చేనేతతో ఫ్యాషన్ ఆమె ప్యాషన్.. అదే 'మోగ్రా'కు గ్లోబల్ గుర్తింపు తెచ్చింది

సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉండాలే కానీ ఎంత గొ్ప్ప రంగంలోనైనా విజ‌యం సాధించొచ్చు. కోల్‌క‌తాకు చెందిన షీనా రాయ్ కూడా తాను కోరుకున్న రంగంలో ఇష్టంగా ప‌నిచేసి ప్రారంభించిన ఏడాదిలోపే సంస్థ‌ను గ్లోబ‌ల్ బ్రాండ్‌గా మార్చేసింది. రోజుకో ఫ్యాష‌న్ మారుస్తున్న పాశ్చ‌ాత్య దేశాల‌కే ఫ్యాష‌న్ అంటే ఏమిటో తెలియ‌జేసింది. మోగ్రా పేరిట సంస్థ ప్రారంభించి అస‌లైన ఫ్యాష‌న్ చేనేత‌లోనే ఉంద‌ని ప్ర‌పంచానికి చాటి చెప్పి.. క‌ళ‌తో క‌ల‌ల‌ను సాక్షాత్క‌రించింది.

చేనేతతో ఫ్యాషన్ ఆమె ప్యాషన్.. అదే 'మోగ్రా'కు గ్లోబల్ గుర్తింపు తెచ్చింది

Wednesday May 06, 2015,

6 min Read

చేతి వృత్తులకు, సంభ్రమాశ్చర్యాలు గొలిపే కళలకు భారతదేశం పుట్టినిల్లు. చేతివృత్తులతో విరాజిల్లిన భారత్ అంటే అనాది నుంచీ ప్రపంచం మొత్తానికీ చెప్పలేని ఆసక్తి. చేతి వృతుల కళలను చూడాలన్న ఆ ఆసక్తే భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు అనేకమందికి ప్రోత్సాహమైంది. ఆ ఆసక్తే ప్రపంచ చరిత్రను మార్చేసింది. భారతీయ చేతివృతుల్లో నాడు.. నేడూ వస్త్రపరిశ్రమే రారాజు. ఆధునిక కాలంలో సాంకేతికపరిజ్ఞాన సముపార్జనలో వెనుబడిపోయి ఈ పరిశ్రమ వెనుకబడి ఉండొచ్చు గాక... కానీ ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫ్యాషన్ దుస్తులకు ఆ చేతివృత్తి నైపుణ్యమే ప్రేరణ. ఫ్యాషన్ ప్రపంచం మొత్తం భారతీయ చేనేతలోంచే కొత్తదనాన్ని వెతుక్కొంటుుందంటే అతిశయోక్తికాదు. షీనారాయ్ కూడా అదేపనిచేశారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, ఆధునిక ఫ్యాషన్‌ రంగాన్ని ఔపోసన పట్టిన ఆమె అసలైన ఫ్యాషన్ మన చేనేతలోనే ఉందని గుర్తించారు. అందుకే ఆధునిక ఫ్యాషన్‌ను.. అద్భుత చేనేత కళను మేళవించి ఫ్యాషన్ డిజైనింగ్‌లో దూసుకుపోతున్నారు.


షీనా రాయ్, మోగ్రా వ్యవస్థాపకురాలు

షీనా రాయ్, మోగ్రా వ్యవస్థాపకురాలు


ఆధునిక.. సంప్రదాయ ఫ్యాషన్లకు వారధి..

భారతదేశంలో ప్రస్తుతం ఫ్యాషన్‌రంగంలో రెండు ప్రధాన ధోరణలున్నాయి. ఒకటి పాశ్యాత్య సీజనల్ సైకిల్, పాప్ ఆర్ట్, భారీ ఉత్పాదక ఈ కామర్స్ వాణిజ్యం, లగ్జరీ బ్రాండ్లు కాగా.. రెండోది వారసత్వ చేనేత, డిజైన్‌రంగం. పూర్వీకుల నుంచి చేతివృత్తి కళను వారసత్వంగా పొందినవారు ప్రస్తుత డిజిటల్ రంగంతో అనుసంధానం కావటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అందులో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు షీనారాయ్ కూడా సిద్ధమయ్యారు. అందరికంటే భిన్నంగా చేస్తే వ్యాపారం ఎప్పుడూ లాభసాటిగానే ఉంటుందన్న సూత్రాన్ని నమ్మే ఆమె ఆధునిక ఫ్యాషన్‌కు భారతీయ చేతివృత్తుల కళను అలంకరించి అద్భుత విజయం సాధించారు. ఢిల్లీలోని నిఫ్ట్‌లో ఫ్యాషన్‌డిజైనింగ్ చదివిన ఆమె ప్రపంచంలోని ఫ్యాషన్ పోకడలన్నీ అధ్యయనం చేశారు. ఎన్నో పుస్తకాలు తిరిగేశారు. చివరకు అసలైన ఫ్యాషన్ భారతీయ చేనేతలోనే ఉందని గుర్తించారు. మోర్గా పేరుతో సంస్థను స్థాపించి ప్రపంచం మొత్తానికీ తన ఫ్యాషన్ కళను పరిచయం చేస్తున్నారు.

image


లక్ష రూపాయల పెట్టుబడితో..

షీనారాయ్‌కి చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అమితాసక్తి. వారసత్వ సంపదకు నిలయమైన కోల్‌కతాలో.. ఆధునిక పోకడల కేంద్రమైన ఢిల్లీలో ఆమె రెండు భిన్నమైన వాతావరణాల్లో పెరిగారు. ఈ రెండు చోట్లా వ్యక్తుల అలవాట్లు, ఆకాంక్షలు, జీవిత విధానాలను లోతుగా అధ్యయనం చేశారు. బాలికల పాఠశాలలో చదివిన షీనా.. అప్పటి నుంచే తన మిత్రులు ఎలాంటి డ్రస్సులు ధరిస్తున్నారు.. అవి వాళ్లకు ఎలాంటి లుక్‌ను ఇస్తున్నాయనే విషయాలను పరిశీలించేవారు. నిఫ్ట్‌లో చదువు పూర్తవగానే రెక్కలు కట్టుకొని ఆకాశంవైపు ఎగిరారు. ఫ్యాషన్ ప్రపంచంలో విహరించారు. మొదట ప్రఖ్యాత డిజైనర్ ప్రశాంత్‌వర్మ వద్ద ఫ్యాషన్ డిజైనింగ్‌లో మెళకువలు తెలుసుకున్నారు. ఆ తర్వాత న్యూయార్క్ చేరుకున్న ఆమె.. లేడీ గాగా, ది బ్లాక్ ఐడ్ పియాస్, జిమ్ స్టీన్‌మ్యాన్, బ్రూనో మార్స్ వంటి పాప్‌స్టార్లకు డిజైనర్‌గా ఉన్న ఆషర్ లెవన్ వద్ద పనిచేశారు. ఫ్యాషన్ అండ్ యూ డాట్ కామ్, ఇండియన్ రూట్స్ డాట్‌కామ్ సంస్థల్లో కీలకంగా పనిచేశారు. ఈ అనుభవాలు ఆమెకు ఫ్యాషన్‌రంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకొనేందుకు తోడ్పడ్డాయి. దాంతో ఆమె మదిలో ఒక బలమైన బృహత్‌లక్ష్యంతో న్యూయార్క్ నుంచి ఢిల్లీ ఫ్లైటెక్కారు.

'‘న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ డిజైన్‌ను ఎలా చూస్తారన్నదానిపై నాకు కొత్త దృక్పథం ఏర్పడింది. పశ్చిమదేశాల్లోని డిజైన్లు, స్ట్రీట్ స్టైల్‌పై తూర్పుదేశాల సంప్రదాయాల ప్రభావం ఉన్నప్పటికీ మన సొంతదేశంలో ఆ వ్యక్తిత్వాన్ని, కథలను కోల్పోతున్నాం. దేశంలో ఎంతో మంది బహుళ నైపుణ్యంగల డిజైనర్లు సంప్రదాయ టెక్స్‌టైల్స్‌తో శోభాయమానమైన డిజైన్లు చేస్తున్నారు. అయితే, అతికొద్దిమంది మాత్రమే పాశ్చాత్య వస్త్రాలకు స్థానిక, చేతివృత్తుల వనరులను వాడుతున్నారు. డైలీ లైఫ్‌చాయిస్‌కు తగినట్లుగా సంప్రదాయ వస్త్రాల సరఫరా లేకపోవటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలోనే బలమైన సాంస్కృతి ముద్ర ఉండాలన్న సంకల్పంతో 2014 జూన్‌లో మోగ్రా పురుడుపోసుకొంది’ అని షీనా చెప్తారు.

ఆమెకు ఎంతో ఇష్టమైన సెంట్ తయారుచేసే పువ్వు పేరే తన సంస్థకు పెట్టుకున్నారు. కేవలం రూ.లక్ష వ్యక్తిగత పెట్టుబడితో సంస్థను ప్రారంభించారు. నాణ్యమైన చేనేతను వెతుక్కొంటూ ఢిల్లీ నుంచి పుణే చేరిపోయారు. మొదట అక్కడ ఆమెకు అసౌకర్యంగా అనిపించినా కళను పరిశీలిస్తున్నకొద్దీ అక్కడి సమాజంతో మమేకమయ్యారు.

image


నిరంతరం అన్వేషణ...

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్లు గంటగంటకూ మారిపోతుంటాయి. పశ్చిమదేశాల్లో సీజనల్ సైకిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. మోగ్రా సంస్థ దీనికి భిన్నంగా ఉండాలని షీనా మొదటే నిర్ణయించుకొన్నారు. అందుకే సీజన్ అన్న ఆలోచన లేకుండా నిరంతరం కొత్త ఫ్యాషన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

‘ఇతర ఫ్యాషన్ సంస్థలు, బ్రాండ్లలా సీజనల్ సైకిల్స్‌లో కాకుండా దాదాపు ప్రతిరోజూ కొత్త ఉత్పత్తిని సృష్టించాలని పనిచేస్తాం. ఇందుకోసం మేం నిరంతరం పరిశోధిస్తాం. షాపింగ్ చేస్తాం. అవసరమైతే ప్రయాణాలు కూడా చేసి ఫ్యాషన్లను అభివృద్ధి చేస్తాం. మా పరిశోధన అధికభాగం ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ దుస్తుల ఎంపికకు మాత్రం స్వయంగా చేనేత క్లస్టర్లకే వెళ్తాం. ఆ దుస్తులు ఎల్లప్పుడూ దశాబ్దాలు, ఒక్కోసారి శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ డిజైన్లతోనే ముచ్చటగొలుపుతుంటాయి. ఒకసారి సరుకు దొరికిన తర్వాత వాటిని తీసుకెళ్లి ప్రస్తుత కాలానికి తగినట్లుగా డిజైన్లు రూపొందిస్తాం’ అని షీనా తెలిపారు.

నిజాయితీయే విజయ రహస్యం..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావటానికి ఫ్యాషన్ సంస్థలు తమ ఉత్పత్తులకు లేని ప్రత్యేకతలను ఆపాదించి వినియోగదారులను మోసం చేయటం పరిపాటిగా మారింది. కానీ, షీనా అలాకాదు. నిజాయితీ అనే సూత్రంపైనే ఆమె మోగ్రా సంస్థను స్థాపించారు.. నడిపిస్తున్నారు. అంత నిజాయితీగా ఉంటే సంస్థలను నడుపలేం అనేవాళ్లు కూడా ఉంటారు. నిజమే.. లాభాల కోసమే పనిచేసే సంస్థలు నిజాయితీని పక్కనబెట్టేస్తాయి. కానీ షీనాకు లాభమే లక్ష్యం కాదు. ఫ్యాషన్ రంగం ఆమెకు ఒక ‘ప్యాషన్’. అందుకే ఆమె వ్యాపారంలో నిజాయితీని నమ్ముకున్నారు.

