జర్నలిజం ఎందుకు గతి తప్పుతోంది..?!

ఇప్పటికప్పుడు పత్రికా స్వేచ్ఛకు వచ్చిన ముప్పేమీ లేదు..!! అయినా ఓ వర్గం మీడియా బిక్కచచ్చిపోయింది.. ?!

జర్నలిజం ఎందుకు గతి తప్పుతోంది..?!

Tuesday October 18, 2016,

3 min Read


స్వాతంత్ర్యానంతరం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ఒక చీకటి అధ్యాయం. దేశ భద్రత పేరుతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేశారు. ప్రతిపక్షాన్ని అణచిపెట్టారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మీసా చట్టం కింద మొత్తం 34,988 మందిని అరెస్టులు చేశారు. డిఫెన్స్ ఆఫ్‌ ఇండియా రూల్స్ కింద 75,818 మందిని జైల్లో పెట్టినట్టు జనతా పార్టీ ప్రభుత్వం నియమించిన షా కమిషన్ రిపోర్టు తేల్చింది.

ఎమర్జెన్సీ సమయంలో పత్రికా స్వేచ్ఛే పెద్ద సమస్య. ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీడియా కిక్కురుమనలేదు. మీడియా తీరు గురించి ఆనాడు ఎల్ కే అద్వానీ ఒక మాటన్నారు. మీడియాను వంగి సలాం చేయమంటే సాగిలపడతారు అని. నేటి మీడియా వ్యవహార శైలి చూస్తుంటే నాడు ఎల్ కే అద్వానీ మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు. ప్రాథమిక హక్కులను కాలరాయడం లేదు. ప్రతిపక్షం జైల్లో లేదు. పత్రికా స్వేచ్ఛకు వచ్చిన ముప్పేమీ లేదు. అయినా ఓ వర్గం మీడియా బిక్కచచ్చిపోయింది. వెన్ను విరిగిన మనిషిలా తయారైంది.

ఇప్పుడు ప్రపంచం ఒక తెరిచిన పుస్తకం. సమాచారం శరవేగంగా విస్తరిస్తోంది. ఎవరైనా సరే రిపోర్టర్ అవతారమెత్తే పరిస్థితి వచ్చింది. 1975లో టీవీలు లేవు. కానీ ఇప్పుడు ఒక్క ఇండియాలోనే 800 పైచిలుకు ఛానళ్లు ఉన్నాయి. వార్తా పత్రికలు కూడా పుష్కలం. అప్పట్లో జాతీయ పత్రికలకు కొన్ని ఎడిషన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రతీ పత్రిక దేశం నలుమూలలకు చేరుతోంది. ఒక్క దైనిక్ భాస్కర్ పత్రికకే 50 ఎడిషన్లు ఉన్నాయి.

అన్నింటికన్నా ఇప్పుడు సోషల్ మీడియాదే హవా. ఒక ఎడిటర్ కన్నా సోషల్ మీడియానే వేగంగా పనిచేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా రిపోర్టర్ కూడా ఒక ఎడిటరే. అందునా ఫలానా వార్తలే కవర్ చేయాలన్న రూల్సేం లేవు. ఛానళ్లలా గైడ్ లైన్స్ కూడా ఉండవు. సోషల్ మీడియాను అడ్డుకునే వాళ్లు లేరు. స్వేచ్ఛగా అభిప్రాయాలను పంచుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియా విప్లవం నుంచి మీడియా తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి వచ్చింది.

image


ఈ కొత్త ఈకో సిస్టమ్ లో ఇండియన్ మీడియా ముఖ్యంగా టీవీ జర్నలిజం కొత్త గ్రామర్ ను అద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నది. కొందరు సంప్రదాయ జర్నలిస్టు గురువులు చెప్తున్నట్టు.. గత కొన్నేళ్లుగా టీవీలో ఒక్కటి కూడా నిష్పాక్షికమైన వార్త రావడం లేదు. క్లాసికల్ న్యూస్ రిపోర్టింగ్ జవసత్వాలు ఉడిగిపోయింది. నేటి వార్తలకు ఒక దశా దిశా ఉండాలి. సంప్రదాయ జర్నలిజంలో అభిప్రాయాలు సంపాదకీయాలకే పరిమితమవుతున్నాయి. టీఆర్పీ వేటలో వాస్తవాలు కనుమరుగవుతున్నాయి. వేగమే కొత్త జర్నలిజం మంత్రం. వార్తలో ఒక జీవముండాలి. ప్రతి సందర్భం ఒక కొత్త వార్త కావాలి. కానీ ఇప్పుడేం జరుగుతోంది..? కాస్త ఇంట్రెస్టింగ్ న్యూస్ దొరికితే చాలు.. జనాలను ఆకర్షించడానికి పరిపరి విధాలుగా తిప్పి తిప్పి అదే ప్రసారం చేస్తున్నారు. దాంతో ఆ వార్త ఒరిజినాలిటీ కోల్పోతుంది.

