ఏప్రిల్ ఒకటి నుంచి జియో టారిఫ్

ఏప్రిల్ ఒకటి నుంచి జియో టారిఫ్

Tuesday February 21, 2017,

2 min Read

దేశవ్యాప్తంగా 4జీ సేవలతో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో ఇక ఉచిత సేవలకు టాటా చెప్పేసింది. న్యూ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ప్రోగ్రాం లాంచ్‌ తోపాటు కొత్త టారిఫ్‌ ప్లాన్లను రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరంనుంచి కొత్త ప్లాన్లను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఏడాది పాటు డేటా, వాయిస్‌ కాల్స్‌ ను ఫ్రీగా అందించిన జియో నెట్‌వర్క్‌ ఏప్రిల్‌ 1 నుంచి టారిఫ్‌ వసూలు చేస్తుందని ముకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఉచిత సేవల పొడిగింపు ఊహాగానాలకు తెరపడింది. ఇతర నెట్‌ వర్కులు ఆఫర్‌ చేస్తున్న ధరల్లోనే డేటా ప్లాన్స్ ఇస్తామని ముఖేష్ తెలిపారు. కాకపోతే 20 శాతం డేటా అదనంగా అందిస్తామన్నారు.

image


2017 చివరికల్లా దేశమంతా జియో నెట్‌వర్క్‌ విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అంబానీ అన్నారు. అందులో 99 శాతం దేశీ జనాభాను కవర్‌ చేయాలని జియో భావిస్తోంది. గత నెలలో జియో సబ్‌స్క్రైబర్లు 100 కోట్ల జీబీని మించి వాడుకున్నారనీ.. హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ముగిసిన తరువాత కూడా ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ రిజిస్టర్‌ ద్వారా అన్ని నెట్‌వర్కులకూ ఫ్రీ కాలింగ్‌ సదుపాయం ఉంటుందన్నారు. ఈ వాయిస్‌ కాల్స్‌ కు రోమింగ్‌తో సహా ఎలాంటి హిడెన్ చార్జీలు విధించమని అంబానీ తెలిపారు. టారిఫ్‌ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ కనెక్టివిటీతో పాటు కస్టమర్లకు మంచి అనుభూతిని అందించాలన్ని తమ లక్ష్యమని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. డేటా అనేది డిజిటల్ జీవితానికి ఆక్సిజన్ వంటిదనీ.. దాన్ని అత్యంత సరమైన ధరకే డేటా సేవలు ప్రొవైడ్ చేస్తామన్నారు. ఇవాళ ఎంత బెస్ట్ అనిపించుకుంటున్నామో రేపు కూడా అంతే ఇంప్రెషన్ వచ్చేలా శ్రమిస్తామన్నారు. రానున్న కొద్ది నెలల్లో తమ డేటా కెపాసిటీని రెట్టించి మరింత క్వాలిటీ సర్వీస్ అందిస్తామని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.

జియో ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లు సబ్ స్క్రైబ్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు. గత 100 రోజుల్లో సెకనుకు ఏడుగురు కస్టమర్ల చొప్పున జియోలో చేరారని... టెలికాం రంగంలోనే ఇదో విప్లవమని అభివర్ణించారు. జియోను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మొదటగా చేరిన 10 కోట్ల మంది జియో వినియోగదారులే తమ బ్రాండ్‌ ప్రచారకర్తలని ముఖేష్ అన్నారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ దూసుకుపోతోందని.. డేటా వినియోగంలో భారతీయులే ముందున్నారని ఉన్నారని ముఖేష్ అన్నారు.