సొంత కంపెనీ కోసం కార్పెంటర్ అయిన కంప్యూటర్ ఇంజనీర్

సొంత కంపెనీ కోసం కార్పెంటర్ అయిన కంప్యూటర్ ఇంజనీర్

Tuesday April 28, 2015,

7 min Read

కలలు అందరూ కంటారు.. కానీ వాటిని సాధించుకోవడంలోనే ఉంటుంది అసలు మజా. అలాంటి కోవకే చెందుతారీ కథలోని ముగ్గురు స్నేహితులు. ఎ.ఎం.సమీర్‌కీ , సి.ఆర్.వత్సలకీ ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకం. వాళ్ళ స్టార్టప్ స్క్వాడ్రోకు ఈ ఏప్రిల్‌కి మూడేళ్ళు పూర్తవటం ఒక్కటే కాదు, మొదటి వెయ్యి రోజుల్లో తనకాళ్ళమీద తాను నిలబడింది కూడా. ఏ స్టార్టప్‌కైనా ఇదొక పెద్ద మైలు రాయి. ముగ్గురు యువ వ్యవస్థాపకులు స్థాపించిన బోనిటో డిజైన్ కథ ఇది. అదే వాళ్ళ మరో స్టార్టప్ వెంచర్ స్క్వాడ్రోకు తొలి పెట్టుబడి ఎలా అయిందో చెబుతుంది. 2014 లో భారత గృహాలంకరణ పరిశ్రమ మార్కెట్ విలువ 1800 కోట్ల డాలర్లు. 2015 నాటికి అది 2000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అందులోకి దూసుకెళ్ళాలన్నదే వీరి తాపత్రయం. ఇప్పటి వరకూ వాళ్ళు బెంగళూరులో 300 ప్రాజెక్టులు పూర్తి చేశారు.

సమీర్,వత్సల,రిక్సన్ బృందం

సమీర్,వత్సల,రిక్సన్ బృందం


తొలి అడుగులు

సమీర్, వత్సల ఇద్దరూ కాలేజ్ ఫ్రెండ్స్. ఆ తరువాత్ ఇద్దరిదీ చెరోదారి. వత్సల ఒక డిజైనర్‌గా హోమ్ టౌన్‌లో పనిచేస్తుంటే సమీర్ ఒక టెక్నాలజీ కంపెనీలో చేరాడు. ఆ తరువాత మోటరోలా కంపెనీలో యాప్ డెవలపర్ అయ్యాడు. కానీ వత్సల మాత్రం ఆ బహుళజాతి కంపెనీలో సృజనాత్మకమైన సంతృప్తి పొందలేకపోయింది. ఫ్రీలాన్సింగ్ పనులు చేపట్టింది. ఈలోగా సమీర్‌కి ఇంటెర్నెట్ మార్కెటింగ్ మీద దృష్టిపడింది. దాంతో ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, బ్లాగింగ్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. వత్సల డిజైన్లు బాగున్నాయి. జనం ఇంకా ఇంకా కావాలంటున్నారు. సమీర్ ఆమె నైపుణ్యానికి తగిన ఫలితం దక్కాలనుకున్నాడు. ఆమె నైపుణ్యానికి బోనిటో డిజైన్స్ పేరుతో ప్రచారం కల్పించటం మొదలుపెట్టాడు. బోనిటో అంటే అందమైన అని అర్థం. 2012 ప్రారంభం నాటికల్లా ఒక వెబ్‌సైట్ మొదలుపెట్టటంతోబాటు అన్నిచోట్లా ప్రచారం చేస్తూ వచ్చారు. వత్సల తాను పనిచేసిన బహుళజాతి కంపెనీలలో కొనుగోలు విధానం సంతృప్తికరంగా లేదన్న విషయాన్ని గ్రహించింది. “ క్లయింట్ ఒకే ఒక ఫర్నిచర్ ఐటెమ్ కొనాలనుకుంటే వాళ్ళు ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అనుసరించాల్సి వస్తున్నది. అమ్మకం తరువాత క్లయింట్ మళ్ళీ ఆ వస్తువు గురించి మాట్లాడాలనుకుంటే తనకు అసలెంత మాత్రమూ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడాలి “ అని యువర్ స్టోరీతో చెప్పారామె.

