హెచ్ 1బీ వీసా కట్టడి చేస్తే ఆ ఎఫెక్ట్ మనకేనా..?

హెచ్ 1బీ వీసా కట్టడి చేస్తే ఆ ఎఫెక్ట్ మనకేనా..?

Tuesday December 13, 2016,

2 min Read

కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్లకు పెద్ద షాకిచ్చారు. హెచ్ వన్ బీ వీసాలపై ఇక్కడకువచ్చి అమెరికన్ల ఉపాధిని దెబ్బతీయడాన్ని ఇకపై సహించమని మరోసారి స్పష్టం చేశారు. యూఎస్‌ కంపెనీల్లో చాలా మంది హెచ్‌వన్‌ బీ వీసాలతోనే పనిచేస్తుండటంతో ఇండియాపై ఈ ప్రభావం తీవ్రంగానే పడనుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముంది.

అమెరికాలో ఉద్యోగాలు స్థానికులకే అనే నినాదంతో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లలో అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన విధానాలపై మరింత స్పష్టత ఇచ్చారు. అమెరికన్‌ ఉద్యోగుల స్థానంలో హెచ్‌ వన్‌ బీ వీసాలతో వచ్చిన విదేశీయుల పనిచేసేందుకు ఇకపై ఏ మాత్రం అనుమతించమని తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్న ట్రంప్.. ప్రెసిడెంట్ గా విజయం సాధించిన తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా అయోవాలో తన మద్దతుదారులతో భేటీ అయిన ట్రంప్ ఈ విషయంపై సమగ్రంగా చర్చించారు. 

image


ప్రచార సమయంలో తాను అమెరికన్లను కలిశానని, వారిలో చాలా మంది విదేశీయుల కారణంగా ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా తమ స్థానంలో వచ్చిన వారికి తప్పనిసరి పరిస్థితుల్లో ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. కొత్త వారికి శిక్షణ ఇస్తే తప్ప వారికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వమని కంపెనీలు బెదిరిచాయని, ఇలాంటి దారుణాలు డిస్నీ వాల్డ్ సహా పలు కంపెనీలు చేస్తున్నాయని అన్నారు. అమెరికన్ల హక్కుల్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడుతానన్న ట్రంప్.. డిస్నీ సహా ఇతర కంపెనీల్లో హెచ్ వన్ బీ వీసాలపై పనిచేస్తున్న వారిని వెనక్కి పంపేలా చేస్తానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే డిస్నీ వాల్డ్‌, మరో రెండు ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలు తమ ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతున్నారంటూ ఇద్దరు మాజీ ఉద్యోగులు కేసులు పెట్టారు. హెచ్‌ వన్‌ బీ వీసాలపై తక్కువ జీతానికి విదేశీ ఉద్యోగుల్ని తెచ్చుకుని తమ ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని ఆరోపిస్తూ కోర్టు మెట్లెక్కారు. 2015 జనవరిలో వాల్ట్‌ డిస్నీ తొలగించిన 250 మంది సిబ్బందిలో ఉన్న ఈ ఇద్దరు.. HCL, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ సంస్థల పేర్లను కూడా కేసులో ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో హెచ్‌వన్‌ బీ వీసాలపై ట్రంప్‌ తీసుకురానున్న కొత్త చట్టాలతో హెచ్ వన్ బీ వీసాలపై ఆధారపడిన కంపెనీలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అమెరికా హెచ్‌ వన్‌ బీ కింద 65 వేల నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలు ఇస్తుండగా.. వాటిలో 25 నుంచి 35 వేల వరకు ఇండియన్లకే కేటాయిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ హెచ్ వన్ బీ వీసా నిబంధనలు మరింత కఠినతంర చేస్తే అది ఇండియన్ ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.