నేషనల్ మెడల్ బాక్సర్.... ఓ ట్రాలీ డ్రైవర్‌గా ఎందుకు మారాడు ?

నేషనల్ మెడల్ బాక్సర్.... ఓ ట్రాలీ డ్రైవర్‌గా ఎందుకు మారాడు ?

Tuesday June 23, 2015,

6 min Read

మృణాల్ బోస్... జీవితంలో 2015 జనవరిని మర్చిపోలేడు. ఒక పక్క తిరగబెడుతున్న గాయాలు, ప్రమాదం కారణంగా ఆటకు దూరం కావడం, అంతంత మాత్రం శిక్షణ, ఆర్థిక ఒత్తిళ్లు... ఇలా కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. అయితే, వీటన్నిటి మధ్యలోనే అతను జాతీయస్థాయిలో మెడల్ గెలిచాడు. నాగపూర్‌లో జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో మృణాల్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.

క్రికెట్‌ని తప్ప మరే క్రీడనూ పట్టించుకోని ఇండియాలో సగటు క్రీడాకారుడి పరిస్థితికి మృణాల్ అద్దంపడుతున్నాడు. కాంస్య పతకం గెలిచాక మృణాల్‌కు కూడా ప్రభుత్వ ఉద్యోగం రావాలి. ఇస్తామనే హామీ కూడా వచ్చింది. కాకపోతే అదింకా ఆచరణ లోకి రాలేదు. బాక్సింగ్‌లో రాణించడం అంటే, మామూలు విషయం కాదు. బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ.. అలాగే, బాగా దెబ్బలు తగిలే ఆట కూడా. ఇప్పుడు కూడా మృణాల్ భుజానికి ఆపరేషన్ చేయించాలి. అయితే, మూడు పూట్లా తిండికే కష్టంగా వుంటే, ఇక ఆపరేషన్లు ఏం చేయించుకుంటాడు.. ?

మృణాల్ తండ్రి ఆర్మీ వర్క్ షాపులో కార్మికుడు. తల్లి ఇల్లు చూసుకుంటుంది. ఇద్దరు అక్కలకి పెళ్ళయింది. ఒక చెల్లి ఈ మధ్యే పోలీసు ఉద్యోగం సంపాదించి, ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణ పొందుతోంది. ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఇంకా ఒలంపిక్ మెడల్ సాధించాలనే కలగంటున్నాడు.. మృణాల్.

'' చిన్నప్పుడు స్కూల్ తర్వాత చాలా టైమ్ వుండేది. బలాదూర్‌గా తిరిగే వాడిని. నన్నలా ఓ ఆవారాలా వదేలయడం కంటే, ఏ ఆటలో, డాన్సో నేర్పిస్తే బావుంటుందనుకున్నారు మా ఇంట్లో. నాకు ఆటలంటే ఇష్టం కనుక క్రికెట్ నేర్చుకుందామనుకున్నాను. అయితే, క్రికెట్ అంటే, బ్యాట్, బాల్, ప్యాడ్స్ లాంటివి కొనాలి. అదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని మా ఇంట్లో క్రికెట్ జోలికి పోలేదు''.
వేరే గత్యంతరం లేక పొట్టనింపుకోవడానికి ఇలా  గూడ్స్ క్యారియర్ వృత్తిలోకి దిగిన మృణాల్

వేరే గత్యంతరం లేక పొట్టనింపుకోవడానికి ఇలా గూడ్స్ క్యారియర్ వృత్తిలోకి దిగిన మృణాల్


మరి ఈ బాక్సింగ్ ఎలా అబ్బింది ? మృణాల్‌కు పన్నెండేళ్ళ వయసున్నప్పడే అతను ఆడుతున్న తీరు చూసిన ఓ బంధువు. అతనికి బాక్సింగ్ నేర్పిస్తే బావుంటుందని సలహా ఇచ్చాడు. ఈ ఆటకు పెద్దగా ఖర్చు వుండదన్న ధీమాతో మృణాల్ తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఆ పన్నెండేళ్ళ వయసులో టైంపాస్‌గా మొదలైన బాక్సింగ్... చివరికి అతనికో సీరియస్ కెరీర్‌గా మారింది. మహారాష్ట్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ గేమ్స్, అండ్ స్పోర్ట్స్ క్లబ్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. 2008లో జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్ వల్ల కాలికి గాయమై, ప్రాక్టీస్‌కి కొంత బ్రేక్ పడింది. మళ్ళీ 2010లో అతడి ఫిట్‌నెస్ లెవెల్ పెరిగి మళ్ళీ బాక్సింగ్‌కి రెడీ అయ్యే సమయానికి జూనియర్ కేటగిరీకి అతను వయసు మీరిపోయింది.