image


“హోమ్ టౌన్ లోకి ఒక కస్టమర్ వస్తే తనకి తన గది కొలతలు తెలిసి ఉంటాయి. ఏది ఎక్కడ ఉంచాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఫర్నిచర్ తీసుకెళ్ళి అక్కడ అమర్చుకుంటారు. డిజైన్ డిపార్ట్‌మెంట్ అనే శాఖ ఒకటి ఉంటుందని కూడా జనానికి తెలియదు. క్లయింట్‌కి ఏం కావాలో అడిగి తెలుసుకోవటానికి సరైన పద్ధతి కూడా లేదు “ అంటారు వత్సల. అప్పుడే ఆమెకు తెలిసివచ్చింది సమస్య ఎక్కడ ఉందనేది. కానీ ఆమె మేనేజర్లు ఎవరూ ఆమె సలహాలు వినలేదు సరికదా సహకరించలేదు కూడా. ఎందుకంటే అక్కడ వ్యవస్థ చాలా పెద్దది. కేవలం ఒక హోమ్ టౌన్ ఉద్యోగిగా ఏదైనా అంశం లేవనెత్తితే అది ముంబయ్ కేంద్రకార్యాలయానికి వెళ్లాల్సిందే. 

వత్సల తరచూ సమీర్‌తో కలిసి కాఫీ తాగుతూ ... అసంతృప్తికి లోనవుతున్న కస్టమర్స్ గురించి చెప్పేది. ధర చెల్లించటానికి కస్టమర్ సిద్ధంగా ఉన్నప్పటికీ అతడి అవసరాలకు తగినట్టు సిద్ధం చేసి ఇవ్వగల వ్యవస్థ లేదంటూ చెబుతుండేది. అప్పుడే సమీర్ ఆ కోణంలో పరిశోధన మొదలుపెట్టాడు. 

“ దాదాపు ప్రతి ఇంటీరియర్ డిజైనర్‌కూ ఈ సమస్య ఉంది. అది కేవలం ఒక కంపెనీకి ఆపాదించటం కాదు, మొత్తం పరిశ్రమే అలా ఉంది. అది పూర్తిగా దిగువ స్థాయి కార్మికులతో వ్యవహరించాల్సి వస్తుంది. కానీ కంపెనీలు అలా నియంత్రించలేవు. “ముడి కలప దించుకునే వ్యక్తి, కార్పెంటర్, డ్రిల్లింగ్ చేసేవాడు, బోల్టులు బిగించే మనిషి.. పూర్తిగా వాళ్లమీద ఆధారపడలేం. రేపు అకస్మాత్తుగా కార్పెంటరో మరో కార్మికుడో ఫోన్ స్విచాఫ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్ ఆగ్రహానికి గురయ్యేది కంపెనీపై మాత్రమే “ అంటాడు సమీర్.

ఇంటీరియర్ డిజైన్ కంపెనీలలో చాలావరకు క్లయింట్ సంప్రదించటానికి ఒకే జవాబుదారీ వ్యక్తి ఉండడు. ఈ సంగతి గ్రహించటమే అవకాశాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవటానికి దోహదం చేసింది. మీరో కారు కొంటున్నట్టు ఊహించుకొండి. కొనటం పూర్తయ్యేదాకా మీరు ఒకే సేల్స్ పర్సన్ తో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంటీరియర్స్ విషయంలో అదే మొత్తం ఖర్చు చేస్తున్నప్పటికీ అలా జరగదు.

తొలి కస్టమర్‌ని సంపాదించటం

ఏ స్టార్టప్‌కైనా తొలి కస్టమర్ ని సంపాదించటం ఒక మాజిక్. సమీర్‌కి ఆ రోజులు గుర్తుకొచ్చాయి. “ మా అపార్ట్ మెంట్‌లో తెలిసిన మార్కెటింగ్ ఉద్యోగి ఒకరుండేవారు. క్లయింట్స్ లిస్ట్ ఒకటి ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు. లంచ్ టైమ్‌లో, టీ టైమ్‌లో వాళ్ళకు ఫోన్ చేసి మీకేమైనా ఇంటీరియర్స్ వర్క్ అవసరముందా ? అని అడిగేవాళ్ళం. నిజానికి అలా అడగటం మార్కెటింగ్ పద్ధతి కానే కాదు. కానీ మొదటి క్లయింట్స్ కోసం అది తప్పనిసరి. నేను చేస్తున్నదేంటంటే, వాళ్ళు మా వెబ్ సైట్ చూసేట్టు చేయటం. అదే నా ఉద్దేశం. వాళ్ళు వెబ్‌సైట్ చూశారన్నసంగతి తెలిసింది. వాళ్ళకు చూసింది నచ్చింది. తిరిగి ఫోన్ చేశారు. “హోమ్ టౌన్ లో పనిచేస్తుండగా వత్సల ఒకరిద్దరు ఫ్రెండ్స్ కోసం డిజైన్ చేసింది. అప్పట్లో వాళ్ళు ఏమంత గొప్పగా డబ్బివ్వకపోయినా ఇప్పుడా పని వెబ్‌సైట్‌లో పెట్టుకోవటానికీ, మొదటి ఇద్దరు క్లయింట్స్ మనసులు గెలవటానికీ పనికొచ్చింది.