‘ఉత్పత్తిదారుడు నేతపని నైపుణ్యానికి తగిన ధర చెల్లిస్తున్నపుడు ఉత్పత్తిదారుడికి, కొనుగోలుదారుడికి మధ్య న్యాయబద్దమైన వ్యాపారమనే భాగస్వామ్యముండాలి. మా విషయమే తీసుకొంటే, మన వృత్తి నిపుణుడితో మంచి డీల్ లభించినప్పుడు ధర విషయం ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్లు స్థానికంగా ఉన్నవాళ్లకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తారు. కళను సజీవంగా ఉంచుతారు. భారతీయ నైపుణ్యాలను పాశ్చాత్య డిజైన్లలో మిళితం చేయాలన్న లక్ష్యంతో నేను ప్రారంభించిన మోగ్రా అనుకోకుండానే న్యాయబద్దమైన వ్యాపారానికి వేదిక అయ్యింది. కేవలం చేతితో తయారుచేసిన సంప్రదాయ దుస్తులను వనరులుగా వాడుతున్నప్పటి నుంచి న్యాయబద్దమైన ధరనే చెల్లిస్తున్నాను. ఆ విధంగా వారికి నేను ఒక వనరుగా మారాను’ అని షీనా ఎంతో ఆనందంగా చెప్తారు.

వినియోగదారుల ఇష్టాయిష్టాల్లో కూడా స్పష్టమైన మార్పు వచ్చిందని షీనా గుర్తించారు. ‘నేడు ప్రజలు తమ జీవిత విధానంపట్ల చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తమ ఆహార అలవాట్లలాగే వాడ్రోబ్ కూడా స్థానికంగా ఉత్పత్తి అయిన చేనేత నైపుణ్యంతో కూడిన వస్త్రాలతో నిండిపోవాలని కోరుకొంటున్నారు. ఇందుకోసం కొంచెం ఎక్కువ ధర చెల్లించేందుకు కూడా వెనుకాడటంలేదు. వినియోగదారుల్లో ఈ మార్పులే మోగ్రా అభ్యున్నతికి మార్గాలు వేయనున్నాయి’ అని ధీమాగా చెప్తున్నారు. ‘ప్రజలు తమ సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ పరిస్థితులపై ఎంతో అవగాహన పెంచుకున్నారు. పరిశ్రమ కూడా వారి కోరికల మేరకు ఉత్పత్తులను చేయాల్సిందే. తూర్పు, పశ్చిమ, చిన్న పెద్ద అన్న తేడాలేకుండా అందరు డిజైనర్లు, బ్రాండ్లు నమ్మకమైన, సహజమైన సరుకులవైపు మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మెరాకి ప్రాజెక్ట్స్, వైట్ చంపా, జోడీ వంటి సంస్థలు మాస్ ప్రొడ్యూస్డ్ స్టోర్లలోకి చేనేత నైపుణ్యాన్ని తీసుకొస్తున్నాయి’ అని తెలిపారు. ఎంచుకున్న వృత్తిలో ఎంతో లోతైన అధ్యయనం చేస్తేగాని ఇంతటి నిశిత పరిశీలన సాధ్యంకాదు. వినియోగదారు ఇప్పుడు తమ వార్డ్‌రోబ్‌లో ప్రయోగాలకు ఇష్టపడుతున్నందున చిన్నతరహా పరిశ్రమల రంగంలో మోగ్రావంటి సంస్థలకు గొప్ప భవిష్యత్తు ఉందని ఆమె ఊహించారు.

ఈ కామర్స్ మాటేలేదు..

