మీరు ఎంత నవ్వగలరో చెప్పేసే 'హసోవన్'

నవ్వులతోట హసోవన్‌నవ్వడంతో వచ్చే లాభాలేంటో?మానసిక వ్యాధి నుంచి బయటపడ్డానికి నవ్వు ఒకటే మార్గమా ?నవ్వడాన్ని కూడా వెంచర్‌గా మార్చిన సవిత


మీరు ఎంత నవ్వగలరో చెప్పేసే 'హసోవన్'

Friday May 22, 2015,

4 min Read

హసోవన్... ఈ సంస్కృత పదానికి తెలుగు అర్ధం నవ్వుల తోట. ఈ పేరుతో ఓ సంస్థ ఏర్పడింది. ఇది ప్రైవేట్ గ్రూప్స్, ఎన్‌జీఓలు, కార్పొరేట్లతోపాటు... అడిగితే వ్యక్తిగతంగానైనా వెల్‌నెస్ థెరపీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. నిజానికి హసోవన్ గురించి రాయడం అంత తేలిక కాదు. ఇది కేవలం స్టార్టప్ కాదు. ఇదో లైఫ్ స్టైల్, ఇదో వేదాంతం. ప్రపంచంతో మనుషులు, వారి ప్రవర్తనపై రూపొందిన ఓ విధానం. ఇది అన్నిటిగురించి చెబ్తున్నా మళ్లీ నవ్వడం గురించే ప్రత్యేకంగా చెప్తూ ఉంటుంది. ఇది చాలా సీరియస్ అయిన నవ్వులాట.

image


హసోవన్ ప్రారంభం

ఓ పారిశ్రామికవేత్తగా మారాలనే ఆలోచన హసోవన్ వ్యవస్థాపకురాలు సవిత హోసమానేకు ఎప్పుడూ లేదు. ఉద్యోగ వేటలో తిరుగుతున్నపుడు ఓ రాత్రి వచ్చిన ఆలోచనే ఇది. ఈ ఉద్యోగాన్వేషణ కంటే ఏదైనా సొంతగా ప్రారంభించాలని ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహా ప్రభావమే హసోవన్. “నా దగ్గర డబ్బులు లేవని స్పష్టంగా చెప్పేశా, కనీసం ఎలాంటి కంపెనీ ప్రారంభించాలో నా దగ్గర ఆలోచన కూడా లేదం”టారు సవిత. అయితే, అంతర్గతంగా ఆమె ఆలోచనలు మాత్రం అటువైపే నడిపించాయి. మనసులో ఓ మూల సొంత వ్యాపారంపై ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో పేపర్‌పై సవిత రాసుకున్న ఆలోచన... ఇప్పుడింత సక్సెస్ అవుతందని ఆమెకూ తెలీదప్పుడు.


సవిత హోసమానే, హసోవన్ వ్యవస్థాపకురాలు

సవిత హోసమానే, హసోవన్ వ్యవస్థాపకురాలు


“సంతోషం, సంబరం, ఆనందం, ఆరోగ్యం నవ్వు... వీటి గురించిన నా వెదుకులాటే నన్ను ఇటువైపు నడిపించింది. అందరినీ నవ్విస్తూ ఉండేలా ఏదైనా చేయాలనిపించింది. చెప్పదలచుకున్నవాటిని అందగానే కాదు, హాస్యంతో ముంచెత్తి చెబ్తే ఏం జరుగుతుంది అనిపించింది” అని ఆలోచించానంటారు సవిత. ప్రజలను సంతోషంగా ఉంచాలి. ఇక పరిష్కారం కావు అనే సమస్యలకు సొల్యూషన్ చూపాలి అనుకునేవారామె. అయితే కేవలం నవ్వుల కోసమే ప్రత్యేకంగా ఓ వ్యవస్థకు ఆద్యం పోశారు సవిత.

