ఆధునిక యుగంలోనూ అమ్మ భాషకు అందలం

ఆధునిక యుగంలోనూ అమ్మ భాషకు అందలం

Tuesday March 15, 2016,

5 min Read


మాతృభాష తల్లిపాల వంటిది.. పరభాష, పోతపాల వంటిది. తల్లి పాలు తాగినవాడికి, పోతపాలు తగినవాడికి ఎంతో ఎంతో తేడా ఉంటుంది. అలాగే మాతృభాషలో నేర్చుకున్నవారికి, పరభాషలో నేర్చుకున్నవారికి కూడా అంతే తేడా ఉంటుంది అన్నాడో కవి. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృబాష అని గాంధీజీ అభిప్రాయపడ్డారు. అన్యభాష అవసరం జీవితంలో ఎంతో ఉన్నప్పటికీ, మాతృభాషకున్న మాధుర్యాన్ని మర్చిపోవద్దు. స్టార్టప్ రంగంలో ఇప్పటికే సంచలనం రేపిన యువర్‌స్టోరీ స్థానిక భాషలకు పట్టంకడుతూ ఇప్పుడు భాషా పండుగను ఘనంగా నిర్వహించింది. 

ఇండియా-భారత్ రెండింటి మధ్య ఎంతో డిజిటల్ గ్యాప్ ఉంది. దాన్ని పూరించడానికి యువర్ స్టోరీ ఈ బాధ్యతను తలకెత్తుకుంది. డిజిటల్ రంగంలో తొలిసారిగా నిర్వహించిన భాషా పండుగ విజయవంతమైంది. డిజిటల్ యుగంలోనూ స్థానిక భాషలకు తిరుగులేదని భాషా పండుగలో పాల్గొని 13 స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.

భాష పండుగలో పాల్గొన్న స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల

భాష పండుగలో పాల్గొన్న స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల


కేంద్ర సాంస్కృతిక శాఖ, రివెరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ సహకారంతో మార్చి 11న దేశ రాజధాని ఢిల్లీలో భాషా పండుగను యువర్ స్టోరీ ఘనంగా నిర్వహించింది. స్థానికభాషల్లో సేవలందించేందుకు మరికొన్ని స్టార్టప్ కంపెనీలకు మార్గం చూపించింది.

బిలిట్యూటర్, ఈరెలెగో, ఇండస్ ఓఎస్, ఇండియన్ టీటీఎస్, లిపికర్, లింగ్వావిస్టా, మెగ్‌డాప్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాతృభారతి, ప్లానెట్ గోగో, ప్రతిలిపి, శబ్ధనగరి, శ్రద్ధాంజలి, టైడ్‌లెర్నింగ్ వంటి 13 స్టార్టప్ కంపెనీలు యువర్ స్టోరీ భాషా పండుగలో పాల్గొన్నాయి. ప్రాంతీయ భాషలపై మమకారం తగ్గలేదని నిరూపించుకున్న ఆ స్టార్టప్ కంపెనీల గురించి సంక్షిప్తంగా..

బిలిట్యూటర్: భాషాభిమానులకు, భాషా నేర్చుకోవలనుకున్నవారికి వారధిగా నిలుస్తోందీ సంస్థ. అమ్రాష్ ఆనంద్ చెన్నైలో ఇటీవలే ఈ సంస్థను ప్రారంభించారు. ఇంటర్నెట్లో వివిధ భాషల్లో పుస్తకాలను చదివే వారికి మంచి అవకాశాలను కూడా కల్పిస్తోంది.

ఈరెలెగో: పబ్లిషర్లకు, రచయితలకు ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్‌గా నిలుస్తున్నది ఈ రెలెగో. స్థానిక భాషల్లోని ప్రచురణలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు రచయితలకు ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతున్నది. బుక్స్, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ న్యూస్ పేపర్స్‌ను కూడా పబ్లిష్ చేస్తున్నదీ సంస్థ. ప్రింట్ పబ్లికేషన్స్ కాకుండా డిజిటల్ రీడర్స్ కోసం ఈ సంస్థ తమ సేవలను అందిస్తున్నది.

