ఇక బస్సుల్లోనూ బయో టాయిలెట్స్.. 

లాంగ్ జర్నీలో ఒంటికి.. రెంటికి నో ఫికర్

0


మనకు తెలుసు. బస్సుల్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒంటికి, రెంటికి పడే బాధలేంటో..? అందునా డయాబెటిక్ పేషెంట్స్ కష్టాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చీటికీ మాటికీ డ్రైవర్లను రిక్వెస్ట్ చేయాలంటే మనసు చంపుకోవాలి. ఒక్కోసారి అతను మాట వినకుంటే నలుగురి ముందు చిన్నతనంగా అనిపిస్తుంది. డ్రైవర్ బుద్ధిపుట్టినప్పుడు ఆపితేనే మనం ఒంటికో, రెంటికో కంప్లీట్ చేసుకోవాలి. ఆ విషయంలో మహిళల బాధలు వర్ణించలేం. బస్సులో దూర ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరికీ ఇది అనుభవమే.

ఈ కష్టాలకు చెక్ పెట్టడానికే కర్నాటక ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వచ్చింది. దూర ప్రయాణం చేసే బస్సుల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేసింది . దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవడంతోపాటు- ముసలివాళ్లు, మహిళలు, చిన్నపిల్లలు, మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ తరచూ ఎదర్కొనే టాయిలెట్ సమస్య నుంచి పూర్తిగా రిలీఫ్ అయ్యారు. ప్రస్తుతానికి ఐదు బస్సుల్లో ఈ సదుపాయాన్ని కల్పించారు. బెంగళూరు, మైసూరుకు తిరిగే బస్సుల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 

అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఎటొచ్చీ టాయిలెట్స్ శుభ్రం చేసే దగ్గరే పెద్ద చిక్కొచ్చి పడింది. వాటిని మేనేజ్ చేయడం నానాటికీ కష్టమవుతోంది. పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే దానికి పరిష్కారంగా మరో నిర్ణయం తీసుకుంది కేఎస్ఆర్టీసీ. విసర్జించిన మలమూత్రాలను బయో టాయిలెట్ల ద్వారా పనికొచ్చే ఎరువుగా మార్చి.. ఆ కంపోస్టును అమ్మాలని నిర్ణయించింది. అది కొనేవాళ్లు ఎవరైనా అభ్యంతరం లేదని ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.

వోల్వో, మార్సిడిస్ కంపెనీలతో ప్రస్తుతానికి బయో టాయిలెట్స్ ఇన్ స్టాల్ చేసే విషయంలో టాక్స్ నడుస్తున్నాయి. ప్రాథమికంగా ఏఏ రూట్లలో నడిచే బస్సుల్లో ఆ టాయిలెట్లను అమర్చాలనేది ఇంకా నిర్ణయించాల్సి వుందని కేఎస్ఆర్టీసీ ఎండీ రాజేంద్ర కుమార్ కటారియా తెలిపారు.

ఈమధ్యే ఇండియన్ రైల్వే వాళ్లు కొన్ని బండ్లలో ప్రభుత్వ కార్యక్రమం కింద బయో టాయిలెట్లను ప్రవేశపెట్టారు. వారితో సంప్రదించి వాటి పనితీరుపై మరింత అధ్యయనం చేస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.  

Related Stories