వాళ్ల పెళ్లి ఖర్చు జస్ట్ రూ. 500 మాత్రమే..!

నోట్లు రద్దయినా పెళ్లి రద్దు చేయొద్దని..

వాళ్ల పెళ్లి ఖర్చు జస్ట్ రూ. 500 మాత్రమే..!

Saturday November 26, 2016,

2 min Read

మొన్న గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఎలా జరిగిందో చూశారుగా..! సుమారు 600 కోట్లు ఖర్చుపెట్టారట! భూదేవంత అరుగు.. ఆకాశమంత పందిరి.. వేల సంఖ్యలో అతిథులు.. బంగారు ధగధగలు.. వంటల ఘుమఘుమలు.. అబ్బో పెళ్లంటే ఇదేరా అనే రేంజిలో ఉంది. ఒకపక్క దేశంమొత్తం చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతుంటే.. గాలివారింట పెళ్లి మాత్రం రాజవైభోగాన్ని తలపించింది. ఉన్న మారాజులు ఎలాగైనా చేసుకుంటారు.. ఎటొచ్చీ లేనోడికే తిప్పలు!!

అలాంటి ఇబ్బందుల మధ్యే ఓ జంట కేవలం రూ. 500 తోనే పెళ్లి చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, జరగడం సాధ్యమేనా అని అనుకున్నా, ఇది ముమ్మాటికీ నిజం. పందిళ్లు లేవు. మేళతాళాలు లేవు. విందు భోజనాల్లేవు. చుట్టాల పక్కాల హడావిడి లేదు. చడీచప్పుడు లేకుండా ఆ పెళ్లి జరిగింది.

పెద్ద నోట్లు రద్దు చేయటంతో పాటు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకోవడంపై పరిమితులు విధించారు. ఆ ప్రభావం పెళ్లిళ్లపై తీవ్రంగా పడింది. దీంతో కొందరు వివాహాలను వాయిదా వేసుకున్నారు. మరికొందరు ఉన్నంతలో జరిపించారు. అయితే సూరత్‌లోని ఒక జంట మాత్రం వాయిదా వేయకుండా అత్యంత సాదాసీదాగా జరుపుకుంది. దాన్నొక వేడుకలా కాకుండా.. రోజువారీ తతంగంలా జరిపేశారు. ఎంతగా అంటే.. పెళ్లికి వచ్చిన బంధువులకు కేవలం కప్పు టీ మాత్రమే ఇచ్చారు.

image


గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌కి చెందిన దక్ష, భరత్‌ పర్మార్‌ కి పెద్ద నోట్లు రద్దు అవ్వకముందే పెళ్లి ఫిక్సయింది. స్తోమత కొద్దీ అట్టహాసంగానే జరిపించాలని అనుకున్నారు. కానీ తీరా పెళ్లి డేట్ దగ్గరికొచ్చే పెద్దనోట్ల రద్దు ప్రకటన.. గొంతులో పచ్చివెలక్కాయలా పడింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. పెళ్లి క్యాన్సల్ చేసుకోవడానికి మనసు రాలేదు. అలాగని ఘనంగా చేయడానికి సరిపడా డబ్బు లేదు. ఉన్నదంతా డిపాజిట్ చేయడానికే పోయింది.

అయినా సరే, సెకండ్ థాట్‌కి అవకాశం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కేవలం రూ. 500 ‌ఖర్చుతో వధూవరులు ఒక్కటయ్యారు. వచ్చిన వాళ్లందరికీ కప్పు టీ ఇచ్చి.. ఇంతే సంగతులు చిత్తగించవలెను.. అన్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి రావడం, అతిథులకు సరైన మర్యాద కల్పించలేక పోవడం బాధ కలిగించిందని అబ్బాయి అమ్మాయి ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆగిపోతుందనుకున్న పెళ్లి ఐదువందలతో జరగడం మాత్రం ఆనందంగా ఉందని సన్నగా నవ్వారు. వచ్చిన వాళ్లు కూడా సిచ్యువేషన్ అర్ధం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఐదొందలు ఏ మూలకు సరిపోయేవి.