అప్పు పుట్టట్లేదా..? అయితే క్రెడిట్ మంత్రి సాయం తీసుకోండి..!

అప్పు పుట్టట్లేదా..? అయితే క్రెడిట్ మంత్రి సాయం తీసుకోండి..!

Tuesday April 26, 2016,

4 min Read


అప్పారావు... ఓ మధ్యతరగతి జీవి

కుటుంబఅవసరాలు, పిల్లల చదువులు, పండగలు, పబ్బాలు అని చేబదులు అప్పులు చేయడం అప్పారావుకి కామన్. ఓ సారి బ్యాంక్ నుంచి లోన్ వస్తుందేమోనని ట్రై చేశాడు. అన్ని డాక్యుమెంట్లు తీసుకుని ఆశపెట్టిన ఎగ్జిక్యూటివ్ చివరికి.. మీరు ఎలిజిబుల్ కాదని తేల్చేశాడు. ఏం తక్కువ నాకు అని అప్పారావు నిలదీస్తే.. ఎగ్జిక్యూటివ్ కిందకు పైకి చూసి.. "క్రెడిట్ స్కోర్" అని చెప్పి చక్కా వెళ్లిపోయాడు.. బుర్రగోక్కోవడం అప్పారావు వంతయింది.

అలాగే మరో మల్లేశ్వరరావు.. 

ఈ సారి అతనికి వచ్చిన సమాచారం... "అసలు మీకు క్రెడిట్ స్కోర్ లేదండి.."

అలాగే మరో నాగేశ్వరరావు... 

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాదేమో అని కంగారు పడ్డాడు. కానీ అనూహ్యంగా వారం రోజులకే అప్రూవల్ వచ్చేసింది. ఎందుకలా.. అని ఉత్సుకతతో హోమ్ లోన్ ఆఫీసులో అడిగితే.. మీ క్రెడిట్ హిస్టరీ చాలా బాగుందండి అనే సమాధానం వచ్చింది.

వీరికే కాదు.. భారతదేశంలో చాలా మందికి ఈ క్రెడిట్ స్కోర్ పెద్ద పజిల్. దీని గురించి తెలిసినవాళ్లూ తక్కువే. అందుకే బ్యాంకుల నుంచి లోన్లు పొందడంలో విఫలమవుతూంటారు. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే... భారత దేశంలో లోన్లు పొందడానికి అర్హత ఉన్న వారిలో 75 శాతం మందికి అసలు క్రెడిట్ హిస్టరీనే లేదు.

క్రెడిట్ స్కోర్.. లోన్ కి మొట్టమొదటి అర్హత..!

బ్యాంకులన్నీ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని రుణాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత.. లోన్లు తీసుకోవడం ఎంత సులువయిందో.. అంత కష్టమయింది కూడా. ఎందుకంటే నగదు రూపేణా ఖర్చు పెట్టడానికి సిద్ధమైనపోయిన ప్రజలు... అంత త్వరగా బ్యాంకింగ్ కార్యకలాపాల్లో జోరు చూపించలేకపోయారు. ఫలితంగా భారీ మొత్తం ఆదాయం ఉన్నవారికి కూడా క్రెడిట్ స్కోర్ జీరోగా ఉండిపోతోంది. బ్యాంకుల ద్వారా కార్యకలాపాలు చేసి.. క్రెడిట్ కార్డులు వాడుతూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నవారికి లోన్లు పొందడం సులువుగానే మారుతోంది. మిగతా వారి పరిస్థితే కొంచెం క్లిష్టంగా మారుతోంది. వారికి క్రెడిట్ స్కోరు లేనందున బ్యాంకులు లోన్లు ఇవ్వవు.. బ్యాంకులు లోన్లు ఇవ్వవు కాబట్టి క్రెడిట్ స్కోరు రాదు. ఇక బయటపడటం ఎలా..?

లోన్లు పొందడానికి అర్హత ఉన్నవారిలో ఇలాంటి వారే 75శాతం మంది ఉన్నారు. వీరికి క్రెడిట్ స్కోర్ విషయంలో సూచనలు, సలహాలతో పాటు సాయం కూడా చేస్తామంటోంది క్రెడిట్ మంత్రి స్టార్టప్. బ్యాంకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రంజిత్ పుంజా, ఆర్. సుదర్శన్, గౌరీ ముఖర్జీ అనే ముగ్గురు కలిసి దీన్ని ప్రారంభించారు.

" భారత ఆర్థిక వ్యవస్థలో లోన్ అప్లయి చేయడం రిజెక్ట్ కావడం సహజంగా జరుగుతుంది. కానీ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం జరగదు. అదే విదేశాల్లో.. ఓ వాతావరణ అంచనాల్లా తెలుసుకుంటారు.." రంజిత్, కో ఫౌండర్, క్రెడిట్ మంత్రి

రంజిత్, సుదర్శన్ సిటీ బ్యాంకులో కలిసి పనిచేశారు. వారికి క్రెడిట్ స్కోర్ విషయంలో మంచి మార్కెట్ ఉందనే సంగతి అర్థమయింది. కానీ ఈ విషయంలో ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలో.. దీనికి టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక ఆయోమయానికి గురయ్యారు. ప్రజలకు క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి.. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే చెప్పేందుకు ఓ ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలని నిర్ణయించారు. దానికి టెక్నాలజీని వాడుకోవాలనుకున్నారు. కానీ ఎలా అనేది వారికి పెద్ద సమస్యగా మారింది. 

