ఇక మౌనం చాలు... తొలి అడుగువేద్దాం రండి ! 

0


ధర్మమనేది స్వీయనియంత్రణ, న్యాయాన్యాయ విచక్షణతో నడుచుకునేలా చేసే ఓ మతపరమైన అంశం. ఆ ధర్మాన్ని పాటించడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చినట్టు భావిస్తాను. నేను పడుకునే ముందు మా నాన్న ప్రతీ రోజూ రాత్రి ఎన్నో కథలు చెబ్తూ ఉండేవారు. ఆయన ఓ అద్భుతమైన స్టోరీ టెల్లర్. భారతీయ పురాణాల్లోని ఎన్నో అంశాలను కథలుగా మార్చి ఆయన నాకు చెప్పేవారు. ఆ కథల ప్రభావమో లేక మరే అంశమో నాకు తెలియదు కానీ.. మా అందరిలో తెలియకుండానే ఆ ధర్మం జీర్ణించుకుపోయింది. నా ప్రమేయం లేకుండా నేను సరైన అడుగులు వేసేందుకూ ఆ ధర్మమే దోహదపడి ఉండొచ్చు. 1970ల నాటి కాలంలో మధ్యతరగతి కుటుంబాలన్నీ ఓ విషయాన్ని బలంగా నమ్మేవారు. అదేంటంటే.. ఖర్మ చేయి, కానీ దాని ప్రతిఫలాన్ని మాత్రం ఆశించవద్దు అనే మాటను తప్పకుండా స్మరణలో ఉంచుకునేవారు.

వయస్సు పెరిగేకొద్దీ 'స్ట్రాంగ్ విమెన్' నాకు రోల్ మోడల్స్‌లా అనిపించేవారు. మా అవ్వకు 14మంది పిల్లలు. ఆమె చాలా స్ట్రాంగ్ లేడీ, విలువల విషయంలో ఆమె జీవితంలో ఎప్పుడూ సర్దుకుపోలేదు. మా అమ్మ, తను అసలు చదువుకోనేలేదు. కానీ నన్ను మాత్రం చదువు విషయంలో చాలా ప్రోత్సహించారు. ఓ స్వతంత్ర మహిళగా జీవితంలో నిలదొక్కుకోవాలని, చదువుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఎప్పుడూ వివరిస్తూ ఉండడం నాకు బాగా గుర్తు. మహిళా జీవితానికి ఉన్న విలువ, స్వతంత్రత విషయంలో సమానత్వంపై ఆమెకు అప్పట్లోనే చాలా స్పష్టత ఉండేది. లీన్ ఇన్ (షెరిల్ శాండ్‌బర్గ్ రాసిన పుస్తకం) పుస్తకం గుర్తొచ్చినప్పుడు నాకు మరో విషయమూ స్ఫురిస్తుంది. అప్పటి పరిస్థితులను వాళ్లు ధైర్యంగా ఎదుర్కొని, నిలదొక్కుకోవడం వల్లే మా తరం మహిళలకు మంచి బాటలు పడ్డాయని.

నాకు మ్యాథ్స్‌పై మంచి పట్టు ఉండడం వల్ల నేను ఇంజనీర్ కావొచ్చనే ఆలోచన ఉండేది. కానీ అప్పటికే అది పురుషులు ఎక్కువగా ఉండే ప్రపంచం. 1980లో నా పదహారో ఏట నేను ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టాను. అప్పటికే చాలా తక్కువ మంది అమ్మాయిలుమా డిపార్ట్‌మెంట్‍లో ఉన్నారు. కాలేజీలోకి అడుగుపెట్టే మొదటి రోజు మా అమ్మ చెప్పిన మాట ఒక్కటే. 'నువ్వు అక్కడికి వెళ్లేది డిగ్రీ పట్టా పుచ్చుకోవడానికి, చదువుకోవడానికి మాత్రమే. వివాదల జోలికి వెళ్లకుండా నీ పని నువ్వు చూసుకుని వెళ్లిపోతూ ఉండు' అని. మొదటి వారంలోనే నా కలలన్నీ కల్లలైపోతున్నట్టు అనిపించింది. అక్కడ చదువుకోవడం అసాధ్యమనే భావన వచ్చింది. చీర కట్టుకుని నలుగురిలో కలిసిపోకపోతే, వాళ్లందరి తీక్షణ చూపులు నన్ను తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తాయని అర్థమైంది. క్లాసుల్లోకి అడుగుపెట్టడం మొదలు ల్యాబుల్లో జరిగే ఈవ్ టీజింగ్ వరకూ ఎన్నో ఎన్నెన్నో. కానీ వీటన్నింటినీ తట్టుకుని 'నేను నిలబడగలను' అనే లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యనిపించింది.

