జాతీయ రహదారులను నందనవనాలుగా మారుస్తున్న ఎవెన్యూ ప్లాంటేషన్

0

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ నందనవనాలుగా రూపుదిద్దుకోనున్నాయి. తెలంగాణ అటవీశాఖ రోడ్లకిరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతోంది. నాటిన ప్రతిమొక్క బతికేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఈ అవెన్యూ ప్లాంటేషన్ విజయవంతంగా అమలవుతోంది. అందుకే ఈ ప్లాంటేషన్ కు జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి.

రాష్ట్రమంతా ఇప్పటికే హరితహారం కింద ఊరూరా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రోడ్లను కూడా హరితవనాలుగా మార్చే కార్యక్రమానికి అటవీశాఖ శ్రీకారం చుట్టింది. మూడో విడత హరితహారం కంటే ముందుగానే.. అంటే మే నెలలోనే ఎవెన్యూ ప్లాంటేషన్ ను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఏ రోడ్డు వెంట ప్రయాణం చేసినా, ఇరు వైపులా పచ్చదనం, పూలమొక్కలతో కళకళలాడాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. రోడ్లపై వెళుతుంటే ఒక వనంలో ప్రయాణించిన అనుభూతి ఉండాలని సీం ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆ తరహాలోనే రోడ్లను నందనవనాల్లా తీర్చి దిచ్చే ప్రయత్నాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా అటవీశాఖ చేపట్టింది. ఈ పనుల పురోగతిపై అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడాన్ని అవెన్యూ ప్లాంటేషన్ గా పిలుస్తారు. రాష్ట్రంలోని 52 అటవీ డివిజన్లలో ఒక్కో ప్రాంతానికి 10 కిలోమీటర్లకు తక్కువ కాకుండా రోడ్ల వెంట ఏవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. పెట్టిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకోవటం ఈ ప్లాంటేషన్ ప్రత్యేకత. ఎండాకాలంలోనే ఈ ప్లాంటేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈనెలలో పనులను ముమ్మరం చేశారు. ఈసారి అవెన్యూ ప్లాంటేషన్ లో కొత్త టెక్నిక్ తీసుకొచ్చారు. పిట్ తీయడం దగ్గర నుంచి, మొక్క చుట్టూ వర్మికంపోస్ట్, ఎరువు వేయటం, నాటిన మొక్క నిటారుగా పెరిగేందుకు సపోర్ట్ స్టిక్ తో పాటు, ప్రతీ మొక్కకు ట్రీ గార్డును కూడా ఒకేసారి ఏర్పాటు చేయటం ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేకత.పెట్టిన ప్రతీ మొక్క బతికేలా ఒకేసారి పూర్తి రక్షణ చర్యలు తీసుకోవటంలో భాగంగా ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. 2015 లో 1,500 కిలో మీటర్లు, 2016లో 2,400 కిలో మీటర్లమేర రోడ్ల వెంట నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దవుతున్నాయి.

ఈయేడాది తెలంగాణ వ్యాప్తంగా 3,500 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా సుమారు ఐదు వందల కిలో మీటర్ల పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో కిలో మీటరుకు 400 మొక్కల చొప్పున నాటనున్నారు. రంగు రంగుల పూల మొక్కలు ఒక వరుసలో ఉండేలా థీమాటిక్ స్టయిల్లో నాటుతారు. ప్రయాణంలో అహ్లాదకరంగా ఉండేలా రకరకాల పూల మొక్కలను రోడ్ల వెంట పెట్టేందుకు అటవీశాఖ నిర్ణయించింది. మర్రి, రావి, వేప, కానుగ, చైనా బాదాం, రెయిటీ ట్రీ లాంటి నీడను ఇచ్చే చెట్లతో పాటు రంగు రంగుల పూలు రోడ్ల కిరువైపులా దర్శనమివ్వబోతున్నాయి. కాలనుగుణంగా పూసి అందంగా కనిపించే గుల్ మొహర్, తబూబియా, బహూనియా, అవ్లాండియా, టెకోమా, పెల్టా ఫోరమ్ రకాలను రోడ్ల వెంట నాటుతున్నారు.

తెలంగాణ అటవీ శాఖ చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ కు జాతీయస్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. అదిలాబాద్ జాతీయ రహదారితో పాటు, వరంగల్ హైవేలో రాయగిరి వరకు ఎవెన్యూ ప్లాంటేషన్ ను చేపట్టనున్నారు. ఇది విజయవంతమైతే జాతీయ రహదారులన్నీ నందనవనాలుగా మారినట్టే.

Related Stories

Stories by team ys telugu