మీ ఫ్రెండ్స్ సూచనలతో సేవలు పొందమంటున్న టూస్ట్

రేటింగ్స్, రివ్యూల ఆధారంగా సేవల సిఫార్సు ఇక సర్వీసుల ఎంపిక మరింత సులువు టూస్ట్ యాప్‌ను అభివృద్ధి చేసిన ఫోన్ వారియర్

మీ ఫ్రెండ్స్ సూచనలతో సేవలు పొందమంటున్న టూస్ట్

Saturday May 09, 2015,

2 min Read

కార్పెంటర్ మొదలుకుని పార్టీ ప్లానర్ వరకు సర్వీస్ అందించే వారిని వెతకడం కోసం ఎంతో సమయం వెచ్చించాల్సిందే. పని పూర్తి అయ్యేవరకు అదో పెద్ద ప్రహసనమే. దీనికితోడు సర్వీస్ అందించే వారిని ఎంత వరకూ విశ్వసించొచ్చు. సేవల కోసం వెబ్ సర్చ్ ఒక్కటే ఇందుకు సరిపోదు. ఎవరి వద్ద నుంచి సర్వీసులు తీసుకోవచ్చో మనం నమ్మే స్నేహితులు సిఫార్సు చేస్తే అంతకంటే పెద్ద ఉపశమనం ఏముంటుంది. మీ స్నేహితులు, వారి నెట్‌వర్క్‌లో ఉన్నవారు సిఫార్సు చేసిన సర్వీసులను తెలిపేందుకో యాప్ ‘టూస్ట్’ వచ్చేసింది. స్నేహితులిచ్చే రేటింగ్స్, రివ్యూల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఇక చాలా ఈజీ. ఇంకా వేరేగా చెప్పాలా సమయమూ, డబ్బూ ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు ఆ తర్వాత మీరిచ్చే రేటింగ్స్, రివ్యూలు మీ స్నేహితులకూ ఉపయోగపడుతుంది.

image


యాప్ యాప్ యాప్

లొకేషన్, బిజినెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సేఫ్టీ.. ఇప్పుడు ఏ అంశంపైనైనా యాప్స్ వచ్చేశాయి. వీటి రాకతో దైనందిన జీవితం ఎంతో సులువైంది. 2016 నాటికి యాప్స్ మార్కెట్ నాలిగింతలకు పెరిగి రూ.3,800 కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో పెయిడ్ యాప్స్ వాటా రూ.2,065 కోట్లుండనుంది. ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు పూర్తిగా మొబైల్ యాప్ పైనే వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయంటే భవిష్యత్‌ను ఇట్టే ఊహించుకోవచ్చు.

image


రంగంలోకి ఫోన్ వారియర్

95 శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్లు లోకల్ బిజినెస్ వివరాల కోసం తమ చేతిలోని ఫోన్లపైనే ఆధారపడుతున్నారట. ఇంతటి ప్రాధాన్యమున్న మొబైల్ యాప్స్ విభాగంలోకి చిన్న స్టార్టప్ కంపెనీలూ ప్రవేశిస్తున్నాయి. ప్రధానంగా లోకల్ బిజినెస్ వివరాలు అందించే యాప్స్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇటువంటి కోవలోకే ఫోన్ వారియర్ వచ్చి చేరుతుంది. స్నేహితులు రికమండ్ చేసిన లోకల్ బిజినెస్ వివరాలను ఈ యాప్ అందిస్తుంది. జస్ట్ డయల్ వంటి సంస్థలు ఆన్‌లైన్ డెరైక్టరీస్‌ను మాత్రమే అభివృద్ధి చేశాయి. ఇందుకు భిన్నంగా ‘ట్రస్ట్’ను ఆధారంగా చేసుకుని టూస్ట్ రంగంలోకి దిగింది. స్నేహితులను మించిన నమ్మకం లేదంటారు ఫోన్ వారియర్స్ సహ వ్యవస్థాపకులు రోహిత్ రాఘవ్.


ఇలా పనిచేస్తుందీ యాప్..

మీరు వైద్యుడి కోసం వెతుకుతున్నట్టయితే.. మీ స్నేహితులు, వారి నెట్‌వర్క్‌లో ఉన్నవారు సిఫార్సు చేసిన వైద్యులను ఈ యాప్ చూపిస్తుంది. స్నేహితుల గురించి, వారి మనస్తత్వం గురించి మనకు బాగా తెలుసు. మన మనస్తత్వానికి దగ్గరగా ఉండే స్నేహితుడు ఏదైనా సర్వీసును పొందినట్టయితే మనకూ నమ్మకం ఏర్పడుతుంది. ఈ ట్రస్ట్‌ను లోకల్ బిజినెస్ సర్చ్‌కు జోడించామని రోహిత్ చెబుతున్నారు. ఫోన్‌లో మన దగ్గరి స్నేహితులు, బంధువుల నంబర్లుంటాయి. వీరిచ్చే సూచనలను నమ్ముతాం కూడా.


కాలర్ ఐడీ కూడా..

డెరైక్టరీ సర్వీసులతోపాటు కాలర్ ఐడీ, కాల్ బ్లాక్ ఫీచర్ కూడా ఈ యాప్‌లో ఉంది. సర్వీసుల పేరుతో మోసం చేసేవారి నంబర్లను బ్లాక్ చేయవచ్చు. నమ్మకమైన సర్వీసు అందించే వారిని ఒకచోటకు చేర్చే వేదిక ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఇందుకు పరిష్కారంగా టూస్ట్ యాప్‌ను తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది. ఫోన్‌గ్రాఫ్ ఆధారంగా రియల్ టైం సేవలను అందించేలా టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు వెల్లడించింది.

చందన్, రోహిత్ రాఘవ్

చందన్, రోహిత్ రాఘవ్


వ్యాపారులకో యాప్..

అటు వ్యాపారుల కోసం కూడా యాప్‌ను అభివృద్ధి చేయాలని ఫోన్ వారియర్ టీం భావిస్తోంది. డాక్టర్ కోసం చూస్తున్న యూజర్ ఫోన్ స్క్రీన్‌పైన సమీపంలోని హాస్పిటల్‌ను ప్రకటన రూపంలో చూపించే వీలుంది. తద్వారా వ్యాపార సంస్థలకు రేటింగ్‌తోపాటు ఫీడ్‌బ్యాక్‌ను వెంటనే ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ఈ యాప్ బీటా వర్షన్‌లో ఉంది. అన్ని సర్వీసులు ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. మరిన్ని ఫీచర్లతో యాప్ రానుందని రోహిత్ అంటున్నారు. ఇప్పటి వరకు టోస్ట్ యాప్‌లో 75 కోట్ల మంది వ్యక్తులు, సంస్థల సమాచారం నిక్షిప్తమై ఉంది. ఏప్రిల్ ప్రారంభంలో కమ్యూనికేషన్స్ విభాగంలో గూగుల్ ప్లే టాప్ ట్రెండింగ్ యాప్స్‌లో టాప్ యాప్స్‌లో టూస్ట్ నిలిచింది. ఇప్పటికే 12 లక్షలకుపైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి.