ఇతని సంకల్పం ముందు పేదరికం ఓడిపోయింది  

0

మనసుంటే మార్గం ఉంటుందంటారు. ఈ మాటను నిజం చేసి చూపించాడు లాల్చా అనే నిరుపేద మారుమూల గిరిజన కుర్రాడు. చదువంటే ఏంటో తెలియని మణిపూర్ లోని ఒక కుగ్రామంలో పుట్టి, ప్రతిష్టాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలో సీటు సంపాదించాడు. కనీసం పెన్ను కూడా కొనుక్కోలేని కటిక పేదరికాన్ని సవాల్ చేసి- నల్లకోటు ధరించి న్యాయదేవత ముందు సగర్వంగా తలెత్తుకున్నాడు. తన జాతికోసం, తనవారి ఉన్నతి కోసం పాటుపడతానని ప్రతిన బూనాడు.

బాల్యం ఎలా వుందో తెలియదు. ఒకపూట తింటే రెండో పూట కడుపు మాడ్చుకోవాలి. మణిపూర్ లో మూలకు విసిరినేట్టుండే గమ్నామ్ అనే గ్రామంలో పట్టుమని పది ఇళ్లు కూడా వుండవు. కానీ నిత్యం ఏవేవో అల్లర్లు. కుకి జాతికి చెందిన లాల్చాకు తోడబుట్టిన వాళ్లు ఐదుగురు. చిన్న పూరిగుడిశె. అందరూ అందులోనే మసులుకోవాలి. లాల్చా ఏడేళ్ల వయసప్పుడు గ్రామంలో ఏదో గలాటా జరిగింది. ఆరోజున భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. దక్షిణ బెంగళూరులో పాస్టర్ గా పనిచేసే మామయ్య దగ్గరికి వెళ్లాడు.

ఆ తర్వాత లాల్చా పరిక్రమ హ్యుమానిటీ ఫౌండేషన్ అనే ఒక చారిటీ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అక్కడే స్కూలింగ్ అయిపోయింది. పై చదువుల కోసం మొదటిసారి బెంగళూరు సిటీకి వచ్చాడు. ఉన్నట్టుండి ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా వుంది. అక్కడి జనాల్ని, వారి భాషను, వ్యవహారాన్ని చూసి కల్చర్ షాక్ అయ్యాడు. ఏడు ఇళ్లు మాత్రమే ఉన్న తన గ్రామమేంటి? ఈ ప్రపంచమేంటి అని ఆశ్చర్యపోయాడు. భాష తెలియక, ఇంగ్లీష్ రాక తికమకపడ్డాడు.

మామయ్య సలహాతో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాశాడు. కాంపిటిషన్ లో 50వేల మంది ఉన్నారు. అంతమందిలో లాల్చా బంపర్ ర్యాంక్ కొట్టాడు. కేవలం టాప్ 50 ర్యాంకర్లు మాత్రమే అందులో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధిస్తారు. అందులో లాల్చా ఒకరు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే లా స్కూల్ ఫీజు చాలా ఎక్కువ. పూలదారి అనుకునేలోపు ఉన్న దారి కాస్తా మూసుకుపోయింది. 

ఇలా అయితే లాభం లేదని తను అంతకుముందు చదువుకున్న పరిక్రమ స్కూల్ వాళ్లను అప్రోచ్ అయ్యాడు. ఇదీ సంగతి అని వాళ్లకు వివరించాడు. లాల్చా పరిస్థితి గమనించిన స్కూల్ ఫౌండర్లు ఐడీఐఏ అనే సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ లాల్చా లాంటి పేదపిల్లల ఉన్నత చదువుల బాధ్యతను తీసుకుంటుంది. వాళ్లే ఫీజు గట్రా కడతారు. ప్రత్యేకంగా లా చదివే వాళ్లకు ఐడీఐఏ తగిన ప్రోత్సాహం ఇస్తుంది. దాన్ని స్థాపించింది ఎవరో కాదు.. నేషనల్ లా స్కూల్ లో గ్రాడ్యుయేట్ చదువుకున్న షమ్నద్ బషీర్ అనే పూర్వ విద్యార్ధి. లాల్చా చదువు బాధ్యతను ఐడీఐఏ తలకెత్తకుంది. అతనితోపాటు యుగళ్ అనే అంధ విద్యార్ధిని కూడా లా చదివిస్తోంది. ఇలా ఆ సంస్థ ఎందరికో చేయూతనందిస్తోంది.

జీవితంలో నేను ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా, మంచి మనుషుల మధ్య పెరిగాను. వారి దయాదాక్షిణ్యాలతో ఇంత పెద్ద చదువు చదివాను. దానికి సార్ధకత చేకూర్చడమే నా ముందున్న కర్తవ్యం. చారిటీ సంస్థల ప్రాడక్ట్ అయిన నేను- ముందుగా నా కమ్యూనిటీకి న్యాయం చేయాలి. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి. అంతకంటే నేనేం కోరుకోవడం లేదు-లాల్చా.

Related Stories