క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇక కాలం చెల్లినట్టే..!! ఎందుకంటే..?

Monday February 22, 2016,

4 min Read

ఒకప్పడు జేబులో పర్సు ఒబేసిటీ వచ్చిన వ్యక్తిమల్లే అంతలావు ఉండేది. టెక్నాలజీ పెరగడంతో క్రమంగా దాని ఒపాసిటీ తగ్గిపోయింది. లిక్విడ్ క్యాష్ జేబులో పెట్టుకుని తిరగాల్సిన రోజులు పోయాయి. ఊ..అంటే క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో గీకేస్తున్నారు. సినిమా టికెట్ల నుంచి ఈ సేవ దాకా అంతటా కార్డే- కార్డియాలజిస్టుగా పనిచేస్తోంది. అయితే ఇకపై అవికూడా మాయం కావొచ్చు . మీరు చదివింది నిజమే. ఎందుకో ఏమిటో మీరే తెలుసుకోండి. 

యూపీఐ వచ్చేసిందోచ్  

యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్. యూపీఐ. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే బ్లాటూత్ ద్వారా పక్కమొబైల్ కు సమాచారం పంపినంత తేలికగా, తొందరగా చెల్లింపులు జరిపే వ్యవస్థ. ఆధార్ లేదా, నెట్ లో వర్చువల్ అడ్రస్ ఇస్తే చాలు. బ్యాంక్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు నడపొచ్చు . ఇది మనీకి ఒక ఈమెయిల్ లాంటిదన్న మాట. డిజిటల్ వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుండానే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అవతలి వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక యునిక్ ఐడీ ఉంటేచాలు డబ్బు వెళ్లిపోతుంది. మొబైల్ ద్వారా డబ్బు పంపాలంటే, వేళ్లు నొప్పెట్టేలా కాలమ్స్ అన్నీ పూర్తిచేయాల్సిన పని లేదు.

undefined

undefined


1) మొబైల్ ఫోన్ ఆధారంగానే పేమెంట్స్ జరపవచ్చు. వ్యక్తులకు, కంపెనీలకు, చెల్లించవచ్చు. వారినుంచి డబ్బు స్వీకరించవచ్చు. జస్ట్ మొబైల్ నంబర్ లేదా… ఆధార్ నంబర్ ఇస్తే చాలు.

2) ఆధార్, మొబైల్, అకౌంట్ నంబర్లు లేకపోయినా ఫర్వాలేదు.. వర్చువల్ అడ్రస్ ఇచ్చినా లావాదేవీలు పూర్తవుతాయి.

3) వర్చువల్ అడ్రస్ ఆన్ లైన్ సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఎవరు హ్యాక్ చేసినా మన సమాచారం వారికి తెలియదు. ఎందుకంటే చెల్లింపు అడ్రస్ అకౌంట్@ప్రొవైడర్, యూజర్ ఐటీ@మైపీఎస్పీ ఇలా ఉంది. ఈ సమాచారం హ్యాకర్లుకు వెళ్లినా నష్టమేమీ లేదు. ఆధార్ నంబర్ మాత్రమే ఐడెంటిఫయిర్ గా ఇచ్చినా సరిపోతుంది. దేశంలో ఇప్పుడు 25 కోట్ల అకౌంట్లకు ఆధారే ఆధారం. ఏడాదికి 120 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయినేది ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నిలేకని మాట. 77 వేల మైక్రో ఏటీఎంలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి.

4) ఇందులో ఉన్న మరో సదుపాయం ఏమిటంటే… సరైన సమయానికే పేమెంట్ జరుగుతుంది. ఒక డేట్ ను ఫీడ్ చేసిపెడితే అదే రోజు లేదా అంతకన్నా కొంచెం ముందుగానే పేమెంట్ పూర్తవుతుంది.

5) ఒకేసమయంలో చాలా పేమెంట్స్ చేయవచ్చు. వేరు వేరు ఐడీలతో చెల్లింపులు జరిపే వీలుంది. ఒక్కసారి అథంటికేషన్ ఇస్తే చాలు. జీతాలిచ్చేటప్పుడు కంపెనీలకు ఇది చాలా ఉపయోగం.

6) బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్లేయర్స్ పని మరింత సులువు చేస్తుంది యూపీఐ. మొబైల్ అప్లికేషన్ లో యూపీఐ ఉపయోగిస్తే… బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మనమే ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ లో పాస్ వర్డ్స్, పిన్స్, బయోమెట్రిక్ లాంటి వర్చువల్ అడ్రస్ లతో… బ్యాంక్ అకౌంట్ ను ఖాతాదారులే నిర్వహించుకోవచ్చు. ఒక్కో బిల్లు పేమెంటుకు ఒక్కో అడ్రస్ సృష్టించుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు అక్షయపాత్రకు ప్రతి నెలా కొంతమొత్తం డొనేట్ చేయాలనుకంటే దానికో అడ్రస్ సృష్టించుకోవచ్చు.

