20 ఏళ్ల వయసులోనే నాలుగున్నర కోట్ల నిధులు!

ట్రెండీ ఫ్యాషన్ జువెలరీకి కేరాఫ్ అడ్రస్ -సరికొత్త డిజైన్లతో కస్టమర్ల మనసు దోచుకుంటున్న పిపా బెల్లా-

20 ఏళ్ల వయసులోనే నాలుగున్నర కోట్ల నిధులు!

Monday January 04, 2016,

5 min Read

ఆకాశంలోనే కాదు సగం... అవకాశాల్లోనూ సగం అంటారు. తీరా అవకాశం ఇవ్వాల్సి మాత్రం ఎవరి దారిన వారు పోతారు. ఒకటీ రెండు చోట్ల అని కాదు.. ప్రపంచమంతటా మహిళల పట్ల ఇలాంటి వివక్షే. అయితే మిగతా దేశాల కన్నా మన దేశంలో ఈ వివక్ష కొంచెం ఎక్కువే. వ్యాపారంలో ఎంతో కొంత రాణించిన మహిళలు నడుపుతున్న కంపెనీలపై నమ్మకముంచి పెట్టుబడులు పెట్టే వారి సంఖ్యే తక్కువ. అదే రెండు పదుల వయసున్న యువతి పెట్టుబడి కోసం ప్రయత్నం చేస్తే..? అలాంటి వారిని ఇన్వెస్టర్లు ముందుగా అడిగే ప్రశ్న 'మీకు పైళ్లైతే? పిల్లలు పుడితే? బిజినెస్ పరిస్థితి ఏంటి'? 20 ఏళ్ల శుచి పాండ్యాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇలాంటి ప్రశ్నలడిగే వారు తనను ఎప్పటికీ నమ్మరని, వ్యాపారాభివృధ్ది కోసం కష్టపడి పనిచేస్తానని నమ్మిన వారి నుంచి పెట్టుబడి సమీకరించాలని అప్పుడే డిసైడైంది శుచి.

image


కుటుంబ నేపథ్యం

శుచి పాండ్యా... ముంబైలో ఆభరణాలు తయారు చేసే కుటుంబానికి చెందిన యువతి. జువెల్లరీ డిజైనింగ్ అనేది ఆమె రక్తంలోనే ఉంది. రోజూ భోజనం చేసే సమయంలో కుటుంబసభ్యులు బిజినెస్, మార్కెట్ వాల్యూ గురించి మాట్లాడే మాటలు వింటూ పెరిగింది శుచి. అలా చిన్నతనంలోనే ఆభరణాల తయారీకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంది. న్యూయార్క్ యూనివర్సిటీ పరిధిలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మార్కెటింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ కోర్సులో నేర్చుకున్న పాఠాలు ఆమె ఆలోచనలకు కొత్త రెక్కలు తొడిగాయి. అయితే న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాక మాత్రం కొంతకాలం ఫ్యామిలీ బిజినెస్ లో సాయం చేసింది.

"ఫ్యామిలీ బిజినెస్ కార్యకలాపాల్లో సాయం చేయడంతో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. సప్లై వ్యవస్థ, ధర నిర్ణయం తదితర అంశాల గురించి ప్రాక్టికల్ గా తెలుసుకోగలిగాను"- శుచి పాండ్యా

