పుట్టింది నాగిరెడ్డిపల్లెలో.. ఉద్యోగం సిడ్నీలో.. ఆంట్రప్రెన్యూర్ అయింది హైదరాబాద్‌లో..!

పుట్టింది నాగిరెడ్డిపల్లెలో.. ఉద్యోగం సిడ్నీలో.. ఆంట్రప్రెన్యూర్ అయింది హైదరాబాద్‌లో..!

Wednesday April 27, 2016,

3 min Read

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దత్తత తీసుకున్న తర్వాతనే నాగిరెడ్డిపల్లె అంటే బహుశా మెదక్ జిల్లా వాసులకు కూడా తెలిసిందేమో. అదే ఊరులో పుట్టి పెరిగిన భవానీ ఆలోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లమో చేసి ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియాలో ఆఫర్ రావడంతో ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఆమె కనస్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందే వారి సంఖ్య వంద మంది వరకూ ఉంటారని అంటున్నారు.

తెలంగాణ ఉద్యమ నేపధ్యం

పనిచేసింది సిడ్నీలో అయినా పుట్టి పెరిగిన తెలంగాణాను మర్చిపోలేదు భవానీ. అక్కడున్న తెలంగాణ ఎన్నారైలను ఒక తాటిపైకి తెచ్చి తనదైన పోరాటం చేశారామె. భవానీ వాళ్ల నాన్న కూడా తొలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారట.

“1969 ఉద్యమంలో నాన్నగారు పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు,” భవానీ

ఇంటిలో నాన్న గారి లెగసీని తాను తీసుకున్నానని అంటారామె. ఆయన స్థాయిలో పోరాటాల్లో పాల్గొనకపోయినా ఇక్కడ చలో అసెంబ్లీ జరిగినప్పుడు తాను వచ్చానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఇక్కడ ఉండే వారికి ఉపాధి కల్పించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

image


ఆటో మొబైల్ డిప్లమా టు ఆస్ట్రేలియా

భవానీ సొంతూళ్లో చదువుకోడానికి బడి లేకపోవడంతో పొరుగూరు కాన్వెంట్ లో చదువుకున్నారు. అప్పట్లో అమ్మాయిలను వేరే ఊరు పంపించి చదివించడం అంటే జనం ఏదోలా చూసేవారు. కానీ భవానీ తండ్రికి మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుడా తన పిల్లలను మంచి విద్య అందించాలనే తాపత్రయపడ్డారు. భవానీ వాళ్ల అక్కతో పాటు రోజూ పక్కనున్న ఊళ్లో స్కూల్ కి వెళ్లి వచ్చేవారట. అలా చదువుకోడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చిందని అంటారామె. చదువుని నెగ్లెక్ట్ చేయకపోవడమే తన అభివృద్ధికి దోహదపడిందని చెబ్తారు. 

“అక్కని డాక్టర్, నన్ను ఇంజనీర్ ని చేయాలని అమ్మ అనుకుంది,” భవానీ

అయితే అక్క బిఎస్సీ జాయిన్ అయిందని. కానీ తాను మాత్రం ఆటోమొబైల్ డిప్లమా పూర్తి చేశాని అన్నారు. ఆ తర్వాత ఏపిఎస్‌ఆర్టీసీ లో డిప్యూటీ సూపర్వైజర్‌గా ఉద్యోగం వచ్చింది. గరాజ్‌లో చేసే ఆ పని అప్పట్లో మగవాళ్లు మాత్రమే చేసేవారట.

“ఇంజనీరింగ్ పూర్తి చేయమని అక్క సలహా ఇచ్చింది,” భవానీ

ప్రభుత్వ ఉద్యోగంతో తన గ్రోత్ ఆగిపోకూడదని వాళ్లక్క అన్నారట. ఒక రకంగా తాను ఆస్ట్రేలియా వెళ్లడానికి అక్క ప్రోద్బలమే కారణమని అంటారామె. ఎనిమిదేళ్లు సిడ్నీలో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం తర్వాత ఇండియా చేరుకున్నారు.

చిన్నప్పటి చాంపియన్ భవానీ

చిన్నప్పటి చాంపియన్ భవానీ


ఇన్ఫ్రాకంపెనీ పెట్టబోయి కనస్ట్రక్షన్ లోకి

తాను చదివింది ఆటో మొబైల్ అనంతరం మెకానికల్ లో ఇంజనీరింగ్ చేసినా పనిచేసింది ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోనే. హైదరాబాద్ వస్తే కచ్చితంగా కంపెనీ ప్రారంభిచాలనే అనుకున్నా. కాకపోతే ఏం వ్యాపారం చేయాలనే దానిపై చాలా కాలం తర్జన భర్జన పడ్డాను. ముందుగా స్కూలు పెడదామని అనుకున్నా. ఆ తర్వాత హాస్పిటల్. కానీ ఇన్ ఫ్రా కంపెనీ అయితే ఎక్కువ మందికి ఉపాధి అందించొచ్చని దాన్ని ఎంచుకున్నా అంటారు. అయితే పెట్టుబడి ఎక్కువ అవుతుందని భావించి కనస్ట్రక్షన్ వైపు అడుగులేసారు. శ్రీరాం కనస్ట్రక్షన్స్ పేరుతో ఓ వెంచర్ ప్రారంభించారు. వ్యాపారం ప్రాఫిటబుల్ గా సాగుతోందని ధీమాగా అన్నారు. 30 మంది ఉద్యోగులున్నారు. ఆఫ్ రోల్ లో మరో అరవైకి పైగా ఉద్యోగులున్నారు. మరికొంత మంది ఫ్రీ లాన్సర్స్ పనిచేస్తున్నారు. బిజినెస్ నెక్ట్స్ లెవెల్ కి వెళ్తే మరో వంద మందికి పని కల్పించొచ్చని చెప్పుకొచ్చారు భవానీ.

చిన్నప్పటి నుంచి చాంపియన్ 

చిన్ననాటి నుంచి చురుగ్గా ఉండే భవానీ స్కూల్ చాంపియన్, కాలేజీ టాపర్. సిడ్నీలో ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వ్యాపారంలోనూ సూపర్ సక్సెస్ అయ్యారు. చదువుకునే రోజులన నుంచే గెలవడం అలవాటుగా చేసుకున్నానని భవానీ అంటారు. ఏ సందర్భంలో అయినా ధైర్యంగా ఎదుర్కోవడం మా నాన్న గారు నేర్పించారు. దాన్ని కొనసాగిస్తూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇలా చిన్నప్పటి నుంచి ఎన్నో బహుమతులు, అవార్డులు అందుకున్నారు. వాటి లిస్టంటా చెప్పడం ఇప్పుడు కష్టమే సుమీ. ఇందలో కొన్ని అరుదైనవి ఉన్నాయని అన్నారామె. తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిలు ఎక్కువగా చదువులకు దూరం అవుతున్నారు. ఆ పరిస్థితి మారాలి. దానికోసం తాను ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రైతుల కోసం సహాయం కోసం ఒక ఎన్జీఓను రన్ చేస్తున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో బిజీ అవుతానని అంటున్న భవానీ తన ప్రతి నిర్ణయం వెనక భర్త ప్రోత్సాహం ఉందన్నారు.

image


నేను చెప్పేదేంటంటే .. 

చదువులో రాణిస్తే జీవితంలో దేన్నైనా సాధించగలరు. ముఖ్యంగా ఆడపిల్ల చదువుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం. అమ్మాయి సొంతంగా సంపాదించుకునే శక్తి ఉన్నప్పుడు సమాజంలో మార్పు సాధ్యపడుతుంది.