డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లలో ఆర్మీకి 50% డిస్కౌంట్.. పుణె కుర్రాళ్ల వినూత్న ఆలోచన!

డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లలో ఆర్మీకి 50% డిస్కౌంట్.. పుణె కుర్రాళ్ల వినూత్న ఆలోచన!

Friday January 27, 2017,

3 min Read

మనం పెద్దగా గమనించం గానీ.. రోజుకి సుమారు 5వేల మంది సైనికులు రైళ్లలో రిజర్వేషన్ సీట్లు దొరక్క జనరల్ కంపార్టుమెంట్లలో సర్దుకుంటారు. గంటల తరబడి ప్రయాణ భారాన్ని పంటిబిగువన భరిస్తారు. వారి కుటుంబ సభ్యులు, మాజీ సైనికోద్యోగులదీ అదే సమస్య. అందుకే వారి ప్రయాణ బడలికను గాల్లో తేలిపోయేలా చేసింది ఉడ్ చలో అనే స్టార్టప్.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. డొమెస్టిక్ ఫ్లయిట్లలో సీట్లు పూర్తిస్థాయిలో నిండవు. ఒక్కో షటిల్ లో పావువంతు ఖాళీలే వుంటాయి. ఒక రోజులో అన్ని విమానాల ఖాళీ సీట్ల సంఖ్య 40వేలకు పైమాటే. వాటిని అలా ఖాళీగా ఉంచే బదులు.. అవే సీట్లను ఆర్మీ ఉద్యోగులకు డిస్కౌంట్ రేట్లలో ఇస్తే ఎలా వుంటంది? ఈ కాన్సెప్టు మీద పుట్టిందే ఉడ్ చలో స్టార్టప్.

image


పుణెకి చెందిన, వరుణ్ జైన్, రవికుమార్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు వచ్చిందీ ఆలోచన. సైనికుల జర్నీ సమస్యను తీర్చడంతో పాటు, అటు డొమెస్టిక్ విమానయాన సంస్థలకు కూడా రెవెన్యూ పెంచారు. ఖాళీగా పోయే బదులు ఎంతోకొంత డిస్కౌంటుతో సీట్లు నిండితే, వాళ్లకూ ఆదాయం పెరిగినట్టే కదా. పైగా సైనికులకు అలాంటి ఆఫర్ ఇవ్వడంలో తప్పులేదు. వాళ్ల సేవలను గౌవరించినట్టూ ఉంటంది.. ఇటు విమాన సంస్థల ఆదాయామూ పెరుగుతుంది. అంటే ఒక్క ఐడియాతో రెండు వైపులా ప్రయోజనమన్నమాట.

త్రివిధ దళాల సైనికులకు, మాజీ ఉద్యోగులకు, వారి పిల్లలకు, యుద్ధంలో మరణించిన జవాన్ కుటుంబ సభ్యులకు, పారామిలటరీ సభ్యులకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

ఫ్లయిట్ బుకింగ్ పోర్టల్ ఆన్ లైన్ తో పాటు, పలు ఆర్మీ కంటోన్మెంట్ల ఆవరణల్లో, బెంగళూరులోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో, ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వెటరన్, పుణెలోని బీఈజీ (రిక్రూట్) సెంటర్, మహారాష్ట్రలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆఫ్ లైన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఫౌండర్లలో ఒకరైన వరుణ్, గతంలో తవిస్కా సొల్యూషన్స్ అనే ప్రాడక్ట్ డెవలప్ మెంట్ కంపెనీలో పనిచేశాడు. రవి అనే మరో కో-ఫౌండర్ టాటాలో, డసాల్ట్ అనే కంపెనీలో మూడేళ్లపాటు వర్క్ చేశాడు. 2012లో మొదలైంది ఉడ్ చలో తో స్టార్టప్ ప్రయాణం మొదలుపెట్టారు.

ప్రస్తుతానికి ఉడ్ చలో మూడు విమానయాన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. (కొన్ని కారణాల వల్ల ఆ విమాన సంస్థల పేర్లు వెల్లడించలేం.. కాన్ఫిడెన్షియల్) రోజుకి ఐదువేల టికెట్లు అమ్ముడవుతున్నాయి.

అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ద్వారా టికెట్ బుకింగ్ రియల్ టైంలో జరిగిపోతుంది. మధ్యలో వెరిఫికేషన్ ప్రాసెస్ వుంటుంది. టికెట్ కొనే వ్యక్తి ఆర్మీకి సంబంధించిన వారేనా, కాదా అన్నది రూఢీ చేసుకున్న తర్వాతే, సీట్ రిజర్వ్ అవుతుంది. అందుకోసం ఒక్కో ఎయిర్ లైన్స్ ఇద్దరేసి లాయర్లను నియమించుకుంది. వాళ్లు బుకింగ్ పోర్టల్ ద్వారానే క్లియరెన్స్ ఇస్తారు. నకిలీ రిక్వెస్టులను పూర్తిగా నివారించడానికే ఈ ప్రాసెస్ అంతా.

ఈ స్టార్టప్ లో మొత్తం 14 మంది పనిచేస్తున్నారు. అందులో ఆఫ్ లైన్ కౌంటర్ మీద ముగ్గురుంటారు. వాళ్లు కూడా రిటైర్డ్ సైనికోద్యోగులే. సందర్భాన్ని బట్టి ఒక్కో టికెట్ మీద 1 నుంచి 4 శాతం ఫీజు ఎయిర్ లైన్స్ సంస్థల నుంచి వసూలు చేస్తారు. స్టార్టప్ రెవెన్యూ నెలకు 50 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. తక్కిన విమాన సంస్థలతోనూ టై అప్ కావాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. 

సిబ్బంది సంఖ్య కూడా పెంచాలనే యోచనలో ఉన్నారు. అదికూడా డిఫెన్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లనే రిక్రూట్ చేసుకోవాని భావిస్తున్నారు. వార్ విడోస్, వార్ డిసేబుల్డ్, డింపెండెంట్స్ మాజీ ఉద్యోగులను మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (ఢిల్లీ) వారి సాయంతో, అన్ని కేటగిరీల నుంచి కలిపి సుమారు 70మందికి ఉపాధి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు.

త్వరలో ఉడ్ చలో బుకింగ్ కౌంటర్లను 50కి పెంచబోతున్నారు. ఎక్కడైతే ఆన్ లైన్ అందుబాటులో ఉండదో, అక్కడ ఆఫ్ లైన్ వర్క్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. స్టార్టప్ కు ప్రాచుర్యం కల్పించేదుకు సోషల్ మీడియాను ఎంచుకున్నారు.

ఉడ్ చలో వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి