మోదీ జీ... వినండి ఓ కామన్ మేన్ రిక్వెస్ట్

ఉబర్ క్యాబ్ ఘటనల్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి?శిక్షలు పడుతున్నా సమాజంలో మార్పు రావడం లేదెందుకు?మహిళాసాధికారత అంటే ఏమిటి?పురుషుల్లో చైతన్యం కావాలి!ప్రధాని మోదీకి ఓ కామన్ మేన్ సూచనలు- శ్రద్ధా శర్మ

మోదీ జీ... వినండి ఓ కామన్ మేన్ రిక్వెస్ట్

Monday June 15, 2015,

3 min Read

“నిజం ప్యాంటు తొడుక్కునే లోగా అబద్ధం లోకమంతా ఓ రౌండు కొట్టి వస్తుంది”... ఓ పాత సామెత.
image


నేను విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు బే ఏరియాలో ఓ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ నన్ను అడిగాడు... 'మేడమ్ మీ దేశంలో అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణించడం నిజంగా ప్రమాదమా ?' అని... అప్పుడు నాకు ఏం సమాధానం చెప్పాలో ఒక్క క్షణంపాటు అర్థం కాలేదు. “కాదు... అలాంటిదేమీ లేదు, ఇలాంటి ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఏదోమూల నిత్యం జరుగుతూనే ఉంటాయి. భారత్ ఒక్క దేశాన్నే ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు ?” అందామా ! లేక, “అవును, భారత్ లో మహిళలకు అంత క్షేమం కాదు. విదేశాల్లో ఉన్నంత భద్రత మా దేశంలో మహిళలకు ఉండదని నా అభిప్రాయం” అని చెప్పాలా! పెద్ద సందేహం.

మోదీ జీ! దేశ రాజధాని నగరం ఢిల్లీలో గత డిసెంబరులో ఉబర్ క్యాబ్‌లో మహిళపై అత్యాచారం ఉదంతంతో మీ వద్దకు ఎన్నో విన్నపాలు చేరి ఉంటాయి. అలాంటిదే నేనూ ఒకటి మీ దృష్టికి తెస్తున్నాను.

ఈ దేశంలోని కోట్లాది ప్రజల్లాగే నేను కూడా ఎంతో సంతోషించాను... బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే... ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, మోదీ ప్రధాని కాబోతున్నారని. మార్పునకు మీరు ప్రతీక. ఎన్నో అంశాల్లో మార్పు రావాలి. ముఖ్యంగా మహిళల స్థితిగతులు, భద్రత ఎంతో క్షీణించాయి. అందరిలాగే నేను కూడా “అచ్చే దిన్ ఆయేంగే” (మంచి రోజులు వస్తున్నాయి) అని నమ్మాను. ఎందుకంటే “మహిళలు, యువత, రైతులు” – వీళ్లే ప్రథమ ప్రాధాన్య అంశాలని మీరు ఎన్నోసార్లు చెప్పారు.

ఎన్నో, ఎన్నెన్నో సంవత్సరాలుగా ఈ దేశ మహిళలు మంచి రోజులకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మన పురాణాల్లో చెప్పారు... “యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” (మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు). కానీ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత మన సమాజంలో ఈ పరిస్థితే లేదు.

నా అభిప్రాయాన్ని ఇంకొంచెం స్పష్టంగా వివరిస్తాను. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలపై ప్రతిపక్షాల మాదిరి నేను మిమ్మల్ని విమర్శించడం లేదు. అది నా ఉద్దేశం కానే కాదు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. మన నిత్యజీవితంలో ఇవన్నీ భాగమైపోయాయి.

మీడియా కూడా కొద్దిరోజులు ఈ అంశంపై హడావుడి చేస్తుంది. తర్వాత అందరూ దీన్ని మర్చిపోతారు. ఎంత పెద్ద ఘటన విషయంలోనైనా ఇలాగే జరుగుతోంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే, నేను మీ నుంచి ఆశించేదేంటో తెలుసా! అందరిలాగే ఓ నిట్టూర్పు విడిచి, ఓ ఘాటు వ్యాఖ్య చేసి, తర్వాత దీన్ని మర్చిపోవడం కాదు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, స్పష్టమైన నిర్ణయాలు, ఆలోచనలతో దృఢమైన కార్యాచరణ ప్రకటించాలి.

మహిళా సాధికారత గురించి మీరు చర్చించే ముందు నేను మీకు కొన్ని సూచనలు చేయదలచుకున్నాను. దయచేసి పరిశీలించండి.

అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి ? ఎవరో ఎంపిక చేసిన కొందరు మహిళలకు అవార్డులివ్వడం, సన్మానాలు, సత్కారాలు చేయడం కాదు. కొన్ని ఉన్నత పదవుల్లో మహిళలను కూర్చోబెట్టడం కానే కాదు. ఈ దేశంలోని పురుషులు మహిళల విషయంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో చైతన్యపరిచినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఇది అంత సులభమేం కాదు. దీనికి ప్రణాళికాబద్ధమైన నిరంతర కృషి అవసరం. గత ప్రభుత్వాలు కూడా తప్పుచేసిన పురుషులకు గట్టి శిక్షలు, నిషేధాలు అంటూ ఎన్నో మాటలు చెప్పాయి. కానీ మేం మీ నుంచి ఆ మాటలు కోరుకోవడం లేదు. పైపై చర్యలు, తాత్కాలిక ఉపశమనాలు కాదు, సమస్యకి మూలాల్ని అరికట్టడానికి శాశ్వత చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై దృష్టిపెట్టాలి.

సమాజంలో ఉన్న మలినాల్ని శుద్ధి చేసే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే జాగరుక్ సమాజ్ (సమాజాన్ని చైతన్యం), జాగరుక్ నవ్ జవాన్ (యువచైతన్యం) వంటి పథకాల్ని కూడా ఎందుకు ప్రారంభించకూడదు ? దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేయాలి. మీడియాలో దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలి. మీడియాకు కూడా మీపై అభిమానం ఎక్కువ. మీ ప్రతి కదలికనీ అందరూ ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. అందువల్ల వారిని సరైన రీతిలో ఉపయోగించుకుని ఈ కార్యక్రమాల లక్ష్యాల్ని సులభంగా చేరుకోవచ్చు.

మహిళలను సన్మానించడమే కాదు... పురుషులకు కూడా అవార్డులివ్వండి. ఉదాహరణకి “పురుషోత్తమ్” (ఉత్తమ పురుషుడు) అని ఓ అవార్డుని ప్రకటించండి. ఇది ఎంత సూక్ష్మస్థాయిలో ఉంటే అంత మంచిది. మీకున్న అధికారాలకి, ప్రజాదరణకు ఆ స్థాయిలోని ఉత్తములను గుర్తించడం మీకు ఏమంత కష్టమైన పనేమీ కాదు. ఇలాంటి అవార్డులు మగవారికి కూడా స్ఫూర్తినిస్తాయి. మహిళలను గౌరవించాలనే స్పృహని పెంపొందిస్తాయి.

ఓ సాధారణ పౌరుడిగా ఇవి నా ఆలోచనలు. మీరు దృష్టిపెడితే ఇలాంటి పథకాలు ప్రారంభించి వాటిని సరైన రీతిలో బ్రాండింగ్ చేయగలరు.

నిషేధాలు, శిక్షలు భయాన్ని పెంచుతాయే గానీ చైతన్యాన్ని, గౌరవాన్ని కాదు.

అందుకే మనం కోరుకున్న మార్పు సమాజంలో ఎప్పటికీ కలగానే మిగిలిపోతోంది.

- శ్రధ్దా శర్మ, చీఫ్ ఎడిటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ యువర్ స్టోరీ