హోల్‌సేల్ ధరలకే రిటైల్ కస్టమర్ల ఇంటికి సామాన్లు

హోల్‌సేల్ రేట్లకే డోర్ డెలివరీ...నిత్యావసరాల విక్రయాల్లో వినూత్న వ్యాపార ఆలోచన...కేష్ అండ్ కేరీ స్టోర్ రేట్లకే ఇంటికే వస్తువులు...అమెరికా బాక్స్‌డ్ హోల్‌సేల్ వ్యాపారమే ప్రేరణ...

హోల్‌సేల్ ధరలకే రిటైల్ కస్టమర్ల ఇంటికి సామాన్లు

Monday April 13, 2015,

3 min Read

ఈ కామర్స్, ఇంటర్నెట్ ఆధారిత వాణిజ్యం ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. రిటైల్ వ్యాపారాలతో పోల్చితే... కస్టమర్‌కి తక్కువ ధరకే వస్తువులు అందించగలగడంతో ఆదరణ శరవేగంగా పెరుగుతోంది. ఇంట్లో కూర్చునే కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ చేయగలగడం వినియోగదారుడికి ఎంతో సౌకర్యంగా ఉంటోంది. ఈ రంగంలో నిత్యాసవరాలు, వంటింటి సరుకుల అమ్మకం కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఈ రంగంలో ఉన్న బిగ్‌బాస్కెట్.కాం, జాప్‌నౌ.కాం వంటి సంస్థలు తమదంటూ ప్రత్యేకత సృష్టించుకున్నాయి. ఆర్డర్ చేస్తే.. నేరుగా ఇంటికి సరఫరా చేసే కాన్సెప్ట్‌ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందుతున్నాయి. అయితే... ఈ రంగంలో ఉన్న లోటు హోల్‌సేల్ ధరలకు అందించలేకపోవడం. మెట్రో, బెస్ట్‌ప్రైస్ వంటి సంస్థలు విక్రయాలు చేస్తున్నట్లుగా హోల్‌సేల్ రేట్లకు ఇవ్వగలిగే సైట్లు పెద్దగా లేవు.


image


హోల్‌సేల్ రేట్లకే డోర్ డెలివరీ

అమెరికా వంటి దేశాల్లో హోల్‌సేల్ వ్యాపారం ఇప్పటికే బాక్సుల్లో హోల్‌సేల్ వస్తువులు ఇళ్లకే అందించే విధానం అమల్లో ఉంది. మన దేశంలోకి ఈవిధానం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇండియా ఎట్ హోమ్ వంటి కంపెనీలు ఈరంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈతరహా వ్యాపారంలోకి తాజాగా అడుగుపెట్టింది హైద్రాబాద్ సంస్థ ఫస్ట్ ప్రైస్.

సమీర్ వంజీ బీకామ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్. ఫస్ట్ ప్రైస్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయన మాటల్లో... "మా నాన్న వ్యాపారం నిర్వహించేవారు. ఆయనకు మెట్రో కార్డ్ ఉండేది. ఒకరోజు మెట్రోస్టోర్‌కి వెళ్లి అక్కడ హోల్‌సేల్ ధరలకే కొనుగోలు చేశాం. ఇలా అందరికీ తక్కువ రేట్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంటే అనే ఆలోచన వచ్చింది. కస్టమర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు అందించాలనే ఐడియా అప్పుడే వచ్చింది."

అప్పట్లో సమీర్ ఇంటర్ కంప్లీట్ చేశారంతే. అప్పుడే ఫ్రెష్ బజార్.కాం ప్రారంభించినా.. కొంతకాలానికి నిర్వహణాపరమైన ఇబ్బందుల కారణంగా మూసేయాల్సి వచ్చింది. తర్వాత సీఏ కోర్సులో జాయిన్ అయ్యారు సమీర్. 'నాకు ఆ కోర్సుపై ఆసక్తి కలలేదు. నా ఆలోచనలన్నీ హోల్‌సేల్ వ్యాపారం చుట్టే తిరిగేవి. అందుకే సీఏ వదిలేసి మళ్లీ ఇదే రంగంలోకి వచ్చేశా' అంటారు సమీర్.

