పిల్లల హక్కులకు బ్రాండ్ అంబాసిడర్.. ఆవిడే శ్యామలీ..!

పిల్లల హక్కులకు బ్రాండ్ అంబాసిడర్.. ఆవిడే శ్యామలీ..!

Wednesday March 23, 2016,

4 min Read


అది గోవాలోని ఓ మరుమూల గ్రామం.. పిల్లలంతా సమావేశమయ్యారు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకుంటున్నారు... తమకు టాయిలెట్ లేదని ఓ చిన్నారి తన సమస్యను అక్కడ గట్టిగా వినిపిస్తున్నాడు..!


గోవాలో ఇంకో గ్రామం.. అక్కడ పిల్లలంతా పిల్లలంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకంటున్నారు. కిక్కులు, పంచుల్లో ఒకరిని మించి ఒకరు ప్రతిభ చూపిస్తున్నారు. వారికి ప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షెరా శిక్షణ ఇస్తున్నారు.

మరో గ్రామంలో... పిల్లలంతా నాటకంలో శిక్షణ పొందుతున్నారు. ఆ నాటకం ప్రధాన అంశం- పిల్లల హక్కులు...!

ఇలా చెప్పుకుంటూ పోతే గోవాలోని మరుమూరు గ్రామాల్లో కనీస హక్కులు పొందలేని, నిరుపేద పిల్లలు ఎంతోమంది తమకు తెలియుకుండానే తమ సాధికారిత కోసం పనిచేసుకుంటూ పోతున్నారు. పేదరికంవల్లనో... కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనో కనీస హక్కులు లేక బాల్యం వడలిపోతున్న వైనం ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ఈ కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నారు శ్యామలీ రే. "మిత్సుకో ట్రస్ట్" ద్వారా శ్యామలీ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. 

మిత్సుకో అంటే జపనీస్ భాషలో "చిన్నారుల వెలుగు" అని అర్థం. గోవాలోని పంజిమ్ కేంద్రంగా ఉంటూ తమ హక్కులు పొందలేని చిన్నారుల సాదికారత కోసం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చిన్నారులు కూడా సమాజంలో బాగమేనని వారిని కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో బాగస్వామ్యం చేయాలనేది ట్రస్ట్ లక్ష్యం. దీనికి కర్త , కర్మ,క్రియ శ్యామలీ రే.

image


ఆరిన దీపం నింపిన వెలుగు "మిత్సుకో"

1995 సంవత్సరం... అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ కోసం పనిచేసేందుకు జపాన్ కు చెందిన మిత్సుకో అనే యువతి తన భర్త, డానియల్ తో కలిసి ఢిల్లీకి వచ్చారు. అదే సమయంలో బెంగాల్ కు చెందిన శ్యామలీ రే కూడా రెడ్ క్రాస్ కోసమే ఢిల్లీలో పనిచేస్తున్నారు. మిత్సుకో, డానియల్ తో కలిసి పనిచేసిన కొద్దికాలంలో శ్యామలీ రే వారికి బాగా దగ్గరయ్యారు. వారు రెడ్ క్రాస్ పని మీద అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా పని చేసేవాళ్లు. అలా ఏ సమయంలో వెళ్లినా ఢిల్లీలో ఎక్కడైనా వీరి కారు ఆగినప్పుడల్లా వీధి బాలలు చేయి చాస్తూ కారు చుట్టూ మూగేవారు. అత్యంత చలికాలమైనా.. ఎండలు మండిపోతున్నా.. చిన్నారులు మాత్రం అలా వస్తూనే ఉండేవారు. వీరి కోసం ఏదైనా చేయాలని మిత్సుకో...శ్యామలీ, డానియల్ తో పదే పదే చెబుతూ ఉండేది. వీరి ఆలోచనలు ప్రాథమిక దశలోనే ఉండగా.. 2007లో మిత్సుకో క్యాన్సర్ తో కన్నుమూశారు. దీంతో మిత్సుకో భర్త.. ఆమె ఆశయాన్ని సాధించేందుకు ఓ స్వచ్చంద సంస్థను శ్యామలీతో కలిసి ప్రారంభించాలని సంకల్పించారు. దాని ఫలితమే "మిత్సుకో ట్రస్ట్" ఆవిర్భావం. 2009లో గోవా నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. 

image


చిన్నారుల సంక్షేమానికే ప్రాధాన్యం

చిన్నారులు ఈ ప్రపంచంలో వారికి ఉన్న స్థానాన్ని వారు అస్వాదించేలా చేయడమే మిత్సుకో ట్రస్ట్ ప్రథమ ప్రాధాన్యం. దీనిపై ఆవగాహన పెంచడం ద్వారా సమాజంలో వారికి గౌరవం పెరుగుతుంది. విజ్ఞానమూ వస్తుంది. వారి ఎదుగుదల సమాజానికి ఉపయోగపడుతుంది. చాలా మంది పెద్దలకు చిన్నారులకు కనీస హక్కులు ఉన్నాయనే అవగాహన లేదు. పెద్దలు తీసుకునే నిర్ణయాలు చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంటే కచ్చితంగా వారి అభిప్రాయం తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ద చైల్డ్ ఆర్టికల్ 12లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఎవరూ దాన్ని పాటించడం లేదు. దీన్ని మార్చేందుకు శ్యామలీ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వీధిబాలలు, నిరుపేద బాలలు ఎలాంటి హక్కులు అనుభవించడం లేదు. ఇవి చిన్నారులపై జరుగుతున్న దారుణాలను కూడా తగ్గించేందుకు దోహదపడతాయి.

