మీకు ఎవరినైనా అభినందించే అలవాటుందా?

మీకు ఎవరినైనా అభినందించే అలవాటుందా?

Monday February 15, 2016,

3 min Read

ఈ రోజుల్లో అవతలివారిలో ఏదైనా నచ్చితే బావుందనో, వాళ్లు బాగాచేస్తే శెభాష్ అనో ఎంతమంది ఠక్కున చెప్తేస్తారు చెప్పండి? వేళ్లమీద చెప్పొచ్చు. చిన్న కాంప్లిమెంట్ ఇవ్వటానికి మనసు రాదు? బాగుందని చెప్పడానికి వాయిస్ రాదు. నిజానికి ఒక్కరో ఇద్దరో కాదు.. ఈ విషయంలో మన దేశానికే చాలా పెద్ద ట్రాక్ రికార్డే ఉంది. 

అవును. మన పక్కవాళ్లు ఏదైనా సాధించినా, ఓ చిన్నపని సక్సెస్ పుల్ గా చేసినా మనం గుర్తించటంలో, కాంప్లిమెంట్ ఇవ్వటంలో మాత్రం చొరవ చూపించం. కావాలంటే మిమ్మల్నిమీరోసారి ప్రశ్నించుకోండి. సిన్సియర్ గా ఎవరికైనా ఓ కాంప్లిమెంట్ ఇచ్చారా? లేదంటే శెభాష్ అని భుజం తట్టారా? అలా చేసి ఎంత కాలమైందో గుర్తుతెచ్చుకోండి.

ఈ హడావుడి ప్రపంచంలో ఎవరిగోల వారిది. నిజమే. కానీ, అభినందించటానికి రాని నోరు- విమర్శలకు మాత్రం రెడీగా ఉంటుంది. తగుదునమ్మా అని ముందుకొస్తారు. ఇంట్లో, ఆఫీసులో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో- అది బాలేదు.. ఇది సరిగ్గా లేదంటూ దిక్కుమాలిన విమర్శలు గుప్పిస్తాం తప్పితే.. బాగున్న అంశాలను బాగున్నాయని, వ్యక్తుల్లోని మంచి లక్షణాలను అభినందిద్దామని, వారు చేసిన పనులను గుర్తించుదామని ఎవరికీ అనిపించదు. కీపిటప్ అనటానికి నోరు పెకలదు. ఈ విషయం ఇప్పుడు కాదు.. చాలా ఏళ్లుగా గమనిస్తూ వస్తున్నా. 

ఈ మధ్య ఓ ఆఫీసుకి వెళ్లా. అది కొత్తగా పెట్టిన ఓ కంపెనీ. అక్కడి ఉద్యోగులతో మాట్లాడుతున్న సందర్భంలో, మీలో ఒకరికొకరికి నచ్చిన విషయాలేమైనా గుర్తించారా? వాటి గురించి ఓ చిన్న కాంప్లిమెంటైనా ఇచ్చారా అనడిగాను. కానీ ఏ ఒక్కరి నుంచీ సమాధానం లేదు. అంటే, ఏ ఒక్కరికీ అవతతలి వారి మంచి లక్షణాలను, టాలెంట్ ని గుర్తించటానికి మనసు ఒప్పలేదన్నమాట. ఆశ్చర్యం కలిగించే విషయం కదా. కానీ ఈ టాపిక్ మూలాలు తవ్వుకుంటూ వెళితే ముందు ఇళ్లలో అమ్మానాన్నల్ని అనాలేమో? :-)

image


మన తల్లిదండ్రులు ఎదుటివాళ్లని గుర్తించటంలో, మన ప్రేమను చెప్పటంలో కాస్త భిన్నంగానే వ్యవహరించారనిపిస్తుంది.

నా స్కూల్ డేస్ లో వక్తృత్వం, డిబేట్ పోటీల్లో ప్రైజులు చాలా గెలుచుకునేదాన్ని. నేను ఇంటికి ఓ ప్రైజుతో రాగానే మా అమ్మ చాలా సంతోషపడేది. నా గురించి గర్వంగా ఫీలవుతుతోందని కూడా అర్ధమయ్యేది. కానీ, వెంటనే ఏం జరిగేదో తెలుసా.. “ఇదంతా బాగానే ఉంది కానీ, ఫలానా వాళ్ల అమ్మాయి ఇలాంటి పోటీల్లోనే ఇంకా ఏదో సాధించింది అని చెప్తూ... నువ్వింకా చేయాల్సింది చాలా ఉందని వెంటనే గుర్తుచేస్తుండేది. నాకది చాలా చిత్రంగా అనిపించేది. పైగా ఈ చిన్న చిన్న విజయాలు ఎక్కడ నా తలకెక్కి ఎదగటం ఆపేస్తానో అని భయపడుతూ ఉండేది. కానీ, నాకేమో ఈ చిన్నచిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఉండేది. ఓ స్మాల్ ట్రీట్, ఓ ఐస్ క్రీమ్ పార్టీ, ఓ చిన్న గిఫ్ట్- లేదంటే ఆ పూటకి స్టడీ అవర్స్ కి బ్రేక్. ఇలా ఏదో ఒకటి కోరుకునేదాన్ని. నా స్కూల్ డేస్ లో ఇలాంటి సందర్భాలు అనేకం.

