రుణవసూళ్లలో 100 శాతం రికార్డ్ ఉజ్జీవన్‌కు ఎలా సాధ్యమైంది ?

రుణవసూళ్లలో 100 శాతం రికార్డ్ ఉజ్జీవన్‌కు ఎలా సాధ్యమైంది ?

Saturday June 20, 2015,

6 min Read

పేదలు సబ్సిడీలు,ఉచిత రుణాలు కోరుకుంటున్నారనడం ఓ ఆపోహ మాత్రమే-సుమిత్ ఘోష్

పేదలు సబ్సిడీలు,ఉచిత రుణాలు కోరుకుంటున్నారనడం ఓ ఆపోహ మాత్రమే-సుమిత్ ఘోష్


ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ. అభివృధ్ది రేటు చూస్తే 5శాతం. ఈ లెక్కలన్నీ చూడటానికి గొప్పగా కన్పిస్తాయ్. కానీ మన దేశంలో 41శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవంటే మాత్రం కొద్దిగా నిరుత్సాహ పరచే అంశం. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములు కానివారికి ప్రభుత్వం అందించే ఋణసదుపాయం కానీ..ఇతర పథకాలు కానీ అందే అవకాశాలు అంతంత మాత్రమే. పైన చెప్పిన లెక్కల ప్రకారం దేశంలో 50 కోట్ల మందికి ఈ సదుపాయాలన్నీ అందుబాటులో లేవు. వీరిలో దాదాపు 70శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారే.

ఇంత పెద్ద జనాభాకు బ్యాంకింగ్ వ్యవస్థ కార్యకలాపాలను అందించే దిశగా మైక్రోఫైనాన్స్ సంస్థలు (సూక్ష్మఋణ సంస్థలు) ఆవిర్బావం ప్రారంభమైంది. ఇది 2000వ సంవత్సరం తర్వాత చోటు చేసుకున్న పరిణామం. ఐతే 2010లో చోటు చేసుకున్న విపరీత పరిణామాలతో ఆంద్రప్రదేశ్‌లో ఈ మైక్రో ఫైనాన్స్ రంగం చితికిపోయింది. దాదాపుగా అన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలూ మూతబడ్డాయనే చెప్పాలి. అలా ఆ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన వాటిలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ ఒకటి. పట్టణ, చిన్న తరహా పట్టణ ప్రాంత ప్రజలకు ఉజ్జీవన్ తన సేవలు అందిస్తోంది.

ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ లోగో

ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ లోగో


2005లో సుమిత్ ఘోష్ ఉజ్జీవన్‌ను స్థాపించారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కమ్యూనిటీలో 30ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో పాటు మిడిల్ ఈస్ట్, దక్షిణ ఆసియాలో స్టాండర్ట్ చార్టర్డ్ రిటైల్ బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసిన ఘనత సమిత్ ఘోష్ సొంతం. మనదేశం విషయానికి వస్తే..HDFC బ్యాంకును ఇక్కడకు తెచ్చినది సుమిత్ ఘోషే. ఉజ్జీవన్ ప్రస్తుతం ఇండియాలోని 22 రాష్ట్రాల్లో తన సేవలు అందిస్తోంది. వాటిలో అసలు బ్యాంకులే చేరని 48 జిల్లాలు కూడా ఉన్నాయంటే ఉజ్జీవన్ ఎలా ప్రజల్లోకి చేరువ అవుతోందన్న సత్యం అర్ధమవుతోంది.

6, 150కోట్ల రూపాయలను ఇప్పటికే ఉజ్జీవన్ రుణాల రూపంలో ప్రజలకు ఇవ్వగా..వాటిలో 99.87 శాతం రీ పేమెంట్ చేయగలిగారంటే..అంతకన్నా సక్సెస్ రేట్ ఇంకే బ్యాంకుకుగానీ..సంస్థకు గానీ లేదని చెప్పొచ్చు.

ఓ సంస్థ ఎనిమిదేళ్లు సక్సెస్‌గా నడవడం..అది కూడా ఓ మైక్రో ఫైనాన్స్ సంస్థ..దాదాపు 100శాతం రీపేమెంట్ రేటుతో అరుదనే చెప్పాలి. అసలు ఈ రంగమే సంక్షోభం ఎదుర్కొంటున్నా... సమర్థంగా నిలబడటం తన సక్సెస్ స్టోరీని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండటానికి గల కారణాలేంటి ? సుమిత్ ఘోష్ ఈ సంస్థను ఎలా నడుపుతున్నారు ? అనుసరించే పధ్దతులేంటి ?