అమెరికా, యూరోప్‌‍లలో కొన్ని దశాబ్దాల క్రితమే నవ్వులపై మెడికల్ రీసెర్చ్ మొదలైంది. కానీ ఇది వైద్య ప్రక్రియగా ఇప్పటికే నిరూపితమైంది కూడా. ఈ పరిశోధనలో తేలిందేంటంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్... శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతాయి.

“కోపం గుండె, రక్త ప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చర్మం, ఉదరభాగాలపై ఒత్తిడి తెస్తుంద”ని వివరించారు సవిత. అలాగే నవ్వితే చాలా ప్రయోజనాలుంటయని చెప్పారు. రోగ నిరోధక శక్తి, నొప్పుల నియంత్రణ, రక్తపోటు, వ్యాధి సోకిందనే భావన నుంచీ నవ్వులు మనలను దూరం చేస్తాయి.

మంత్ర, యంత్ర, తంత్రాలే ప్రాథమిక సాధనాలు

మంత్రం(కాన్సెప్ట్), యంత్రం(డివైజ్), తంత్రం(థెరపీ)... ఇవి మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నవే. వీటికి ఆధునిక రూపాలే ఇప్పుడు మనం చూస్తున్నాం.

  • ఇవే మంత్రాలు : వర్క్‌షాప్‌లను నిర్వహించి, నవ్వాల్సిన అవసరం గురించి, దాని ప్రాముఖ్యతపైనా అందరికీ చెబ్తుంది హసోవన్. ఇందులో మూడు మంత్రాలు చాలా ముఖ్యమైనవి. నీ కోసం నవ్వు, నిన్ను నువ్వు ప్రేమించు, క్షణక్షణం హాయిగా బతుకు...
  • ఇవే యంత్రాలు : బయో మెడికల్ డివైజ్‌లను ఉపయోగిస్తుంది హసోవన్. లాఫ్టర్ కోషియెంట్... అంటే నవ్వు స్థాయిని కొలిచి చెప్పే ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ అందుబాటులో ఉంచుకుంటారు. అలాగే లాఫింగ్ ఛైర్ కూడా వీళ్ల దగ్గరుంటుంది. ఇదో అద్భుతమైన సీటింగ్ విధానం. ఒత్తిడి తగ్గించే ఈ కుర్చీకి తయారీ కంపెనీకి పేటెంట్ కూడా ఉంది. ఇంకా మరిన్ని ఉత్పత్తులనూ పరిశీలిస్తున్నారు హసోవన్ టీం.
  • ఇవే తంత్రాలు : మైండ్ రిలాక్స్ అయ్యేందుకు కొన్ని టెక్నిక్స్ అవలంబిస్తున్నారు. వర్క్‌షాప్‌లలో వీటిగురించి వివరిస్తుంటారు. దీర్ఘకాలం నవ్వుకుంటూ ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఎలాంటి జీవన విధానం అవలంబించాలో చెబ్తారు. వీటిని హసోవన్ టీం ఎప్పుడూ ఫాలోఅప్ చేస్తుంటారు కూడా.

శరీరం కంటే ఆలోచనలు చాలా శక్తివంతమైనవని.. ఇప్పటికే నిరూపితమైంది. సానుకూల ఆలోచన ధోరణి(పాజిటివ్ థింకింగ్) అలవాటు చేసుకుంటే... అదే మనకు మంచి మెడిసిన్ అవుతుంది. “మన మైండ్‌ని డిస్టర్బ్ చేసే సమస్యలకు దూరంగా ఆలోచనలు తీసుకెళ్లగలగడమే అసలు సమస్య. కొంతమంది తాము ఆనందంగా ఉన్నామనే అనుకుంటారు. అయితే తమ కోపాన్ని అణచుకుంటూ... తమ బాధని మరింతకాలం కొనసాగిస్తూ ఉంటారు వాళ్లు” అంటారు సవిత.

