రాజకీయనాయకుల దిగజారుడు భాష మారేదెప్పుడు..?

నాయకులు మాటల తూటాలు-రాజకీయాల్లో దిగజారుతున్న విలువలు-

రాజకీయనాయకుల దిగజారుడు భాష మారేదెప్పుడు..?

Wednesday December 30, 2015,

5 min Read

ఆ మధ్య అరుణ్ జైట్లీ ఫేస్ బుక్‌ లో ఓ పోస్ట్ చేశారు. జీఎస్టీపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనపై తన ఆవేదనను అందులో ప్రస్తావించారు. నిజానికీ ఈ పోస్ట్ ప్రస్తుత రాజకీయా నాయకులు వాడుతున్న భాష ఎంత దిగజారిపోయిందో ప్రతిబింబించింది. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. రాజకీయ నాయకులంతా దీన్ని స్వాగతించాల్సిందే. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు వాడుతున్న భాష చాలా వరకు దిగజారిపోయింది. ఇది అందరూ అంగీకరించాల్సిన సత్యం. 

image


ఇటీవల జరుగుతున్న రాజకీయ చర్చల్లో నైతికత పూర్తిగా తగ్గిపోయింది. పరస్పర విమర్శల స్థానంలో వ్యక్తిగత దూషణలు సర్వసాధారణమైపోయాయి. నాయకుల అమర్యాదకరమైన భాష వాడటం ఎంత కామన్‌ అయిపోయిందంటే -అసలు ఒక మాట సభ్యత గలదా లేక అసభ్యకరమైందా అన్న అనే తేడా గుర్తించడమే కష్టమైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే అమర్యాదకరమైన భాష వాడటం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిపోయింది. రాజకీయాల్లో భాష ఇంతగా దిగజారిపోవడానికి కారణం చట్టసభల్లో క్రిమినల్స్ అడుగుపెట్టడం, పార్టీలు, ప్రభుత్వాల్లో కీలకమైన పదవులు చేపట్టడమే. ఇదీ మన రాజకీయ పార్టీలు సాధించిన ఘన విజయం అని కొందరంటే... రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధాన స్రవంతిలో ప్రాంతీయవాదం పెరిగిపోవడమే కారణమన్నది మరికొందరి భావన.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. ప్రస్తుతం నాయకులు వాడుతున్న భాషపై విశ్లేషణ, ఆత్మపరిశీలన అవసరం. స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపిన కాంగ్రెస్‌ అగ్రనాయకులంతా ఇంగ్లాండ్‌ లోని బెస్ట్‌ కాలేజీ, యూనివర్సిటీల నుంచి పట్టాలు అందుకున్న వారే. బ్రిటీష్ పార్లమెంటరీ సంప్రదాయాల గురించి వారికి అవగాహన ఉంది. వారంతా ఇంగ్లీష్ భాష, సంస్కృతి, ఆధునికతకు అలవాటు పడ్డారు. వారు తమతో పాటు భారతీయులకు రుచించని వేషభాషలను వెంట తీసుకొచ్చినా తమ నాయకత్వ పటిమతో దేశానికి ఆదర్శంగా నిలిచారు. అయితే మహాత్మాగాంధీ మాత్రం ఖాదీ వాడకం ప్రారంభించి రాజకీయ నాయకుల వేషధారణలో మార్పు తెచ్చారు. నిజానికి గాంధీ వస్త్రధారణను విన్ స్టన్ చర్చిల్ అసహ్యించుకునేవారు. ఆయననను హాఫ్ నేక్డ్ ఫకీర్ అనేవాడు. ఆడంబరాలంటే ఇష్టపడే విన్ స్టన్ చర్చిల్ అలా అనుకోవడం సహజమే. కానీ గాంధీజీ ఆడంబరాలకు దూరం. విదేశీ భాష, వస్త్రధారణతో భారతీయులతో మమేకమవ్వడం సాధ్యంకాదని ఆయనకు తెలుసు. అందుకే ఖాదీ బట్టలు కట్టి జనానికి దగ్గరయ్యారు.

