క్యాలీఫ్లవర్ నుంచి క్యాబ్ వరకు.. అన్ని సేవలు ఒకే యాప్‌లో..

క్యాలీఫ్లవర్ నుంచి క్యాబ్ వరకు.. అన్ని సేవలు ఒకే యాప్‌లో..

Sunday March 20, 2016,

5 min Read


ఇప్పుడంతా టెక్నాలజీ మయం. టమోటాలు కావాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా అంతా ఆన్‌లైన్‌లోనే. అందుకే పలు సంస్థలు యాప్‌ల ద్వారా తమ సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్క రంగానికి ఒక్కో యాప్‌కు బదులుగా, అన్ని సేవలను ఒకే చోట అందిస్తే ఎలా ఉంటుంది. వినడానికే ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ ఆలోచనను నిజం చేసేందుకు గుర్గావ్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ యానా సిద్దమైంది. నిత్యావసర వస్తువల నుంచి క్యాబ్ బుకింగ్స్ వరకు అన్నింటిని తమ చాట్ బేస్డ్ సర్వీస్‌లో పొందుపర్చింది. అంతేకాదు ధరలను కూడా వివిధ స్టార్టప్‌లతో పోల్చి, వినియోగదారులకు మేలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నది.

గత ఆగస్ట్‌లో ఫేస్‌బుక్ వినియోగదారులంతా.. ఆ సంస్థ ప్రారంభించిన టెక్ట్స్ అసిస్టెంట్ ఎం యాప్ కోసం ఎగబడ్డారు. రిజర్వేషన్లు చేసుకోవడానికి ఇతర సర్వీసుల గురించి చర్చించేందుకు ఈ చాట్‌బాట్ ఉపయోగపడుతుంది. ఇలాంటిదే మరింత మెరుగైన స్మార్టర్ మొబైల్ మెసేజింగ్ సర్వీస్‌ను డెవలప్ చేస్తున్నామని డిసెంబర్‌లో గూగుల్ కూడా ప్రకటించింది.

యానా ఫౌండర్స్ అంకిత్, ఆశిష్, రాహుల్

యానా ఫౌండర్స్ అంకిత్, ఆశిష్, రాహుల్


ఈ రంగం జోరందుకుంటున్న తరుణంలో గుర్గావ్‌కు చెందిన యానా కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. యూజర్లకు క్యాబ్స్‌ బుక్ చేయడంలో సాయపడేందుకు, నిత్యావసర సరుకులు ఆర్డరిచ్చేందుకు, అన్ని రకాల కాంటాక్ట్‌లను చూసేందుకు ఓ ఫ్రెండ్ మాదిరిగా, పర్సనల్ చాట్ అసిస్టెంట్‌గా వ్యవహరించనుంది యానా. అంతేకాదు ప్రైజ్‌ను ఇతర సంస్థలతో పోల్చి, ఏ సంస్థ తక్కువ మొత్తానికి ఇస్తుందో కూడా యూజర్లకు తెలియజేస్తోంది. తక్కువ ధరకు సరుకులు ఎక్కడ లభిస్తాయో వివరిస్తుంది.

అన్ని సర్వీసులు ఒకే యాప్‌లో..

రాహుల్ గుప్తా యానా స్థాపించడంలో ఒకే ఉద్దేశం ఉంది. ప్రతి సర్వీస్‌కు ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ హోం స్క్రీన్‌లో చెత్త చెత్త చేసుకునే బదులుగా, అన్ని రకాల సర్వీసులకు ఒకే యాప్‌ను వినియోగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో యానాను తీసుకొచ్చారు. అమెరికాకు చెందిన టెక్స్ట్ మెసేజ్ సర్వీస్ మ్యాజిక్‌ను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని రూపొందించారు. ఫిబ్రవరిలో యాప్‌ను లాంచ్ చేస్తే.. 48 గంటల్లోనే 17 వేల మెసేజ్‌లు వచ్చాయి.

ఐఐఎం బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం కార్నెల్‌లో, ఆ తర్వాత హాంకాంగ్‌లో గోల్డ్‌మన్ సాచ్స్‌లో పనిచేశారు రాహుల్. ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో హాంకాంగ్ నుంచి భారత్‌కు తిరిగొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార వ్యూహకర్తల టీమ్‌లో చేరారు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని రూపొందించడమే కాదు.. నిర్వహించింది కూడా రాహులే.

ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపైన్ టీమ్ అంతా ఢిల్లీకి షిఫ్టయింది. ఈ సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అంకిత్ శర్మ, ఆశిష్ గుప్తాలను కలిశాడు రాహుల్. ఈ ముగ్గురూ ఓ యాప్‌ను బిల్డప్ చేయాలని నిర్ణయించారు.

హలో యానా..

