వైద్యరంగ అవినీతిపై సామాన్యుడి అస్త్రం ' ఔషోధ్యాత్మిక '

వైద్యరంగ అవినీతిపై సామాన్యుడి అస్త్రం ' ఔషోధ్యాత్మిక '

Wednesday September 02, 2015,

4 min Read

ఏదైనా చిన్న సుస్తీ చేసినా..లేదంటే పెద్ద సర్జరీ జరిగినా ముందు భయపడేది దానికి అయ్యే ఖర్చు గురించే. అందులోనూ డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్స్ చూస్తే అందులో ఏది అవసరమో..ఏది అనవసరమో మనకు అస్సలు తెలియని సందర్భాలు చాలా ఉంటాయ్. నిజంగా మనకు అవసరం లేని మందులు రాసినా.. ఏం అనలేని పరిస్థితి. తలనొప్పికి కూడా స్కానింగ్‌లు రాసే రోజులివి. అదేమంటే.. అసలు జబ్బేంటో తెలియాలంటే ఇవన్నీ తప్పనిసరి అని దబాయింపులూ మామూలే. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఏ మెడిసిన్ దేనికి వాడాలి... వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి..? అని తెలిస్తే బావుండనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి పనే చేశాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కృష్ణకాంత్ అనే ఓ యువకుడు.

అవినీతిని భరించలేకపోయా !

"మాది వారణాసికి దగ్గర్లోని ఓ చిన్నగ్రామం. మా కుటుంబం అంతా కూడా సామాజిక సేవలోనే ఉంది. జాతికి సేవ చేయడంకన్నా గొప్పది ఇంకోటి లేదంటాను నేను. సమాజంలోని అవినీతిని పారదోలడం నా బాధ్యతగా భావించా. పోలీస్, వైద్య, న్యాయ వ్యవస్థ ఈ మూడు రంగాలు అవినీతిమయమైన రంగాల్లో మొదటి స్థానాలు ఆక్రమించాయ్ '' ఇదీ కృష్ణకాంత్ తివారీ అనే ఓ సామాన్యు యువకుడి ఆవేదన. 

వీటన్నింటికీ చెక్ చెప్పి తనవంతు సాయం చేసేందుకు ఔషోధ్యాత్మిక పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ తయారు చేశాడు. ఇది ఔషధాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. వైద్యరంగంలో అవినీతిబారిన పడకుండా... కొద్దిగానైనా మనకు అవగాహన పెంచేందుకు ఇది తోడ్పడుతుంది.

కృష్ణకాంత్ తివారీ

కృష్ణకాంత్ తివారీ


కృష్ణకాంత్ తండ్రి సైన్యంలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం వారి కుటుంబం నుంచే మరో ముగ్గురు సైన్యంలో పని చేస్తున్నారు. నిజాయితీ అనేది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయిందంటే అతిశయోక్తి కాదు. " నేను చాలా నిజాయితీ పరుడ్ని. ఇదే చాలాసార్లు కష్టాలు తెచ్చిపెట్టింది. అయితే ఆ ఇబ్బందులన్నీ నన్నుమరింత ధృడంగా చేశాయి. నా విజన్..నా లక్ష్యం భారతదేశంలో ప్రతీ ఒక్కరికీ సరైన జ్ఞానం, సమాచారం అందించడమే. దీని వల్ల ప్రశ్నించే తత్వం పెరిగి వ్యవస్థలో జవాబుదారీతనం వస్తుంది. అదే జరిగిన రోజు దేశం గొప్పగా మారుతుంది.." అని గర్వంగా చెప్తాడు కృష్ణకాంత్. 

బెంగళూరు మైండ్ ట్రీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న కృష్ణకాంత్ విద్యా నేపధ్యం విషయానికి వస్తే.. ఎలక్ర్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. తనకున్న ఖాళీ సమయంలో ఈ మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేశారు.

ఎలా పనికొస్తుంది ?

అనేక రకాల మందులు, టాబ్లెట్లు, సర్జరీలు... ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తన యాప్ కోసం సేకరించారు కృష్ణకాంత్. " కొన్ని మెడికల్ పోర్టల్స్ కూడా నేను సేకరించిన సమాచారాన్ని రివ్యూ చేసాయి. నేను యాప్‌లో పొందుపరిచిన సమాచారాన్ని నూటికి నూరు శాతం నమ్మొచ్చు. దానికి నా గ్యారంటీ " అని నమ్మకంగా చెప్తారు . 

ఔషోధ్యాత్మిక ఓ మెడిసిన్ తాలుకు బేసిక్ వివరాలను తెలియజేస్తుంది. ఆ మెడిసిన్ పేరు, అందులో ఉండే పదార్ధాలు, ఎందుకు వాడతారు, ఎన్ని గ్రాముల ఉంటుంది, దాని ధర, తయారీ ఖర్చు... వంటి వివరాలన్నీ యాప్‌లో తెలుసుకోవచ్చు. రోగ, రోగి లక్షణాలు, ఏ లక్షణాలుంటే ఏం వాడొచ్చు, దాని మీదున్న వివాదాలు.. ఆ మందు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ , ఎలాంటి వారు వాడకూడదనే హెచ్చరికలు, ఆ ఔషధానికి ప్రత్యామ్నాయంగా ఉన్న మందులు.. వంటి వివరాలన్నీ ఈ యాప్‌లో లభ్యమవుతాయి. అందులో సెర్చ్ రిజల్ట్స్ వాటి ధర ఆధారంగా ..ఆరోహణ పద్దతిలో కన్పిస్తాయి. ఈ యాప్ వాడటం కోసం యూజర్ ఎలాంటి డీటైల్స్ ఇవ్వక్కర్లేదు. కేవలం ఇంటర్నెట్ ఉండాలి. అది కూడా సెర్చ్ ఆప్షన్ కోసమే.