మీడియా సెక్యులర్, మోడ్రన్, లిబరల్. అన్నింటికీ మించి ప్రజాపక్షం. ఈ విషయంలో అందరిదీ ఒకే మాట. మతతత్వాన్ని, మతమౌఢ్యాన్ని చీల్చి చెండాడింది. వాయిస్ లేని వారి గొంతుకగా మారింది. హింసాత్మక సిద్ధాంతాలను వ్యతిరేకించింది. ఈ పంథా లెఫ్టిజం నుంచి వచ్చింది. కానీ అదిప్పుడు మసకబారింది. దేశానికి ఇప్పుడు రైటిజం కావాలి. అది తప్పేం కాదు. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో రైటిజమే నడుస్తోంది. కాకపోతే ఇండియాకే అది పూర్తిగా కొత్త. నిజానికి లెఫ్టిజం మాదిరిగా రైటిజానికి ఒక నిర్మాణాత్మకమైన రూపం లేదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే రైటిజానికి దారి చూపుతోంది. అది లౌకికవాదాన్ని బహిరంగంగానే సవాలు చేస్తోంది. వాళ్లదిప్పుడు జాతీయవాదం. అది కాకుండా ఎలాంటి భిన్నాభిప్రాయం వచ్చినా దానికి దేశద్రోహ ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు అరిచేవాడిదే రాజ్యం. దేశం మీద ప్రేమను చాటుకునే ఆరాటంలో టీవీ స్టూడియోలు ప్రత్యక్ష యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి.

కానీ ఆ ధోరణి భవిష్యత్తు గురించి ప్రమాదకరమైన సంకేతాలిస్తున్నది. పక్షపాత వైఖరి బహుతావాదాన్ని ప్రోత్సహిస్తున్నది. మైనారిటీ అభిప్రాయాలను అణిచివేస్తోంది. భారత్ లాంటి దేశానికి అది మంచిది కాదు. అది భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ఇప్పుడు మీడియాకు ప్రభుత్వ నిర్ణయం పవిత్రమైపోయింది. అధికారంలో ఉన్న వాళ్లను ముట్టుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు తప్పు చేస్తే ప్రధాని మంత్రిని కూడా వదిలేవాళ్లు కాదు. ఆ రోజుల్లో మంత్రి మీద వార్త రాసినప్పటికీ.. జర్నలిస్టులు హాయిగా ఆఫీసుకొచ్చి పనిచేసుకునేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు ఎటు చూసినా భయమే కనిపిస్తోంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ఇది చేటు.

అలాగని జర్నలిజానికి ప్రమాదం ఉందని నేను చెప్పను. టీవీ స్టూడియోలు ఒక కొత్త సంక్షోభాన్ని సృష్టించాయని మాత్రం చెప్పగలను. అది మనస్సాక్షిని చంపుకునే సంక్షోభం. భావ ప్రకటనా స్వేచ్ఛ మూలాలనే దెబ్బతీస్తోంది. ఎడిటర్లు జర్నలిజం నైతిక విలువలను మరిచిపోయి వాళ్ల జేబుల గురించే ఆలోచిస్తే, బహిరంగంగానే అధికార కేంద్రాలకు సాగిలపడితే.. అది పెను సంక్షోభమే. అదృష్టం కొద్దీ వార్తా పత్రికలు ఇంకా శక్తివంతంగా పనిచేస్తున్నాయి. డిజిటల్ జర్నలిజం బలంగా తయారవుతోంది. మీడియా కూడా శక్తివంతమైనదే. కానీ రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతోంది. జర్నలిస్టులకు విశ్వసనీయతే ధనం. ఎలక్ట్రానిక్ మీడియాలో అది కొరవడుతోంది. కొన్ని ఛానళ్లు మాత్రమే నిజాల్ని నిర్భయంగా వినిపిస్తున్నాయి. వాటికే భవిష్యత్తు ఉంటుంది. సెలబ్రిటీ యాంకర్లు దీన్ని గమనించాలి. తప్పులు తెలుసుకోవాలి. “ ప్రజాస్వామ్యం నంబర్ గేమ్ కాదు. పార్లమెంట్ ఒక కోర్టు గది అంతకన్నా కాదు. ప్రజాస్వామ్యం ఒక ఒక నైతిక వ్యవస్థ. దేశానికి రాజ్యాంగం, చట్టం కూడా ముఖ్యమే. ప్రజాస్వామ్యం కేవలం ఒక ఆచారంలా మారిపోతే.. అది దేశానికే అరిష్టం. అలా జరగకుండా చూసే బాధ్యత మనందరిపైనా ఉంది’’ అన్న వాజ్ పేయి మాటలను ఒకసారి గుర్తుచేసుకోవాలి.