నాంపల్లి రైల్వేస్టేషన్ ముందు ఇడ్లీ బండితో బంజారాహిల్స్ లో ఏసీ రెస్టారెంట్ పెట్టాడు

రామ్ కుమార్ షిండే సక్సెస్ స్టోరీ

నాంపల్లి రైల్వేస్టేషన్ ముందు ఇడ్లీ బండితో బంజారాహిల్స్ లో ఏసీ రెస్టారెంట్ పెట్టాడు

Wednesday February 08, 2017,

3 min Read

తెల్లవారుజామున మూడింటికి హైదరాబాదులో ఏమైనా తినడానికి దొరుకుతుందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు టీ అమ్మేవాడు కూడా ప్లాస్క్ సంచీలో సర్దుకుని పెట్టుకుని వెళ్లే టైం అది. బ్రెడ్ ఆమ్లెట్ బండి కూడా బిచాణా ఎత్తేసే సమయం అది. నగరం మత్తుగా జోగుతున్న వేళ.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన వేళ.. 

అదిగో.. నాంపల్లి రైల్వేస్టేషన్ ముందు ఆగండి. అక్కడ పొగలు గక్కే దోశబండి కనిపిస్తుంది. చుట్టూ జనం ఎగబడుతూ కనిపిస్తారు. చల్లచల్లటి వాతావరణంలో వేడివేడి దోశలు తింటూ క్లైమేట్ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ టైంకి సిటీలో ఏం దొరుకుతుందో ఏం దొరకదో తెలియదుగానీ, నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు రామ్ బండి మాత్రం యమా బిజీగా ఉంటుంది. ఎక్కడో ఉన్న హైటెక్ సిటీ నుంచి పనిగట్టుకుని వచ్చి మరీ రామ్ వేసిన దోశలు తినిపోతుంటారు. అతడు వేసే దోశల్లో స్పెషాలిటీ ఏంటి? అసలు ఎవరీ రామ్?

image


బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14. పార్క్ హయత్ ఎదురుగా ఒక లేన్. కాస్త లోపలికి ఎంటరైతే లెఫ్ట్ లో రామ్స్ దోశ హౌజ్ అని గ్లాస్ కర్టెన్ రెస్టారెంట్ కనిపిస్తుంది. వాలెట్ పార్కింగ్ లో అవుడి, బీఎండబ్ల్యూ కార్లు పార్క్ చేసి ఉంటాయి. కుర్రాళ్లు బయటనిలబడి ఆర్డర్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు . పిజాదోశ, తవావడా తినందే కదిలే సవాల్ లేదని ఎదురు చూస్తుంటారు. అలా ఎంతసేపైనా..

రామ్స్ దోశ హౌజ్ మరెవరిదో కాదు. పైన చెప్పుకున్న నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా దోశబండి నడిపే వ్యక్తిదే. అవును.. ఆ రామే ఈ రాము. నమ్మశక్యంగా లేదు కదా. తెల్లవారు జామున ఇడ్లీలు దోశలు అమ్ముకునే కుర్రాడు.. ఇంత పోష్ లొకాలిటీలో ఏసీ రెస్టారెంట్ ఓనర్ అంటే నమ్మబుల్ గా లేదుకదా. అతడి సక్సెస్ వెనుక బోలెడంత పెయిన్ ఉంది. అలుపెరుగని ప్రయాణం ఉంది.