అమెరికాకు చెందిన మ్యాజిక్‌కు సిమిలర్‌గా ఓ పైలట్‌ను రన్ చేశారు. వాట్సప్ నంబర్‌ను ఉపయోగిస్తూ యూజర్లు తమకు కావాల్సిన సర్వీస్‌లను మెసేజ్ రూపంలో పంపేవారు. గత ఏడాది మే, జూన్ రెండు నెలల్లోనే యానా టీమ్ 50 వేల మెసేజెస్‌ను స్వీకరించింది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో యానా ఇంటెలిజెన్స్‌ను రూపొందించారు.

ఇవాళ యానా టొమోటాలు, ఆలుగడ్డ, బ్రెడ్.. ఇలా ఏదీ కావాలన్నా యూజర్లు ఆర్డర్‌ను స్వీకరించి వెండర్లకు తెలియజేస్తుంది. క్యాబ్ నుంచి హోం సర్వీసెస్ వరకు ఏ సర్వీస్‌ కావాలన్న సమాచారం ఇస్తుంది.

image


యూజర్ల సందేహాలకు తమ ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ వందశాతం సమాధానం ఇస్తుందని, ఎలాంటి జంపింగ్‌కు అవకాశం లేదని యానా ఫౌండర్లు చెప్తున్నారు. నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ), నాచురల్ నెట్‌వర్క్ వంటి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఏఐ ఇంజిన్ ఉపయోగిస్తోంది.

అంతేకాదు యూజర్లు కోరితే.. డిన్నర్లకు ఎక్కడికి వెళ్లాలో కూడా యానా సూచిస్తుంది. గూగుల్ ప్లేసెస్‌ లభ్యమయ్యేవే కాకుండా.. యానా ప్లేసెస్ పేరుతో ఓ ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా 10 వేల వెండర్లు, వ్యాపారవేత్తల వివరాలున్నాయి.

మరిన్ని సౌకర్యాలు..

ప్రస్తుతం లభ్యమయ్యే సేవలకు మరిన్నింటిని జోడించాలని యానా ఫౌండర్లు భావిస్తున్నారు. ఫుడ్ ఆర్డర్, రీచర్జ్, ఈవెంట్, మూవీ టికెట్ బుకింగ్ వంటి సేవలను కూడా అందించనున్నారు. షాపింగ్, న్యూస్ కూడా ఈ యాప్‌లో పొందుపరిచే అవకాశాలున్నాయని ఫౌండర్లు వివరించారు.

ఐదు సర్వీసులు.. పది నగరాలు

ఇప్పుడిప్పుడే చాట్ బేస్డ్ మెసేజ్ సర్వీస్ రంగంలోకి ప్రవేశించిన యానా ఇప్పటికే ఏడుగురు వెండర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పెపర్ ట్యాప్, జాప్ నౌ, ఓలా, ఉబెర్, హౌస్ జాయ్, ఈజీ ఫిక్స్, జెట్ సెట్ క్లీన్ వంటి ప్రముఖ స్టార్టప్‌లు యానాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరో 15 బ్రాండ్లతో త్వరలోనే ఒప్పందం కుదర్చుకోనుంది. గ్రోసరీస్, ప్లేసెస్, క్యాబ్స్, హోం సర్వీసెస్, కన్వర్జేషన్స్ ఈ ఐదు కేటగిరీలు ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్‌ నగరాల్లో పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో కొన్ని సర్వీసెస్‌లను మాత్రమే ఇప్పుడు అందిస్తున్నారు.

ఫిబ్రవరిలో యాప్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి 3 వేల మంది యూజర్లు యానా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతివారం 1500 మంది యూజర్లు యాక్టీవ్‌గా రిక్వెస్ట్‌లను పంపుతుంటారు. ప్రతిరోజు కనీసం 5 నుంచి పది వరకు ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఇందులో సమాచారం కోసం యూజర్లు పంపిన రిక్వెస్టులు లేవు. ప్రతి రోజు 10 ట్రాన్సాక్షన్లంటే తక్కువేమీకాదని యానా ఫౌండర్లు అంటున్నారు.

విదేశాల్లో సైతం..

‘‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్సక్షనల్ చాట్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఏదైనా సర్వీసులకు చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు మా యాప్‌ను వదిలి వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాదు ఒక్కో సర్వీస్‌కు ఒక్కో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా ఇంటర్‌ఫేస్ ఉపయోగించి అన్ని సర్వీసులు చేసుకోవచ్చు’’ అని రాహుల్ వివరించారు.

వచ్చే ఆరు నెలల్లో రోజుకు వెయ్యి ట్రాన్సక్షన్లు జరిగే విధంగా యాప్‌ను డెవలప్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే కాదు అమెరికా, యూకే, యూరప్‌లలో కూడా సేవలందించేందుకు యానా ఫౌండర్లు సిద్ధమవుతున్నారు.