గుండుసూది దగ్గరనుంచి ప్రతి వస్తువునూ ఈ కామర్స్ ద్వారా వినియోగదారులకు చేరుస్తున్న కాలమిది. వినియోగదారులు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు. కానీ షీనా మాత్రం తమ ఉత్పత్తులను వినియోగదారులకు వద్దకు చేర్చేందుకు ఈ కామర్స్ జోలికి వెళ్లలేదు. గతంలో ఈ కామర్స్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఆమెకు అందులోని లోటుపాట్లేమిటో బాగా తెలుసు. ఈ కామర్స్‌లో బ్రాండ్లదే హవా. వస్తువు ఎక్కడ తయారవుతున్నది ? ఎలా తయారవుతున్నదన్నదానికి ప్రాధాన్యం ఉండదు. కానీ షీనా తన ఉత్పత్తులను కొనే వినియోగదారులు వాటి గొప్ప కథలను కూడా తెలుసుకోవాలని ఆశించారు. అందుకే వినియోగదారులు తమ డిజైన్లను ప్రత్యక్షంగా చూసి, వాటి గొప్పతనాన్ని తెలుసుకొని కొనేలా స్టోర్లలో విక్రయిస్తున్నారు. ‘ఆధునిక ప్రపంచంలో గుర్తింపు కోల్పోయిన, ముఖ్యంగా పశ్చిమదేశాలకు తెలియని భారతీయ చేనేత నైపుణ్యాలను వెలికితీసి అందరూ ఆ వస్త్రాలను ధరించేలా అందుబాటులో ఉంచాలనేదే మా ఆలోచన. ఎంతో మంది కొత్త డిజైనర్లు భారతీయ నేత నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరికంటే వినియోగదారుడికి అత్యుత్తమ వస్తువులను, తక్కువ ధరలకు అందించటమే మోగ్రా ప్రత్యేకత’ అని చెప్తారు షీనారాయ్. మోగ్రా ఉత్పత్తులకు మార్కెట్‌లో అంచనాలకు మించి ఆదరణ లభిస్తుండటం షీనాకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నది. వినియోగదారులతోపాటు మీడియా కూడా మోగ్రా డిజైన్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతుండటంతో ఆమె ఆనందందానికి అవధులు లేవు. మిస్ ఓగ్ ఇండియా సంస్థ తన మొదటి ఎడిషన్‌లోనే మోగ్రా విశిష్టతలను ప్రముఖంగా ప్రచురించింది. మోగ్రా ఎస్‌ఎస్15 కలెక్షన్లు అద్భుతమని పుణే మిర్రర్ వ్యాఖ్యానించింది. హోంగ్రౌన్, ఇండియాట్యూబ్, ఎల్‌బీబీడీ వెబ్‌సైట్లు కూడా షీనా విజయగాధను ప్రముఖంగా పేర్కొన్నాయి.

image


మోగ్రా.. ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్...

గుండెల నిండా ఆత్మవిశ్వాసం. ఏదో సాధించాలన్న దృఢ సంకల్పంతో కేవలం లక్ష రూపాయలతో షీనారాయ్ ప్రారంభించిన మోగ్రా ఇప్పుడొక గ్లోబల్ బ్రాండ్. భారత్‌లోనే కాకుండా థాయ్‌లాండ్, శ్రీలంక, కొరియా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఆస్ట్రేలియా, బ్రెజిల్.. ఇలా అనేక దేశాల్లో మోగ్రా డిజైన్లంటే వినియోగదారులకు అమితాసక్తి. భారతీయ చేనేత నైపుణ్యాలను విశ్వవ్యాప్తం చేస్తూ డిజైనిగ్‌లో అద్భుతాలు చేస్తున్న మోగ్రా సంస్థను షీనా ఒంటి చేత్తో నడిపిస్తూ మంచి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. మోగ్రాకు అకౌంటెంట్, ఫొటోగ్రాఫర్, ప్రజాసంబంధాల అధికారి, మార్కెటింగ్ గురు.. అన్నీ షీనాయే. ఆచరణకూ.. ఆదర్శానికి మధ్య స్పష్టమైన బేధం తెలిసిన షీనా తాను ఎంచుకొన్న రంగంలో వాస్తవికంగా ఆలోచిస్తూ దూసుకుపోతున్నారు. ‘మీ ఆలోచనను, ఉత్పత్తిని మీరు నిజంగా నమ్మితే దాన్ని కచ్చితంగా ఆచరణలో పెట్టండి. జీవితంలో అన్నింటిలాగా ఇదంత తేలికేంకాదు. కానీ మీ పనిని ఇతరులెవరైనా మెచ్చుకొన్నారూ అంటే మీ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే’ అని సలహా ఇస్తారు షీనారాయ్.