అదే సమయంలో 2014లో గౌరి వీరితో చేతులు కలిపారు. గౌరికి బ్యాంక్ తో పాటు... స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల్లో డిజిటల్ బ్యాంకింగ్ ను పర్యవేక్షించిన అనుభవం కూడా ఉంది. దాంతో వారు త్వరగానే క్రెడిట్ మంత్రికి రూపకల్పన చేయగలిగారు. కొన్నాళ్లకే తక్కువ క్రెడిట్ స్కోర్, అసలు క్రెడిట్ స్కోరే లేని ఫైల్స్ లో చాలా మార్కెట్ ఉందని అర్థమయింది. దాని ప్రకారం పని ప్రారంభించారు. ఇప్పుడు మూడు విభాగాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. నెగెటివ్ క్రెడిట్ హిస్టరీ, నో క్రెడిట్ హిస్టరీ, హెల్తీ క్రెడిట్ హిస్టరీ విభాగాల్లో వీరు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

క్రెడిట్ మంత్రి బృందం <br>

క్రెడిట్ మంత్రి బృందం


అప్పిచ్చేవాళ్లనీ చూసి పెడతారు.. !

క్రెడిట్ మంత్రి ముందుగా వ్యక్తిగతంగా సలహా కావాలనకున్నవారికి ప్రొఫైల్స్ ను సేకరిస్తుంది. క్రెడిట్ కోషంట్ పేరుతో ఓ రికార్డు తయారు చేస్తుంది. ఆ వ్యక్తి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్ ను చూసేందుకు పర్మిషన్ తీసుకుంటుంది. డాటా మొత్తం సేకరించిన తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన అల్గారిథమ్స్ దీన్ని విశ్లేషణ చేసి కచ్చితమైన క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ను తయారు చేస్తుంది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ ఉండదు. అంతా అల్గారిథమ్ ద్వారా జరిగిపోతుంది. అందువల్ల తప్పిదాలకు ఆస్కారం లేదు. అదేరకంగా అప్పు ఇచ్చే బ్యాంకులు, సంస్థల కోసం మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారిని వారి వారి ప్రాధాన్యాల ప్రకారం చూసిపెడతారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ సేవలు అందించే సంస్థలు ఎక్కడెక్కడ అప్పులు వస్తాయో చూపిస్తాయి.. కానీ క్రెడిట్ మంత్రి మాత్రం.. ఎక్కడికి వెళ్లవద్దో చెబుతుంది.

ఇప్పుడు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల చాలా మంది లోన్ల అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూంటాయి. మొదట క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడమే. అప్పు పొందే విషయంలో మొదటి అడుగుగా క్రెడిట్ మంత్రి విశ్లేషిస్తుంది. ఇలా చేయడం వల్ల అతి తక్కువ వడ్డీరేటుకు.. మంచి సంస్థల నుంచి లోన్లు పొందే అవకాశం ఉంది.

లెండర్స్.. కస్టమర్స్ మధ్య గ్యాప్ తగ్గిస్తున్న క్రెడిట్ మంత్రి

నెగెటివ్ క్రెడిట్ హిస్టరీ ఉన్న వ్యక్తితో డీల్ చేయడం ఓ సవాల్ లాంటింది. దీన్ని అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని బాగుచేయడంతో పోల్చవచ్చు. ఉన్నపళంగా ఎవరినీ ఆరోగ్యంగా మార్చలేరు. కొంత సమయం క్రమశిక్షణతో వ్యవహరించిన తర్వాతే ఫలితాలు చూడగలం.

ఆదాయమూ ఘనమే...

గత ఏడాది మేలో క్రెడిట్ మంత్రి తొలిసారి ఫండింగ్ పొందింది. ఎలివర్ ఈక్విటీ అనే ఫండింగ్ వీరి మార్కెట్ స్ట్రాటజీ నచ్చడంతో భారీగానే పెట్టుబడిని అందించింది. ఈ సంస్థ ఆదాయము మార్గాలూ ఎక్కువే. క్రెడిట్ స్కోరు ఎనాలసిస్ చేసి.. దాన్ని పెంచుకునేందుకు సలహాలు ఇచ్చినందుకు ఇండివిడ్యువల్స్ నుంచి.. అలాగే మంచి హెల్తీ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లను రికమెండ్ చేసినందుకు.. ఆర్థిక సంస్థల నుంచి ఆదాయాన్ని పొందుతున్నారు. వచ్చే రోజుల్లో వ్యక్తిగతంగా పూర్తిగా ఉచితంగా సేవలు అందించి.. ఆర్థిక సంస్థల వద్ద మాత్రమే రుసుములు వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికి 45వేల మందికిపైగా క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోవడం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో సగం మందికిపైగా మొత్తం ప్రోఫైల్ ను అందుబాటులో ఉంచారు. ఈ ఫిబ్రవరిలో క్రెడిట్ మంత్రి రెండు లక్షల మంది వినియోగదారులను చేరుకుంది.

మార్కెట్ పై పట్టు

క్రెడిట్ మంత్రి విభిన్న వ్యూహాలతో ముందుకెళ్తోంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి లోన్లు అంత సులభంగా రావు. వీరి విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత సరళంగా వ్యవహరించేలా సరికొత్త ప్రొడక్టులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ ఆర్థిక సేవల రంగంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ రంగంలో 2014కే పన్నెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాదికి 48 శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. ఇప్పటికే కొన్ని స్టార్టప్ లు ఈ రంగంలో పరుగందుకుంటున్నాయి. ప్రజల్లో డిజిటల్ ఫైనాన్షియల్ పై అవగాహన పెరిగే కొద్ది.. క్రెడిట్ మంత్రి లాంటి స్టార్టప్ ల బిజినెస్ కు కొదవేమీ ఉండదు.

వెబై సైట్