టాట్‌ క్యాపిటల్‌తో జట్టుకట్టిన టీ హబ్‌

ఎంఓయూతో టీహబ్‌లోని స్టార్టప్‌లకు పెరగనున్న అవకాశాలు..3 దేశాల మధ్య బలోపేతం కానున్న వ్యాపార సంబంధాలు..

0


స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టీ హబ్‌ మరో కీలకమైన ముందడుగువేసింది. కార్పొరేట్‌ అడ్వైజరీ కంపెనీ, స్టార్టప్‌లను ప్రోత్సాహించడంలో ముందుండే టాట్‌ క్యాపిటల్‌లో జత కట్టింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో విస్తరించిన టాట్‌ క్యాపిటల్‌తో టీహబ్‌ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత స్టార్టప్‌లు అంతర్జాతీయ కంపెనీలు, వెంచర్‌ క్యాపిటలిస్టులతో అనుసంధానమయ్యే అవకాశం లభిస్తుంది. స్టార్టప్‌ల వ్యాపారం, పెట్టుబడులకు సంబంధించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య టాట్‌ క్యాపిటల్‌ అనుసంధానకర్తగా వ్యవహరించనుంది.

టీహబ్‌ - టాట్‌ మధ్య కుదిరిన MOUతో అనేక ప్రయోజనాలున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మంచి పేరున్న టాట్‌ క్యాపిటల్‌ ఎంఓయూ ద్వారా టీ హబ్‌లో కొలువుదీరిన స్టార్టప్‌లకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించనుంది. బడా బడా కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. అంతేకాక ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే ఛాన్స్‌ దొరుకుతుంది. టీహబ్‌ - టాట్‌ ఎంఓయూ ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు టీ హబ్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశముంది.

“ఎంట్రప్రెన్యూర్లు దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తున్నారు. భారత పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా టీ హబ్‌.. మరో భౌగోళిక అడ్డంకిని తొలగించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నా. టీ హబ్‌ ద్వారా ఎదుగుతున్న స్టార్టప్‌లకు ఈ ఒప్పందం ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. టాట్‌ క్యాపిటల్‌తో కలిసి పనిచేయడం ద్వారా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నామంటారు టీ హబ్ సీఈవో జయ్‌ కృష్ణన్‌. 

“ఈ ఒప్పందం ద్వారా మూడు దేశాలు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా, భారతదేశ సంస్కృతుల్లో ఉన్న సారూప్యం స్టార్టప్‌ల విషయంలోనూ కనిపిస్తున్నది. ఈ ఒప్పందం ద్వారా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌లతో టాట్‌ అనుసంధానమై వివిధ అంశాలపై స్టార్టప్‌లకు మార్గదర్శనం చేస్తుందిని టాట్ క్యాపిటల్‌ కో ఫౌండర్‌ రామ్‌ అంటున్నారు.

దేశంలో ఉన్న వనరులు, టెక్నాలజీ, మేథో సంపత్తి, చట్టాలు ఇండియాలో ఆస్ట్రేలియా కంపెనీల ఏర్పాటుకు, వ్యాపార విస్తరణకు ఉపయోగపడనున్నాయి. వచ్చే నెలలో టాట్‌ క్యాపిటల్‌ భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన వ్యాపార దిగ్గజాలతో హైదరాబాద్‌ బిజినెస్‌ మీట్‌ ఏర్పాటు చేయనుంది. 

Related Stories