ఈ స్టోరీ చ‌దివితే.. ఈ చిన్నారికి వ‌చ్చిన ఆలోచ‌న మ‌న‌కెందుకు రాలేదా అనిపిస్తుంది!

ఈ స్టోరీ చ‌దివితే.. ఈ చిన్నారికి వ‌చ్చిన ఆలోచ‌న మ‌న‌కెందుకు రాలేదా అనిపిస్తుంది!

Friday December 25, 2015,

2 min Read

బాత్రూంలో నీళ్లు బడబడమంటూ పారబోస్తూ స్నానం చేయడమే మనకు తెలుసు. ఈవెన్ షేవింగ్ కూడా హాఫ్ బ‌కెట్ నీళ్లు ఖ‌తం చేస్తాం మ‌న‌కు తెలియ‌కుండా! బ్ర‌షింగ్ కోసం కూడా త‌క్కువేం వాడం. ఇక కిచెన్‌లో అయితే అడ్డూ అదుపూ ఉండ‌దు. అంట్లు తోమ‌డం నుంచి బ‌ట్ట‌లు ఉతికే వ‌ర‌కు. ఇలా అవ‌స‌రానికి మించి నీళ్ల‌ను ఎంత‌గా వృధా చేస్తున్నామో మ‌న‌కే తెలియ‌దు. ఆదా చేయాలనే కోణంలో ఏనాడూ ఆలోచించం కూడా. కానీ ఈ స్టోరీ చ‌దివితే ఆ చిన్నారికి వ‌చ్చిన ఆలోచ‌న మ‌న‌కెందుకు రాలేదా అనిపిస్తుంది!

image


పర్యావరణంలో నీరు అతి పెద్ద సమస్య . నీటి క‌ట‌క‌ట త‌లుచుకుంటే భ‌విష్య‌త్ భ‌యం గొలుపుతుంది. గుక్కెడు నీరులేక అల్లాడే ప్రాంతాల‌ను, జ‌నాల‌ను నిత్యం చూస్తునే ఉన్నాం. వాళ్ల బాధ‌ల గురించి వింటునే ఉన్నాం. అంత‌కు మించి మ‌న‌వంతు సాయం మాత్రం చేయ‌లేక‌పోతున్నాం. కానీ 12 ఏళ్ల సృష్టి నేర్క‌ర్ మాత్రం ఆ విష‌యంలో కాస్త లోతుగానే ఆలోచించింది. ఆలోచ‌నే కాదు. ఆచ‌ర‌ణ‌లోనూ స‌క్సెస్ అయింది.

ఇంత‌కూ ఏం చేసింది?

అక్క‌డికే వ‌స్తున్నాం. నాసిక్ కు చెందిన సృష్టి నేర్కర్ ఆరో తరగతి చదువుతోంది. ఒకరోజు సృష్టి వాళ్ళ నాన్న కారు వాష్ కి ఇవ్వ‌డానికి సర్వీసింగ్ సెంటర్ కు వెళ్తున్నాడు. నేనూ వ‌స్తాను డాడీ అంది. అత‌ను స‌రే అన్నాడు. ఇద్ద‌రూ స‌ర్వీసింగ్ సెంట‌ర్‌కు వెళ్లారు. అక్క‌డ చాలా కార్లు ఉన్నాయి. అందులో కొన్ని కార్లు వాష్ అవుతున్నాయి. పెద్ద‌పెద్ద స్ప్రేయ‌ర్లతో నీళ్లు ఎగ‌సిప‌డుతున్నాయి. అది చూసిన సృష్టికి ఒక డౌటొచ్చింది. ఒక‌ కారు క‌డ‌గ‌డానికి ఎన్ని నీళ్లు స‌రిపోతాయ‌ని స‌ర్వీసింగ్ సెంట‌ర్ వాళ్ల‌ను అడిగింది. దానికి వాళ్లు రెండు లీట‌ర్లు చాలు అన్నారు. అంత‌పెద్ద కారు నాలుగు వైపులా క్లీన్ చేయ‌డానికి రెండు లీట‌ర్ల నీరెలా స‌రిపోతుంద‌ని ఆశ్చ‌ర్య‌పోయింది. దానికి వాళ్లు- మేం స్ప్రింక్లర్లు వాడుతాం.. అందువ‌ల్ల కాసిని నీళ్ల‌యినా స‌రిపోతాయి అన్నారు.

బుర్ర‌లో ఐడియా త‌ట్టింది

రెండు లీట‌ర్ల నీళ్ల‌తో కారు వాష్ చేయ‌గ‌లిగిన‌ప్పుడు- మ‌నం రోజూ స్నానానికి వాడే నీళ్ల‌ను అంత‌కంటే త‌గ్గించ‌లేమా? ఈ లాజిక్ ద‌గ్గ‌ర సృష్టి ఆలోచ‌న‌లు గింగిరాలు కొట్టాయి. సాధార‌ణంగా ఒక మనిషి షవర్ తో స్నానం చేస్తే దాదాపు 80 లీటర్ల నీళ్లు ఖ‌ర్చ‌వుతాయి. ఈ వృధాను అరిక‌ట్టాలంటే- కార్ వాష్ చేయ‌డానికి వాడే నాజిల్స్ కంటే ఇంకా సన్నటి నాజిల్స్ వాడి ష‌వ‌ర్ త‌యారు చేస్తే స‌రి! ఆటోమేటిగ్గా నీళ్లు ఆదా అవుతాయి! ఇదే సింపుల్ టెక్నిక్ అప్ల‌య్ చేయాల‌నుకుంది.

ఐదోసారికి విజ‌య‌వంతం

ఒక్క‌సారికే స‌క్సెస్ అవ‌లేదు. నాలుగుసార్లు అటెంప్ట్ చేసింది. ఐదోసారి విజ‌య‌వంత‌మైంది. ఆమె చేసిన ప్ర‌యోగం వ‌ల్ల- ఒక‌సారి స్నానం చేస్తే ఏకంగా 65 లీట‌ర్ల నీరు ఆదా అవుతుంది. కేవలం 15 లీటర్ల నీరే ఖర్చవుతాయి. సృష్టి కనుగొన్న ఈ పరికరం పేటెంట్ హ‌క్కులు ఆమెకే చెందాల‌ని తండ్రి న‌రేంద్ర నేర్క‌ర్ భావిస్తున్నారు. పర్యావరణ ప్రేమికురాలిగా, చిన్నారి ఇన్వెంటర్ గా పేరు తెచ్చుకున్న సృష్టికి పెయింటింగ్ అంటే ఇష్టం. బాస్కెట్ బాల్ ఆడుతుంది. చిన్నిచిన్న‌ మేజిక్ లు కూడా చేస్తుంది.

అన్నయ్య తయారు చేశాడు స్మార్ట్ హెల్మెట్

అన్న‌ట్టు వాళ్ల ఇంట్లో సృష్టి ఒక్క‌రే క్రియేటివ్ కాదు. ఆమె అన్న‌య్య కూడా అలాంటి బాప‌తే. 12 స్టాండ‌ర్డ్ చ‌దువుతున్న అమీ- ఒక స్మార్ట్ హెల్మెట్ క‌నుక్కొన్నాడు. దాని స్పెషాలిటీ ఏంటంటే- ఆ హెల్మెట్ పెట్టుకుంటేగానీ స్కూట‌ర్ స్టార్ట్ అవ‌దు. హెల్మెట్ ఆవ‌శ్య‌కత అంద‌రికీ తెలియాలంటే ఏదో ఒక‌టి చేయాల‌నే ఐడియా నుంచి పుట్టిందీ స్మార్ట్ హెల్మెట్ ఇన్వెన్ష‌న్‌. ఈ ఐడియా ఏదో బావుంది క‌దా! అత‌ను కూడా దాని పేటెంట్ హ‌క్కుల కోసం అప్ల‌య్ చేశాడు. కడుపున పుట్టిన బిడ్డల ప్రతిభ చూసి తండ్రి నరేంద్ర తెగ మురిసిపోతున్నాడు.