ఇండస్ ఓఎస్: ప్రాంతీయ వలసవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే ఆర్థికపరమైన, సామాజిక, ప్రాంతీయ టెక్నాలజీని డెవలప్ చేయడం డిజిటల్ ఇండియా అతి పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు ఇండస్ ఓఎస్ కృషి చేస్తున్నది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ డిజిటల్ మాధ్యమం ద్వారా దగ్గర చేసేందుకు స్మార్ట్ ఫోన్‌ వారధిగా చేసుకుంది. ప్రపంచ తొలిప్రాంతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచింది. భారతీయ భాషలు ఉపయోగించే వారికోసమే ఈ ఓఎస్ ను అభివృద్ధి పరిచింది. అలాగే ప్రాంతీయ భాషల్లో మాట్లాడుకునేందుకు, సందేశాలు పంపుకునేందుకు ఉపయోగపడే నేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (డీఈఐటీవై)తో ఒప్పందం కూడా కుదర్చుకుంది. ఒమిదయార్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇటీవలే 5 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండ్‌ను కూడా సేకరించింది. స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు రోహిత్ బన్సాల్, కునాల్ బెహల్, క్వికర్ ఫౌండర్ ప్రణయ్ చౌలెట్, ఇన్ మొబీ కో ఫౌండర్స్ నవీన్ తెవారీ, అమిత్ గుప్తా, హరి పద్మనాభన్, టెమాసెక్‌కు చెందిన మయాంక్ సింఘాల్ వంటి ఇన్వెస్టర్లు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

ఇండియన్ టీటీఎస్: భారతీయ భాషల్లో టెక్స్ట్ టు స్పీచ్ సిస్టమ్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. ఛందస్సు, నుడికారాలు మారిపోకుండా అత్యంత సహజరీతిలో సందేశాలను స్థానిక యాసల్లో వివరించే వాయిస్ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థ రూపొందించింది. ఏ పరికరంలోనైనా, ఏ మొబైల్‌లోనైనా వాడుకునేందుకు వీలుగా హిందీ టీటీఎస్ ఏపీఐని అభివృద్ధి చేసింది. స్థానిక భాషలో ఐవీఆర్ పేరును గానీ, ఆర్డర్ ను గానీ పలికితే కస్టమర్లపై ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. సంస్థలను కస్టమర్లకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సరికొత్త వాయిస్ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచింది ఇండియన్ టీటీఎస్.

లిపికార్: స్థానిక భాషల్లో సందేశాన్ని పంపుకునేందుకు సులువైన పరిష్కారాన్ని కనిపెట్టిందీ సంస్థ. హిందీ, మరాఠీ, గుజరాతీ, తెలుగుతో సహా మొత్తం 18 భాషల్లో సందేశాలు పంపే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. విండోస్ పీసీ, కీబోర్డ్ యాప్ ఆన్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లకు బహుభాషా ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను, ఓ వెబ్ ఏపీఐని రూపొందించింది. ప్రాడక్ట్ ఇన్నోవేషన్‌లో సింప్లిసిటీకిగాను 2008లో సౌత్‌ఏషియా మంథన్ అవార్డ్‌ను కూడా గెలుచుకుంది లిపికార్. సులభంగా టైపింగ్ మెథడ్‌ను సృష్టించడం వల్లే లిపికార్‌కు ఇంత పాపులారిటీ వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేవారికి ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా సొంత భాషలోనే ఆలోచించి, టైప్ చేసుకోవచ్చు.

లింగ్వావిస్టా: అభిషేక్ చక్రవర్తి ఈ స్టార్టప్ సీఈవో. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాంగ్వేజ్ టెక్నాలజీని అవుట్ స్టాండింగ్ లాంగ్వేజ్ సర్వీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం. స్థానిక భాషతో వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే వీరి ఉద్దేశం. 20 ఏళ్ల వయసులో స్టార్టప్‌ కంపెనీని స్థాపించిన అభిషేక్ చక్రవర్తి ప్రస్తుతం భారత్‌తోపాటు చైనా, జపాన్‌లకు కూడా వ్యాపారాన్ని విస్తరించారు.

మెగ్‌డాప్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్: మెగ్‌డాప్ ఒకే ఒక్క లక్ష్యంతో ప్రారంభమైంది. స్థిరమైన బిజినెస్ మోడల్‌తో వాటాదారుల కోసం ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించి, ప్రాంతీయత్వం ద్వారా డిజిటల్ అంతరాన్ని తొలగించాలన్నదే వీరి లక్ష్యం. వివిధ స్థానిక భాషల్లో కంటెంట్‌ను అందించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, ప్రాడక్ట్‌ను రూపొందించించింది మెగ్‌డాప్. థర్డ్ పార్టీల కోసం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ (టెక్స్‌లాంగ్)ను అభివృద్ధి చేసింది. ఈ-కామర్స్, గవర్నమెంట్, మీడియా, ట్రావెల్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ వంటి రంగాలలో కంటెంట్‌ను లోకలైజ్ చేయడమే వీరి ఉద్దేశం. కంపెనీల ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ బిజినెస్, కమ్యూనికేషన్స్, ఇతర అన్ని వ్యవహారాలు స్థానిక భాషలోనే నిర్వహించేందుకు టెక్స్‌లాంగ్ సహకరిస్తుంది.