ఉజ్జీవన్ మూల సిధ్దాంతాలు

  • ఉజ్జీవన్ ఆవిర్భవించిన నాటి నుంచే సుమిత్ ఘోష్‌కు ఓ బలమైన ఆలోచన ఉంది. పట్టణ ప్రాంత పేదలకు మాత్రమే రుణాలివ్వడం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకోవడం. ఇవన్నీ ఆయన నిశ్చితాభిప్రాయాలు. ఈరంగంపై ఉన్న అపోహలు,పుకార్లను లెక్కపెట్టలేదు.
  • "దాదాపు 60కోట్లమంది పేదలకు ఎటువంటి బ్యాంక్ వసతులు లభించని చోట..సాధారణంగానే వారికి ఎటువంటి అప్పుూ లభించదు. అలానే వారికి లోన్ ఇచ్చినా తిరిగి అప్పు చెల్లించలేని స్థితిలో ఉంటారు. మరి అలాంటి వారికి లోన్ ఇవ్వడం, తిరిగి తీసుకోవడం మామూలు పద్దతిలో కాకుండా ఇంకేదైనా కొత్త పధ్దతి కనిపెట్టాలి. అదే ఉజ్జీవన్ చేసింది" ఉజ్జీవన్ మైక్రో ఫైనాన్స్ విశిష్టతను వివరించారు సుమిత్ ఘోష్.
  • అలానే పేద ప్రజలు ఎప్పుడూ ఉచిత ఋణం లేదంటే సబ్సిడీలను కోరుకుంటారనేది ఓ అపోహ. తప్పుడు ప్రచారమేనంటారు సుమిత్ ఘోష్. అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా..అందరిలా ఇంకెక్కడైనా అప్పు దొరికితే బావుండని వారు చూస్తారు తప్ప..ఫ్రీగా డబ్బు కోరుకోరని సుమిత్ చెప్తారు.
  • ఓ రకమైన సుపీరియార్టీ కాంప్లెక్స్‌లో ప్రభుత్వాల్లోని పెద్దలు, బ్యాంకులు ఈ అభిప్రాయాలకు వచ్చాయంటారాయన. దీనికి ఉదాహరణగా 1955లో ఇంపీరియల్ బ్యాంకును జాతీయకరణ చేసిన విధానం గుర్తు చేస్తారు

2010 సంక్షోభం-ఓ ఛాలెంజ్

2010లో ఆంధ్రప్రదేశ్ లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ సంస్థలను క్రమబద్ధీకరించడానికి ఆర్డినెన్స్ ను తెచ్చింది. అప్పు వసూలు చేయడానికి పలు సూక్ష్మరుణసంస్థలు అనుసరించిన విధానంతో ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకువస్తే.. అదికాస్తా వికటించి.. లోన్ రీపేమెంట్‌రేట్ 30-40 శాతం పడిపోయింది. ఆ తర్వాత మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొత్త లోన్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. వాటికి లోన్లు ఇప్పించే లీడ్ బ్యాంకులు ఓ వేళ అప్పులిస్తే.. తిరిగి రావేమో అనే అనుమానంతో సహకరించడం మానేశాయ్. ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి కొన్ని నెలల సమయంపట్టింది.

అప్పటి సంక్షోభానికి పరిమితికి మించిన అప్పులు. అవి చెల్లించే విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించకపోవడమే కారణమంటారు సుమిత్ ఘోష్. ఆంధ్రప్రదేశ్‌లో ఉజ్జీవన్ ఎలాంటి వ్యాపారం చేయకపోయినా, ఇక్కడి ప్రభావం పక్క రాష్ట్రాలపైకూడా పడి.. కొంత ధనం నష్టపోయింది. ఆ పాఠం నేర్పిన అనుభవంతో 2009లో ఉజ్జీవన్ క్రెడిట్ బ్యూరో వ్యవస్థను తయారు చేసుకుని.. ఓ కస్టమర్ సామర్ధ్యం మేరకు అప్పులు ఇవ్వడం ప్రారంభించింది..

