కాలేజీ గేటు ముందు సెక్యూరిటీ గార్డుగా మారిన మాజీ ఫుట్ బాల్ ఛాంపియన్  

1

ఇదొక విస్మృతికి గురైన క్రీడాకారుడి దైన్య స్థితి. ఒకప్పుడు ఫుట్ బాల్ గ్రౌండులో ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన ఆటగాడు అతను. ట్రోపీలు, టైటిళ్లు తెచ్చినప్పుడు ఆహో ఓహో అని ఆకాశానికెత్తారు. ఇవాళ ఎందుకూ కొరగాకుండా పోయాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఒక కాలేజీ గేట్ ముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

బెంగళూరు మౌంట్ కార్మెల్ గర్ల్స్ కాలేజీ ముందు స్టూల్ వేసుకుని కూర్చుని, విజిల్ నోట్లో పెట్టుకుని కూర్చున్న మోహన్ ని పలకరిస్తే సముద్రమంత ఆవేదన వ్యక్తం చేశాడు. దేశంలో ఎందరో ఛాంపియన్లు ఇవాళ ఎక్కడో, ఏదో మూలకు బతుకీడుస్తున్నారు. తమిళనాడుకి చెందిన మోహన్ జీవితం కూడా అలాంటిదే. ఆడినంత సేపే ఆకాశానికెత్తుతారు. తర్వాత పాతాళానికి తొక్కేస్తారు. వెటరన్ క్రీడాకారుడిగా కాసింత పెన్షన్ కు కూడా నోచుకోక, పూటగడవని స్థితిలో కాలేజీ గేటు ముందు సెక్యూరిటీ గార్డు అవతారమెత్తాడు.

సుమారు 30 ఏళ్ల కెరీర్. ఆటగాడిగా, కోచ్ గా మోహన్.. ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ డిఫెండర్. 1977లో ఫెడరేషన్ కప్ సాధించాడు. 198లో మోహన్ టీం స్టాఫర్డ్ ఛాలెంజ్ కప్ గెలుచుకుంది. అతని అద్భుతమైన ఆటతీరు కొరియా, ఆఫ్ఘనిస్తాన్, మలేషియాలో పర్యటించేలా చేసింది. ఆ తర్వాత గార్డెన్ సిటీ కాలేజీ ఫుట్ బాల్ టీమ్ కోచ్ గా పనిచేశాడు. ఆ సమయంలో టీంలో అంతర్గత కుమ్ములాట మూలంగా తప్పుకున్నాడు. బయటకొచ్చాక ఏం చేయాలో అర్ధం కాలేదు. మాజీ ఛాంపియన్ గా తనని ఎవరూ గుర్తించలేదు. చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు.

మౌంట్ కార్మెల్ కాలేజీలో మెహన్ స్నేహితుడు ఒకాయన పనిచేస్తున్నాడు. అతణ్ని అడిగాడు.. మీ కాలేజీలో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందా అని. అదనంగా అర్హతలు ఏమైనా కావాలంటే.. నేను మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ ఛాంపియన్ అని చెప్పమన్నాడు. అలాగైనా జాలి చూపించి పని ఇప్పిస్తారనేది మోహన్ ఆశ. అనుకున్నట్టే సెక్యూరిటీ గార్డుగా జాబ్ దొరికింది. 

విద్యార్ధుల ఐడీ కార్డులు చూడటం, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా లోపలకి పంపించడం.. ఇదే అతని డ్యూటీ. ఇందులో నామూషీ పడాల్సిన అవసరం లేదంటాడు మోహన్. పొట్టకూటి కోసం ఇంతకు మించి ఏం చేయగలను అని నిట్టూర్పు విడిచాడు. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుద్దామని సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నా అంటున్నాడు.

దేశంలో ఇలాంటి దైన్య స్థితిలో ఉన్న ఆటగాళ్లలో మోహనే మొదటివాడూ కాదు.. చివరివాడూ కాదు. ఎందరో ఛాంపియన్లు మైదానంలో గెలిచి.. ప్రత్యర్ధులను మట్టికరిపించి, దేశ పేరు ప్రతిష్టలు నిలిపి, మలిసంధ్యలో పాతాళానికి పడిపోయారు.