మాతృభారతి: మాతృభారతి, రచయితలకు స్వయం ప్రచురణ ప్లాట్‌ఫామ్ అయితే చదువరులకు ఈ-బుక్స్ డౌన్‌లోడ్ చేసుకునే ఓ యాప్. గత ఏడాది మాతృభారతి 35 వేల రీడర్లను, 900 మంది రైటర్లను పొందింది. అలాగే 3300 ఈబుక్స్‌ను ప్రచురించగా, 3.6 లక్షల మంది ఈ-బుక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మాతృభారతి ఆరు భాషల్లో 22 రాష్ట్రాల్లో తమ సత్తా చాటింది. అలాగే 42 దేశాల్లో మాతృభారతికి రీడర్లు ఉన్నారు.

ప్రతిలిపి: దేశంలో ప్రాంతీయ భాషల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సెల్ఫ్ పబ్లిషింగ్, రీడింగ్ ఫ్లాట్‌ఫామ్ ప్రతిలిపి. ప్రారంభమైన ఏడాదిన్నరలోనే 2700 మంది భారతీయ రచయితలు, ఆరు భాషల్లో తమ రచనలను ప్రతిలిపిలో అప్‌లోడ్ చేశారు. సాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్‌వంటి అవార్డలను గెలుచుకున్న రచయితలు సైతం తమ రచనలను ప్రతిలిపిలో ప్రచురిస్తున్నారు. 35 లక్షల మంది ఇప్పటివరకు ప్రతిలిపి ద్వారా వివిధ రచనలను చదివారు.

ప్లానెట్ గోగో: స్థానిక భాషల్లో కంటెంట్ డిస్కవరీ లాక్ స్క్రీన్ యాప్ ప్లానెట్ గోగో. వ్యక్తిగత సమాచారాన్ని, న్యూస్‌ను యాండ్రాయిడ్ యూజర్లకు స్క్రీన్ లాక్ ద్వారా అందిస్తున్నది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకునేవారికి ‘గోగో పాయింట్స్’ పేరిట రివార్డులు కూడా అందిస్తున్నది. కంటెంట్‌ను చదవడం లేదా ఫోన్‌ను అన్‌లాక్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్స్‌లలో ఉచిత టాక్ టైమ్‌ను కూడా పొందొచ్చు.

శబ్దనగరి: ఐఐటీ కాన్పూర్‌లో పురుడుపోసుకున్న శబ్దనగరి, హిందీలో భారతదేశపు తొలి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్. కంటెంట్‌ను స్థానిక భాషల్లో ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఏడాది క్రితం లైవ్‌లోకి వెళ్లిన ఈ పోర్టల్, ఊహించినదాని కన్నా ప్రాచుర్యం పొందింది.

శ్రద్ధాంజలి: శ్రద్ధాంజలి.కామ్ పూర్వీకుల, బంధువుల జ్ఞాప‌కాల‌ను చిరకాలం గుర్తుంచుకునేందుకు సాయం చేస్తుంది. కుటుంబ వివరాలు, ఫోటోలు, వీడియోలు, వివిధ భాషల్లో సంతాప సందేశాలను నిక్షిప్తం చేస్తుంది. మరణ, జనన తేదీలను ప్రతి యేటా రిమైండ్ చేస్తుంది. ఈ పోర్టల్‌కు 350 మందికిపైగా వినియోగదారులున్నారు. తొమ్మిది భారతీయ భాషల్లో సంతాప సందేశాలను పంపేందుకు శ్రద్ధాంజలి.కామ్ సహకరిస్తుంది.

టైడ్‌లెర్నింగ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురికివాడల పిల్లలు, టీచర్లు విద్యలో కొత్త కొత్త విధానాలను నేర్చుకునేందుకు అవసరమైన టెక్ అసిస్టెడ్ లెర్నింగ్ టూల్స్‌ను టైడ్‌లెర్నింగ్ డెపలప్ చేస్తోంది. టైక్నాలజీ ఇన్షియేటివ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంక్షిప్త రూపమే టైడ్. నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు, నేర్పించాలనుకునే టీచర్లకు మంచి ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలన్నదే టైడ్ లెర్నింగ్ ఉద్దేశం. అదే సమయంలో స్థానిక సంస్కృతి, భాష, యాస, సంప్రదాయలు పాఠశాలలో కొనసాగేలా కృషి చేస్తుంది. ఉపాధ్యాయులు తమ నాలెడ్జ్‌ను మరింత పెంచుకునేందుకు సాయపడుతుంది. బోధనలో కొత్త కొత్త విధానాలు, సదుపాయాలను వివరిస్తుంది. గ్రామీణ, మురికివాడల పిల్లల కోసం సెకండ్ లాంగ్వేజ్ యాప్ పేరిట ఓ ఇండిపెండెంట్ ఇంగ్లిష్ యాప్‌ను డెవలప్ చేస్తోంది.

భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సేవలను అందిస్తున్న ఈ స్టార్టప్ కంపెనీలు మరింత అభివృద్ధి చెందాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.