తొలి అడుగుల తడబాటు

ఈ ఇద్దరు కస్టమర్ల విషయంలో వాళ్ళు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫలితం బాగా వచ్చేట్టు చూసుకున్నారు. ధరలు బేరమాడుకోవటం ఎలా ఉండాలో వాళ్ళకు ఇదొక పరీక్ష. “ఆర్థిక పరంగా మాట్లాడాలంటే మొదటి రెండు ప్రాజెక్టులూ నష్టాలే. ఎందుకంటే వత్సల ఒక డిజైనర్. నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. జనంతో బేరమాడటం మాకు తెలియదు” అంటాడు సమీర్. వత్సలకు డిజైన్ కోసం అడ్వాన్స్ వచ్చినప్పుడు తను చాలా సంతోషించింది. దాంతో కస్టమర్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ ఆ డిజైన్ ను అమలులో పెట్టే స్థితికి వచ్చేసరికి సమస్యలు వెలుగు చూశాయి. 

“డిజైన్ ను ఆచరణలో పెడుతున్నప్పుడు సమస్య ఎదురైంది. బయటి వ్యక్తుల సేవలు వాడుకోవాల్సి వచ్చింది. మాకు ఎలాంటి పరిచయమూ లేనప్పటికీ కేవలం ప్రయోగాత్మకంగా వాడుకున్నాం” అని చెప్పాడు సమీర్. అలా కార్పెంటర్లను వినియోగించుకొవాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ ముందుకు సాగింది. “ కస్టమర్‌కూ మేం నియమించుకున్న వాళ్లకూ మధ్య మేము ఉన్నాం. కానీ పనిజరిగే చోటుకెళ్ళిన కస్టమర్ మార్పులు కోరేవాడు. దీంతో వాళ్లకూ పనివాళ్లకూ మధ్య ఘర్షణ మొదలైంది. పగటిపూట పని ఉండటం వల్ల సమీర్, వత్సల... పని జరుగుతున్నచోట ఉండలేకపోయేవాళ్ళు. కస్టమర్‌కీ, పని వాళ్లకూ మధ్య మాటా మాటా పెరిగినప్పుడు పనివాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ''పనివాళ్ళు చివరికి మా మీదనే పోలీసు కేసుపెట్టారు. మేం వాళ్ళకు డబ్బివ్వలేదన్నారు. పని ఆగిపోయింది కాబట్టి మా కస్టమర్ మాకు డబ్బివ్వలేదు. మొత్తమ్మీద మాకు 3 లక్షల నష్టమొచ్చింది. కానీ మా తప్పు లేదని తేలింది. పనివాళ్ళకు మేం డబ్బిచ్చేశాం. వత్సల మొత్తం 8 లక్షలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది. కానీ వాళ్ళు నాలుగు లక్షలే ముట్టిందని పోలీసుల దగ్గర అబద్ధమాడారు. మేం పోలీస్ స్టేషన్‌లో రశీదులు చూపించేసరికి ఆ వ్యవహారం అంతటితో ముగిసింది. కస్టమర్‌కు ఇలాంటివి ఎదురుకాకుండా మేం మధ్యలో రక్షణగా ఉంటాం. అందుకోసం పది శాతం అదనంగా వసూలు చేస్తాం. అది సరైందే.