ఆ ఘట్టం ముగిశాక నేను ఉద్యోగంలో చేరాను. మొదటి ఏడాది ఉద్యోగంలో చేరినప్పుడు అత్యద్భుతంగా పనిచేసినట్టు నేను ఫీలయ్యాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. ఆ ఏడాది నాకు లభించిన బహుమతి జీతంలో మైనస్ 3 శాతం వృద్ధి. ఆ దిగులుతో కొద్దిరోజులు అలానే నెట్టుకొచ్చినప్పటికీ.. నెల రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని మా మేనేజర్‌ను కలిశాను. చివరికి తెలిసింది ఏంటంటే.. నేను పనిచేసిన ప్రాజెక్టుల్లో కానీ, నేను చేసిన పనిని కానీ ఎవరూ పరిగణలోకి తీసుకోలేదని ! సొంత డబ్బా (సెల్ఫ్ ప్రమోషన్) అనేది డాబు దర్పాలకూ, అహంకారానికి ప్రతీక అని అనుకునే సంస్కృతి నుంచి రావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని నాకు అనిపించింది. అప్పుడు నా జీవితంలో రెండు భిన్న పార్శ్వాలను ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అనిపించింది అప్పుడే.

జపాన్‌లో 'బుషిడో' అనే పదానికి అర్థం 'ది వే ఆఫ్ వారియర్' (ఓ యోధుడి శైలి)ను ఓ సమురాయ్ జీవితమని చెప్పొచ్చు. ప్రతిఫలం ఆశించకుండా విధేయతను చూపుతూ జీవితాన్ని త్యాగం చేయడమే లక్ష్యంగా వాళ్లు గడుపుతారు. మాఫియా కల్చర్‌లో మాత్రం 'ఓమెర్టా' అనేది మౌనంగా ఉన్నందుకు ఇచ్చే గౌరవం, విలువ. మరి ఆ మహిళలో ఈ రెండు గుణాలనూ తనలో నిబిడీకృతం చేసుకుందా ?

ఈ వ్యవస్థ అలాంటిది !

తప్పులను ఓర్చుకుంటూ, ఏం జరిగినా మాట్లాడకుండా మౌనంగా ఉండడమే ఉత్తమమైన విషయమని చెప్పిన ఎలన్ పావో వర్సెస్ కెపిసిబి జెండర్ డిస్క్రిమినేషన్ కేసు గురించి మనకు తెలుసు. ఒక వేళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో కూడా మనకు ఓ స్పష్టత ఉంది.

గొడవల కంటే శాంతంగా ఉండేందుకు ఎక్కువ మంది మహిళలు మొగ్గుచూపుతారు, అది వాళ్ల సహజ స్వభావం. అలా ప్రతీ అంశంలోనూ కాంప్రమైజ్ అయిపోతూ.. వాళ్లకు దక్కాల్సిన దానిని అందుకోకుండా నిస్సహాయులుగా ఉండిపోతున్నారా ? సక్సెస్‌ను క్లైం చేసుకునేందుకు చాలా మంది ''ఫాదర్స్'' (సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అని ఓ కొటేషన్) ముందుకొస్తారు. సైన్స్, హిస్టరీ, బిజినెస్.. రంగం ఏదైనా.. వీళ్ల ఉదాహరణలతో నిండిపోయి ఉంటుంది. 'ప్లేజియరిజం' (గ్రంధచౌర్యం) అనేది వ్యాపారంలో చాలా కామన్. ఇతరులు చేసిన పనిని తమదిగా చెప్పుకునే బాపతు చాలా మందే ఉన్నారు. ఓ తప్పును పదే పదే కరెక్ట్ అని చెప్పడం వల్ల దాన్ని నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఎంతో మంది సమర్ధులైన మహిళలున్నారు, వాళ్లు చేసిన ఘనకార్యాలూ ఉన్నాయి. కానీ అందుకు తగిన గుర్తింపు దక్కకపోవడానికి నేను కళ్లారా చూశాను.

1996లో నేను మొదటి కంపెనీని, 2001లో రెండో సంస్థను ప్రారంభించాను. వెంచర్ క్యాపిటలిస్టులు, బోర్డులతో జరిగే అనేక కీలక సమావేశాల్లో మహిళలు తక్కువగా కనిపించేవారు. ఒకసారి జరిగిన ఘటన నాకు కళ్లలో నీళ్లు తెప్పించింది, ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిన ఆ ఘటన నాకు ఇప్పటికీ గుర్తు. ఓ సారి ఓ సీనియర్ ఉద్యోగి అయిన మహిళ మేం ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని తిరస్కరించింది. అక్కడే ఉన్న ఓ బోర్డ్ మెంబర్ ఓ అనాలోచిత మాటను ఠక్కున అనేశారు. ''అందరూ నీ మాదిరి కుటుంబానికి బదులు పనికి విలువ ఇవ్వరులే, అందుకే ఆ మహిళ ఉద్యోగాన్ని వద్దని ఉంటుంది' అనేశారు.

