కాలేజ్ డ్రాపౌట్... కార్పొరేట్ 360 ఓనర్ !

"తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి"... ఈ వాక్యం వరుణ్ చంద్రన్ కు సరిగ్గా సరిపోతుంది. నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి, కాలేజ్ డ్రాపవుట్ గా అనేక ఒడిదుడుకులు అనుభించి తన విజయానికి బాటలు వేసుకుని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీనే స్థాపించాడు వరుణ్. ఉద్యోగం కోసం బెంగళూరు వీధుల్లో చక్కర్లు కొట్టిన వరుణ్... ఇప్పుడు సింగపూర్ లో కంపెనీ ద్వారా ఎందరికో ఉపాధినిస్తున్నాడు. బెంగళూరులో చిన్న ఉద్యోగంతో కెరీర్ మొదలుపెట్టి కార్పొరేట్ 360 కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడా కంపెనీ కార్యకలాపాలు నాలుగు ఖండాలకు విస్తరించాయి. వరుణ్ చంద్రన్ కు జీవితమే గొప్ప గురువు. జీవించాలన్న సంకల్పమే గొప్ప ప్రేరణ. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనే గొప్ప స్ఫూర్తి. ఇంతకీ ఎవరీ వరుణ్...

కాలేజ్ డ్రాపౌట్... కార్పొరేట్ 360 ఓనర్ !

Thursday March 26, 2015,

4 min Read

"కేరళలోని కొల్లం జిల్లా పడం గ్రామం నాది. నా తండ్రి నిరుపేద రైతు. తిండి కూడా లేని రోజులవి. ఉన్నంతలో బతుకీడ్చేవాళ్లం. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన అప్పుడే కలిగింది." ఇవీ 33 ఏళ్ల వరుణ్ చంద్రన్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పే మాటలు. ఇప్పుడంటే వరుణ్ కోటీశ్వరుడు. కార్పొరేట్ 360 కంపెనీ వ్యవస్థాపకుడు. కానీ వరుణ్ జీవితంలో చూడాల్సిన పేజీలు చాలా ఉన్నాయి. పూట గడవడమే కష్టంగా ఉన్న కడు పేదరికాన్ని అనుభవించాడు వరుణ్. కేరళలో పడం అనే చిన్న పల్లెలో నిరుపేదరైతు కుటుంబంలో జన్మించిన వరుణ్... జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ఎంతగానో శ్రమించాడు. వరుణ్ తల్లిదండ్రులు ఐదో తరగతి వరకే చదువుకున్నా... పిల్లల చదువు విషయంలో లోటు కనిపించొద్దని రెక్కలు ముక్కలు చేసుకున్నారు. వాళ్ల ఊరికి దగ్గర్లో ఉన్న చిన్న పట్టణం పతానపురంలోని సెయింట్ స్టీఫెన్స్ పాఠశాలలో వరుణ్ ని చదివించారు. చిన్నప్పట్నుంచీ పొలం పనుల్లో వరుణ్ పడ్డ శ్రమ స్కూల్లో కలిసొచ్చింది. స్పోర్ట్స్ లో రాణించి స్కూల్ కి ఎన్నో మెడల్స్ సాధించిపెట్టాడు. ఫుట్ బాల్ ఆడేందుకు వరుణ్ కు స్కాలర్ షిప్ ఇచ్చింది కేరళ ప్రభుత్వం. కేరళలో యువ ఫుట్ బాల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న వరుణ్... గోల్డ్ మెడల్ సాధించి తన సత్తా ఏంటో చూపించాడు. కానీ ఎక్కడైతే వరుణ్ ఆకాశాన్ని చూశాడో... అక్కడే పాతాళాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫుట్ బాల్ ఆడుతూ వరుణ్ గాయపడ్డాడు. ఫుట్ బాల్ నే కాదు... చివరకు కాలేజీని వదిలిపెట్టాల్సి వచ్చింది. చదువుని మధ్యలోనే ఆపేసి జాబ్ కోసం బెంగళూరు వెళ్లాడు.

image


అమ్మమ్మ బంగారు గాజులే పెట్టుబడి !

