వాళ్లు లిప్ స్టిక్ రాసుకుంటే సెన్సార్ బోర్డుకు అభ్యంతరమేంటి..?  

0

మొన్న ఉడ్తా పంజాబ్ విషయంలో ఏం జరిగిందో తాజాగా లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా విషయంలో అదే రిపీట్ అవుతోంది. అర్ధంపర్ధం లేని అభ్యంతరాలతో నిత్యం వార్తల్లో ఉండే సెన్సార్ బోర్డు.. లిప్ స్టిక్ సినిమాపైనా అదే రకమైన ఆంక్షలు విధించింది. అసభ్య పదజాలం, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ సినిమా విడుదలకు మోకాలడ్డింది.

ప్రకాశ్ ఝా ఫిలిం బేనర్ పై అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కింది లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా మూవీ. నలుగురు వేర్వేరు వయసుగల మహిళల జీవిత ప్రయాణం ఈ సినిమా ఇతివృత్తం. సమాజంలోని అనేక ఆంక్షల నడుమ వాళ్లు ఏం కోరుకుంటున్నారో, ఎలాంటి స్వేచ్ఛను అనుభవించాలని తపన పడుతుంటారో, పైకి చెప్పలేని వాళ్ల కోరికలేంటో తెరమీద ఆవిష్కరించారు. రత్న పథక్ షా, కొంకణసేన్, ఆహన కుమార, ప్లైట్ బోర్థాకుర్ ఆ నలుగురు మహిళల పాత్రలు పోషించారు.

అలంకృత శ్రీవాత్సవ గతంలో లింగసమానత్వం నేపథ్యంలో తీసిన టర్నింగ్ 30 సినిమా తీశారు. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. టోక్యోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పిరిట్ ఆఫ్ ఏషియా పురస్కారాన్ని అందుకుంది .

తాజాగా ఆమె తెరకెక్కించిన లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా మాత్రం విడుదల దగ్గర ఆగిపోయింది. కారణం సెన్సార్ బోర్డు మితిమీరిన అభ్యంతరాలు చెప్పడం. సెక్సువల్ సీన్స్ ఉన్నాయని, డైలాగుల్లో అసభ్యత దొర్లిందని, అవి మహిళల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, ఆడియో పోర్నోగ్రఫీ సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని .. ఇలా రకరకాల రీజన్స్ చెప్తోంది సెన్సార్ బోర్డు.

అయితే దర్శకురాలు మాత్రం సెన్సార్ బోర్డు సభ్యుల వైఖరిపై మండిపడుతోంది. అడ్డంకులు తొలగి సినిమా తెరమీద కనిపించేదాకా పోరాడతానని అంటోంది. ఇది కేవలం సినిమా సమస్య కాదు.. కనీస సానుభూతిలేని సమాజంలో నలిగిపోతున్న మహిళల నిజజీవిత గాథ అంటారామె. అలాంటి వాళ్లు కోరుకుంటున్న స్వేచ్ఛని, వాళ్ల గుండె చప్పుడిని తెరమీద ఆవిష్కరించానని అలంకృత శ్రీవాత్సవ అంటున్నారు. ఆడవారిపై అనాదిగా వివక్ష చూపిస్తునే ఉన్నారు.. ఆ హింసను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమే లిప్ స్టిక్ సినిమా ఉద్దేశమని ఆమె చెప్పారు. సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపడం.. మహిళ హక్కులను కాలరాయడమే అనేది దర్శకురాలి వెర్షన్.

అంతర్జాతీయ వేదికల మీద నుంచి ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఫిలిం మేకర్ కి సొంత దేశంలోనే అభ్యంతరాలు ఎదురుకాడం నిజంగా బాధాకరమే. అందుకే ఇండస్ట్రీ కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది. సెన్సార్ తీరుపట్ల ఇటు ప్రేక్షకులు కూడా విస్మయం చెందారు.

ఏది ఏమైనా ఈ సినిమా కోసం పబ్లిక్ ఈగర్లీ వెయిటింగ్. మరి సెన్సార్ బోర్డు కత్తెర ఏం చేస్తుందనేదే ప్రస్తుతానికి సస్పెన్స్.  

Related Stories

Stories by team ys telugu