బ్రాండ్ మీది... బ్రాండింగ్ మాది !

కంపెనీ మాస్ లోకెళ్లాలంటే దానికంటూ ఓ గుర్తింపు ఉండాలి. మార్కెట్లో త‌న‌దైన ముద్ర వేయ‌గ‌ల‌గాలి. అలా వేయాలీ అంటే ఆ కంపెనీకి ఒక బ్రాండింగ్ మ‌స్ట్ అండ్ షుడ్‌. బ్రాండింగ్‌ లో బంప‌రాఫ‌ర్లు దాగి ఉంటాయ‌ని గ్ర‌హించారా యువకులు. అంతే డిజైన్ సొల్యూష‌న్ బిజినెస్ కి తెర‌లేపారు. ఇంత‌కీ పెట్టుబ‌డి ఎంత‌నుకున్నారు? ప‌ట్టుమ‌ని మూడు ల‌క్ష‌లు కూడా లేదు. ఐడియాదే ఇందులో మేజ‌ర్ రోల్. స‌మ‌శీతోష్ణ వాతావ‌ర‌ణంలో నివ‌సించే పెర్డిక్స్ అనే ప‌క్షి పేరిట ఓ బిజినెస్ సొల్యూష‌న్ కంపెనీ స్టార్ట్ చేశారు. మూడు డిజైన్లూ ఆరు ఆర్డ‌ర్లుగా దూసుకుపోతున్నారు.

బ్రాండ్ మీది... బ్రాండింగ్ మాది !

Wednesday March 25, 2015,

5 min Read

పెర్డిక్స్ ల‌క్ష్యం.. బిజినెస్ స‌పోర్ట‌ర్ గా నిల‌వ‌డం. క‌న్జ్యూమ‌ర్స్ ని అట్రాక్ట్ చేయ‌డం. దేశంలో ఎంద‌రో వ్యాపారులున్నారు. వాళ్ల‌కంటూ ఓ ట‌ర్నోవ‌ర్ ఇత‌ర గుడ్ విల్ వ‌గైరాలు పుష్క‌లంగానే ఉన్నాయి. కానీ, బ్రాండ్ ఇమేజ్ మాత్రం లేదు. ఆ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయ‌డ‌మే పెర్డిక్స్ ప్ర‌ధానోద్దేశం. కేవ‌లం ఎంబ్ల‌మ్స్ మాత్ర‌మే కాదు.. త్రీడీ ప్రొడ‌క్ట్ డిజైన్.. మొబైల్ యాప్స్.. వెబ్ సైట్స్.. కొర్పొరేట్ బ్రాండింగ్‌.. డిజిట‌ల్ గ్రాఫిక్స్.. యానిమేష‌న్స్.. ఇలా అనేక ర‌కాలైన సేవ‌లందిస్తుంది పెర్డిక్స్.

image


పెర్డిక్స్ నేటివిటీ మీద ప్ర‌ధానంగా దృష్టి సారిస్తుంది. మ‌న‌మేదైనా డిజైన్ చేస్తే అది ప్ర‌తి ఒక్క‌రితో కనెక్ట‌యిపోవాలంతే! డిజైనింగ్ అంటే ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేనివిధంగా త‌యారు చేయ‌డం మాత్ర‌మే కాదు. ప్ర‌తి ఒక్కరికీ తెలిసినట్టుగా ఉండ‌టం కూడా. నేటివిటీ ట‌చ్ ఇస్తూ పెర్డిక్స్ త‌యారు చేసే ప్ర‌తి స్టిక్క‌ర్ అదుర్స్ అనిపిస్తుంది. చూడాల్సింది ఆకాశంవైపున‌కే అయినా కాళ్లు మాత్రం నేల మీదే ఉండాల‌న్న ప్ర‌ధాన సూత్రం ఫాలో అవుతారు పెర్డిక్స్ క్రియేటివ్ టీం మెంబ‌ర్స్.