నిధుల సేకరణ-కస్టమర్లతో సంబంధాలు

తమ కార్యకలాపాల కోసం ఉజ్జీవన్ అనేక ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలతో కలిసి పని చేస్తోంది. సెకొయా కేపిటల్, ఇండియా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఫండ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కోఆపరేషన్, లోక్ కేపిటల్ సంస్థలేవీ ఉజ్జీవన్ సంస్థ ఆశయాలు..లక్ష్యాలకు భిన్నంగా పని చేయాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదంటారు సుమిత్ ఘోష్. "మాకు పెట్టుబడి పెట్టేవారికి మేం ప్రత్యేకంగా చెప్పేదేమంటే.. రాత్రికిరాత్రి లాభాలు మేం ఇవ్వలేం. ఇది ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి.. ప్రతిఫలాలు అంత త్వరగా రావు. లాభం విషయానికి వస్తే పెట్టుబడికి 15శాతం లాభం వస్తుందని మాత్రం స్పష్టం చేశాం" అని చెప్పారు. సెకోయా కేపిటల్ ఉజ్జీవన్‌కు పెద్ద పెట్టుబడిదారు. SKS మైక్రోఫైనాన్స్ తర్వాత సెకోయా పెట్టుబడి చేసిన సంస్థ ఉజ్జీవన్ మాత్రమే కావడం గమనార్హం.

బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ యూనస్ తో(ఫోటోలో మద్య) సుమిత్ ఘోష్( కుడివైపు)

బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ యూనస్ తో(ఫోటోలో మద్య) సుమిత్ ఘోష్( కుడివైపు)


మిగిలిన మైక్రోఫైనాన్స్ సంస్థలకూ ఉజ్జీవన్ కూ తేడా ఏంటి ?

ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పులు ఇచ్చే ప్రతీ స్థాయిలోనూ పారదర్శక విధానం పాటిస్తోంది. అదే సంస్థకు పెద్ద బలమని చెప్తారు సుమిత్ ఘోష్.. "మా లక్ష్యం ఏంటో మాకు స్పష్టంగా తెలుసు. మాది వ్యాపారమే కానీ ప్రజల అవసరాలను తీర్చుతూ వారి జీవన స్థితిగతులను మెరుగపరిచే లక్ష్యంతో చేస్తున్న వ్యాపారమిది. ఇదే మాకూ మిగిలిన వారికీ తేడాని తెలియపరుస్తుంది" అంటారు.

మేం ఇప్పటిదాకా ఏం చేసినా..అందులో 100శాతం మా నిజాయితీ, కష్టం ఉంది. ప్రతీ పనిలో ఏదైనా కొత్తపద్దతిలో పేదలకు ఉపయోగపడగలమా లేదా ఆలోచించాం..మార్కెట్ లో మాది నంబర్ వన్ సంస్థ కాదు..అన్నిటికన్నా మంచి సంస్ధ అని అందరూ గుర్తించాలి..

" మేం చేసే ప్రతీ పని పారదర్శకంగా ఉంటుంది.. పనితీరు ఆధారంగా ఇక్కడ పని చేసే ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి..అలానే సంస్థలో భాగస్వామ్యం కలిపించేలా షేర్లు కూడా ఇస్తాం..ఉద్యోగుల భద్రతతోపాటు..వారిని సంతోషంగా ఉంచడం కూడా పని తీరును మెరుగుపరుస్తుందనేది నేను నమ్ముతాను.. మిగిలిన అన్ని రంగాల్లానే మైక్రో ఫైనాన్స్ రంగంలో కూడా కస్టమర్లతో మెలిగేతీరు వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది.." ఉద్యోగులకు తాము కల్పించే వాతావరణం గురించి సుమిత్ ఘోష్ చెప్పారు.

ఓ గ్రామంలోని ఆటోస్టాండ్

ఓ గ్రామంలోని ఆటోస్టాండ్


99.87% రీపేమెంట్ సక్సెస్ వెనుక సీక్రెట్

తమ సక్సెస్ సీక్రెట్ గురించి చెప్తూ సుమిత్ "ఏ మైక్రో ఫైనాన్స్ సంస్థ అయినా విజయవంతం కావాలంటే ఒకటే వడ్డీ రేటు ఉంటుంది. ఐతే అది ఏ పరిస్థితుల్లో అయినా కొనసాగించడమే పెద్ద ఛాలెంజ్" అంటారు.

