అందరూ మొక్కలు నాటితే.. ఇతను చెట్లను నాటుతున్నాడు.. 

0

ఈమధ్యే పద్మశ్రీ పురస్కారం అందుకున్న వనజీవి రామయ్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పుడమి తల్లికి నిత్య పత్రాభిషేకం చేస్తున్న వనపూజారి ఆయన. పచ్చదనం కోసం జీవితాన్నే త్యాగం చేశాడు. రామయ్యలాంటి కమిట్మెంట్ ఎంతమందికి ఉంటంది చెప్పండి. అలాంటివారి కోవలోకే వస్తారు అప్పారి రామచంద్ర. కోటి మొక్కలు నాటిన రామయ్య అభినవ అశోకుడైతే.. అతని అడుగుజాడల్లో నడుస్తున్న రామచంద్ర మరో హరితస్వాప్నికుడు. విచిత్రంగా ఇద్దరి పేర్లలోనూ రాముడున్నాడు. ఆనాడు ఆ రాముడు తండ్రి మాటకు కట్టుబడి వనవాసం చేస్తే, ఈనాడు ఈ రాములు మనిషి మనుగడకోసం వనాలకే ఆవాసం కల్పిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే హైవే కొండచిలువలా పరుచుకున్నట్టుగా కనిపిస్తుంది. మెలికలు తిరుగుతూ అదలా సాగిపోతునే ఉంటుంది. ప్రయాణం సౌకర్యంగానే ఉంటంది. కానీ సేదతేరే భాగ్యమే లేదు కదా. నల్లటి తారు నిగనిగలే కానీ, చల్లగా తలలూపే పచ్చటి చెట్లేవి? ఏసీ బస్సులో మన ప్రయాణం హాయిగా సాగితే చాలా..? రెక్కల విప్పార్చి కొమ్మమీద కూర్చునే అదృష్టం ఒక పక్షికి లేదా? మొక్కలు నాటండి.. చెట్లను పెంచండి అని నినాదాలే కానీ ఆచరించేవారు ఎంతమంది? ఈ కాంక్రీట్ జంగిల్ ఇలాగే విస్తరించుకుంటూ పోతే, చివరికి మిగిలేది ఏంటి? రహదారులు అభివృద్ధికి సూచికలు. కాదనడం లేదు. కానీ చెట్లు కూడా ప్రగతికి మెట్లు.

హైదరాబాదుకి చెందిన అప్పారి రామచంద్ర మస్తిష్కంలో ఇవే ఆలోచనలు. చేస్తున్న ఉద్యోగం సంతోషాన్నివ్వడం లేదు. కళ్లు మూసినా తెరిచినా చెట్టే కనిపిస్తుంది. వటవృక్షాలు పటపటా నేలరాలిపోతుంటే, మనసు తట్టుకోలేకపోయింది. రోడ్డేయాలంటే అడ్డంగా ఉన్న చెట్టుకుని ఖండఖండాలుగా నరకడమొక్కటే పరిష్కారమా? వందల ఏళ్ల నాటి వృక్షాన్ని మరోచోట నాటలేమా? ఈ ఆలోచనలు రామచంద్రను ఒకపట్టాన ఉండనీయలేదు. ప్రకృతి కోసం, పచ్చదనం కోసం ఉద్యోగాన్ని వదిలేశాడు.

ఏ చెట్లయితే అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయని భావిస్తున్నారో, అవే చెట్లకు ప్రాణప్రతిష్ట చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్నాడు. గ్రీన్ మార్నింగ్ హార్టికల్చర్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్ పేరుతో వటవృక్షాలను ఒడుపుగా పట్టుకుని మళ్లీ నేలతల్లి ఒడిలో నిలబెడుతున్నాడు.

ఈజిప్టులో ఈ తరహా ఉద్యమం ఏనాడో వచ్చింది. రామచంద్ర లాంటి పర్యావరణ ప్రేమికుల పుణ్యమాని మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే రీప్లాంటేషన్లో చైతన్యం వస్తోంది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగాన్నే వదిలేశాడంటే అతని సంకల్పం ఎంత గొప్పగా నాటుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో చెట్లను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించి ఎలా పున:ప్రతిష్టిస్తారో ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకుని, గ్రీన్ మార్నింగ్ సంస్థను నెలకొల్పాడు.

ఆస్ట్రేలియా భూములు వేరు. మన లాండ్ వేరు. ఇక్కడ సాయిల్ గట్టిగా ఉంటుంది. అక్కడి మిషనరీ ఇక్కడ ఉపయోగిస్తే లాభం లేదు. అందుకే హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్లతో కలిసి చెట్లను తరలించి వేరే చోట నాటే ప్రక్రియకు పూనుకున్నాడు. మెట్రో వాళ్లు కూడా రామచంద్ర ప్రతిపాదనను ఒప్పుకున్నారు. అలా వారితో కలిసి 800 చెట్లదాకా పెకిలించి వేరేచోట విజయవంతంగా నాటారు.

చెట్ల పరిమాణాన్ని, సంఖ్యను బట్టి, దూరాన్నిబట్టి చార్జ్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ సంఖ్యలో చెట్లుంటే కొంత రాయితీ ఇస్తారు. ఆర్డరుని బట్టి ఆరు వేల నుంచి లక్షన్నర దాకా తీసుకుంటారు. చెట్లను తరలించే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పెకిలించాల్సిన చెట్టు చుట్టూ నాలుగు మీటర్ల వ్యాసంలో గోయి తీసి పైకి లేపుతారు. రవాణాలో వేళ్లు దెబ్బతినకుండా దాని చుట్టూ గోనె సంచులు కట్టి నీళ్లతో తడుపుతారు. వేళ్లు వట్టిపోకుండా అవసరమైన కెమికల్స్ చల్లుతారు. వేప, మామిడి, రావి, నేరేడు, మర్రి లాంటి చెట్లనెన్నో విజయవంతంగా తరలించి పునరుజ్జీవం పోశారు.

ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు.. గుజరాత్, బెంగళూరులోని కొన్నిప్రాంతాల్లో కూడా ట్రీ ట్రాన్స్ లొకేషన్ చేశారు. మెట్రోతో కలుపుకుని ఇప్పటిదాకా సుమారు 5వేల చెట్లదాకా పున:ప్రతిష్ట చేశారు. అందులో సక్సెస్ రేట్ 80 శాతం ఉంది. అనుకున్నంత వేగంగా జరిగే ప్రక్రియ కాదు కాబట్టి, కొద్దిగా సమయం పడుతుందంటారు రామచంద్ర. ఎందుకంటే క్రేన్లు, ట్రాలీలు, ఎర్త్ మూవర్స్ కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా భారీ నుంచి అతిభారీ వృక్షాలను తరలించేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జరగరాని నష్టం జరుగుతుంది.

రామచంద్ర సంకల్పం ఇప్పుడిప్పుడే నాటుకుంటోంది. క్రమంగా ఎడారిని కప్పుకుంటున్న భూమాత మీద పచ్చటి దుప్పటి పరుస్తున్నారు. హరత వికాసం పట్ల జనాల్లో చైతన్యం వచ్చి రామచంద్రలాగా మహాయజ్ఞం చేపడితే తప్ప, పర్యావరణంలో అనుకున్న సమతౌల్యం రాదు.   

Related Stories