గౌహ‌తీలో ఐఐటీ చేసిన దుష్యంత్ పాల్రివాల్‌, మ‌నీష్ సుగంధీ, శుభం జైన్, రంజు ర‌వీంద్ర‌న్, శ్రీజ‌న్ మౌలిక్ అనే ఈ ఐదుగురు 2012లో ప్రారంభించారీ సంస్థ‌. తాము చ‌దివిన కోర్సులు వేరైనా ల‌క్ష్యం మాత్రం ఒక్క‌టే అన్నట్టు.. అంద‌రూ క‌లిసి ఈ రంగంలోకి దిగారు. చ‌దివిన చ‌దువుకు త‌గిన ఉద్యోగంలో చేరాల‌న్న‌ది శుద్ధ త‌ప్పు. అస‌లు మ‌నం ఏదైనా కోర్సు చేస్తే అది ఫ‌లానా అర్హ‌త ఉంద‌ని తెలియ‌చేయ‌డానికి ప‌నికొచ్చేది మాత్ర‌మే. అస‌లైన గ్రాడ్యుయేష‌న్ ఆటిట్యూడ్ లో ఉంటుంద‌ని గ్ర‌హించారు దుష్యంత్ అండ్ కో. అందుకే ఫ్లోలో ప‌డి కొట్టుకు పోకుండా. ప్ర‌తి ఒక్క‌రూ బిల్ గేట్స్ ద‌త్త పుత్రులై విదేశాల‌కు పారి పోకుండా.. ఇక్క‌డే స్థిర‌ప‌డాల‌ని నిర్ణ‌యించారు. మార్కెట్ లో గ్యాప్ ఎక్క‌డుందో వెతికి అక్క‌డ టాలెంట్ చూపాల‌నుకున్నారు.

లివ్ లోక‌ల్ థింక్ గ్లోబ‌ల్.. దుష్యంత్ టీం ఫాలో అయ్యే బిజినెస్ ఫార్ములా. వీరిలో శ్రీజ‌న్, దుష్యంత్ కైరో గ్లోబ‌ల్ సొసైటీలో ఫెలో షిప్ సాధించారు. మ‌నీష్ యంగ్ లీడ‌ర్షిప్ ఫెలో ఇన్ ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గా ఉన్నాడు. వీళ్లలో ఫౌండ‌ర్లు ఐదు మందేగానీ.. మొత్తం 50మంది వ‌ర‌కూ ఎంప్లాయిస్ ఉన్నారు. వీరిలో డిజైన‌ర్లు కొంద‌రు.. టెక్నిక‌ల్ డెవ‌ల‌పర్స్, బిజినెస్ డెవ‌ల‌ప‌ర్స్ మ‌రి కొంద‌రు.. మ‌రికొంద‌రు ఫైనాన్షియ‌ల్ మేట‌ర్స్ చూసుకుంటారు. ఇలా ఎవ‌రి బాధ్య‌త‌లు వాళ్లు పంచుకుని ప‌క్కాగా ప‌ని చేసుకుపోతుంటారు.

image


డిజైనింగ్ భార‌తీయ సంప్ర‌దాయంలో ఒక భాగం.. అదెంత‌గా అంటే ప్రత్యేకించీ ప‌ట్టించుకోనంత‌గా. దాని గొప్ప‌ద‌నం అస్స‌లు గుర్తించ‌నంత‌గా ఇక్క‌డి జ‌న జీవ‌నంలో పెన‌వేసుకుపోయి ఉంటుంది డిజైనింగ్‌.. ఇక్క‌డి ప్ర‌కృతి, పిల్లాజెల్లా గొడ్డూగోదాతో కూడిన జీవ‌నం.. ఆట‌పాట‌లు విద్యావిష‌యాలూ స‌మ‌స్తం ఏదో ఒక శైలి క‌లిగి ఉండేవే. చూసినంత‌నే మ‌న‌సు పై ముద్ర వేయ‌గ‌లిగేవే. క‌ళ్లు పెట్టి చూడాలేన‌గానీ మ‌న కంటి ముందు ఆడుతూ క‌నిపించే చిట్టి పొట్టి పిల్ల‌లూ, ప‌క్కింటి ఆంటీ కూడా ఒక బ్రాండే.. దీన్ని గుర్తించి మార్కెట్ లోకి చొచ్చుకు వెళ్ల‌డం ఎలా? ఇదీ దుష్యంత్ టీంని ముందుకు న‌డిపించే బిజినెస్ మంత్రం. క‌నిపించిన ప్ర‌తిదీ మ‌న డిజైన్లో అందంగా ఒదిగిపోయేదే... డిజైన్ చేస్తే పోయేదేముందీ అదో బ్రాండ్ గా మార‌డం త‌ప్ప.. అనుకుంటారు పెర్డిక్స్ టీం మెంబ‌ర్స్.

