హిందూ ముస్లిం భాయీ భాయీ..! సామూహిక వివాహమంటే ఇదేనోయీ..!!  

0

భిన్నజాతులు, భిన్నమతాల సమహారం మన భారతదేశం. అలాగని మతకల్లోలాలు లేవని కాదు. గంగాజెమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అయిన ఈ గడ్డమీద హింసచేలరేగిన సందర్భాలు అనేకం. దానికి కారణం ఎవరు..? ఎందుకు..? అన్న వివరాల్లోకి వెళ్లడం అనసవరం. అలాంటి నెత్తుటి మరకలకు ఇక అవకాశం ఇవ్వొద్దనే గొప్ప ఉద్దేశంతో ఆ గ్రామ ప్రజలంతా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. హిందూ ముస్లింలు పక్కపక్కన నడవడాన్ని కూడా సహించలేని ఆ ఊరు- ఒక్కసారిగా పరమతసహనానికి ప్రతీకగా మారిపోయింది.

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని ఒక మారుమూల గ్రామం రావత్ పూర్. మొన్నటిదాకా అక్కడ మతపరమైన అల్లర్లు చెలరేగేవి. రోజూ ఏదో ఒక సంఘటన కలవరపెట్టేది. ఎన్నాళ్లిలా నెత్తుటేర్లు పారడం? నిత్యం మారణహోమం సాగాల్సిందేనా ? మహ్మద్ షకీల్ అనే పెద్దాయన మనసులో రగిలిన ఆవేదన ఇది. ఇలా జరగడానికి వీల్లేదు. ఈ జాడ్యానికి ఎక్కడోచోట చరమగీతం పాడాల్సిందే.

సామూహిక వివాహం. అదికూడా హిందూ-ముస్లిం జంటలను ఒకచోట కలిపే వేదిక. వేదమంత్రాలతో, ఖురాన్ వచనాలతో ఒక పండుగలా జరిపితే ఎలా వుంటుంది? మహ్మద్ షకీల్ చేసిన ప్రతిపాదన ఊరి జనాన్ని ఆలోచింపజేసింది. రక్తపాతానికి చరమగీతం పాడాలంటే వేదమంత్రాలు పఠించాల్సిందే.. ఖురాన్ వచనాలు ప్రతిధ్వనించాల్సిందే.. అని పెద్దలంతా తీర్మానించారు.  

ఆ రోజు రానే వచ్చింది. మార్కెట్ కు ఆ పూట సెలవు ప్రకటించారు. హిందూ జంటలు హిందూ సంప్రదాయంలో వస్తే.. ముస్లిం జంటలు వాళ్ల మతాచారం ప్రకారం వచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు- ఖురాన్ వచనాలు మార్మోగాయి. సుమారు 8వేల మంది గ్రామస్తులు ఈ సామూహిక వివాహ మహోత్సవానికి అతిథుల్లా హాజరవడమే కాదు... వాళ్లే పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. పది జంటలు ఊరిజనం సాక్షిగా ఒక్కటయ్యాయి. ఇరు వర్గాల వధూవరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందూ పూజారులు ముస్లిం ఇమామ్ లతో ఆలింగనం చేసుకున్నారు. ఆకాశం నుంచి వేలమంది మీద పూల వర్షం కురిసింది. ఒకే ఒక్క ఆలోచన సోదరభావాన్ని కలకాలం నిలిచిపోయేలా చేసింది.

నా మనసులో ఆలోచనకు ఇంతటి భారీ స్పందన వస్తుందని ఊహించలేదంటాడు మహ్మద్ షకీల్. నా తీర్మానానికి ప్రతీ ఒక్కరూ పాజిటివ్ గా రియాక్టరయ్యారని సంతోషంగా చెప్తున్నాడు. గుండె నిండా ఆనందాన్ని మూటగట్టిన ఈ అరుదైన పెళ్లి వేడుకను కళ్లారా చూశానని ఒకరకమైన ఉద్వేగంతో అన్నాడు.