ఖరీదైన పాఠం

ఈ సంఘటన నుంచి యువ వ్యవస్థాపకులు పాఠం నేర్చుకున్నారు. కీలకమైన్ పనులు ఔట్ సోర్స్ చేయకూదదని అర్థమైంది. 2012 ఏప్రిల్ నాటికల్లా మూడు ప్రాజెక్టులు పూర్తిచేశారు. ఒక కంపెనీ ప్రారంభించాలనుకున్నారు. వత్సల తన ఉద్యోగం వదిలేసింది. సమీర్‌తో బాటు ఆ తరువాత మూడో సహ వ్యవస్థాపకుడు రిక్సన్ కూడా కలిశాడు. ఆమె ఉద్యోగం వదిలేయటం వలన ఆ తరువాత మూడు నెలలకాలం ఆమె కనీస ఖర్చుల కోసం వాళ్ళిద్దరూ కలిసి పోగుచేసి అందించారు. ఆ ఏడాది అక్టోబర్ దాకా ఒక ఉద్యోగిని పెట్టుకోగలిగేంత డబ్బు వాళ్ల దగ్గరలేదు. అనుకోకుండా వాళ్లకు కారు చౌకగా ఓ చోటు దొరికింది. 1500 చదరపుటడుగులకు కేవలం నెలకు 15 వేలకే అద్దెకు దొరికింది. వాళ్ళ డబ్బంతా ఫ్యాక్టరీ నిర్మాణానికే సరిపోయింది. అందరూ కలిసి 3 లక్షలు పెట్టారు. అందులో 2 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చారు. ఆ చోటునుంచే ఆర్డర్లు సంపాదించారు. సమీర్ ప్రకటనల బాధ్యత చూసుకున్నాడు. అలా వాళ్లకు పిలుపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాళ్ళకు బెంగళూరుకు చెందిన సందీప్ అనే విక్రేత తారసపడ్డాడు. అతనిదగ్గర ఆ యంత్రాలున్నాయి. కొనటానికి తమ దగ్గర డబ్బులేని విషయం అతనికి చెప్పి బతిమాలారు. ఇప్పుడే కొత్తగా ఈ వ్యాపారంలోకి దిగామని బ్యాంకులు అప్పులివ్వటానికి సిద్ధంగా లేవని చెప్పారు. ఏమైతేనేం, ఏడాదిపాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేలా అతను యంత్రాలివ్వటానికి ఒప్పుకున్నాడు.

వాళ్ళకు వెంటనే ఆదాయం రావటం మొదలు కాలేదు. సమీర్ తల్లిదండ్రులేమో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కార్పెంటర్ గా మారాడంటూ విసుక్కున్నారు. తొలి క్లయింట్స్‌లో ఒకరైన నిశాంత్ మా వెబ్ సైట్ చూసి ఫోన్ చేశాడు. మా ముఖాలు చూసి మమ్మల్ని నమ్మాడు. అతనికి చూపించటానికి మాకో ఆఫీసు కూడా లేదు. మా ఆఫీసులో కలుస్తానని అతను అన్నప్పుడల్లా ఎలాగోలా ఆ మాట దాటవేసేవాళ్ళం. కానీ అతను మాకు డబ్బిచ్చాడు. కార్పెంటర్లకు అడ్వాన్స్ ఇవ్వటానికి అది వాడుకున్నాం. అతని పని విజయవంతంగా పూర్తి చేశాం. ఆ డబ్బే వ్యాపారాన్ని నడిపింది. “ అని గుర్తు చేసుకుంటాడు సమీర్. 

ఏడాదిన్నరపాటు నానా ఇబ్బందులు పడ్డారు. అప్పటికిగాని వాళ్ళు తామొక కంపెనీ నడుపుతున్నామనే అభిప్రాయానికి రాలేదు. ప్రతి చిన్నపనీ మొదలుకొని డిజైనింగ్ దాకా వాళ్ళే చేసుకునేవారు. ఒక్కోసారి కూలీలు ఉండేవారు కాదు. డెలివరీ ట్రక్కు వచ్చేది. క్లయింట్ తో మాట్లాడుతున్నా కాసేపు చర్చలు ఆపి సరకు దింపాక మళ్ళీ చర్చలు కొనసాగించేవాళ్ళు. కస్టమర్‌ని సంతృప్తికరంగా ఉంచితేనే వాళ్లకు మనుగడ ఉంటుందని ఈ బృందానికి బాగా తెలుసు. ఒక కస్టమర్‌కి కనీసం ఒక శాతం పని చేయకపొయినా వాళ్ళు 20-30 శాతం డబ్బు ఆపేస్తారు. అంటే నూరుశాతం లాభం అక్కడే ఆగిపోయి ఉంటుంది. ఇందులో నమ్మకం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 

