హైదరాబాద్ ఆటోవాలా జిందాబాద్  

0

ఆటోవాలా అంటే మోసం, దగా అన్న భావన అందరిలో ఉంటుంది. ఊరుకాని వారు ప్రాంతం కాని వారు వస్తే వాళ్లను నిలువునా దోపిడీ చేస్తారనేది తరచుగా వినిపించే మాటలు. అయితే అందరినీ ఒకే గాటన కట్టేయలేం. ఆటోవాలాలు అందరూ చెడ్డవారు కాదు. మంచితనం మూర్తీభవించిన వ్యక్తులూ ఉంటారు. వాళ్లు డబ్బుకు పేదవాళ్లు కావొచ్చు, కానీ మనసుకి మాత్రం పేదవాళ్లు కాదు. అలాంటి సంఘటనే హైదరాబాదులో ఒకటి జరిగింది. బెంగళూరుకి చెందిన వరిజశ్రీ అనే సింగర్ కి ఎందురైన అనుభవం ఆమె తన ఫేస్ బుక్ లో రాసుకుంది.

ఇతను బాబా. హైదరాబాద్ ఆటోడ్రైవర్. అలా అనడం కంటే నా పాలిట దేవుడు అంటే బావుంటుంది. ఎందుకంటే, వీసా ఇంటర్వ్యూ కోసం నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. ఒక హోటల్లో దిగాను. పొద్దున్నే ఇంటర్వ్యూ. ఆటో మాట్లాడుకున్నాను. మధ్యలో ఎక్కడైనా ఏటీఎం కనిపిస్తే డబ్బులు డ్రా చేయాలనుకున్నాను. వీసా ఫీజు కోసం ఐదు వేలు కావాలి. కానీ నా దగ్గర 2వేలు మాత్రమే ఉన్నాయి. డ్రైవర్ కి చెప్పాను ఏదైనా ఏటీఎం దగ్గర ఆపమని. వాటి మీద ఆశపెట్టుకోవడం నేను చేసిన అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే, ఒకటి కాదు రెండు కాదు. 10-15 సెంటర్లు తిరిగాను. ఎక్కడా ఔటాఫ్ సర్వీస్ అనే కనిపించింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. కొన్ని షాపుల్లోకి వెళ్లి రిక్వెస్ట్ చేశాను. కార్డ్ స్వైప్ చేసుకుని 3వేలు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాను. ఎవరూ నా బాధను అర్ధం చేసుకోలేదు. నిస్సహాయంగా మిగిలిపోయాను.

ఇదంతా గమనించిన డ్రైవర్ బాబా- పరేషాన్ అవకండి మేడం నా దగ్గర మూడువేలు ఉన్నాయి తీసుకోండి.. మళ్లీ హోటల్ కి వచ్చిన తర్వాత ఇవ్వండి అన్నాడు. అతని మాటలకు నా కళ్లు చెమర్చాయి. ఆ సమయంలో నాకు బాబా నిజంగా దేవుడిలా కనిపించాడు. ఇలాంటి ఆటోవాలాను నేనే జీవితంలో చూడలేదు. అతనెవరో నాకు తెలియదు. నేనెవరో అతనికి తెలియదు. ముక్కూముఖం తెలియని మనిషికి ఒక ఆటోవాలా మూడువేల రూపాయలు ఇచ్చాడంటే అతని మనసు ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేను. అతనికి మళ్లీ ఇస్తాను సరే, కానీ ఆ టైంలో అర్ధం చేసుకునే మనుషి దొరకడం నిజంగా గ్రేట్. అందునా సగటు ఆటోడ్రైవర్ దగ్గర మూడువేల రూపాయలు గగనమే. ఉన్న డబ్బంతా నా చేతిలో పెట్టాడంటే అతని హృదయం ఆకాశమంత కనిపించింది.

అతని మాటలతో నాకు ఒకరకంగా జ్ఞానోదయమే అయింది. తోటివారికి చేతనైన సాయం చేయాలనే సిద్ధాంతం మనసులో బలంగా నాటుకుంది. బాబా లాంటి ఆటో డ్రైవర్ పరిచయం కావడం గర్వంగా ఫీలవుతున్నాను. మానవత్వాన్ని మించిన మతం లేదని నేను గొప్పగా చెప్పగలను.