సాధార‌ణంగా మ‌న స‌మ‌స్య‌లు కేవ‌లం ప‌రిష్కారాన్ని కోర‌వు. సుల‌భ‌త‌ర‌మైన పరిష్కారాన్ని ఆశిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అది కూడా అత్యంత ప్ర‌భావ‌వంతంగా, స‌మ‌ర్ధ‌వంతంగా ఉండాల‌ని కోరుకుంటాయి. కాబ‌ట్టి మ‌న ప్రొడ‌క్ట్ అవ‌స‌రార్ధం అన్న‌ట్టు ఉండ కూడ‌దు.. అదో సృజ‌నాత్మ‌క అనుభ‌వంగా ఉండాలి. మ‌న‌ డిజైన్ చూసే మార్కెట్లో సాటి వ‌స్తువుల్లో ఈ వ‌స్తువే బెస్ట్ అనిపించాలి. అంత క్రియేటివిటీ అందులో తొణికిస‌లాడాలి. అలా క‌స్ట‌మ‌ర్ దృష్టిని ఆక‌ర్షించ‌లేని డిజైన్ ఫెయిల‌యిన‌ట్టే లెక్క‌.. ఇలా త‌మ‌కు తాము ఒక పాల‌సీ క్రియేట్ చేసుకుంది పెర్డిక్స్ టీం.

కాంపిటీటివ్ మార్కెట్లో డిజైన్ థింకింగ్ బాగా ఎక్కువైందీ మ‌ధ్య‌.. ఫ్లిప్ కార్ట్, ఫ్రెష్ డెస్క్ లాంటి కొన్ని ఆన్ లైన్ కంపెనీలు ఈ విష‌యం మీద ఎక్కువ దృష్టి పెట్టాయి. భార‌తీయ‌త ఉట్టిప‌డేలా డిజైనింగ్ కావాల‌ని కోరుతున్నాయి. కాబ‌ట్టి డిజైన్ థింకింగ్ కీల‌కంగా మారిన రోజుల్లో ఉన్నాం మ‌నం. హెల్త్ కేర్, అర్బ‌న్ ప్లానింగ్‌, ఎడ్యుకేష‌న్ రంగాల్లో ఇది మ‌రీ ఎక్కువైందని అంటారు పెర్డిక్స్ డిజైన‌ర్లు.

పెర్డిక్స్ టీం మార్కెట్లో పేరున్న మెసేజింగ్ యాప్స్ కి డిజైన్లు అందించింది. వీటిలో లైన్ అండ్ వీ చాట్ వంటివి ఉన్నాయి. ఒక్కో టాస్క్ ఒక్కో డిజైనింగ్ ఛాలెంజింగా ఉంటుంది. లైన్ స్టాటిక్ స్టిక్క‌ర్ల‌ను ఆశిస్తే, విచాట్ యానిమేటెడ్ కోరుకుంటుంది. ప్ర‌తి యాప్ కొన్ని గైడ్ లైన్స్ క‌లిగి ఉంటాయి. అదే స‌మ‌యంలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన త‌త్వాన్ని క‌లిగి ఉంటాయి. ఈ విష‌యాల‌ను స‌రిగ్గా ఆవిష్‌ంరించ‌గ‌ల‌గాలి. ఇవ‌న్నీ క‌రెక్టుగా అర్ధం చేసుకుంటేగానీ స‌రికొత్త డిజైన్ పుట్టుకు రాదని అంటాడు పెర్డిక్స్ మెయిన్ ఫౌండ‌ర్ దుష్యంత్‌.