  • కస్టమర్ల ఎంపిక - ముందు మనం ఎంచుకున్న వ్యక్తి ఆర్ధిక సామర్ద్యమే తిరిగి అతను అప్పు చెల్లించగలడా లేదా అనేది నిర్ణయిస్తుంది. అదే ఓ గ్రూపు మొత్తానికి అప్పు ఇస్తే అది తీర్చడమనేది ఆ బృందం సమిష్టి బాధ్యత అవుతుంది. అందరూ చెల్లించగలిగే సభ్యులనే ఆ బృందంలోకి తీసుకుని అప్పుకోసం సంస్థకు వస్తారు. అప్పుడు రీపేమెంట్ లో సమస్యలు తలెత్తవు.
  • ఓ కస్టమర్ వ్యక్తిగతంగా మూడు దఫాలుగా లోన్ తీర్చలేకపోతే , ఆ తర్వాత అది అంతా తీర్చాలన్నా తీర్చలేని స్థితికి చేరుకుంటాడు. అదే ఓ బృందం తరపున తీసుకున్న రుణంలో ఒకరి బదులు ఒకరు అప్పు కట్టుకుంటూ ఆ పరిస్థితి రాకుండా చూస్తారు. ఇదే గ్రూప్ లోన్లకు ఉన్న వెసులుబాటు.
  • తక్కువ వడ్డీ రేట్లు - మైక్రో ఫైనాన్స్ రంగంలోనే అతి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుండటంతో ప్రతీ కస్టమరూ వడ్డీ కట్టడంలో ఎప్పుడూ వెనుకాడరు.
  • క్రెడిట్ బ్యూరో: అప్పు తీసుకునే కస్టమర్లు, వారి ఆర్ధిక స్థితి... ఇవన్నీ ఓ డేటా రూపంలో ఉజ్జీవన్ క్రెడిట్ బ్యూరో వద్ద ఉంటాయి. కాబట్టి అప్పుఎగవేతదారులనే సమస్య తలెత్తదు.

ఉజ్జీవన్ ప్రస్థానంలో మైలురాళ్లు

సమిత్ ఘోష్ తీసుకున్న రక్షణాత్మక చర్యలు, అనుసరించిన విధానంతో ఉజ్జీవన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ఎనిమిదేళ్లు తన ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకుని..ఇంకా ముందుకు సాగుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, అధిగమించిన మైలురాళ్ల గురించి చెప్తూ "మొదట్లో పెట్టుబడికి అవసరమైన రెండుకోట్ల 70లక్షల రూపాయలు సమకూర్చుకోవడం పెద్ద ఛాలెంజ్ గా మారింది. 30ఏళ్ల బ్యాంకింగ్ రంగం అనుభవం ఏ మాత్రం పని చేయలేదు. అంత చిన్న మొత్తానికి కూడా ఏడాది పట్టింది" అని గుర్తుచేసుకున్నారు. అదే సంస్థ ఇప్పుడు ప్రతీ పన్నెండు గంటలకూ 3 కోట్ల రూపాయల అప్పు ఇస్తోంది.

"2010సంక్షోభం అధిగమించడం కూడా ఓ సవాలే. మా కస్టమర్లను వేరే సంస్థలకు తరలిపోకుండా..బిజినెస్ దెబ్బతినకుండా మేం అనుసరించిన పధ్దతులు మమ్మల్నీ రంగంలోలీడర్లుగా నిలబెట్టాయి. కష్టాలను ఎదుర్కొని రాటుదేలిన సంస్థగా నిలబెట్టాయి "

" అలానే మాకున్న అభిప్రాయాలు,విలువలతో కూడిన ఉద్యోగులను సంపాదించడం కూడా అంత సులభంగా జరగలేదు" చెప్పారు సుమిత్ ఘోష్..

ముందున్న మార్గం

ఖచ్చితంగా పూల పాన్పు కాకపోయినా ముళ్ల మార్గం మాత్రం కాదనే చెప్పాలి. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా నడుస్తున్న ఉజ్జీవన్.. తన రూపాన్ని మార్చుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతానికి మైక్రో ఫైనాన్స్ రంగంలో ఎటువంటి అవరోధం ఎదురుకాకపోయినా.. కేవలం రుణాల మంజూరు సంస్థగానే అయితే భవిష్యత్ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. అందుకే బీమాతో పాటు ఇతర ఆర్థిక సేవలు అందించే దిశగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆలోచిస్తున్నాయ్. సహాయకబృందాలు, గ్రూపురుణాల స్థానంలో వ్యక్తిగత రుణాలను మంజూరు చేయడం ప్రారంభిస్తే..ఈ రంగంలో ఉజ్జీవన్ లాంటి సంస్థలు మరిన్నాళ్లు తన విజయగాధ కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తనకి మాత్రమే సొంతమైన క్రెడిట్ బ్యూరో వ్యవస్థతో పేద ప్రజలకు అప్పులు ఇస్తూ..అద్భుతమైన రీపేమెంట్ రేట్ తో దూసుకుపోతోంది ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్.