క్యాబ్ సేవల్లో మరో విప్లవం 'నానో ట్యాక్సీ'

ట్యాక్సీ యుద్ధంలో పెరిగిన పోటీ తగ్గిపోతున్న కార్ల సైజ్చిన్న కార్లే కాదు.... బుల్లి కార్లూ ఇప్పుడు ట్యాక్సీలే ఆటలతోనూ పోటీపడ్తున్న కంపెనీలు

0

బెంగుళూరులో మొదటి 2 కిలోమీటర్లకు ఆటో ఛార్జ్ రూ.25, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.13. సాధారణంగా ఇది కార్లతో పోటీకొచ్చే ధరమీ కాదు. అయితే.. మీటరుపై ఇంత అదనం అన్నపుడు మాత్రం ట్యాక్సీయే నయమేమో అనిపించక మానదు. ఇలాంటి సమయంలోనే బెంగుళూరులో నానో ట్యాక్సీ సేవలు ప్రారంభించింది ట్యాక్సీ ఫర్ ష్యూర్. దీనికి మొదటి 2 కిలోమీటర్లకు రూ.25, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.10 ఛార్జ్ చేస్తున్నారు. ఈ దెబ్బకు ఆటోకంటే ట్యాక్సీ ప్రయాణమే చీపుగా మారిపోయింది.

100 నానో కార్లతో బెంగుళూరులో ఈ సర్వీస్ ప్రారంభించిన ట్యాక్సీ ఫర్ ష్యూర్... దేశవ్యాప్తంగానూ ఈ సర్వీస్ విస్తరిస్తోంది. అయితే ట్యాక్సీ ఫర్ ష్యూర్ యాప్, మొబైల్ సైట్లలో 'పిక్ నౌ' ఆప్షన్ ద్వారానే ఈ సర్వీస్ లభ్యమవుతుంది. ఎందుకంటే ఇది నిమిషాల వ్యవధిలోనే కస్టమర్‌ను చేరుకునే అవకాశం కల్పించే సౌకర్యం ఇది.

కస్టమర్ల పికప్‌కు సిద్ధమైన నానో ట్యాక్సీలు
కస్టమర్ల పికప్‌కు సిద్ధమైన నానో ట్యాక్సీలు

నానో ట్యాక్సీ సర్వీస్ ఎంత ఉపయోగమో ఓ చిన్న లెక్క ద్వారా తెలుసుకుందాం. 7 కిలోమీటర్ల దూరం ఎయిర్ కండిషన్డ్ నానో ట్యాక్సీలో ప్రయాణిస్తే.. మనకు రూ. 75 ఖర్చవుతుంది. అదే ఆటోలో ఇదేదూరం వెళ్లాలంటే మాత్రం రూ.90 ఇచ్చుకోవాలి. ఇదే సమయంలో నానో కార్లో డ్రైవర్ కాకుండా 4 గురు ప్రయాణించే అవకాశముండగా... ఆటోలో ముగ్గురు మాత్రమే వెళ్లాలి. అంటే నానో ట్యాక్సీల ద్వారా సౌకర్యమే కాదు, జేబు భారం కూడా తగ్గుతుందన్న మాట.

నానో ఎందుకు ?

"భారత ప్రయాణికుల రవాణా రంగంలో ఇదో విప్లవాత్మకమైన అడుగు. నగరాల్లో ప్రయాణాన్ని మరింత సులువుగా, సౌకర్యంగా, చవగ్గా మార్చేందుకు ఈ నానో ట్యాక్సీ సర్వీస్ ఉపయోగపడుతుంది" అంటున్నారు ట్యాక్సీ ఫర్ ష్యూర్ సీఈఓ రఘునందన్. దీనితో మరిన్ని ప్రయోజనాలున్నాయని చెబ్తున్నారు కూడా.

1. ట్యాక్సీ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉంది. ఇక్కడ టాటా నానో ధర తక్కువగా ఉండడం మరింత ప్రయోజనం. అదే సమయంలో బడ్జెట్లో ఎక్కువ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

2. సిటీ ప్రయాణాలకు నానో చాలా అనుకూలమైనది. స్వల్ప దూరం ట్రావెల్ చేసేందుకు, ఇరుకు రోడ్లకోసం దీన్ని మించిన వాహనం లేదు. త్వరగా జర్నీ పూర్తవడంతో ఎక్కువ ట్రిప్పులు తిరిగి, ఆదాయం పెంచుకునే అవకాశం భాగస్వాములైన డ్రైవర్లకు లభిస్తుంది.

3. తక్కువ డౌన్ పేమెంట్, చిన్నపాటి ఈఎంఐల కారణంగా... జేబుకు భారం కాదు.

4. నానో ట్యాక్సీ కస్టమర్లకు చాలా సౌకర్యవంతమైనది.


మరి ఆటోల గతేంటి ? సంగతేంటి ?

"గత మూడేళ్లలో ట్యాక్సీ ఫర్ ష్యూర్ 30 లక్షల ట్రిప్స్ పూర్తి చేసింది. 4 కోట్లమందికి ప్రజలను గమ్యాలకు చేర్చాం. 14 నగరాల్లో విస్తృతమైన సేవలందించాం. కస్టమర్ సౌకర్యమే అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు నానో సర్వీస్ లాంఛ్ చేశాం. డిమాండ్ తగినట్లుగా మేం అందుకోలేకపోతే... మా సేవల్లోకి ఆటోలను తెచ్చేందుకు కూడా సిగ్గుపడం. అడిగినవి కాకుండా ప్రజలకు ఏది అవసరమో దాన్ని చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, " అన్నారు ట్యాక్సీ ఫర్ ష్యూర్ సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ.

కొత్త సర్వీస్ లాంఛ్ చేశాక అది సక్సెస్ కావడానికి కొత్త కస్టమర్లు అవసరం అంటోంది ట్యాక్సీ ఫర్ ష్యూర్. అయితే... ఇప్పటికిప్పుడే హడావిడిగా చేయాల్సిన పని లేదని కూడా చెబ్తోంది. కానీ ఒక్కో అడుగూ చొప్పున వేయడం మాత్రం ముఖ్యమేనని చెబ్తున్నారు.

"కస్టమర్ల నుంచి మాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. ముఖ్యంగా ధర నిర్ణయం మా సర్వీస్‌ని ప్రజలకు దగ్గర చేస్తోంది. అలాగే సర్వీస్‌లోనూ మేమెప్పుడూ ఒకడుగు ముందే ఉంటాం. 360డిగ్రీ ప్రచారం ప్రజలకు మమ్మల్ని మరింత చేరువ చేసింది. కస్టమర్ల రోజువారీ జీవితాల్లో ట్యాక్సీ ఫర్ ష్యూర్ ఓ భాగం కావాలన్నదే మా లక్ష్యం. అది కూడా వాళ్లకు సౌకర్యంగా ఉండాలి, తక్కువ ఖర్చులో ప్రయాణం పూర్తవ్వాలి" అంటున్నారు అప్రమేయ.

2014 ప్రారంభంలో ట్యాక్సీ ఫర్ ష్యూర్ సి రౌండ్ ఫండింగ్ ద్వారా 50 మిలియన్ డాలర్లు సమీకరించింది. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ సంస్థ... త్వరలోనే మరోమారు నిధుల సేకరణ చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ట్యాక్సీ రంగం వేగం చూస్తుంటే... మన దేశంలో తర్వాతి ఈకామర్స్ ఇదే అనిపిస్తోంది.