నింబ‌జ్ కోసం త‌యారు చేసిన డిజైన్ల‌కు మార్కెట్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాల్ ఆఫ్ క‌ల్చ‌ర్ అనే గ్లోబ‌ల్ ఆర్గ‌నైజేష‌న్ రీసెంట్ గా ఖురానీ అనే యాప్ రిలీజ్ చేసింది. దీనికి త‌గిన స‌హాయ స‌హకారాలందించింది పెర్డిక్స్. సరోద్, ఐహెచ్ఎమ్సీఎల్ లాంటి ప్ర‌భుత్వ రంగ కంపెనీల‌తో సైతం క‌లిసి ప‌నిచేస్తున్నారు పెర్డిక్స్ టీం మెంబ‌ర్లు. జ‌బాంగ్ వంటి ప్ర‌ఖ్యాత ఆన్ లైన్ సంస్థ‌లతో కూడా పెర్డిక్స్ జ‌త క‌ట్టి కొత్త డిజైన్ల‌కు, యాప్స్ కీ ప్రాణం పోస్తోంది.

పెర్డిక్స్ ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌పై కాన్ స‌న్ ట్రేట్ చేసింది. అందులో మొద‌టిది క్లైంట్ అవ‌స‌రాలేంటో గుర్తించ‌డం. అందుకు త‌గిన విధంగా ప్రొడ‌క్ట్ త‌యారు చేస్తే ఇటు త‌మ‌కు అటు వాళ్ల‌కూ అదో స్పెష‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ లా అనిపించ‌డం.. మ‌రీ ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే క్లైంట్ తో క‌మ్యూనికేష‌న్ గ్యాప్ అంటూ ఉండ‌కూడ‌దు. చేసే ప‌ని మొక్కుబ‌డిగా అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఆ కంపెనీ ఎంప్లాయిస్ క‌న్నా మించిన‌ డెడికేష‌న్ చూపాల‌ని అంటాడు శ్రీజ‌న్.

అంతే కాదు కంపెనీ కంపెనీకి ప్ర‌త్యేక ప‌రిశోధ‌న అవ‌స‌రం. గుడ్డిగా డిజైన్ల‌ను త‌యారు చేయ‌డం అస్స‌లు కూడ‌దు. డీప్ స్ట‌డీ చేశాక‌గానీ త‌మ ప్రొడక్ట్ త‌యారు చేయ‌దు పెర్డిక్స్ టీం. ఒక్క‌సారి చేస్తే అది ప‌ర్ఫెక్ట్ గా సూట‌వ్వాల్సిందే. మ‌నంగానీ ఒక డిజైన్ చేశామంటే అందులో ఎమోష‌న్స్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాల్సిందే. వారి వారి సంస్కృతీ సంప్ర‌దాయాలు కూడా అందులో తాండ‌వించాలి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆ డిజైన్లో న‌వ‌ర‌సాలూ నాట్యం చేస్తున్న‌ట్టు క‌నిపించాలి. అలా జ‌రిగిన‌ప్పుడు డిజైన్ చేసిన వారికీ చేయించుకున్న‌వారికీ సంతృప్తి.. చేశామంటే చేశామ‌నే ప‌ని అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని అంటుంది పెర్డిక్స్ టీం. ఇంత‌టి అంకిత భావం ప్ర‌ద‌ర్శిస్తుంది కాబ‌ట్టే పెర్డిక్స్ లాభార్జ‌న‌లో ముందుంటోంది. ఒక్కో క్ల‌యింట్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది.


