చూపులేపోయినా టేబుల్ టెన్నిస్ లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన చిన్నారి

చూపులేపోయినా టేబుల్ టెన్నిస్ లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన చిన్నారి

Tuesday April 25, 2017,

2 min Read

మల్లికా మరాతే. అండర్ 14 టేబుల్ టెన్నిస్ లో ఇప్పుడీ పేరొక సంచలనం. ఎందుకంటే మల్లిక అందరిలాంటి అమ్మాయి కాదు. పసితనంలోనే ఆంబ్లియోపియా అనే మహమ్మారి బారిన పడింది. దాన్నే లేజీ ఐ అంటారు. అంటే, ఒక కన్ను సరిగా కనిపించదు. దాని ఎఫెక్ట్ మెదడు మీద కూడా పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా కనిపించే వ్యాధి. అలాంటి పరిస్థితుల్లో మల్లికా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి టేబుల్ టెన్నిస్ లో ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించి సంచలనమైంది.

image


మల్లికా నాలుగేళ్ల క్రితం ఆంబ్లియోపియా బారిన పడింది. ట్రీట్ మెంట్ జరుగుతున్న టైంలో చూపు ఇంకా మందగించింది. దాంతోపాటు బ్రెయిన్ షార్ప్ నెస్ కూడా తగ్గింది. అయినా చిన్నారి కుంగిపోలేదు. ఎవరూ వెన్నుతట్టకుండానే తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అప్పటికే టేబుల్ టెన్నిస్ మీద మమకారం పెరిగింది. తనకు వచ్చిన వ్యాధి ఆటకు ఆటంకం కాకూడదని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది.

చిన్నారి సాధన ముందు వైకల్యం ఓడిపోయింది. ఏ ఆటలోనైతే సత్తా చూపించాలని పట్టుదలతో ఉందో అదే ఆటలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ గా గెలిచి నిలిచింది. మహిళలు ఆటల్లో రాణించడం అంతంతమాత్రమే అయిన మన దేశంలో, వాళ్లకుండే కట్టుబాట్లు, చిన్నచూపు, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో- ఒక చిన్నారి అందునా పాక్షిక అంధత్వంతో బాధపడే అమ్మాయి టేబుల్ టెన్నిస్ లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడటం నిజంగా అభినందించాల్సిన విషయం.

ఇంకా సమాజంలో ఆడపిల్లల పట్ల అనేక అసమానతలు రాజ్యమేలుతున్నాయి. షార్ట్స్ వేసుకోవద్దని, వాళ్లను స్కూలుకి తప్ప ఆటస్థలానికి పంపొద్దని, వాళ్ల మీద ఖర్చుపెట్టే ప్రతీ పైసా భారమని భావించే ఈ దేశంలో- వైకల్యాన్ని దిగమింగి చిన్నారి మనో నిబ్బరాన్ని గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఎంతైనా అభినందనీయులు.

ఈ సందర్భంగా దీపా కర్మాకర్ ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. జిమ్నాస్టిక్స్‌ లో ఒలింపిక్స్‌ కు ఎంపికైన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర లిఖించుకున్న దీపా- రియోలో పతకం కోసం తన ప్రాణాలే పణంగా పెట్టి పోరాడింది. రోజుకు 9 గంటలు సాధన చేసిన అత్యంత ప్రమాదకర విన్యాసాన్ని సైతం సుసాధ్యం చేసింది. మల్లికా కూడా అదే కోవలోకి వస్తుంది. కాస్తంత ప్రోత్సాహం ఇస్తే చాలు అమ్మాయిలు ఆటల్లోనూ తిరుగులేని ప్రతిభ కనపరుస్తారని చెప్పడానికి చిన్నారి మల్లికాయే నిదర్శనం.