మన మిస్టర్ యూనివర్స్.. వయసు 103 ఏళ్లు.. ఇప్పటికీ ఫిట్

పొట్టివాడే కానీ యమా గట్టివాడు

0

మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్ ఎవరో మీకు తెలుసా? పాకెట్ హెర్కులెస్ అని ఎవరిని ముద్దుగా పిలుచుకుంటారో చెప్పగలరా..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..

పై ఫోటోలో పక్కపక్కనే వున్నది ఇద్దరు కాదు. వొక్కరే. పేరు మనోహర్ ఎయిచ్. అందరికీ ఏమో గానీ బాడీబిల్డర్లకు మాత్రం మనోడు సుపరిచితుడే. ఎందుకంటే అతని కాంట్రిబ్యూషన్ ఆ రేంజిలో వుంది. బాడీ బిల్డింగ్ లో మూడుసార్లు ఏషియన్ గోల్డ్ మెడలిస్టు. అంతేకాదు 1952లోనే మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న బిల్డర్ కూడా . అందరూ పాకెట్ హెర్కులెస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. హైట్ కూడా ఏమంత కాదు. జస్ట్ నాలుగు అడుగుల‌ 11 అంగుళాలు. అన్నట్టు వయసు ఎంతో చెప్పలేదు కదా.. సెంచరీ దాటింది. ప్రస్తుతం 103. స్టిల్ ఫిట్ అండ్ యంగ్.

మనోహర్ పుట్టిన సంవత్సరం 1912. ధమ్తీ అనే గ్రామంలో జన్మించాడు. ఇప్పుడది బంగ్లాదేశ్ లో వుంది. చిన్నప్పటి నుంచే కసరత్తు అంటే పడిచచ్చేవాడు. ఇప్పటికీ అంతే అనుకోండి. 1942లో రాయల్ ఎయిర్ ఫోర్సులో జాయిన్ అయ్యాడు. అవి స్వాంతంత్ర్యోద్యమ రోజులు కావడంతో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గళం విప్పాడు. అలా జైలు పాలయ్యాడు. అయినా మనోహర్ కసరత్తు ఆపలేదు. జైల్లో ఉన్నంత కాలం బాడీ బిల్డింగ్ ను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. రోజుకు 12 గంటల పాటు వర్కవుట్ చేసేవాడు. మనోహర్ పట్టుదల చూసి జైలు అధికారులు అబ్బురపడ్డారు. అత‌ని కండలను చూసి ఇంప్రెస్ అయి స్పెషల్ ఫుడ్ అందించారు. అలా జీవితం మరో మలుపు తిరిగింది.

1950లో మిస్టర్ హెర్కులస్ టైటిల్ గెలిచాడు మనోహర్. తర్వాత మిస్టర్ యూనివర్స్ పోటీలపై నమ్మకం కలిగింది. 1951లో మిస్టర్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచాడు. అలా మనోహర్ పేరు పాపుల‌ర్ అయింది. తర్వాత ఏడాది మరింత పట్టుదలతో సాధన చేశాడు. రెండసారి 1952లో  మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచాడు. ఆసియా క్రీడల్లో 1951(ఢిల్లీ), 1954(మనీలా), 1958(టోక్యో)ల్లో వరసగా బంగారు పతకాలు సాధించాడు. తర్వాత చాలాచోట్ల బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. లాస్ట్ షో 2003లో ఇచ్చాడు. అప్పుడు మనోహర్ వయసు 90.

ప్రస్తుతం మనోహర్ కు 103 యేళ్లుంటాయి. కోల్ కతాలో వుంటాడు. 13 ఏళ్ల క్రితమే ఎక్స‌ర్ సైజ్ మానేశాడు. అనుక్షణం పాత రోజుల్ని నెమరువేసుకుంటూ బోసినవ్వులు చిందిస్తాడు. నేను సాధించిన పతకాలు నన్ను జీవితాంతం సంతోషపెట్టాయని గర్వంగా చెప్తాడు . అతని కొడుకు కోల్ క‌తాలో జిమ్ పెట్టాడు. అందులో మ‌నోహ‌ర్ యువకులకు మెలకువలు నేర్పిస్తూ చురుగ్గా ఉన్నాడు. మందు, సిగరెట్ కు దూరంగా ఉంచడమే తన ఆరోగ్య రహస్యం అంటాడీ బోసినవ్వుల మిస్టర్ యూనివర్స్.