మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం వంద ఎకరాల్లో విమెన్ ఇండస్ట్రీస్ పార్కులు   

0

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరుపున అన్నిరకాల ప్రోత్సాహకాలను అందజేస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో మూడు చోట్ల ఇండస్ట్రీస్ పార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సుల్తాన్ పూర్, తూప్రాన్, నందిగామలో ఏర్పాటు చేస్తున్న మహిళా ఇండస్ట్రీస్ పార్కులను ఐలాలుగా గుర్తించి అభవృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత, ఆర్ధిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం కట్టబుడి ఉందని, ఈ దిశగా మహిళలు అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

బషీర్ బాగ్ పరిశ్రమ భవన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగారెడి జిల్లా సుల్తాన్ పూర్ లో 50 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న విమెన్ ఇండస్ట్రీస్ పార్కుకు భూకేటాంపు పత్రాలను ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులకు మంత్రి అందజేశారు. అలాగే తూప్రాన్ లో మహిళా (కోవె) ఇండస్ట్రియల్ పార్కులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.88 కోట్ల నిధుల మంజూరు పత్రాలను, ఎలీప్ ఇండస్ట్రీస్ పార్కుకు మినహాయింపు ఉత్తర్వులను ఆయా సంస్థల మహిళా పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ అందజేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలకు, టీఎస్ ఐఐసీ మహిళా ఉద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని అన్నారు. నేటితరం మహిళలు తోటివారినుంచి గౌరవాన్నే కాకుండా, అన్ని రంగాల్లో పురుషులతో సమాన అవకాశాలు కావాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. స్త్రీలను పూజించే భారతదేశంలోనే అఘాయిత్యాలు జరగడం బాధాకరమన్నారు. మహిళలు సంఘటితంగా ఉండి తమపై జరుగుతున్న దాడులను, వివక్షను ఎదుర్కోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫిక్కీ, కోవె, ఎలీప్ ఆధ్వర్యంలో పారిశ్రామికరంగంలో మహిళలు రాణించడం సంతోషకరమని, వారిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.

మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే 100 ఎకరాల్లో విమెన్ ఇండస్ట్రీస్ పార్కులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తూప్రాన్, సుల్తాన్ పూర్, నందిగామలో నెలకొల్పుతున్న మహిళా పారిశ్రామికవాడలను ఐలాలుగా ఏర్పాటు చేసి, వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల నిర్వహణలో మహిళా పారిశ్రామికేత్తలకు శిక్షణ నిచేందుకు ఫిక్కీ, కోవె, ఎలీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మూతపడిన పరిశ్రమలను పునురుద్ధరించేందుకు ఇండస్ట్రియల్ క్లినిక్ సెంటర్‌ కూడా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు 90 రోజుల్లో ఇచ్చే ప్రోత్సాహకాలను, సబ్సిడీలను పెంచే అంశాన్ని చర్చించి తగునిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పరిశ్రమలకు అనుమతులిచ్చే ప్రక్రియను సీఎం పూర్తిగా ప్రక్షాళన చేశారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సులభంగా అనుమతులు ఇచ్చేందుకే టీఎస్ ఐపాస్ ని అమల్లోకి తెచ్చామని అన్నారు. టీఎస్ ఐపాస్ కింద ఇప్పటిదాకా 3,500 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, అందులో 50 పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయని కేటీఆర్ అన్నారు. ఇండస్ట్రీస్ ఏర్పాటుతో రాష్ట్రానికి 50వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 1.75లక్షల మందికి ఉపాధి దొరుకతుందని కేటీఆర్ చెప్పారు.

విమెన్స్ డేని పురస్కరించుకుని 2016-17 సంవత్సరానికి టీఎస్ ఐఐసీలో ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన జీడిమెట్ల జోనల్ మేనేజర్ మాధవిని మంత్రి కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్ ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పద్మ, పద్మజారెడ్డి, ఎలీప్ ప్రతినిధులు రమాదేవి, కోవె ప్రతినిధులు శైలజారెడ్డి, గిరిజారెడ్డి, టీఎస్ ఐఐసీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.