పెద్ద పెద్ద బ్రాండ్లకు చెల్లించేటప్పుడు జనం పెద్దగా పట్టించుకోరు. ఆ వస్తువు మీద నమ్మకం కలగాలంతే. అదే స్టార్టప్ అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఉత్పత్తి మీద, దాని నాణ్యత మీద అపనమ్మకంతో ఉంటారు. కస్టమర్ సంతృప్తే చెల్లింపులకు మార్గం సుగమం చేస్తుంది. వాళ్ళింకా ఒక బ్రాండ్ కాదుకాబట్టి అదొక అవరోధం. “,మొదట్లో కస్టమర్లు డబ్బు తీయటానికి వెనకాడేవారు. మాకేమో ఖర్చులు పేరుకు పోతుండేవి. మాకు నాలుగు లక్షల రూపాయల ప్రాజెక్ట్ దొరికితే మాకు అడ్వాన్సుగా ఒకటిన్నర నుంచి రెండు లక్షలదాకా ఇచ్చేవారు. కానీ మేం మాత్రం మా సరఫరాదారులకు మొత్తం మూడు లక్షలూ కట్టేయాలి. ఈ సరఫరా దారులతో మాకు స్నేహ సంబంధాలు ఏర్పడటానికి ఏడాది పట్టింది.” ప్రతినెలా 25 వ తేదీ వస్తున్నదంటే చెమటలు పట్టేవి. ఎందుకంటే జీతాలివ్వాలని, అద్దె కట్టాలని గుర్తుకొస్తుంది. 2013 మార్చి నాటికి గాని మేం ఊపిరిపీల్చుకోలేదు. అప్పుడే మేం పెద్ద చోటుకు మారాం. ప్రస్తుతం బెంగళూరు సహకారనగర్ లో 12 వేల చదరపుటడుగుల స్థలంలో ఉన్నాం “ అంటాడు సమీర్

తమ టీంతో వత్సల, సమీర్

తమ టీంతో వత్సల, సమీర్


స్క్వాడ్రో ఏంటి ?

2014 నాటికల్లా ఆధునిక యంత్రాలు తెప్పించుకోగలిగారు. ఎటిపరిస్థితుల్లోనూ వినియోగదారుడికి పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోతే తప్పు తమచేతుల్లోనే ఉన్నదనే అభిప్రాయం వీళ్లకుండేది. చిన్న చిన్న విషయాలే కస్టమర్ కి అసంతృప్తి కలిగించవచ్చు. సరిగ్గా అప్పుడే స్క్వాడ్రో ఆలోచన వచ్చింది. వినియోగదారుడి ఆకాంక్షలను పరిమితం చేస్తూ రంగుల సంఖ్యను కూడా తగ్గించే విధానమే స్క్వాడ్రో. బొనిటో తో క్లయింట్ కి పూర్తి స్థాయి కేటలాగ్ ఇచ్చేశారు. వాటిని థర్డ్ పార్టీ సరఫరా చెస్తుంది. ఒకవేళ ఏదైనా వస్తువు స్టాక్ అయిపోతే వీళ్ళ చేతుల్లొ ఏమీ ఉండేది కాదు. కానీ స్క్వాడ్రో తో వాళ్ళు సొంత స్టాక్ పెట్టుకొని కస్టమర్ సంతృప్తి చెందేలా కేటలాగ్ తయారుచేసుకున్నారు..వాళ్ళు ఈ స్క్వాడ్రో ఆలోచన మీద ఏడాదికి పైగా పనిచేస్తున్నారు. దీనికి ఇంత కాలం పట్టతానికి కారణం దాని ప్రారంభానికి నిధులు అవసరం కాబట్టి. 

2014 మార్చిలో బోనిటో ఆదాయం బాగా బలపడగానే స్క్వాడ్రో కోసం ప్రత్యేకంగా సిబ్బందిని తీసుకోగలిగారు. ప్రస్తుతం బోనిటోకున్న 50 మంది కాకుండా, స్క్వాడ్రోకు మరో 20 మంది ఉన్నారు. సిబ్బంది ఎవరైనా డిజైన్ల విషయంలో తమ ఆలోచనలు స్వేచ్చగా వెల్లడించే సంస్కృతి అలవాటు చేశారు. అది వాళ్లను బలోపేతం చేసింది.