"నవ్వడానికి మేథస్సు అవసరం. మనసు నిలకడగా ఉండాలి. చూస్తున్నదానిపై వెంటనే స్పందించగలగాలి. ఇది విశ్లేషణలకు సంబంధించినది కాదు. మన ఆలోచనలకు సంబంధించిన విషయం. మనలోని బాధలు, టెన్షన్లు, ఒత్తిడి, ఎమోషన్లను తగ్గించే ఓ సహజసిద్ధమైన సాధనం హాస్యం. అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలంటే మనలోని ప్రతికూలశక్తిని ఆసాంతం బయటకు లాగేసేదే నవ్వు"- సవిత

image


కొన్నేళ్లక్రితం ఒక మానసిక వ్యాధితో సవిత బాధపడ్డంతో... అది ఆమె శరీరభాగాలపైనా ప్రభావం చూపింది. అనేక మంది డాక్టర్లను కలిశారు, అలాగే చాలా గుళ్ల చుట్టూ కూడా తిరిగారు. ఆ తర్వాత ఆమెకు అర్ధమైంది ఈ సమస్యకున్న ఏకైక పరిష్కారం నవ్వడమే అని. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించడానికి నవ్వు ఎలా ఉపయోగపడుతుందో అప్పుడే అర్ధమైంది ఆమెకు. "ఆ నవ్వునే అందరికీ పంచాలని అనుకుంటున్నా, బాధని కాదు"అంటారు సవిత.

సవిత ప్రారంభించిన ఈ వెంచర్‌కు నిధులన్నీ ఆమె సొంత డబ్బులే. వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ల ద్వారా కొంత సమకూరుతోంది. ఆదాయం తక్కువే, అయితే ఓషో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిటేటివ్ థెరపీస్, స్టీవ్ విల్సన్&కో వంటి కంపెనీల భాగస్వామ్యంతో దేశవిదేశాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. వెయ్యి మంది వెల్‌నెస్ థెరపీ, 200మంది లాఫ్టర్ కోషియంట్, 50 మంది లాఫింగ్ ఛైర్ ఉపయోగించుకునే స్థాయికి చేరింది ఈ వెంచర్. వారి దగ్గరనుంచి తాను అనుకున్నదాని కంటే ఎక్కువ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని చెబ్తారు సవిత. మరిన్ని అసోసియేషన్లు, ఇంజినీరింగ్ కాలేజ్‌ల సాయంతో హసోవన్‌ని మరింతగా విస్తరిస్తానని అంటున్నారామె.

image


దేశ, విదేశాల్లో సముచిత స్థాయికి చేరుకుంటున్న సంస్థల్లో హసోవన్ ఒకటి. వైద్యరంగంలో ఈ థెరపీకి ప్రాధాన్యత పెరుగుతుండడం, దీని వెనుక తగినంత పరిశోధన ఇప్పటికే జరగడంతో... హసోవన్ వృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే దీనిలో తగినంత లాభదాయకత చేకూరాలంటే... ప్రచారం జరగాల్సి ఉంది. నవ్వితే వచ్చే ప్రయోజనాలేంటో అందరికీ సమగ్రంగా వివరించాలి. హసోవన్ చెప్పే ఫలితాలేవీ అప్పటికప్పుడు కళ్లకు కనిపించేవి కాదు. అందుకే పబ్లిసిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం వీళ్లు న్యూస్ లెటర్లపైనే ఆధారపడుతున్నారు. సోషల్ మీడియా, కేంపెయినింగ్, ఈకామర్స్ రంగాల్లోనూ ప్రచారం చేపడితే... మరింతగా ప్రయోజనం చేకూరుతుందనే అంచనాలున్నాయి.

image


నవ్వుల ప్రయోజనాలను అందిరికీ పెంచేందుకు ఎల్‌క్యూ(లాఫింగ్ కోయిషెంట్) యాప్‌ను లాంఛ్ చేయనుంది హసోవన్. త్వరలో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.