ తప్ప వేరే మాట్లాడని వాళ్లే మనుషులా? బ్రాండెడ్ బట్టలేసే వాళ్లే నాగరికులా? వీటన్నిటికీ తిరుగులేని సమాధానం గోపాలకృష్ణ.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామం సొంతూరు. అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు. ఒకటి నుంచి ఐదు వరకు పారసంబ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదివరకు పక్కనే ఉన్న బ్రాహ్మణతర్లలో అనేఊళ్లో చదివాడు. రెండూళ్లకి మధ్య వాగు అడ్డం. అది ఎండిపోతే దూరం నాలుగు కిలోమీటర్లు. ఒకవేళ వానలొచ్చి పొంగితే ఆ రోజు స్కూల్ మానేయాలి. ఆ ఊళ్లో అందరిదీ అదే పరిస్థితి. కానీ అతని అన్నయ్య, చెల్లి మాత్రం ఏనాడూ బడి మానలేదు. వేరే మార్గంలో 15 కిలోమీటర్లు నడిచేవారు. అలాంటి వాతావరణంలో స్కూలింగ్ పూర్తయిది. పలాస గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేశాడు.

ఆ తర్వాత చదవాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితులు అడ్డుగోడగా మారాయి. దాంతో ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరి అయింది. ఇంట్లో ముగ్గురు సంతానం. ఉన్నదేమో 50 సెంట్ల భూమి. వీళ్లను చదివించడం ఆ నిరుపేద తండ్రికి తలకు మించిన భారమైంది. కనీసం ప్రభుత్వ పాఠశాలలో కూడా చదివించే స్థోమత లేదు. అందుకే ఉద్యోగం కంపల్సరీ అయింది. టీటీసీ రాస్తే మంచి ర్యాంర్ వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో టీచర్ పోస్ట్. మళ్లీ 2006లో డీఎస్సీ రాస్తే సెలెక్ట్ అయ్యాడు. అలా ఉద్యోగం చేస్తూనే డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు.

ఇంటర్ చేసే వరకు కూడా ఇంట్లో కరెంట్ అంటే ఏంటో తెలియదు. గుడ్డిదీపం వెలుతురులోనే చదువు. పెంకుటిల్లు కూడా కాదు. చిన్నపాటి పూరిగుడిశె. ఏ రాత్రయినా వర్షం వస్తే ఆ పూట జాగారమే. ఇల్లంత కురిసేది. అమ్మ రాత్రంతా వంటపాత్రలు పరుస్తూ కూర్చోవడమే. నాన్న చాలా పట్టుదల ఉన్న మనిషి. ఉన్న పొలంలోనే కష్టపడి ఇంత పంట తీశాను.. మీరు సర్కారు బడిలో చదివి నెగ్గుకు రాలేరా అని సవాల్ విసిరేవాడు. ఇవాళ సివిల్స్ ర్యాంక్ కొట్టానంటే నాన్న మాటలే స్ఫూర్తే అంటాడు గోపాలకృష్ణ. కుర్రాడికి చదువే లోకం కాదు. పలుగు పార పట్టి పొలం పనులు కూడా చేస్తాడు.

పిల్లలు ఏం చదువుతున్నారో నాన్నకు కాస్తో కూస్తో తెలుసుగానీ, అమ్మకు బొత్తిగా తెలియదు. సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటే టీచర్ ఉద్యోగం ఉంది కదా.. ఇంకెందుకు చదువు అనేది. యూపీఎస్సీలో మూడో ర్యాంక్ వచ్చిందమ్మా అని ఫోన్ చేసి చెప్తే, పాపం ఆవిడకి అర్ధం కాలేదు. నీ కొడు కలెక్టర్ అయ్యాడమ్మా అంటే అప్పుడర్ధమైంది ఆమెకి. గ్రీన్ ఇంక్ పెన్నుతో మిమ్మల్ని చూడాలరా అని నాన్న ఎప్పుడూ అనేవారు. ఆయన కలను నెరవేర్చాను అంటాడు గోపాలకృష్ణ.

తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా తీసుకున్నాడు. ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే చేశాడు. ట్రాన్స్లేటర్ ను పెట్టుకున్నాడు. ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా జరిగింది. గ్రామీణ వాతావరణం, టీచింగ్ పద్ధతి గురించి అడిగారు. దేశభక్తి గేయాలు కూడా పాడుతా అని చెప్పాడు. ఒకటి పాడమన్నారు. ఆ పాటకు వాళ్లు చాలా ఎగ్జయిట్ అయ్యారు.

ఈ ర్యాంక్ సాధించడానికి అన్నయ్యే కారణమంటాడు గోపాలకృష్ణ. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తాడు. అతను 14 సార్లు గ్రూప్ 1 పోస్టులు కొట్టాడు. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్లు అతడిని వదులుకోదల్చుకోలేదు. గోపాలకృష్ణ కూడా మూడుసార్లు సివిల్స్ అటెంప్డ్ చేశాడు. నాలుగోసారి గెలిచాడు.

దేశానికి ఇంత ముద్ద పెట్టే రైతుల కళ్లలో ఆనందం చూడటమే నా లక్ష్యం అంటాడు గోపాలకృష్ణ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సర్కారీ బడి చదువే కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగు పరచడం మరో ఆశయం అంటాడు. దాంతోపాటు మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తానంటున్నాడు.