1989నాటి సంగతి. రామ్ కుమార్ షిండేకు అప్పుడు ఎనిమిదేళ్లుంటాయి. తండ్రి తోపుడు బండి మీద ఇడ్లీలు, దోశల అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు నాంపల్లి రైల్వే స్టేషన్. మరోరోజు పంజాగుట్ట చౌరస్తా. ఇంకోరోజు మైత్రీవనం. అలా సాగేది అతడి బతుకుబండి. రామ్ తండ్రికి చేదోడువాదోడుగా వుండేవాడు. రాత్రిళ్లు పనిచేస్తూనే చదివాడు. కష్టపడి ఎంబీయే పూర్తిచేశాడు. ఇప్పుడేం చేయాలి? ఉద్యోగం వెతుక్కోవడమా? లేదంటే నాన్న నడిపిన ఇడ్లీ బండి కంటిన్యూ చేయడమా? పెద్ద డైలమా. జాబ్ చేస్తే నెలకు 20వేలు సంపాదించొచ్చు. కానీ రామ్ మనసు ఉద్యోగం మీద లేదు. నాన్న అడుగుజాడల్లో నడవాలని, ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలని.. ఇంకా ఏవేవో రంగుల కలలు.

అనుకున్నట్టే ఇడ్లీ బండికి ఫిక్స్ అయ్యాడు. కానీ ఇలా కాదు. దీన్ని మాడిఫై చేయాలి. క్వాలిటీ ఫుడ్ అందించాలి. కస్టమర్లను ఆకట్టుకోవాలి. రెగ్యులర్ దోశలు వేస్తే వచ్చినవాళ్లు మళ్లీ రారు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సిటీలో ఇలాంటి ఫుడ్ కోర్టులు చాలా వున్నాయి. మనకంటూ స్పెషాలిటీ ఉన్నప్పుడే కదా.. నలుగురు నాలుగుసార్లు వచ్చేది. రామ్ మనసులో ఇవే ఆలోచనలు.

అలా మొదలైంది ప్రయోగం. రకరకాల దోశలు వేయడం మొదలుపెట్టాడు. చీజ్ దోశ, పిజా దోశ, పన్నీర్ దోశ.. ఇంకేముంది నెల తిరక్కుండానే రామ్ బండి యమా పాపులర్ అయింది. రాత్రి 11 తర్వాత సిటీలో తినడానికి అంతగా ఏమీ దొరకని టైంలో రామ్ బండి రారమ్మని పిలుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు కోలాహలం మొదలవుతుంది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడు. కస్టమర్ బేస్ పెరగడానికి అదే కారణం. తెల్లవారు జామున మూడు గంటలకు బిజినెస్ మొదలవుతుంది. పొద్దున 8 వరకు బండి నడుస్తుంది. ఎంతలేదన్నా వెయ్యిమంది వరకు వచ్చి తినిపోతారు.

కట్ చేస్తే, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏసీ రెస్టారెంట్. రామ్స్ దోశ హౌజ్. దాని గురించి తెలియని టెకీ లేడు. అందులో పిజా దోశ తినని ఫిలిం స్టారూ లేడు. వీఐపీలంతా ఇక్కడే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీతో వస్తారు. కుర్రాళ్లంతా ఎగబడతారు. అమ్మాయిలు మరీనూ. వీకెండ్ అయితే కూర్చోడానికే క్యూలో ఉంటారు.

ఇతని ఫేస్ బుక్ పేజీకి 50వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రామ్స్ దోశ హౌజ్ లో 30 మంది పనివాళ్లున్నారు. చెఫ్ లకు నెలకు 30వేల నుంచి 40వేల సాలరీ ఇస్తుంటాడు.

అంత పెద్ద రెస్టారెంట్ ఉందంటే, ఏ ఓనరైనా ఏం చేస్తాడు. హాయిగా కాలుమీద కాలేసుకుని వ్యాపారం చూసుకుంటాడు. కానీ రామ్ అలా కాదు. ఏ నాంపల్లి అయితే దారి చూపిందో.. ఆ ఏరియాను ఇప్పటికీ వదల్లేదు. తెల్లవారు రెండింటికే దోశబండితో రెడీ అయిపోతాడు. పొద్దున ఎనిమిది దాకా అక్కడే ఉంటాడు. సాయంత్రం రెస్టారెంటుకొస్తాడు. ఇంకో పది హోటళ్లు పెట్టినా, నాంపల్లిలో బండి పెట్టి పెనం మీద దోశవేయడం మాత్రం మానను అంటాడు.