సాఫ్ట్ వేరే కాదు.. హార్డ్ వేర్ ని కూడా ప్రోత్సహిస్తాం  

జెడ్ఎఫ్ కంపెనీ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన కేటీఆర్

0

జెడ్ఎఫ్ కంపెనీ రాకతో హైదరాబాద్ లో ఆటోమొబైల్ మానుఫాక్చరింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు హైదరాబాద్ టాప్ మోస్ట్ డెస్టినేషన్ గా మారిందన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు భాగ్యనగరంలో తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ లోని నానక్ రాం గూడలో జెడ్ఎఫ్ టెక్నాలజీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. 8నెలల కాలంలోనే టెక్నాలజీ సెంటర్ ను స్థాపించిన కంపెనీ ప్రతినిధులను అభినందించారు.

సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కోసం టీ-హబ్ ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం… హార్డ్ వేర్ కంపెనీలను ప్రోత్సహించేందుకు టీ-వర్క్స్ అనే ప్రొటో టైప్ ల్యాబ్ ను ప్రారంభిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. జెడ్ఎఫ్ కంపెనీకి తమవంతు పూర్తి సహకారాన్ని అందజేస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో జెడ్ఎఫ్ కంపెనీ తన శాఖను నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు హైదరాబాద్ టాప్ మోస్ట్ డెస్టినేషన్ గా మారిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో జెడ్ఎఫ్ కలిసిరావడం అభినందనీయం అని కొనియాడారు. హైదరాబాదుని మొబిలిటీ ఇంజినీరింగ్ క్లస్టర్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో కంపెనీ సహకారం తీసుకుంటామని తెలిపారు మంత్రి కేటీఆర్. జెడ్ఎఫ్ కంపెనీకి హైదరాబాదులో మంచి అవకాశాలున్నాయని మంత్రి అన్నారు.

జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ కంపెనీ డ్రైవ్‌లైన్‌, ఛాసెస్‌ టెక్నాల‌జీని అభివృద్ధి చేస్తుంది. ఈ సెంట‌ర్ కోసం సదరు కంపెనీ రానున్న అయిదేళ్ల‌లో సుమారు వందకోట్ల పైనే పెట్టుబ‌డి పెట్ట‌బోతోంది. ప్ర‌మాదర‌హిత వాహ‌నాల త‌యారీకి కావాల్సిన హై-ఎండ్ టెక్నాల‌జీని ఇక్కడ అభివృద్ధి చేస్తారు. వాహ‌న కాలుష్యాన్ని త‌గ్గించేందుకు కావాల్సిన‌ టెక్నాల‌జీని కూడా ఈ సెంట‌ర్ డెవలప్ చేయ‌నుంది. 

Related Stories

Stories by team ys telugu