" ఇలాంటి వాతావరణాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. చిన్నారులు తమ ఆలోచనలు, ఐడియా, సృజనాత్మకతను ప్రదర్శించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవి బాల్యం అంటే నిజమైన అర్థం ఏమిటో వారికి అర్థం అయ్యేలా చేస్తాయి. ప్రతి ఒక్క చిన్నారికి తమ హక్కుల గురించి అడిగే హక్కు ఉంది.." శ్యామలీ రే, మిత్సుకో ట్రస్ట్ డైరెక్టర్

image


పిల్లల భాగస్వామ్యం

చేపట్టే ప్రతి పనిలోనూ పిల్లలను భాగస్వాములను చేయడం మిత్సుకో ట్రస్ట్ ప్రత్యేకత. వారి కోసం చేస్తున్న పనులు వారికి అర్థమయ్యేలా చేసి...వారికి వారు సొంతంగా నేర్చుకునేలా ప్రొత్సహించడమే ఈ కార్యక్రమాల్లోని ప్రధాన ఉద్దేశం. ఆటలు, ఈవెంట్లు, సామాజిక సేవా కార్యక్రమాలు అన్నీ పిల్లులు వారి సాధికారిత, హక్కులను తెలుసుకునేలా ఉంటాయి. ట్రస్ట్ చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు విశేషమైనస్పందన వచ్చింది.

# గోవాలోని కారంబోలిం గ్రామంలో మిత్సుకో చేపట్టిన ఓ కార్యక్రమంలో దీక్షానాయక్ అనే విద్యార్థిని రాసిన కాన్సెప్ట్ పేపర్ ఓ సరస్సుకు కొత్త జీవం తెచ్చిపెట్టింది. పొల్యూషన్ తో పూడుకుపోయే పరిస్థితికి వచ్చిన సరస్సు దుస్థితిని వివరిస్తూ... " సరస్సులోనే మంచినీళ్లన్ని ఎక్కడికిపోయాయి.." అంటూ చిన్న రాసిన నాటకానికి అంతర్జాతీయంగా స్పందన వచ్చింది. సన్ షైన్ వరల్డ్ వైడ్ స్కూల్ వాళ్లు సరస్సును దత్తత తీసుకుని పూర్వవైభవం తీసుకొచ్చారు. 

# మిత్సుకో ట్రస్ట్ బాల గ్రామసభ సంస్థతో కలసి పనిచేస్తోంది. పలు గ్రామాల్లో పిల్లలే స్వచ్చందంగా సమావేశాలు నిర్వహించుకుని వారి సమస్యను చర్చించుకునేలా ప్రొత్సహిస్తోంది.

# ఆలోక్ జోహ్రి, శ్రేయరాగిరి ఇస్రాని వివిధ గ్రామాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

# హర్షదా కేర్కర్ మల్టీ మీడియా శిక్షణ ఇస్తున్నారు.

# మార్షల్ ఆర్ట్ఎక్స్ పర్ట్ షేరా చిన్నారులకు స్వయం రక్షణ విభాగంలో సుశిక్షితులను చేస్తున్నారు.

image


ఎన్నో సవాళ్లు...

శ్యామలీకి ట్రస్ట్ నడపడం అంత సులువుగా ఏమీ లేదు. ఎన్నో సవాళ్లను మొదటి నుంచి ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికా ఆమెకు నెలల తరబడి సమయం పడుతోంది. గ్రామాల్లో పెద్దలను ఒప్పించడం.. ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకురావడం.. ఇలాంటివి ఎలాగోలా డీల్ చేసినా.. నిధుల సమస్య శ్యామలీ రే ఆశయాన్ని భారీస్థాయిలో ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతోంది. గోవా ప్రభుత్వ సహకారం.. మరికొన్ని ఏజన్సీల సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. మిత్సుకో ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలకు వ్యక్తిగతంగా కూడా స్పాన్సర్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా... మొదటి నుంచి సేవా రంగంలోనే ఉన్న శ్యామలీ రే వాటిని అధిగమించే ప్రయత్నమే చేస్తున్నారు.. కానీ వెనక్కి పోయే ఆలోచన కూడా చేయడం లేదు. తమ ప్రయత్నాల వల్ల పిల్లల జీవితాల్లో ఇసుమంతైనా మార్పు వస్తే ప్రజల్లో మార్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. చిన్నారులకు అందమైన ప్రపంచం కళ్ల ముందే ఉందని ఆమె నమ్మకంతో ఉన్నారు.

మిత్సుకో ట్రస్ట్ వెబ్ సైట్