"మా అమ్మమ్మ తన బంగారు గాజులను నాకు ఇచ్చింది. వాటిని అమ్మి ఉపాధి చూసుకొమ్మని చెప్పింది. అలా నేను ఇంటి నుంచి బయటకొచ్చాను" 

అంటూ తన జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటాడు వరుణ్. జీవితమన్నాక ఆటుపోట్లు, ఎత్తుపళ్లాలు సహజం. కష్టాలెదురయ్యాయని బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేం. సరిగ్గా వరుణ్ ఇలాగే ఆలోచించాడు. అమ్మమ్మ గాజులమ్మి వచ్చిన డబ్బులతో బెంగళూరులో అడుగుపెట్టాడు. చేతిలో చిన్న సంచి, మనసులో కొంత నమ్మకం మోసుకొని 2002లో బెంగళూరుకు వచ్చాడు వరుణ్. అక్కడ్నుంచే తన కెరీర్ ను మల్చుకోవడం మొదలు పెట్టాడు. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు... ఒక్కో ఆలోచనతో, ఒక్కో అడుగు వేస్తూ తన కెరీర్ ను డిజైన్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇంటర్నెట్ కేఫ్ ల చుట్టూ తిరుగుతూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఎంట్రప్రిన్యూర్ షిప్ గురించి అధ్యయనం చేశాడు. కెరీర్ లో రాణించాలంటే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడటం అవసరం అన్న విషయం అర్థమైంది. ఇంగ్లీష్ అంటే ఓ బ్రహ్మపదార్థం అన్న టెన్షన్ ఓ వైపు. సాధించాలన్న పట్టుదల మరోవైపు. సంకల్పాన్ని చెక్కుచెదరనివ్వలేదు. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు డిక్షనరీ కొనుక్కున్నాడు. లైబ్రరీల్లో రోజుల తరబడి గడిపాడు. సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ నవలలు చదివాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సీఎన్ఎన్ చానల్ ను చూసేవాడు.

"మా ఊరే ప్రపంచం అనుకున్నాను. కానీ ప్రపంచమంటే మా ఊరొక్కటే కాదు. అసలు ప్రపంచమంతా మా ఊరి బయటే ఉందన్న విషయం పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోగలిగాను. చదువుకునే రోజుల్లో ఫుట్ బాల్ ప్లేయర్ ఐఎం విజయన్ నాకు స్ఫూర్తిగా నిలిచేవారు. ఆయన నాకు దేవుడు లాంటి వారు. వీధుల్లో సోడాలు, పల్లీలు అమ్మే దగ్గర్నుంచీ టాప్ ఇండియన్ ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆయన ఎదిగిన తీరు నాకు ఆదర్శం. అలాంటిది... నేనెందుకు జీవితంలో విజయం సాధించలేనన్న ప్రశ్న నిత్యం నన్ను సతమతం చేసేది." వరుణ్ సంకల్పానికి బాటలు వేసింది ఈ ఆలోచనే. ఎంట్రప్రిన్యూర్ షిప్ ప్రపంచమెలా ఉంటుందో బాగా అధ్యయనం చేశాడు. "నేను బెంగళూరు సైబర్ కేఫుల్లో గంటలు గంటలు కూర్చొని ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాను. ప్రోగ్రామర్ అయ్యేందుకు ఇంటర్నెట్ లోనే పాఠాలు నేర్చుకున్నాను. అసాధ్యమన్నదే లేదన్న సూక్తిని నేను ఎప్పటికీ నమ్ముతాను. ఇంటర్నెట్ లో కావాల్సినంత సమాచారం ఉన్న ఈ రోజుల్లో మనం ఏమైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ... ఏదైనా నేర్చుకోవచ్చు" ఇవీ వరుణ్ చెప్పే మాటలు. నిజమే. వరుణ్ కు జీవితమే గురువు. విజయం సాధించేందుకు కావాల్సిన పాఠాలన్నీ జీవితమే నేర్పింది.