మరోవైపు జవహర్ లాల్ నెహ్రూకు మాత్రం బ్రిటీష్ ఆడంబరాలంటే అమితమైన ఇష్టం. ఇంగ్లీష్ భాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. అందుకే తనతో ఇంగ్లీష్ లో మాట్లాడి, బ్రిటీషర్లలా వ్యవహరించేవారిని ఆయన ప్రోత్సహించేవారు. ఆయన అనుయాయుల్లో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇలా పైకొచ్చినవారే. భాషా అవరోధాన్ని తొలగించి, అగ్రవర్ణాల వారి పెత్తానాన్ని ప్రశ్నించిన మొదటి వ్యక్తి రాం మనోహర్‌ లోహియా. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు బలహీనవర్గాల వారిని రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కేందుకు శ్రమించిన నాయకుడు. ఆయన రాకతో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. అప్పటి వరకు రాజకీయాల్లో కాంగ్రెస్‌ దే ఆధిపత్యం. పార్టీలో బ్రాహ్మణులదే పై చేయి. అయితే ఈ పరిస్థితిని మార్చి మెజార్టీకే రాజ్యాధికారం అన్న నినాదంతో అప్పటి పాలకులకు ముచ్చెమటలు పట్టించిన ప్రజాస్వామ్య నాయకుడు. రాజకీయాల్లో వెనకబడిన కులాల వారి అభ్యున్నతిని ఆయన కళ్లారా చూడలేకపోయినా 90వ దశకంలో వచ్చిన మండల్ కమిషన్ రాజకీయాల రూపురేఖలనే మార్చేసింది.

లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, కన్షీరాం, కల్యాణ్ సింగ్, మాయావతి వీరంతా సంపన్న కుటుంబాలో లేక మేథావి వర్గానికి చెందిన వారో కాదు. వారంతా సాధారణ, పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. భారత రాజకీయాలకు కొత్త భాషను పరిచయం చేసిన ఘనత వీరిదే. అయితే రాజకీయాల్లో ఈ మార్పు అప్పటి ఆధిపత్య రాజకీయ వర్గాలకు ఏ మాత్రం నచ్చలేదు. అందుకే లాలూ ప్రసాద్‌, ములాయం సింగ్‌, మాయవతి మాట్లాడే భాషను వెక్కించారు. వారి ఉచ్ఛారణలో ఆధునికతలేదు. వాళ్లలో చాలా మంది ఇంగ్లీషులో మాట్లాడలేరన్నది నిజం. వారు కుల వివక్ష, అగ్రవర్ణాలు, సంపన్న వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆయా నాయకుల అవినీతి, అసమర్థత ఆధిపత్య గ్రూపుల వాదనకు కొంత వరకు బలం చేకూర్చాయి. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుతో వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. నిజానికి రాజ్యాంగ రచన సమయంలో కేవలం చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలన్న వాదనను ఆధిపత్య వర్గం ముందుకుతెచ్చింది. అయితే వారి ఆటలు సాగలేదు.

