మూడు నెలలపాటు కష్టపడి బావి తవ్విన లేడీ భగీరథ  

0

దశరథ్ మాంఝీ తెలుసుగా. భార్యపై ప్రేమతో కొండలనే పిండిచేసిన సాహసికుడు. విషాదాన్ని దిగమింగుకొని తన ఊరి జనానికి దారి చూపించిన యోధుడాయన. అతని పేరుమీద మౌంటెయినర్ మ్యాన్ పేరుతో సినిమా కూడా వచ్చింది. అలాంటి మరో సాహసికుడు మహారాష్ట్రకు చెందిన బాపూరావు తాంజే! భార్యకు జరిగిన అవమానం తట్టుకోలేక, కసితో 40 రోజుల్లో బావిని తవ్వాడు. అలాంటి జాబితాలోకి చేరింది కర్నాటకకు చెందిన గౌరీ నాయక్. మూడు నెలలపాటు శ్రమించి బావిని తవ్వి లేడీ భగీరథ అనిపించుకుంది.

దినసరి కూలీ అయిన గౌరీ, తన ఇంటి ఆవరణలో 15 కొబ్బరి చెట్లు, కొన్ని అరటి చెట్లు, 150 వరకు పోకచెట్లు పెంచుకుంటోంది. ఎండాకాలం కావడంతో నీటికొరత వచ్చింది. అవి కళ్లముందే ఎండిపోతుంటే మనసు చివుక్కుమంది. బోరు వేసేందుకు ఆర్ధిక స్తోమత లేదు. కూలీలను పెట్టించి బావి తవ్వించే స్థాయి కూడా లేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. చెట్లను చంపుకోవడం ఇష్టంలేక, తనే పలుగు పార పట్టుకుని కొంగు నడుముకి చుట్టింది.

రోజుకి ఆరు గంటల చొప్పున, నాలుగు అడుగు మేర, మూడు నెలలపాటు అలుపెరగకుండా తవ్వింది. ఎవరి సాయమూ తీసుకోలేదు. తనే తవ్వుతూ, తనే మట్టి ఎత్తిపోస్తూ చెమట చుక్కల్ని జలధారలుగా మార్చింది. చివర్లో మాత్రం ఆమె కష్టాన్ని చూసి చలించి ముగ్గురు మహిళలు మట్టి ఎత్తిపోయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే అంత లోతునుంచి గౌరి ఒక్కతే మట్టి తట్టని నెత్తిన పెట్టుకుని ఎక్కుతుంటే, చూడలేక పోయారు. సుమారు 60 అడుగుల లోతున తవ్విన బావిలో ప్రస్తుతం ఏడు ఫీట్ల మేర జల ఊరింది.

గౌరి నాయక రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో దినసరి కూలీగా పనిచేస్తోంది. ఒకసారి మీటింగ్ కి వచ్చినప్పుడు గౌరి విపరీతమైన ఒళ్లు నొప్పులతో బాధపడింది. ఏంటా అని ఆరా తీస్తే ఇదీ సంగతి అని తెలిసి ఆశ్చర్యపోయారు అధికారులు. అంతటితో ఆగకుండా గౌరి ఇంటిని సందర్శించి మరింత అవాక్కయ్యారు.

మొక్కలు బతకాలన్న ఒకే ఒక కారణంతో చెమట ధారవోసి స్వహస్తాలతో బావి తవ్విన గౌరి తోటి స్త్రీలకు ఆదర్శంగా నిలిచారు. మహిళలకు తోడ్పాటు అందిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని చెప్పడానికి గౌరీయే నిలువెత్తు నిదర్శనం.   

Related Stories

Stories by team ys telugu