image


సింగపూర్ కళ్లుతెరిపించింది

బెంగళూరులో కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత 2008లో సింగపూర్ లో ఉద్యోగాన్ని సంపాదించాడు వరుణ్. అవకాశాల విషయంలో సింగపూర్ నా కళ్లు తెరిపించిందని గొప్పగా చెబుతుంటాడు వరుణ్. సింగపూర్ లో అడుగుపెట్టడం వరుణ్ జీవితాన్ని మలుపు తిప్పింది. తాను చేస్తున్న జాబ్ మరింత సులువయ్యేందుకు వరుణ్ తయారు చేసిన ఓ సాఫ్ట్ వేర్ టూల్ ను సహచర సిబ్బందిని అబ్బురపరిచింది. వారి ప్రోత్సాహంతోనే వెంచర్ ప్రారంభించేందుకు అడుగులు పడ్డాయి. ఒక గొప్ప ఐడియా వచ్చినంతమాత్రాన మేధావి కాదు. ఆ ఐడియాను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా మేధస్సు బయటపడుతుంది. తన ఐడియానే పెట్టుబడిగా కార్పొరేట్ 360(సీ-360) కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద ఐటీ కంపెనీలు, స్టార్టప్ లు సీ-360 క్లైంట్లుగా ఉన్నారంటే వరుణ్ కంపెనీ గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. చిన్న కంపెనీతో మొదలుపెట్టి తన కార్యకలాపాలను నాలుగు ఖండాలకు విస్తరించాడు. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. కంపెనీ స్థాపించిన రెండుమూడేళ్లలోనే మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. అదే ఉత్సాహంతో, అదే దూకుడుతో భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది సీ-360 కంపెనీ. 2015 చివరి నాటికి యాభై లక్షల మిలియన్ డాలర్లను టార్గెట్ గా పెట్టుకుందీ కంపెనీ. యూఎస్, యూరప్ లల్లో కొత్త కార్యాలయాలను తెరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐటీ మార్కెట్ లో వరుణ్ విజయాలను చూసి పెద్దపెద్ద కంపెనీలు సీ-360ని సొంతం చేసుకునేందుకు అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చాయి. కానీ వరుణ్ వాటన్నింటినీ తిరస్కరించారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందంటున్నాడు వరుణ్. కలలను సాకారం చేసుకోవడమే తన లక్ష్యం.

కార్పొరేట్ 360 టీమ్

కార్పొరేట్ 360 టీమ్


కన్నతల్లిని, ఉన్న ఊరిని మర్చిపోకూడదంటారు. వరుణ్ కూడా అంతే. ప్రపంచ స్థాయిలో బిజినెస్ చేస్తున్నా తన ఊరిని మర్చిపోలేదు. కేరళలోని పతానపురంలో బ్రాంచ్ ఆఫీసును ప్రారంభించి ఎందరికో ఉపాధినిస్తున్నాడు. "సొంతూళ్లో నాలాంటి వారెందరికో అవకాశాలు కల్పించాలన్నదే ఆశయం. మనలో కావాల్సినంత టాలెంట్ ఉంది. అవకాశాలే లేవు. సరైన ప్రోత్సాహం కోసం నాలాంటి వాళ్లెందరో ఎదురుచూస్తున్నారు" అంటాడు వరుణ్. నిజమే. తాను చూసిన కష్టాలు ఇంకెవరూ చూడకూడదన్న తపన వరుణ్ ది. "నేర్చుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయి. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. విజయం అనేది నిరంతర ప్రక్రియ. ప్రతీ రోజూ నేర్చుకోవడం, పాజిటీవ్ గా ఉండటం అలవర్చుకోవాలి" ఇదీ వరుణ్ ఇచ్చే సందేశం. ఎలాంటి సమస్యలు లేకుండా గెలవడం సాదాసీదా విజయమైతే... అనేక సమస్యలను అధిగమించి గెలవడం గొప్ప చరిత్రవుతుంది. వరుణ్ సృష్టించింది, సృష్టిస్తోంది అలాంటి చరిత్రే.