గాల్లో ఎగిరే ఆంబులెన్స్‌ వచ్చేసింది..

2017 జనవరి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సేవలు

గాల్లో ఎగిరే ఆంబులెన్స్‌ వచ్చేసింది..

Sunday December 18, 2016,

2 min Read

మనకు తెలుసు హైదరాబాద్ లాంటి సిటీలో ఆంబులెన్స్ పరిస్థితి ఏంటో? అరచి గీ పెట్టినా లోపల వ్యక్తి ప్రాణాలు పైకి తంతున్నా ట్రాఫిక్ జామ్ అయిదంటే మిల్లీమీటర్ సందుకూడా దొరకదు. బెంగళూరేం తక్కువ కాదు. అక్కడి ట్రాఫిక్‌ సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఆంబులెన్స్ రోడ్డెక్కితే గమ్యం చేరేనాటికి బతికుంటే రోగి అదృష్టం. అందుకే ఒక ప్రైవేటు సంస్థ ఎయిర్ ఆంబులెన్స్ సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చింది.

హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసును కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ప్రారంభించారు. జనవరి నుంచి దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యవసర సమయంలో రోగులకు సేవలు అందిస్తారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్ నగరాల్లో ఆల్రెడీ H-130 ఎయిర్ బస్‌ని సిద్ధం చేశారు. 2018కల్లా దేశవ్యాప్తంగా 17 ఎయిర్ ఆంబులెన్స్ సర్వీసులు తీసుకొస్తామని ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

ఈ సర్వీస్ కావాలంటే ఏడాదికి రూ.9వేలు ఇండివీడ్యువల్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. అలాగే ఒక కుటుంబంలో నలుగురు సభ్యుల కోసం కావాలంటే సంవత్సరం చందా రూ.18వేలు. ఇకపోతే గంటకు మెడికల్ చార్టర్ ఖర్చు లక్షా 75వేలు. జనావాసాల్లో లాండయ్యేందుకు ఇంకా డీజీసీఏ నుంచి అనుమతులు రావాల్సి వుంది.

image


ఎయిర్ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్, ఎయిర్ బస్ హెలికాప్టర్స్ తో పాటు దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులతో టై అప్ అయింది ఏవియేటర్ ఎయిర్ రెస్క్యూ సంస్థ. ఈ ఎయిర్ ఆంబులెన్స్ లో ఒక స్ట్రెచర్‌, అంటెండెట్స్ కూచునేందుకు మూడు సీట్లు, ఒక పారామెడికల్ స్టాఫ్ ఉంటారు. ఇవిగాక వెంటిలెటర్ లాంటి లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్, డీఫైబ్రిలేటర్, కార్డియాక్ మనిటర్, సిరింజ్ గట్రా ఉంటాయి.

ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూ కోసం ప్రత్యేకంగా డయల్ నంబర్ కూడా కేటాయించారు. 155350కి కాల్ చేసినా, ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ ఉన్నా హెలికాప్టర్ ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. అవయవాలను తరలించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద రిస్క్‌. పోలీస్‌ యంత్రాంగంతో కో ఆర్డినేట్ చేసుకుని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించుకుంటే తప్ప.. అనుకున్న టైంలో ఆర్గాన్ ట్రాన్స్‌ పోర్ట్ కాదు. అంత గడ్డు పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ సదుపాయం ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా పొందవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ నెగోషియేట్ లేకుండా అత్యంత తక్కువ సమయంలో గుండె, మూత్రపిండాల వంటి అవయవాలను ఒకచోటి నుంచి ఇంకో చోటికి నిమిషాల్లో తరలించవచ్చు.

అయితే, ప్రస్తుతానికి బెంగళూరులో ఏ హాస్పిటల్‌కూ హెలిప్యాడ్ సౌకర్యం లేదు. సర్వీస్ అందించడానికి ఇదొక ప్రధాన అడ్డంకి. ఇలాంటి సమస్యలను త్వరలోనే అధిగమిస్తామని సంస్థ చెప్తోంది. విదేశాల్లో పాపులర్ అయిన ఈ కాన్సెప్ట్ పై మనదగ్గర కూడా చైతన్యం వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.