దీంతో మళ్ళీ మృణాల్ భవిష్యత్ అంధకారంగా అనిపించింది. ఒక్కసారిగా నీరసించిపోయాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడే అతనికి ఫేమస్ బాక్సర్లైన మనోజ్ కుమార్ (2010 కామన్‌వెల్త్ గేమ్స్ లైట్ వెల్టర్ వెయిట్ డివిజన్ బంగారు పతక విజేత), 2008 ఒలంపిక్స్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్‌లు పరిచయమయ్యారు. వీళ్ళ పరిచయం, వాళ్ళిచ్చిన ధైర్యం.. మృణాల్‌ను మళ్ళీ కార్యోన్ముఖుడిని చేసాయి. రెట్టించిన ఉత్సాహంతో అతడు సీనియర్స్ కేటగిరీలో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు.

చేతిలో ఒక మెడల్ ఉంది కాబట్టి, ఇప్పుడతనికి జీవితం నల్లేరు మీద నడకలా సాగాలి.. కానీ అలా లేదు.

జాతీయ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకోవడం గురించి మాట్లాడేటప్పుడు అతని కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. ‘‘ నేనప్పటికే పూర్తిగా ప్రిపేర్ అయి వున్నాను. మెడల్ గెలుచుకోవడం వరకూ వెళ్లగలననే అనుకున్నాను. నాకున్న శక్తి సామర్థ్యాలన్నిటితో పోరాడాను. శారీరకంగా, మానసికంగా పూర్తిగా సన్నద్ధంగా వున్నాను. సాధారణంగా బాక్సింగ్ మ్యాచ్‌కు వెళ్ళేముందు ఎవరికైనా కొంత భయం వుంటుంది. కానీ నా మనసులో మాత్రం ఒక్కటే వుంది. ఎలాగైనా పతకం గెలవాలి. పతకం వస్తే, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. దాంతో ఆర్థికంగా కాస్త నిలదొక్కుకుని, బాక్సింగ్ ప్రాక్టీస్ మీద మరింత దృష్టిపెట్టగలుగుతాను. అప్పటికే నేను రైల్వేస్ టీమ్‌ను చూసాను. వాళ్ళు ప్రాక్టీస్ మీద చాలా శ్రద్ధ పెడతారు. దాని వల్ల వాళ్ళు రింగ్‌లో ఎక్కువ సేపు ఉండగలుగుతున్నారు. అందుకే నేను కూడా ఈ గేమ్‌లో పతకం గెలిచి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి.. ఆ తర్వాత మరింత బాగా ప్రాక్టీస్ చేసి ఒలంపిక్స్‌లో మెడల్ కొట్టాలి..’’

ఇలాంటి కలలతో నేషనల్ చాంపియన్స్ బరిలో దిగిన మృణాల్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతోనే తన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నాడు. అయితే, విధి మరోలా వుంది. అతను ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడల్లా ఒకటే సమాధానం వచ్చేది. ఆ ఉద్యోగానికి అతని వయసు మీరిపోయిందని .. అయితే, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. బాక్సింగ్ మీద అతనికి వున్న అపారమైన ప్రేమ ఇంకా ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టేలా చేస్తోంది.

ఎంతెంత దూరం ?

తన కలను నెరవేర్చుకోవాలంటే, ముందు రోజులు గడవాలి. కడుపు నిండాలి. అందుకే ఇప్పుడు అతను సరుకుల వ్యాన్‌కు డ్రైవర్‌గా చేరాడు. అయితే, ఇదేం ప్రభుత్వ ఉద్యోగం కాదు. టైమ్ ప్రకారం వెళ్తాం.. వస్తాం అంటే కుదరదు. దీనివల్ల అతను బాగా అలసిపోతున్నాడు. దాని ప్రభావం ప్రాక్టీస్ మీద పడుతోంది. అయితే, చిన్న చూపు చూసేవాళ్ళందరి నోళ్ళు మూయించాలంటే తాను మరింత కష్టపడాలని తనని తాను ప్రతిరోజూ ఉత్తేజపరుచుకుంటూ వుంటాడు.

మరో వైపు ఈ గాయాల వల్లా, బాక్సింగ్ వల్లా అతని చదువు మధ్యలోనే ఆగిపోయింది. కెరీర్‌లో చదువుకు కూడా అంతే ప్రాధాన్యం వుందని సీనియర్లు చెప్పిన సలహా మీదట, ఇప్పుడు ఆయన డిగ్రీ పూర్తి చేసే పనిలో కూడా వున్నాడు.