ఇండో యూఎస్ వెంచర్స్ (ఇప్పుడది కలారి క్యాపిటల్‌గా రీ బ్రాండ్ అయింది)ను నేను కో ఫౌండర్‌గా 2006లో స్థాపించాను. ఆ తర్వాత కుటుంబంతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చేశాను. నేను అప్పటి వరకూ భారత్‌లో పనిచేయలేదు. ఇక్కడ జెండర్ ఎలాంటి పాత్రపోషిస్తుందోననే ఉత్సుకత నాలో ఉండేది. ఇన్నేళ్లు గడిచిన తర్వాత కూడా జీతాల విషయంలో ఉన్న తేడాను ప్రశ్నించేందుకు మహిళలు తమ సహజ స్వభావమైన మౌనంతో, ఓర్పుతోనే భరిస్తున్నారంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

అదే నిజమైతే, ఈ వ్యవస్థకు తగ్గట్టు మహిళలు మారాలా, లేకపోతే ఈ సమాజమే మహిళల అవసరలకు అనుగుణంగా రూపాంతరం చెందాలా ?

అయితే దీనిపై పోరాటం ఏ ఒక్క మహిళోతోనో సాధ్యమయ్యేది కాదు. అందుకే దీనిపై చర్చ జరగాలి. ఇక్కడ నేనో యాక్టివిస్ట్‌ అనిపించుకోవాలనుకోలేదు. ఈ వ్యవస్థ ఏం ఇస్తుంతో తెలుసుకోవాలనుకుంటున్నాను. మనకు మనమే అవకాశాలను సృష్టించుకోవాలనేది నా భావన.

ఎదురుపడకుండా తప్పించుకోవడాన్ని ఎంత కాలం చేస్తూ ఉంటావు అంటూ.. ఈ మధ్యే నా కూతురు ఓ మెయిల్ ద్వారా ప్రశ్నించింది. అప్పుడు నేనో 'డాన్ కిసోట్'నా అనిపించింది ? (Don Quixote - Impractical idealist) వాస్తవాలు తెలుసుకోకుండా సున్నితత్వాన్ని, మేధోపరమైన నిజాయితీని, మానసిక బలాన్ని ఆశిస్తున్నట్టు అనిపించింది.

Martin Niemöller dilemma రాతలు నాకు ఎందుకో ఇక్కడ రాయాలనిపించింది.

First they came for the Socialists, and I did not speak out —

Because I was not a Socialist.

Then they came for the Trade Unionists, and I did not speak out —

Because I was not a Trade Unionist.

Then they came for the Jews, and I did not speak out —

Because I was not a Jew.

Then they came for me — and there was no one left to speak for me.

నా కూతుళ్లు, ఇతర యువతులు.. యావత్ సమాజం.. ఇలాంటి పరిణామాలను ఎదుర్కోలేక మౌనాన్నే ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఇక ఎప్పటికి అలానే ఉండిపోదామా ? మనకు దక్కాల్సిన గౌరవాన్ని, మనకు నచ్చే కోడ్ ఆఫ్ కాండక్ట్‌ గురించి ఇప్పటికీ డిమాండ్ చేయలేమా ?

నేను ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడానని నాకు అనిపిస్తోంది. మార్పులను స్వీకరించాలని ఈ సమాజాన్ని కోరి ఉండాల్సింది. ఒకరిని ఒకరు తెలుసుకోవడానికి ఎక్కువ చర్చలు జరిపితే బావుండు అని చెప్పాలనిపిస్తోంది.

మౌనాన్ని వీడి ఇప్పటికైనా నా మనసులోని మాటను మీ ముందు ఉంచాను. మార్పు కోసం ఓ అడుగు వేశాను. అయితే దీనికి తక్షణమే సమాధానాలు దొరుకుతాయనీ నేను అనుకోను. కానీ ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒక చోట మొదటి అడుగు పడాలి. ఓ చిన్న అడుగుతో ఈ అత్యావశ్యకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సక్సెస్‌ఫుల్ స్టార్టప్స్‌ ద్వారా ఎంతో మంది లీడర్స్‌ను తయారుచేసేందుకే ఈ మొదటి అడుగు.

అనువాదం - నాగేంద్ర సాయి

రచయిత గురించి -

వాణీ కోలా, కలారి క్యాపిటల్ సంస్థ ఎండి. కలారి క్యాపిటల్‌లో ఆమె నాయకత్వ పటిమ ఆంట్రప్రెన్యూర్ల వృద్ధికి దోహదపడ్తోంది. దేశీయ కంపెనీలకు గ్లోబల్ ప్లేయర్స్‌గా ఎదగగలవు అనే నమ్మకం ఆమెది. సిలికాన్ వ్యాలీలో ఆమెకు ఉన్న 22 ఏళ్ల అనుభవం ఎన్నో విజయవంతమైన కంపెనీల ఏర్పాటుకు కారణమైంది. మెంటర్‌గా కూడా ఆమె ఎన్నో స్టార్టప్ సంస్థలకు చేయూతనందించారు. వాణీ కోలా ఇప్పుడు ఎన్నో బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఆంట్రప్రెన్యూర్షిప్, లీడర్షిప్ అనే అంశాలపై తరచూ మాట్లాడుతూ ఉంటారు.

This article earlier appeared on Medium.

(Disclaimer: Kalaari Capital is an investor in YourStory.)

Related Stories