బిజినెస్ మోడల్..

ప్రస్తుతానికైతే యానా బిజినెస్ మోడల్ సో సింపుల్. వినియోగదారుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా వెండర్లు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచే కమిషన్ తీసుకుంటున్నది. ఒక్కో ట్రాన్సాక్షన్‌పై ఐదు నుంచి పది వరకు కమిషన్ తీసుకుంటున్నది.

ప్రారంభమై ఏడాది కూడా గడవకముందే ఈ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. గత నవంబర్‌లో హాంకాంగ్‌కు చెందిన గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పునీత్ గుప్తా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఆ పెట్టుబడిని టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తామని యానా ఫౌండర్లంటున్నారు. మరోదశ పెట్టుబడిని సమీకరించేందుకు కూడా ఈ స్టార్టప్ సిద్ధమవుతున్నది.

యానా టీమ్

యానా టీమ్


గట్టిపోటీ..

స్టార్టప్ రంగంలో ఇప్పటికే యానాకు మంచి మార్కులొచ్చాయి. చాలామంది టెక్నాలజిస్టులు యానాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ రంగంలో నిలబడాలంటే హాప్టిక్, హెల్ప్‌చాట్ వంటి వాటితో పోటీ పడాల్సి ఉంటుందంటున్నారు. ఈ రంగంలో ఇప్పటికే వేళ్లూనుకుపోయిన పలు సంస్థల నుంచి యానాకు గట్టిపోటీ తప్పకపోవచ్చన్నది టెక్నాలజిస్టుల అభిప్రాయం.

కన్‌సీర్జ్ రంగంలో హాప్టిక్ అన్ని స్టార్టప్‌ల కంటే చాలా ముందుంది. ఈ సంస్థ 50 % ప్రశ్నలకు మెషిన్ సమాధానమిస్తే.. మిగతా వాటికి సంస్థలో ఉన్న 150కిపైగా చాట్ ఆపరేటర్లు సమాధానమిస్తారు. ప్లే స్టోర్ నుంచి ఇప్పటికే ఐదు లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మే 2015 నుంచి ఇప్పటివరకు 20 లక్షల మెసేజెస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. అలాగే గత నవంబర్ నుంచి క్యాబ్ బుకింగ్ కోసం ఓలాతో హాప్టిక్ ఒప్పందం కుదుర్చుకుంది.

మరోవైపు ఇదే రంగంలో ఉన్న హెల్ప్‌ చాట్ (గతంలో అకోశా)లో గత మేలో వంద కోట్ల పెట్టుబడిని పెట్టింది సెకోషియా సంస్థ. ప్రతిరోజు వెబ్, టెలిఫోన్, యాండ్రాయిడ్ యాప్ ద్వారా 30 వేలకు పైగా వినియోగదారులు తమ సందేహాలను వ్యక్తపరుస్తుంటారు. ఈ సంస్థ వినియోగదారుల సందేహాలకు తమ చాట్ ఆపరేటర్ల ద్వారానే సమాధానమిస్తోంది.

క్లివెరీ కూడా ఈ రంగంలో సేవలందిస్తోంది. పర్సనల్ షాపింగ్ నుంచి ఫొటో కాపీస్ డెలివరీ వరకు ఎలాంటి సేవనైనా 90 నిమిషాల్లో అందిస్తామని ఈ సంస్థ చెప్తోంది. ఈ సంస్థ ఇటీవలే 2,30,000 డాలర్ల పెట్టుబడిని హాంకాంగ్‌కు చెందిన స్వస్తికా నుంచి సమీకరించింది. షాపర్లను స్థానిక వ్యాపారస్థులకు కనెక్ట్ చేసే లుక్ అప్ సంస్థ ఇటీవలే 2.5 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ నిధులను సమీకరించింది.

చాట్ సర్వీస్ రంగంలో ఇప్పటికే ఎన్నో సంస్థలున్నప్పటికీ నిధులకు మాత్రం ఎలాంటి ఢోకాలేదు. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టెక్నాలజీని సరిగ్గా వాడగలిగే సంస్థలే తక్కువగా ఉన్నాయి. ఆటోమేటెడ్ అసిస్టెంట్‌గా ఇప్పటికే సత్తా చాటిన యానా వంటి స్టార్టప్ కంపెనీల ఆవశ్యకత ఈ రంగంలో ఎంతో ఉంది. చాట్ సర్వీసెస్ రంగంలో విభిన్నత్వం, పది నిమిషాల్లో ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేసే టెక్నాలజీ అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. ఈ టెక్నాలజీని యానా అందిపుచ్చుకోవాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.

వెబ్‌సైట్