కంటి రోగుల పాలిట కలియుగ దైవం పర్వేజ్ ఉబేద్

వైద్యుడిని నారాయణుడని అంటారు. సకాలంలో వైద్యం అందితే ప్రాణ హాని ఉండదని వైద్యులు చెపుతుంటారు. అంగవైకల్యానికి అవకాశమే ఉండదంటారు వాళ్లు. సత్వరం వైద్యం అందించే లక్ష్యంతోనే పని చేస్తున్నారు అసోం వాసి డాక్టర్ పర్వేజ్ ఉబేద్. గ్రామీణ ప్రాంతాలలో కూడా అత్యుత్తమ నేత్ర వైద్యం అందిస్తూ ఇతర డాక్టర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారాయన.

కంటి రోగుల పాలిట కలియుగ దైవం పర్వేజ్ ఉబేద్

Monday June 22, 2015,

3 min Read

డాక్టర్ పర్వేజ్ ఉబేద్. అసోంలోని పేద,అల్పాదాయ వర్గాలకు తక్కువ ఖర్చుకే మేలైన, నాణ్యమైన నేత్రవైద్యం అందించాలని కంకణం కట్టుకున్న ధన్వంతరి. 2007లో నేత్ర వైద్య పట్టా పుచ్చుకున్న తర్వాత జోహ్రాట్‌లోని సివిల్ హాస్పిటల్లో ఉద్యోగం చేశారు. అప్పుడే వేలాది మంది చత్వార రోగులను చూశారు. చూపు మందగించిన రోగులకు కూడా వైద్యం చేశారు. చాలా మంది నేత్ర సమస్యలను తేలిగ్గా తీసుకోవడమూ చూశారు.

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే అసోంలో నేత్ర వైద్య సేవలు చాలా తక్కువగా ఉన్నాయని పర్వేజ్ గుర్తించారు. ఇండియాలో ఉన్న కేటరాక్ట్ రోగుల్లో 18 శాతం మంది అక్కడే ఉన్నారు. అసోంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు చేసే సౌకర్యమే లేదు. అసోంలో చాలా మందికి నేత్ర వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేదని పర్వేజ్ గ్రహించారు. ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేసే ఫీజులను వాళ్లు చెల్లించలేకపోతున్నారు. మరి పేదలకు మేలైన వైద్యం అందించే ప్రక్రియను ఎలా ప్రారంభించాలో మొదట్లో ఆయనకు అర్థం కాలేదు.

డా. పర్వేజ్ ఉబేద్, కంటి వైద్యులు, ERC Eyecare వ్యవస్థాపకులు

డా. పర్వేజ్ ఉబేద్, కంటి వైద్యులు, ERC Eyecare వ్యవస్థాపకులు


రూ. 50 కన్సల్టేషన్, రూ. 99కే కళ్లజోడు


మూడు సంవత్సరాలు ఆలోచించిన తర్వాత పర్వేజ్ మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఈ.ఆర్.సీ. ఐ కేర్ అనే సామాజిక సంస్థను ప్రారంభించారాయన. అసోంలో అందరికీ తక్కువ ఖర్చుతో నేత్ర వైద్యం అందించేందుకు ఈ సంస్థ ప్రారంభమైంది. పేదలకు వైద్యం చేయడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. అంకూర్ కేపేటల్‌తో పాటు రెండు సంస్థల నుంచి ఈ.ఆర్.సీ ఐ కేర్ కు నిధులు అందాయి. ఆ సంస్థలు ఉదారంగా విరాళాలిచ్చాయి. ఇప్పడు అసోంలోని జోహ్రాట్, నాకాచారీ, బోరోలా పట్టణాల్లో నేత్ర వైద్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 22 మంది నేత్ర వైద్యులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మరో 40 మంది పార్ట్ టైమర్లుగా సేవలందిస్తున్నారు. రోగుల నుంచి రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. కళ్లజోళ్లు రూ. 99 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. కేటరాక్ట్ సర్జరీకి రూ. 3,500 రూపాయలు మాత్రమే తీసుకుంటారు.

ప్రధాన ఆసుపత్రి , శాఖల వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు ఈ.ఆర్.సీ. ఐ కేర్ ప్రయత్నిస్తోంది. జిల్లా ముఖ్య కేంద్రంలో ప్రధాన ఆసుపత్రి ఉంటుంది. అందులో నేత్ర వైద్య కేంద్రంతో పాటు శస్త్రచికిత్సల విభాగం ఏర్పాటు చేస్తారు. ప్రతీ ప్రధాన ఆసుపత్రికి నాలుగైదు శాఖలను అనుసంధానం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ శాఖల్లో ప్రాథమిక వైద్య సేవలను అందిస్తారు. గ్రామీణ వైద్య కేంద్రాల్లో కూడా ఆప్టోమెరిస్ట్స్, ఆప్తమాలజిస్టులు ఉంటారు.