రాజకీయ విలువలు పతనమవడానికి మాట తీరే కారణమని నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇది కూడా ఒక కారణమే. చర్చల్లో ఓ విభిన్నమైన పరిభాషకు ఇది అవకాశం కల్పించిందని మాత్రం చెప్పగలను. ప్రస్తుతం రాజకీయాల్లో ఇంగ్లీష్‌ స్థానాన్ని వ్యవహారిక భాష ఆక్రమించుకుంది. ఈ కొత్త భాషా సంస్కృతి ఇంగ్లీష్‌ మాట్లాడే వర్గాలకు మింగుడు పడటం లేదు. ఫలితం రెండు వర్గాల మధ్య ఘర్షణ. కొత్త తరం రాజకీయ వర్గం తెచ్చిన మార్పు ముందు నుంచీ ఆధిపత్యం చెలాయిస్తున్న వర్గానికి సవాల్‌ గా మారింది. ఇది కాస్తా ఇండియన్‌ పాలిటిక్స్‌ ను తప్పుదారి పట్టించింది. భాషాపరమైన మార్పు కొందరికి చేదు గుళికే. అయితే ఇదంతా రాజకీయ ఆస్తిత్వం కోసం రెండు వర్గాలు చేస్తున్న పోరాటమే. వీరిలో ఏ వర్గం కూడా ఓటమిని అంగీకరించేందుకు సముఖంగా లేదు. వాస్తవానికి పరస్పర మర్యాద, ప్రశంస అనే పదాలను నాయకులు ఎప్పుడో మర్చిపోయారు. రాజకీయ విబేధాలు కాస్తా రాజకీయ శత్రుత్వంగా మారిపోయింది. చర్చల్లో విమర్శల స్థానాన్ని పరస్పర దూషణలు ఆక్రమించాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చింది. రాజకీయ చదరంగంలో కొత్తగా అడుగుపెట్టిన ఆప్‌ సంప్రదాయ రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌ గా మారింది. పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవడం పాత పార్టీలకు కత్తి మీద సాములా మారింది. ఆప్‌ ప్రస్థానంతో పెద్ద పార్టీలకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. వాస్తవానికి బడా రాజకీయ పార్టీలకు ఆప్‌ కొరకరాని కొయ్యలా మారింది. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న పార్టీని ఎదుర్కోవడం కష్టంగా మారింది. పార్టీ స్థాపించక ముందు నుంచే ఆప్‌కు ఇతర పార్టీల దూషణలు అలవాటైపోయాయి. మమ్మల్ని మురుగులో పొర్లాడే ఎలుకలతో పోల్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోడీ మమ్మల్ని అడవుల్లో ఉండే నక్సల్స్‌ తో పోల్చారు. దురదృష్టవంతులు (బద్‌ నసీబ్‌ వాలా) అన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రధాని హోదాను దిగజార్చడం దురదృష్టకరం. ఇంకో బీజేపీ సీనియర్‌ నేత గిరిరాజ్‌ సింగ్‌ మమ్మల్ని రాక్షసులతో పోల్చాడు. సాధ్వీ జ్యోతి నిరంజన్‌ అయితే ఓ అడుగు ముందుకేసి ఆప్‌ నేతల్ని అక్రమ సంతానం(హరాంజాదే) అంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయినా బీజేపీ అగ్ర నాయకత్వం వారిని కట్టడి చేయలేదు. కనీసం అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించలేదు.

2007 గుజరాత్ ఎలక్షన్ సమయంలో సోనియా గాంధీ, అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ JM లింగ్డో గురించి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు నాకింకా గుర్తున్నాయి. వాటిని రిపీట్‌ చేయదల్చుకోలేదు. కానీ ఇలాంటి ఎన్నటికీ సమ్మతం కావు. వాజ్‌పేయి హయాంలో కేబినెట్‌ మినిస్టర్‌గా పనిచేసిన యశ్వంత్‌ సిన్హా సైతం గత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను నపుంసకుడంటూ శిఖండితో పోల్చడం నిజంగా బాధాకరం. కానీ ఇప్పుడు అరుణ్‌ జైట్లీ సహా బీజేపీ పెద్దలంతా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోడీని విమర్శించేందుకు ఉపయోగించిన పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తామ తప్పుల్ని చూసుకోకుండా ఎదుటివారి తప్పుల్ని ఎంచడం సరైన విధానం కాదన్నది నా అభిప్రాయం. నీతులు చెప్పడం కాదు పాటించాలి. ఈ విషయం ఆప్‌కు తెలుసు. ముందు ఆత్మపరిశీలన చేసుకుని పొరపాట్లను సరిదిద్దుకోవాలి. ఆప్‌ పురుడు పోసుకోకముందే పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేసి ఎంపీల ప్రవర్తనా నియమావళి రూపొందించింది. అయినా ఎవరూ వాటిని పాటిస్తున్న దాఖలాలు లేవు. అందుకు కారణం ఒక్కటే. భారత రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. చారిత్రక కారణాలతో పాటు రాజకీయాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం పాత రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది. పాతతరం నాయకులెవరూ రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఇష్టపడటం లేదు. గతం, వర్తమానం కలిసి ప్రస్తుత రాజకీయ భాషకు మకిలి పట్టించాయి. కానీ నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. అది మన మంచి కోసమే.

రచయిత: అశుతోష్‌ (ఆమ్ ఆద్మీ పార్టీ నేత)