ఇక చదువులు పూర్తయి.. ఉద్యోగాలు చేస్తున్న టైమ్ వచ్చినా ఈ ధోరణిలో మార్పురాలేదు. సీఎన్ బీసీలో ఆఫర్ వచ్చిందని అమ్మకు చెప్తే మళ్లీ అదే ఫీలింగ్. నిజానికి ఈ ఉద్యోగం రావటం తనకు సంతోషమే. కానీ, నీ కజిన్ ని చూడు. వాడు యూఎస్ వెళ్లాడు. ఇంటికి నెలకు వెయ్యి డాలర్లు పంపుతున్నాడు.. అని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. మా అమ్మ తీరుని చూసి నిట్టూర్చటం మినహా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికీ పెద్ద మార్పేం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఓ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వలేరు. గుర్తింపుని మెచ్చుకోలేరు. బేఠీ గుడ్.. అని చెప్పటానికి ఎందుకు మనసురాదో అర్ధం కాదు.

మనకు ఎదుటివారిని గుర్తించటంలో చాలా చిక్కులున్నాయి వాటన్నిటినీ ఎదుర్కోవటం కంటే ఆ విషయాన్ని పక్కన పెట్టడం బెటరేమో అనే భావనలో ఉంటాం.

నిజానికి ఇలా ఎదుటివారికి కాంప్లిమెంట్స్ ఇవ్వక పోవటంలో మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తాయి. కితాబివ్వటం, పొడగ్తలు కురిపించటం కొన్నిసార్లు నెగెటివ్ గా కూడా పనిచేస్తుంది. అంటే, ముఖస్తుతిగా మాట్లాడి, నాలుగు కాంప్లిమెంట్స్ విసిరి- ఫేవర్ ఆశించే బాపతులా మన గురించి అంచనా వేసే అవకాశం ఉంటుందనే భయం కూడా లోలోపల ఉంటుంది. అంతే కాదు... మనం నెగెటివ్ గా మాట్లాడేవారిని తెలివైనవారుగా, కాస్త అనుభవజ్ఞులుగా భావిస్తామట. అదే పాజిటివ్ మాట్లాడే వారి గురించి అంతమంచి అభిప్రాయం రాదట. సర్వేలు చెప్తున్న మాట ఇది.

స్ట్రయిట్ గా చెప్పాలంటే మన సమాజంలో చెడు చేస్తే వచ్చే పేరు, గుర్తింపు- మంచిచేస్తే రావటం లేదు.

పాజిటివ్ గా ఉండటం బోర్ అయిపోతోంది. నీరసంగా కనిపిస్తోంది. హేళనగా అనిపిస్తోంది. ఎంజాయ్ చేయలేనిదిగా మారుతోంది. అదే విధంగా పాజిటివ్ ఎప్రిసియేషన్ కి కూడా అదే ఇంప్రెషన్ వస్తోంది.

కానీ, పాజిటివ్ నేచర్, సానుకూల ప్రవర్తన, గుర్తింపు- ఇవన్నీ గెలుపుకు బాటలు వేస్తాయని నమ్ముతాను నేను. నేను ఆరాధించే గొప్పవాళ్లంతా చాలా పాజిటివ్ గా జీవితాన్ని తీసుకుని, అడుగడుగునా అదే దృక్పథాన్ని అలవర్చుకున్న వారే.

జీవితంలో ప్రతిరోజు కొత్త అవకాశాలు వస్తునే ఉంటాయి. ప్రపంచం ఏమనుకుంటుందో, ఎలా తీసుకుంటుందో మర్చిపొండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆ అభినందనలు అందజేయండి. మీరెవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను చెప్పేయండి. ఆ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయండి. ఎగ్జిబిట్ చేయండి. అంతకంటే జీవితంలో చేయగల పెద్ద విషయం ఏముంటుంది చెప్పండి.

ఈ వాలంటైన్స్ డే సందర్భంగా, మీకు మీరు ఓ వాదా చేసుకోండి. జీవితాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ, దాన్ని మీ ప్రపంచానికి కూడా అందించండి. ప్రేమను పంచండి. నిర్మొహమాటంగా అభినందించండి. ఫలితం ఎంత అందంగా ఉంటుందో, మీ ప్రపంచం ఎలా మారుతుందో మీరే చూస్తారు.

- శ్రద్ధా శర్మ

చీఫ్ ఎడిటర్, ఫౌండర్, యువర్ స్టోరీ.