బ్రాండ్ మార్చి మరో ప్రయత్నం

'గతంలో చేసిన తప్పులు జరక్కుండా జాగ్రత్త పడుతూ.. మరింత ఆకట్టుకునేలా ఫస్ట్ ప్రైస్ ప్రారంభించా'నంటారు సమీర్. వెబ్‌సైట్‌కి హోమ్ పేజ్, యూజర్ ఇంటర్ఫేస్ మార్చి ఫస్ట్ ప్రైస్‌గా మార్చి మరో ప్రయత్నం చేశారాయన. అనేక పరీక్షలు, ముందస్తు జాగ్రత్తలు, క్రాష్ టెస్టులు చేశాక కొత్త సైట్ మొదలైంది. 'నిజానికి హోల్‌సేల్ ధరలకే నిత్యావసరాలు ఇంటికి అందించే వ్యాపారం భారీ పరిమాణంలో లేదు. ప్రస్తుతానికి హైద్రాబాదే మా టార్గెట్. మార్కెట్లో పట్టు పెంచుకున్నాక ఇతర నగరాలకు విస్తరించే ఆలోచన ఉంది' అని చెప్పారు సమీర్. ప్రస్తుతం ఈ ఫస్ట్ ప్రైస్ ప్రారంభ స్థాయిలోనే ఉంది. సమీర్ తండ్రే వస్తువుల పికప్, డెలివరీల్లో పాలుపంచుకుంటున్నారు. ఆర్డర్ చేయగానే... కస్టమర్లకు హోల్‌సేల్ రేట్లకే ఇంటికి సరఫరా చేస్తోంది ఫస్ట్ ప్రైస్.

సాధారణంగా ఈతరహా వ్యాపారంలో లాభదాయకత ఎక్కువే. 'ఓ టూత్ పేస్ట్ ఆర్డర్ చేస్తే 10 శాతం లాభం కనీసం ఉంటుంది. అదే 3-4 ఒకేసారి ఆర్డర్ వస్తే మార్జిన్ 15-20శాతం ఉంటుంది. అందుకే ఎక్కువగా ఆర్డర్ చేయగలిగితే ఎక్కువ లాభం పొందచ్చ'ని చెబ్తున్నారు సమీర్. ఇతరులతో పోటీ తట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. అధికశాతం మంది 5శాతం రాయితీకే పరిమితమైనా... తాము 7 నుంచి 25 శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నామంటోంది ఫస్ట్ ప్రైస్. ప్రస్తుతం క్యాష్ అండ్ క్యారీ స్థాయి కంపెనీలు ఇచ్చే స్థాయిలో ఇవ్వగలుగుతున్నామని చెబ్తున్నారు వీళ్లు. అయితే అసలు వస్తువుల కంటే అదనంగా విధించే రుసుము కేవలం డెలివరీ ఛార్జ్ ఒకటే. ప్రతీ ఆర్డర్‌కు రూ.39 డెలివరీ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్జిన్లు 1-2 శాతానికి తగ్గించుకోవడం ద్వారా.. ధరల్లో తరచూ ఉండే మార్పులను నియంత్రించుకోవచ్చన్నది సమీర్ ఐడియా.


సమీర్,ఫస్ట్ ప్రైజ్ వ్యవస్థాపకుడు

సమీర్,ఫస్ట్ ప్రైజ్ వ్యవస్థాపకుడు


భవిష్యత్ కోసం ప్రణాళికలు

ప్రస్తుతం కేష్ అండ్ కేరీ అవుట్‌లెట్స్ నుంచే వస్తువులు సేకరిస్తోంది ఫస్ట్ ప్రైస్. అయితే బడా కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకుని మరింతగా మార్జిన్లు సాధించచ్చనే వ్యూహం ఉంది. ఇప్పటికి హైద్రాబాద్‌కే పరిమితమైనా.. జాతీయ స్థాయి కంపెనీగా ఎదగాలనే ఆసక్తి, సామర్ధ్యముందంటున్నారు సమీర్. అమెరికాలో బాక్స్‌డ్ హోల్‌సేల్ స్థాయికి చేరాలన్నదే లక్ష్యంగా సమీర్ చెప్తున్నారు.

వెబ్ http://www.firstprice.co/