ఇప్పుడు పెర్డిక్స్ కంపెనీ డిజైనింగ్ అండ్ ప‌బ్లిసిటీలో ఆరితేరిపోయింది. ఆన్ లైన్ దిగ్గ‌జాలైన ఫ్లిప్ కార్ట్‌. స్నాప్ డీల్ వంటి సంస్థ‌ల‌తో టై అప్ అయ్యి త‌మ స‌హాయ స‌హ‌కారాలందిస్తోంది. బ్రాండింగ్, ప‌బ్లిసిటీలో ప్ర‌త్యేక శిక్ష‌ణ‌లిస్తూ ముందుకు సాగుతోంది. త‌మ స‌క్సెస్ లో మ‌రో ప్ర‌ధాన‌మైన విష‌యం క‌స్ట‌మ‌ర్ ఫీడ్ బ్యాక్ తీసుకుని అందుకు త‌గిన విధంగా మార్పులూ చేర్పులూ చేప‌ట్ట‌డం. అందుకే త‌మ డిజైన్ల‌కు మార్కెట్లో అంత క్రేజ్. అందుకు తాము త‌యారు చేసిన స్టిక్క‌ర్ కేరెక్ట‌ర్ ఆంగ్రీ ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్‌,. ఇది మాకెంతో సంతోషాన్నిస్తోంద‌ని అంటారు పెర్డిక్స్ డిజైన‌ర్లు.

రీసెంట్ గా లైన్ తో క‌లిసి ఓ స్టిక్క‌ర్ కేరెక్ట‌ర్ ప్రొమోష‌న్లో పాలు పంచుకుంది పెర్డిక్స్. అది స్టిక్క‌రేగానీ లైవ్ లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇది ఇండియ‌న్ బ్రాండ్‌ ప్రొమోష‌న్లో మొద‌టి ప్ర‌యోగం అంటారు పెర్డిక్స్ ఫౌండ‌ర్ల‌లో ఒక‌రైన శ్రీజ‌న్.

పెర్డిక్స్ ది మొద‌టి నుంచీ ఒక‌టే విధానం. లాభాలార్జించ‌డం ఒక్క‌టే ధ్యేయం కాదు. బ్రాండింగ్ సొల్యూష‌న్లో మ‌న‌మే టాప్ గా నిల‌వాలి. బ్రాండ్‌ డిజైనింగ్ అంటే మ‌న పేరే గుర్తుకు రావాలి. మ‌న ద‌గ్గ‌రకు వ‌చ్చే క్లైంట్ కి మ‌న‌కిచ్చే డ‌బ్బు గుర్తుకు రాకూడ‌దు.. మ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన ఎక్స్ పీరియ‌న్స్ ఎప్ప‌కిటీ గుర్తుండి పోవాలి. ఇదే విధానంతో పెర్డిక్స్ మార్కెట్ విస్త‌ర‌ణ చేయాల‌ని భావిస్తోంది.

ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు ఇంట‌ర్నెట్ కి షిఫ్ట‌యిపోయింది. మ‌రీ ముఖ్యంగా మోబైల్లో స‌ర్వం దాగి ఉందిప్పుడు. ఈ దిశ‌గా అప్లికేష‌న్ల‌ను రూపొందించ‌డం త‌ప్ప‌నిస‌రి. వ‌ర్చువ‌ల్ గిఫ్ట్స్, స్టిక్‌ీర్స్, గేమ్స్ వ‌గైరా ప్రొడ‌క్ట్స్ ఇప్పుడు డిజైనింగ్ మార్కెట్లో కీల‌కం అయ్యాయి. కాబ‌ట్టి ఈ దిశ‌గా తీవ్రంగా శ్ర‌మించ‌డంలో విజ‌యం దాగి ఉంద‌ని అంటారు పెర్డిక్స్ టీం మెంబ‌ర్స్. ఎవ‌రో క్రియేట్ చేసిన ఫార్మెట్లో క్ల‌రిక‌ల్ జాబ్ చేయ‌డం వేరు.. తామే క్రియేట‌ర్లుగా మారి.. అందుకోసం ప‌నిచేయ‌డం వేరు. ఈ తేడా ప‌సిగ‌ట్టింది కాబ‌ట్టే పెర్డిక్స్ టీం ఇలా దూసుకుపోగ‌లుగుతోంది. యువ‌త‌రానికి ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఆల్ ద బెస్ట్ పెర్డిక్స్ టీం. మీ ఆశ‌లూ ఆశ‌యాలూ నిజం కావాల‌ని కోరుకుంటున్నాం.