‘‘ డిగ్రీ పూర్తి చేయాల్సిందే అని అందరూ చెప్తారు. అయితే, నేను ప్రతి సారీ, టోర్నమెంట్ల వల్లే పరీక్షలకు ఎగనామం పెట్టాల్సి వస్తోంది. ఈ అక్టోబర్‌లో పరీక్షలు రాసి డిగ్రీ పూర్తి చేసేయాలనుకుంటున్నాను. నేనింకా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడాలి. ఉద్యోగం సంపాదించాలి. దీనంతటికీ చదువు చాలా ముఖ్యం. ’’ అని తన దారి గురించి వివరిస్తాడు మృణాల్.

కష్టాలతో బాక్సింగ్

క్రికెట్ తప్ప మరే క్రీడకీ మనం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వం. ఐపిఎల్‌తో క్రికెట్ దశ దిశ పూర్తిగా మారిపోయింది. వేల కోట్ల బిజినెస్‌గా మారిపోయింది. దీని వల్ల కొత్త కొత్త టాలెంట్ వెలుగుచూస్తోంది. మృణాల్ మాటల్లో చెప్పాలంటే…‘‘ క్రికెట్‌ను ఆడేవాళ్ళే కాదు.. నిర్వహించే వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. బాక్సింగ్ లాంటి ఇతర క్రీడల పరిస్థితి ఇలా లేదు. వీటికి సవతి తల్లి ప్రేమే దొరుకుతోంది. ఈ పరిస్థితి మారాలని , ఇతర క్రీడలకి కూడా క్రికెట్‌తో సమాన ఆదరణ రావాలని నా కోరిక. ఇప్పటికిప్పుడు మారకపోయినా.. ముందు ముందైనా మారాలి. నేను కాకపోయినా, నా ముందు తరమైనా బాగుపడితే, నాకదే చాలు..’’

దీనికి ప్రభుత్వులు ఏం చేయాలి ? ‘ఎప్పుడైనా బాగా డబ్బున్న కుర్రాళ్ళు బాక్సింగ్ నేర్చుకోవడం చూసారా ? అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి వున్న వాళ్ళే ఈ క్రీడలోకి వస్తారు. అవే ఆర్థిక కష్టాలతో ఈ ఆటను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి ని గుర్తించి, క్రీడాకారుల కు ఆర్ధిక మద్దతునిచ్చే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి..’’ అంటాడు.. మృణాల్.

‘‘నేను ప్రాక్టీస్ చేసే క్లబ్ లో కనీస సదుపాయాలు కూడా వుండవు. కానీ అక్కడ అసాధారణ ప్రతిభ కనబరిచే ప్లేయర్లు వున్నారు. ఎన్నో అద్భుత మైన విజయాలు సాధించారు. కానీ వారికి ఎటువైపు నుంచి కూడా మద్దతు ఉండదు. బాక్సింగ్‌లో ఆరితేరిన వారు కూడా జీవితంతో పోరాడలేక ఆటను వదిలేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడి మెడల్స్ గెలవగలిగిన బాక్సర్లు మనకున్నారు. కానీ ముందు వాళ్ళ కుటుంబం మూడు పూటలా తినాలి కదా..’’ అని ప్రశ్నిస్తాడు.. మృణాల్.

మాకు మేడలూ, మిద్దెలూ అక్కర్లేదు

నిజానికి క్రీడాకారులకు మేడలూ, ఓడలూ ఇవ్వక్కర్లేదు. చిన్న చిన్న సదుపాయాలతోనే వాళ్ళకు చాలా ఉత్సాహం వస్తుంది. ఒక మంచి ప్రాక్టీస్ కిట్, ఓ జత షూస్, లాంటివి ఇచ్చినా కూడా వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తారు. కనీస సదుపాయాలు లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు, గాయాలయినప్పుడు సరైన వైద్య సదుపాయాలు అందించలేకపోవడం వల్లనే చాలా మంది ఆటకు దూరమవుతున్నారు. మృణాల్‌కు కూడా భుజానికి శస్త్ర చికిత్స చేయాలి. కానీ అంత డబ్బు లేదు. మరి ఎలా ఆడతాడు ? అతని ధైర్యం , పట్టుదల ముందు భుజానికయిన గాయం చాలా చిన్నదైపోయింది.