ఈ.ఆర్.సీ. గ్రామీణ వైద్య కేంద్రాల్లోని సహాయకులు ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించడంతో పాటు నేత్ర వైద్యం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తారు. ఒక మొబైల్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోప్రతీ నెల 15 నుంచి 20 వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. అన్ని ఆదాయ వర్గాలకు పనికొచ్చే వైద్య సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. సులభంగా చేరుకునే నెట్వర్క్ ఉంటే… నేత్ర వైద్య ఆవశ్యకతపై పూర్తి అవగాహన కల్పించే వీలుందని పర్వేజ్ నమ్ముతారు. 2011లో చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన ఈ.ఆర్.సీ. ఐ కేర్ ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అభివృద్ధి చెందింది. వేలాది మందిని చేరుకునేందుకు వీలుగా ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నారు. తొలి నాళ్లలో ఆయన క్లినిక్‌కు చాలా తక్కువ మంది వచ్చేవారు. నేత్ర చికిత్సా విధానంతో పాటు అందులోని ప్రయోజనాలను వివరించేందుకు ఆయన పేషంట్లతో చాలా సేపు మాట్లాడాల్సి వచ్చేది. పేషంట్ల వైపు నుంచి కూడా సమస్యను అవగాహన చేసుకున్న తర్వాత ముందుకు సాగే తీరుపై వ్యూహరచన చేసుకునే అవకాశం వచ్చింది. ఒక్క క్లినిక్ తో సాధించేదేమీ లేదని ఆయన అర్థం చేసుకోగలిగారు. మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేయాలని తీర్మానించి ఆ దిశగా అడుగులు వేశారు. దానితో ప్రధాన ఆసుపత్రి, దానికి అనుసంధానమైన శాఖల వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలిగింది.

క్యాంపుల బయట వేచి ఉన్న పేషెంట్లు

క్యాంపుల బయట వేచి ఉన్న పేషెంట్లు


ఇన్వెస్టర్ కోసం గూగుల్‌లో వేట

ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుకు బాగా నిధులు అవసరమని ఆయన గుర్తించారు. నిధులకోసం పర్వేజ్ అన్వేషించారు. అసోంలో సామాజిక సంస్థల పట్ల ప్రజలకు అవగాహన లేదని ఆయనకు తెలుసు. ఏంజెల్ ఇన్వెస్టర్ అనే పదానికి అక్కడ అర్థమే తెలీదు. అన్వేషణలో గూగుల్ ఆయనకు మంచి నేస్తంగా మారింది. అనేక సంస్థలు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలగురించి గూగుల్ ద్వారానే ఆయనకు తెలిసింది. కొన్ని పుస్తకాలను కూడా చదివి, ఒక వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అనేక కార్యక్రమాలు, పోటీలకు వెళ్లారు. నిధుల వేట ముమ్మరం చేశారు. తొలి నాళ్లలో ఈ.ఆర్.సీ.కి నిధులు వచ్చే అవకాశాలే కనిపించేలేదు. తర్వాత ఫీడ్ బ్యాక్ ఆధారంగా పనులు సులభమయ్యాయి.

ఈ.ఆర్.సీ.. గతేడాది సంకల్ప్ అవార్డుల్లో ఫైనల్ కు చేరుకుంది. కాగితం మీద పెట్టిన ఒక ప్రణాళిక పూర్తి స్థాయి వ్యాపారంగా మారి సలహాదారులు, ఇన్వెస్టర్లను ఆకట్టుకోగలిగింది. తన ప్రధాన కేంద్రాలను, శాఖలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఈ.ఆర్.సీ. భావిస్తోంది. మేలైన వైద్య సేవల ద్వారా మరింత మందిని చేరుకోవాలన్నదే పర్వేజ్ తపన. అంతకంటే ఎక్కువగా నేత్ర వైద్యంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ.ఆర్.సీ.. ఐ కేర్ తరహాలోనే పేద, అల్పాదాయ వర్గాలకు సేపలు అందిస్తున్న సంస్థలున్నాయి. అరవింద్ ఐ కేర్, దృష్టి ఐ కేర్, ఐ నేత్ర, ఫోరస్ అండ్ విజన్ స్ప్రింగ్స్ వంటివి వాటిలో కొన్ని.