7) యూపీఐ వల్ల వ్యవస్థ అనుసంధానం మరింతగా పెరుగుతుంది. ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకుకైనా… వ్యక్తులకైనా, వ్యాపార సంస్థలకైనా డబ్బును తేలికగా పంపించొచ్చు. మొబైల్ పిన్, ఆధార్, లేదా ఫోన్ నంబర్లలో ఏ ఒక్కటి ఉన్నా చాలు.

8) డబ్బు చెల్లింపులప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులు స్వైప్ చేసి.. మన సమాచారమంతా అవతలి వ్యక్తికి ఇవ్వాల్సిన పనిలేదు. పర్సనల్ ఫోన్ నంబర్… వర్చువల్ పాస్ వర్డ్ చాలు మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి. ఈమెయిల్ ఐడీని కూడా యూపీఐ నంబర్ గా పెట్టుకోవచ్చు.

దేశంలో యూపీఐ అమలు మొదలైతే… చెల్లింపులన్నీ సాఫీగా, తేలికగా సాగిపోతాయి. వాలెట్లలోకి డబ్బుల వేయడం, కంపెనీలకు కమీషన్లిచ్చి మళ్లీ వాడుకోవడం ఇలాంటి సమస్యలే ఉండవు. యూపీఐల వల్ల బ్యాంక్ కనెక్టివిటీ పెరుగుతుంది. డబ్బును వినియోగించడంలో మరింత స్వేచ్ఛ వచ్చినట్లే. భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. అంటే దాదాపు ప్రతివ్యక్తి ఒక బ్యాంకర్ అయిపోవచ్చన్నమాట. ప్రతి పేమెంట్ ఎన్పీసీఐ దృష్టికి వెళ్తుంది.

మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్ , డెబిట్ కార్డులు హుష్ కాకి

ఒక్కసారిగనుక యూపీఐ అమల్లోకి వస్తే... మొబైల్ వాలెట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు. “ లావాదేవీలు జరిగినప్పుడు కమీషన్లు తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో యూపీఐ బెస్ట్ ఆప్షన్. మీకు అకౌండ్ ఉన్న బ్యాంకుతో మీ యూపీఐని రిజిస్టర్ చేస్తే చాలు. ఈ కేవైసీ విధానాన్ని ఆర్బీఐ అనుమతిస్తే ఆన్ లైన్లోనే బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. వెంటనే యూపీఐని అనుసంధానిచ్చవచ్చు అంటారు ఆధార్ ఛైర్మన్ నందన్ నీలేకని. 

యువర్ స్టోరీ మాట

ఈ కామర్స్ విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఇది మరింత ఉపయోగకరం. క్యాష్ ఆన్ డెలివరీ మరింత తేలిక కానుంది. బ్యాంక్ అకౌంట్ వివరాలను కస్టమర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి కార్డులు అవసరం లేదు. ఇది వ్యాపారులకు – కస్టమర్లకు ఇద్దరికీ మేలు చేసేదే . వివిధ బిల్లులను… వివిధ ఐడీలతో చెల్లించవచ్చు. పేటీఎం, పేయూ,ఆక్సిన్ వాలెట్ లాంటి స్టార్టప్ లకు మాత్రం యూపీఐ సమస్యలను తెచ్చిపెడుతుంది. యూపీఐ విజయవంతమైతే… ఆ స్టార్టప్ లు క్రమంగా మూతపడే అవకాశముంది. మొబైల్ వాలెట్ నుంచి మొబైల్ వాలెట్ కు చెల్లింపులు ఆగిపోతాయి. ఉదాహరణకు మొబీ విక్ నుంచి పీటీఎంకు మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి కొత్త నిబంధనలు అంగీకరించకపోవచ్చు. వోడా ఫోన్ ఎం-పైసా నుంచి ఎయిర్ టెల్ మనీకి లావాదేవీలు కుదరవు. యూపీఐతో లింక్ పెట్టుకునే బ్యాంకులతో టైఅప్ అవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకొంటుంది.

 “ఇప్పుడున్న స్టార్టప్ లన్నీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పీఎస్పీ బ్యాంక్స్ తో అనుసంధానమై… యూపీఐ ఉనికిని గుర్తించాలి. క్యాష్ లెస్ పేమెంట్స్ పెరగాలి. ఇది అలాంటి వాటికి ప్రారంభంకావాలి.”- శరద్ శర్మ, ఐ స్పిరిట్ వ్యవస్థాపకుడు 

మరికొన్ని నెలల్లో… బహుశా ఈ ఏప్రిల్ లో యూపీఐలకు ఆర్బీఐ ఆమోదం తెలపనుంది. అయితే మొబైల్ వ్యాలెట్లు మాత్రం అలాగే ఉండేలా చర్యలు తీసుకోవాలని… చిన్న వ్యాపారులు కోరుతున్నారు. ఏది ఏమైనా యూపీఐలు వచ్చాక … వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులే వస్తాయి. టెక్నాలజీని దానికి తగ్గట్లు అప్ డేట్ చేసుకోవాలి. ఎందుకంటే డిజిటల్ మనీవైపు దేశం అడుగులేస్తోంది. ఇకపై అంతా ఆన్ లైనే. నో ఆఫ్ లైన్.