" లక్షకి పైగా మెడిసిన్స్ గురించిన సమాచారం యాప్‌లో దొరుకుతుంది. అలానే కొత్త మెడిసిన్ కానీ..ఇన్ఫర్మేషన్ కానీ రాగానే అది కూడా ఆటోమేటిగ్గా అప్ డేట్ అవుతుంది '' - కృష్ణకాంత్.


మొబైల్ యాప్ తో కృష్ణకాంత్ తివారీ

మొబైల్ యాప్ తో కృష్ణకాంత్ తివారీ


అసలెందుకీ పోరాటం?

ఔషోధ్యాత్మిక తయారు చేయాలని ఎందుకు అన్పించిందనే ప్రశ్నకు..సమాధానంగా.. " 2014 జూన్ నెల లో ఎన్డీటీవీ లో చర్చా కార్యక్రమం చూస్తున్నాను. అది డాక్టర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీల మధ్య నడుస్తున్న ఓ అనైతిక, నీతిమాలిన సంబంధం. వారెలా పేషెంట్లను దోచుకుంటున్న వైనాన్నీ టీవీ జర్నలిస్టులు బైటపెట్టారు. ఈ ఫార్మా కంపెనీలు డాక్టర్లకు ఎలా లంచాలిస్తారు, వారెలా పేషెంట్లకు ఈ కంపెనీల మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు, సర్జరీలకు వారి పరికరాల వాడకం... ఇవన్నీ చూసిన నాకు మతిపోయింది. పేషెంట్లంతా డాక్టర్లను దేవుళ్లని నమ్మి వస్తారు..కానీ వారి నమ్మకంపై డాక్టర్లు కొడుతున్న దెబ్బ నన్ను బాగా కదిలించింది. అందుకే ప్రజల్లో ఈ మెడిసిన్స్ గురించిన అవగాహన కల్పించాలని అన్పించింది. దాంతోనైనా మార్కెట్లో వారు వాడే మెడిసిన్లలో మంచిదేది అనే కంక్లూజన్ కి వస్తారనిపించింది.. "


ప్రస్తుతానికి వన్ మేన్ ఆర్మీలా పోరాడుతున్న కృష్ణకాంత్ ఔషోధ్యాత్మిక వెర్షన్ 1 ను ఈ ఏడాది ఏప్రిల్ 30న లాంచ్ చేశారు. ఆ తర్వాత యూజర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుని దాన్ని అభివృద్ధి చేసి వెర్షన్ 1.1 ను జూన్ 10న అప్‌లోడ్ చేశారు. " ఔషోధ్యాత్మిక పూర్తిగా సోషల్ సర్వీస్ కోసం తయారు చేసిన యాప్ . దీంట్లో ఎటువంటి వ్యాపార ఉద్దేశాలూ లేవు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎవరితోనూ ఎలాంటి వ్యాపార భాగస్వామిక ఒప్పందాలు లేవు. యాప్ ద్వారా నాకెలాంటి ఆదాయం రాదు. యాప్ ద్వారా మందుల అమ్మకాలు, డిస్కౌంట్ కూపన్లు వంటివి కూడా ఉండవు. వాటి కోసం ఇక్కడ చూడాల్సిన పనిలేదు.." అని తేల్చి చెప్పాడు కృష్ణకాంత్.

కృష్ణకాంత్ తయారు చేసిన యాప్‌కి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. యూజర్లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తో కృష్ణకాంత్ ఔషోధ్యాత్మికకు మరిన్నిమెరుగులు దిద్దుతున్నారు. టెక్నాలజీ అనేది ఇవాళ ప్రతీ రంగంలోనూ వాడుతున్నారు. వాటిలో హెల్త్ కేర్ కూడా ఒకటి. ఈ రంగంలో ప్రాక్టో పోర్టల్ (practo) డిజిటల్ హెల్త్ కేర్ రంగంలో బిగ్గెస్ట్ సక్సెస్‌గా చెప్పుకోవచ్చు. అలానే సర్జెరికా(surgerica) క్రెడీ హెల్త్ (credihealth) కూడా బాగానే నడుస్తున్నాయ్. స్టార్టప్‌ల విషయానికి వస్తే హెల్త్ కేర్ రంగానికి 2014 కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పుకోవాలి.

వాటితో పోల్చుకుంటే కృష్ణకాంత్ యాప్ చాలా చిన్నదే అయినా చాలా ప్రాముఖ్యం ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాగా గుర్తింపు దక్కుతుంది.. " నా లక్ష్యం ప్రతీ సామాన్య పౌరుడికీ సమాజంలోని సమస్యలపట్ల అవగాహన ఉండాలి. ఎక్కడేం జరుగుతుందో తెలుసుకునే సమాచారం ఉండాలి. దాంతోనే అవినీతికి వ్యతిరేకంగా పోరాడగలరు. తద్వారా ఇండియా సూపర్ పవర్ నేషన్‌గా రూపుదిద్దుకోవాలి.." అంటూ తన లక్ష్యాన్ని వివరిస్తూ చెప్పాడు కృష్ణకాంత్.


కృష్ణకాంత్ లక్ష్యం సమున్నతంగా ఉంది కదూ...ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మీ ఫ్యీడ్ బ్యాక్ పంపండి. ఈ యాప్ పై మీ ఆలోచనలను కామెంట్ల రూపంలో షేర్ చేయండి.

http://www.ausodhyatmika.com/