నేనో కల గన్నాను

2012లో అతని కోచ్ టిజె నాయక్ చనిపోయిన తర్వాత తన సీనియర్ల దగ్గరే మృణాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే, సీనియర్లు, కోచ్‌లు లేనప్పుడు, చిన్న పిల్లలకు తానే కోచింగ్ ఇవ్వడం కూడా అతనికి ఇష్టమే. ‘‘ అయిదేళ్ళ నుంచే పిల్లలు బాక్సింగ్ నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకి నేర్పించడం నాకిష్టం. వాళ్ళకు కూడా నా దగ్గర నేర్చుకోవడం అంటే బాగా ఇష్టం. ఎప్పుడైనా నేను వెళ్ళకపోతే, ఆ పిల్లల తల్లిదండ్రులు నన్ను ఎందుకు రాలేదని అడుగుతారు. నాకప్పుడు చాలా ఆనందంగా వుంటుంది.’’

‘‘మనోజ్ కుమార్ నాకు చేసిన సాయం చూసిన తర్వాత అతనే నాకు దేవుడయిపోయాడు. ఇప్పుడు నన్ను కేవలం మహరాష్ర్టలోనే కాక దేశం అంతటా గుర్తుపడుతున్నారు. నాకు మనోజ్ కుమార్ చేసిన సాయం.. నేను ఇతరులకు కూడా చేయాలనుకుంటున్నాను.’’ ఈ మాటలన్నాక అతన్నో ప్రశ్న అడిగాం.. భవిష్యత్తులో అకాడమీ ప్రారంభిస్తారా.. అని.. దానికి మృణాల్ తనదైన సమాధానం ఇచ్చాడు. ‘‘ లేదు.. మా కోచ్ నాకు ఈ అకాడెమీలోనే శిక్షణ ఇచ్చాడు. నేను కూడా ఇక్కడే నేర్పిస్తాను. మా కోచ్‌కు కొన్నికలలుండేవి. అవి తీరకుండానే అతను కన్నుమూసాడు. ఈ రకంగా ఆయన కలల్ని నేను సాకారం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ’’

మృణాల్‌కు సాయం అందాలని ఆశిస్తున్నాం. ఎవరైనా స్పాన్సర్ చేయకపోతారా అని అతడు ప్రతిరోజూ ఎదురు చూస్తూ వుంటాడు. మరీ ఒక జత బూట్లు కొనుక్కోవడానికి కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి వుండకూడదు. ఈ సారి చేతిలో మందు గ్లాస్ పెట్టుకుని, మన క్రీడాకారుల ఆటతీరు బాగాలేదని మాట్లాడుకునేటప్పుడు .. మన గ్లాసులో మందుకు అయ్యే ఖర్చుతో ఓ పేద అథ్లెట్ జత బూట్లు కొనుక్కోగలడని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో డిన్నర్ ఖర్చుతో ఓ క్రీడాకారుడు గ్లోవ్స్ వచ్చేస్తాయి. ఇవి లేకే మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణించలేకపోతున్నారని మనం అర్థం చేసుకోవాలి.

ఇలాంటి అవసరమైన వారికి .. ఆర్ధిక సాయం అందించగలవాళ్ళకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తోంది.. మిలాప్. మిలాప్ అందించే సాయంతోనే ప్రస్తుతం మృణాల్ బాక్సింగ్ ప్రాక్టీస్ కి ఖర్చు చేయగలుగుతున్నడు. మీరు కూడా మిలాప్ ద్వారా మృణాల్ లాంటి వాళ్ళని ఆదుకోవాలనుకుంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.

అందరు బాక్సర్లలాగే మృణాల్ కూడా ఒలంపిక్ వేదిక మీద పతకాన్ని గెలవాలనుకుంటున్నాడు. ‘‘ నాకు సదుపాయాలుండి, ప్రభుత్వ ఉద్యోగం వుండుంటే, ఇంకా చాలా ఆడేవాడిని. ఇప్పటికైనా వెనుకాడను. నాకు స్పాన్సర్ దొరికితే, ఆర్థిక కష్టాలు కొంత తగ్గుతాయి. అయినా నా ప్రయత్నాలు నేను చేస్తాను. విశ్వవేదికపై భారతదేశం తరపున ఆడేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నా దేశ పతాకను ప్రపంచం గర్వించేలా ఎగరేయడానికి అహర్నిశలూ కష్టపడతాను’’ అని శపథం చేస్తున్నాడు.. మృణాల్. మనమూ అతనికి, అతని ఆశయానికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.