ప్రస్థానం

2010లో వార్టన్ స్కూల్లో ఎంబీఏ చేస్తున్న సమయంలో వచ్చిన ఐడియా శుచి ఓ స్టార్టప్ ప్రారంభించి ఎంటప్రెన్యూర్ అయ్యేందుకు కారణమైంది. అలా ఆలోచనల్లోంచి మొగ్గ తొడిగిందే పిపా బెల్లా. కొత్త తరానికి సంబంధించి టెక్నాలజీ ఆధారిత బిజినెస్ ను ప్రారంభించేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో ఎంబీఏ చేస్తున్నప్పుడే తనకు అర్థమైందంటారు శుచి. వార్టన్ లో ఉండగా ఆమె బిజినెస్ ప్రణాళిక రూపకల్పన, వ్యాపార ప్రారంభానికి సంబంధించి 8వారాల అవగాహన తరగతులకు హాజరైంది. అదే సమయంలో పనిలో పనిగా ఫైనాన్స్, అకౌంటింగ్, కోడింగ్ కోర్సులను కంప్లీట్ చేసింది. వ్యాపార రంగంలో అపార అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు సూచనల నుంచి బిజినెస్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ కు సంబంధించి చాలా విషయాలపై అవగాహన పెంచుకున్న ఆమె ఆన్ లైన్ లో జువెలరీ అందించే స్టార్టప్ పిపా బెల్లాను తీర్చిదిద్దారు. ఈ రంగంతో తనకున్న పరిచయం, అనుభవంతో పాటు ఆన్ లైన్లో జువెలరీ అమ్మకాలకు ఎలాంటి ఢోకా ఉండదన్న నమ్మకమే శుచిని ముందుకు నడిపించింది.

image


"ఆభరణాలు కొనుగోలు చేయాలన్న ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యాషన్ జువెలరీకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యువత లేటెస్ట్ ఫ్యాషన్స్, వినూత్నమైన డిజైన్లు కావాలని కోరుకుంటున్నారు. నాణ్యమైన నగలు అందుబాటు ధరలో ఉంటే చాలనుకుంటున్నారు. బంగారం, వజ్రాల ధరల్లో మార్పు వీటిపై ఎలాంటి ప్రభావం చూపదు" - శుచి పాండ్యా

పిపా బెల్లా అంటే?

మహిళల ఫ్యాషన్ జువెలరీ కలెక్షన్ ను సరసమైన ధరలో అందించే పిపా బెల్లా పేరు వినడానికి వింతగా ఉన్నా.. శుచి ఆషామాషీగా పెట్టిన పేరు కాదది. స్పానిష్ భాషలో పిపా అంటే సాహసాలు చేసే వ్యక్తిత్వం అని అర్థం. ఇక బెల్లా అనేది ఇటాలియన్ పదం. దీనికి ప్రాచీనమైన, సుందరమైన అని అర్థం. తాము తయారు చేసే జువెలరీ ఈ రెండింటినీ ప్రతిబింబించేలా ఉండి మహిళలందరినీ ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పేరు ఎంచుకున్నానంటారు శుచీ పాండ్యా

వ్యాపార విస్తరణ, నిధుల సమీకరణ

ముంబైలో ప్రారంభమైన పిపా బెల్లా ప్రస్తుతం సింగపూర్ వరకు పాకింది. సింగపూర్ లోనూ పిపా బెల్లా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. బిజినెస్ డెవలప్ మెంట్ కోసం అహర్నిశలు శ్రమించిన శుచి పాండ్యా 2015 జులైలో సింగపూర్ కు చెందిన లయన్ రాక్ క్యాపిటల్, రాజేష్ సాహ్నే, తెరుహైడ్ శాటో, రూపానాథ్ నుంచి 6 లక్షల 50 వేల డాలర్ల నిధులు సమీకరించారు. జీఎస్ ఎఫ్ ఫౌండర్ రాజేష్ సాహ్నే, ఫ్రీ కల్ట్ర్ డాట్ కాం మాజీ సీఈఓ సుజల్ షా ప్రస్తుతం పిపా బెల్లా సలహాదారులుగా ఉన్నారు. ఈ నిధులు సద్వినియోగం అయ్యేలా విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజిగా ఉన్నారు శుచి. ముఖ్యంగా హైరింగ్, టెక్నాలజీ డెవలప్ మెంట్, కస్టమర్ల సంఖ్య పెంచేందుకు ఈ మొత్తాన్ని ఖర్చుచేయాలని భావిస్తున్నారు. త్వరలో మరో రెండు దేశాల్లోనూ పిపా బెల్లాను పరిచయం చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.

"ప్రస్తుతానికి మా దృష్టంతా ఇండియాపైనే ఉంది. భారత మార్కెట్ శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. మరో రెండు దేశాల్లోనూ పిపా బెల్లాను స్థాపించి ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ స్థానం సంపాదించుకోవాలన్నది మా ఆలోచన. అయితే మరో ఏడాది వరకు మాత్రం భారత్ మార్కెట్ పైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాం. "-శుచి పాండ్యా.

