స్టార్టప్ సక్సెస్‌కు ఆరు సూత్రాలు

స్టార్టప్ సక్సెస్‌కు ఆరు సూత్రాలు

Friday September 25, 2015,

3 min Read

కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి. మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పినట్టుగా చాలామంది యువకులు ఇప్పుడు స్టార్టప్ కంపెనీలను పెట్టి తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఎలాంటి అనుభవం లేకపోయినా సంస్థలను పెట్టి విజయాన్ని పాదాక్రాంతం చేసుకుంటున్నారు. అయితే సంస్థలు ఆరంభించడం అంత సులభం కాదు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాలి. ఆటుపోట్లను తట్టుకోవాలి. 

ఈ నేపధ్యంలో సంస్థను స్థాపించే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ఆరు విషయాలను సోహన్‌లాల్ కమోడిటీ మేనేజ్‌మెంట్ (SLCM) గ్రూప్ సీఈవో సందీప్ శభర్వాల్ వివరించారు. వాటిని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

'' పద్దెనిమిది ఏళ్ల క్రితం మా కుటుంబ వ్యాపారంలో చేరినప్పుడు నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. వస్తువులు దొరక్కపోవడం, స్టోరేజ్ సందర్భంగా అసాధారణ నష్టాలు, పంట రక్షణలో సమస్యలు, నిర్మాణాత్మకమైన ఆర్థిక సాయం లభించకపోవడం వంటి ఇబ్బందులకు గురయ్యాను. ఈ సమస్యలే నన్ను పరిష్కారం వెతికేందుకు ప్రేరేపించాయి. ఇవే సోహన్‌లాల్ కమోడిటీ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఆవిర్భవించేందుకు కారణమయ్యాయి. మా కష్టానికి ఫలితంగా ప్రస్తుతం మా కుటుంబం పేరు చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

image


కానీ ఈ గ్రూప్ ఈ స్టేజ్‌కు చేరడం అంత సులువుగా జరగలేదు. మంచి, చెడు నిర్ణయాలు నాకు ఎన్నో పాఠాలు నేర్పాయి. ప్రస్తుతం మేం మంచి పొజిషన్‌లో ఉన్నాం. నేను నేర్చుకున్న పాఠాలు ఏదో సాధించాలని తపించే యువ వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్లే వాటిని మీతో పంచుకుంటున్నాను.

1. మిమ్మల్నీ మీరు నమ్మండి

మిమ్మల్ని మీరు నమ్మితేనే ఇతరులు కూడా మిమ్మల్ని నమ్ముతారు. మీకు వచ్చిన ఆలోచనను ముందుగా మీరు నమ్మాలి. ఆ తర్వాత ఇతరులను ఒప్పించాలి. దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. రాత్రీ, పగలు మీరు పనిచేయాల్సి ఉంటుంది. నేను మా గ్రూప్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు నన్ను ప్రోత్సహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సంస్థ ఏర్పాటులో ఉన్న సమస్యలనే అంతా వివరించారు. కుటుంబ సభ్యులతో సహా ఎంతో అనుభవమున్నవారు సైతం నన్ను భయపెట్టారు. ఈ రంగంలో ఉన్న నిబంధనల్లో తరుచుగా జరిగే మార్పుల వల్ల కలిగే నష్టాలని వివరించి బెదరగొట్టారు. అయితే నేను రూపొందించిన కాన్సెప్ట్ అప్పటివరకూ అందరికీ కొత్తది, పరిచయం లేనిదే. వేర్‌హౌజింగ్‌ను ఓ వినూత్న ప్రక్రియగా భావించాను. ప్రాసెసింగ్, సప్లయ్ చైన్, ప్రాడక్ట్స్, సర్వీసెస్ ఇలా అన్ని విభాగాల్లోనూ సంచలనమే సృష్టించాం. నేను ఏం అనుకున్నానో.. దాన్ని ఆచరణలో పెట్టగలిగాను.

