ఇక మూసీ తీరాన ముక్కు మూసుకోవాల్సిన పనిలేదు

ఇక మూసీ తీరాన ముక్కు మూసుకోవాల్సిన పనిలేదు

Friday June 09, 2017,

2 min Read

మూసీ అంటే మురికికూపం! మూసీ అంటే ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం! మూసీని చూస్తేనే కడుపులో దేవేసేదౌర్భాగ్యం! ఇదంతా గతం. ఇప్పుడా ముచుకుందా నదీ పరీవాహక ప్రాంతం పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఆకుపచ్చ తీరాన్ని అద్దుకుని కనువిందు చేస్తోంది.

image


అనంతగిరి కొండల్లో పుట్టి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలిసే చారిత్రక మూసీనది కాలక్రమంగా కాలుష్యకాసారంగా మారిపోయింది. మురికి అనే పదానికి మూసీ పర్యాయపదంగా మారింది. అలాంటి ముచుకుందా నదికి మళ్లీపూర్వ వైభవం తేవాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ పైలట్ ప్రాజెక్టు అనుకున్నట్టే చూడచక్కగా ముస్తాబైంది. 

ఉప్పల్ భగాయత్ లేఔట్ ప్రాంతమంతా ఆకుపచ్చని అందాలతో రారమ్మని స్వాగతం పలుకుతోంది. పూదోటల నుంచి వచ్చే సువాసనలు మనసుకి హాయి గొలుపుతున్నాయి. ఔషధ మొక్కల మీదుగా వీచే తెమ్మెరలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫౌంటెయిన్లతో తీరం రూపురేఖలే మారిపోయాయి.

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూసీ సుందరీకరణకు గత ఏడాదే నాంది పలికారు. దాదాపు 25 లక్షల మొక్కలు జీహెచ్ఎంసీఎ, హెచ్ఎండీఏ పరిధిలో నాటాలని నిర్ణయించారు. ఆరోజు స్వయంగా కేటీఆరే వచ్చి రివర్ ఫ్రంట్ లో మొక్కలు నాటారు. 2.2కిలోమీటర్ల మేర చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని సివిల్ వర్క్స్ కూడా చేపట్టారు. భూమి చదును చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గోడలు నిర్మించారు. మొత్తం కోటీ 80 లక్షల ఖర్చుతో సందరీకరణ పనులు చేపట్టారు. 

దోమలనివారణకు మస్కిటో రిపెల్లెంట్ మొక్కలు, తులసీ మొక్కలు నాటారు. వాటితో పాటు నిమ్మగడ్డి, లావెండర్, వాము,అడ్డసరం వంటి ఔషధ మొక్కలు పెంచారు. ఫ్లవర్ బెడ్స్, లాన్స్, నక్షత్రవనం, డాట్స్ గ్రోవ్, తులసీవనం పనులు చేపట్టారు. వాకింగ్ ట్రాక్స్, చుట్టూ ఫెన్సింగ్, వాకర్లు సేద తీరేందుకు బెంచీలు,100 ఫీట్ల రోడ్డు, గార్డెన్ కు ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరాతోపాటు డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు. 

త్వరలో మూసీ పరీవాహక ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు అంటున్నారు. ఇదే స్ఫూర్తితో 28 కిలోమీటర్ల మూసీతీరాన్నంతా సుందరీకరిస్తామని ఆయన చెప్తున్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మూసీ సరికొత్త సొబగులు సంతరించుకుంది. ముచుకుందా తీరమంతా గతవైభవాన్ని గుర్తుచేసేలా పరిమళమైన పూల గాలులతో పచ్చందాలు పంచుతోంది.