కస్టమర్లే దేవుళ్లు

ఆభరణాలంటే అమితంగా ఇష్టపడే భారత్ లో జువెలరీ రంగంలో పోటీని తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. అందుకే పిపా బెల్లా ప్రతి వారం 100 కొత్త డిజైన్లను మార్కెట్ లోకి తెస్తోంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు నగలను తయారు చేసి ఇచ్చే విధానాన్ని అమలు చేస్తోంది. కస్టమర్లు తాము కోరుకున్న డిజైన్లను ఎంచుకునేలా వెబ్ సైట్ ను అభివృద్ధి చేసింది. 12మంది సిబ్బంది సాయంతో సరికొత్త డిజైన్లకు రూపమిచ్చే ఈ జువెలరీ స్టార్టప్ తాము రూపొందించిన ఏ డిజైన్ ను 21 రోజుల కన్నా ఎక్కువ కాలం ప్రదర్శించదు.

image


"బ్రాండింగ్ లేకుండా కొనుగోలుదారుల అభిరుచి మేరకు నగలను అందించే ఈ విధానంలో కస్టమర్ల నమ్మకం పొందడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది పెద్ద సవాల్. అందుకే అందుబాటు ధరల్లో, అందమైన ఆభరణాలను రూపొందిస్తున్నాం. అయితే తక్కువ ధరకే నాణ్యమైన వస్తువలను అందించడమనేది చాలా కష్టం. అదృష్టవశాత్తూ జువెలరీ రంగంలో మాకున్న అనుభవం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు ఉపయోగపడింది. నాణ్యత, అందమైన డిజైన్లతో నగలను అందించగలుగుతున్నాం" - శుచి పాండ్యా.

నైపుణ్యం, నిబద్ధత గల ఉద్యోగులను వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకోసం శుచి చాలానే కష్టపడ్డారు. ఆ శ్రమకు ప్రతిఫలమే ఎంతో ప్రస్తుతం పిపా బెల్లా టీం. ఉత్సాహం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వం, ఏ సమస్య ఎదురైనా దాన్ని సవాల్ గా తీసుకుని పరిష్కరించే సిబ్బందే తన ప్రేరణ అంటారు శుచి.

కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు త్వరలోనే పిపా బెల్లా యాప్ ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న శుచి ఉత్పత్తుల సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్నారు. సునిశిత దృష్టి, క్రమశిక్షణ తన బిజినెస్ మంత్రమని చెప్పే ఆమె సవాళ్లు ఎదురైనప్పుడు బెదరకుండా ముందుకెళ్తే విజయం తథ్యమంటున్నారు. వ్యాపారంలో ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలన్నదే శుచి అభిప్రాయం.

నిధుల సమీకరణకు శుచి ఇచ్చే సలహాలు

1 - “అనుకున్న వెంటనే ప్రారంభించారు. కొన్ని పనులు పూర్తయ్యేందుకు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఇన్వెస్టర్లతో చర్చల పేరుతో కాలయాపన చేసే కొద్దీ చేతిలో డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడుతుంది”

2 - “వ్యాపారంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఇన్వెస్టర్లకు తెలియజేయాలి. సమస్యను దాచే ప్రయత్నం చేస్తే ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతుంది. ఇన్వెస్టర్లు మీపై నమ్మకం కోల్పోతారు”.

3 - “వ్యాపార విలువ కన్నా నియమ నిబంధనలే ముఖ్యం. మీరు వ్యాపారాన్ని ఎలా నడుపుతారన్నది వీటిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నియమావళి రూపొందించేటప్పుడు లాయర్ సహాయం తీసుకోవడం ఉత్తమం”.

4 - “నిధులు ఎందుకు సమీకరించాలనుకుంటున్నారు? వాటిని ఎలా ఉపయోగించనున్నారు?” ఈ అంశాలపై స్పష్టత ఉండాలి.

5 - “మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే వారంతా మంచివాళ్లు కాకపోవచ్చు. అందుకే వారితో కలిసి పనిచేయడం మంచిదా కాదా అనే విషయం తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు” అన్నది శుచి పాండ్య సలహా.