2. తప్పుడు నిర్ణయం కాదు.. ఏ నిర్ణయం తీసుకోకపోవడమే తప్పు

మానవులు పొరపాట్లు చేయడంమ చాలా సహజం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమన్నంత కష్టంగా అనిపిస్తాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే గంటల తరబడి బోర్డు రూమ్‌లలో గడపాల్సి వస్తుంది. కొన్నైతే తప్పుడు నిర్ణయాలుగా అనిపిస్తాయి. కానీ ఈ ప్రయాణంలో తప్పుడు నిర్ణయాలను పక్కనపెట్టి, సరైన నిర్ణయాలతో కలిసి ముందుకు వెళ్లాలి. సంస్థ ఆరంభ సమయంలో నాకు ఎదురైన ఓ ఘటనకు సంబంధించిన ఓ ఉదాహరణను మీతో పంచుకుంటాను. బ్రాండింగ్‌లో డబ్బులను పొదుపు చేయాలని నేను అనుకున్నాను. కానీ అది తప్పుడు నిర్ణయం. కస్టమర్ల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలంటే బ్రాండింగ్ చాలా అవసరం. దాన్ని ఖర్చుగా కాకుండా, పెట్టుబడిగా భావించాలి. బ్రాండింగ్‌పై నేను తీసుకున్న నిర్ణయం ఆలస్యమైనా దాని ప్రాముఖ్యత ఏంటో నాకు తెలిసొచ్చింది. నా ప్రయాణం ముందుకు సాగేందుకు ఇది ఎంతో ఉపయోగపడింది.

3. అన్నిటి కంటే కస్టమర్లే ముఖ్యం..

మీ కస్టమర్లు మీ సేవల పట్ల సంతృప్తిగా, సంతోషంగా ఉంటే.. సంస్థ వృద్ధి చెందడమే కాదు, విజయం మీ సొంతమవుతుంది. ఏ కంపెనీకైనా కస్టమర్లే బ్రాండ్ ఎంబాసిడర్లు. కస్టమర్లకు మంచి సేవతోపాటు అత్యున్నతమైన ప్రాడక్ట్‌ను అందించడంపైనే దృష్టిపెట్టాలి. మా దగ్గర స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రాసెస్, టెక్నాలజీ, టాలెంట్ ఫర్ స్టేక్ హోల్డర్స్ వంటి విధానాలను అవలంభించాను. 2009లో మేం సంస్థ ప్రారంభించినప్పుడు వచ్చిన మా తొలి వినియోగదారుడు ఇప్పటికీ మాకు కస్టమరే. ఇదెంతో ఆనందాన్నిస్తుంది.

4. సలహాలు తీసుకునేందుకు వెనుకాడొద్దు

అత్యుత్తమ బిజినెస్ స్కూల్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండొచ్చు. లేదంటే మీ స్కూల్‌లో మీరే టాపర్ అయి ఉండొచ్చు. కానీ సలహాలు తీసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కంపెనీకి సీఈవో లేదా ఎండీ అంటే బాస్‌గా మొండిగా ఉండటం కాదు. మంచి ఐడియాలు ఎవరి దగ్గరి నుంచి వచ్చినా స్వీకరించాలి. టాప్ మేనేజ్‌మెంట్ నుంచి ట్రైనీ వరకే కాదు.. మంచి సలహా ఉంటే ఇతరులు చెప్పినా స్వీకరించాలి. నిర్ణయం తీసుకోవడంలో అనిశ్చితి ఎదురైతే ఇతరుల సాయం కోరండి. కానీ సంస్థను నడిపించే అధినేతగా, అంతిమ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి.

5. మీ టీమ్‌పై విశ్వాసముంచండి

మీ కెరీర్‌లో మీరు ఎక్కువ సమయాన్ని మీ టీమ్‌తోనే గడపాల్సి ఉంటుంది. ఉద్యోగులు మీ రెండో కుటుంబం. వారిని విశ్వసించండి. వారిని అర్థం చేసుకోండి. వారితో కలిసి నడవడమే కంపెనీ వృద్ధికి కీలకం. ఇలా వారితో కలిసిపోవడం వల్ల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలోని నైపుణ్యాలు, లోపాలు మీకు తెలుస్తాయి. దీని వల్ల కంపెనీ విలువలకు కట్టుబడని వాళ్లను వదిలించుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది. 

6. ఆరోగ్యాన్ని కాపాడుకోండి

సంస్థ వృద్ధిలోకి రావాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ శక్తులను తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నించండి. సంస్థ అభివృద్ధి మీ ఆరోగ్యవంతమైన నాయకత్వంపైనే ఆధారపడి ఉందనే విషయం మర్చిపోవద్దు. అందువల్ల అన్నిటికంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.


రచయిత గురించి..

సందీప్ శభర్వాల్, ఎస్ఎల్సీఎం గ్రూప్ సీఈవో. అగ్రి లాజిస్ట్స్ రంగంలో సేవలను అందిస్తున్న ఈ సంస్థ దేశంలోనే అతిపెద్దది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. 1.76 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన,760 గిడ్డంగులు, 15 కోల్డ్ స్టోరేజీలను గ్రూప్ నిర్వహిస్తోంది.